‘‘అమ్మ సాక్షిగా చెబుతున్నా.. జాన్‌వరి ఫస్ట్ నుంచి మందు తాగను..’’ ఓ పెద్దాయన అనగానే ‘‘సూపర్ అసలు’’ అంటూ చప్పట్లు కొట్టే యాంకరమ్మ వీడియో ఒకటి ఎంతలా వైరల్ అయ్యిందో తెలియంది కాదు. నిజంగా మీరు కొత్త ఏడాదిలో తీసుకున్న లక్ష్యాలను.. అదేనండీ న్యూఇయర్ రెజల్యూషన్స్‌ను ఎప్పుడైనా కచ్చితంగా అమలు చేశారా?. పోనీ చేసినా.. అసలు వాటిలో కచ్చితంగా పూర్తిస్థాయిలో పాటించినవి ఉన్నాయి?. అసలు ఆ తీర్మానాల విషయంలో ఎప్పుడైనా మీకు మీరు సమీక్షించుకున్నారా?.
మనలో చాలా మందికి బాగా అలవాటైన పనేంటో తెలుసా? మూడు రోజులు చాలా చక్కగా న్యూ ఇయర్ హడావుడిలో అనుకున్న లక్ష్యం(Resolutions) కోసం పని చేస్తారు. నాలుగో రోజు యథావిధిగా మానేయడమో, ఏదో ఒక కారణం చెప్పి దాని నుంచి వైదోలగడమో చేస్తారు. ఇలా చేసే వారు 100లో సుమారు 92 మంది ఉన్నారట!. అంటే.. సిన్సీయర్‌గా తమ రెజల్యూషన్స్ కోసం పని చేసేది కేవలం 8 మందినేనా?. ఈ మాట మేం చెప్తోంది కాదు.. పలు అధ్యయనాలు ఇచ్చిన నివేదికలు సారాంశం ఇదే.
పాజిటివీటీ.. టైం సెట్ గో..
మనలో చాలమంది ఈ కొత్త ఏడాదిలో ఏదైనా సాధించాలనో, లేదంటే ఫలానా పని చేయకుండా ఉండాలనో తీర్మానాలు చేసుకుంటారు. అది కెరీర్ పరంగా కావొచ్చు, ఆరోగ్యపరం(Health Resolution)గా అవ్వొచ్చు, డబ్బు సంబంధితమైనవి కావొచ్చు.. విషయం ఏదైనా చాలామంది ఏదో ఒక తీర్మానం మాత్రం చేసి తీరతారు. అయితే.. అంత ఈజీగా జరిగే పని కాదని వాళ్లకూ బాగా తెలుసు. చాలామంది సమయాన్ని అడ్డంకిగా చెప్పి తప్పించుకుంటారు. పట్టుదల ఉండాలే కానీ సమయం సరిపోదు అనే సమస్య ఉండదు.
అలాగే.. మనం ఓ నిర్ణయం కానీ కమిట్‌మెంట్ కానీ తీసుకునేప్పుడే అది పాజిటివ్‌గా ఉండేలా చూసుకోవాలి. కాబట్టి మన లక్ష్యాన్ని సెట్ చేసుకోవటంలో ముందు ఇది ఉందో చూసుకోవడం మంచిది. ముందు నుంచే ‘‘ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కావు’’ అని ప్రిపేర్డ్‌గా ఉండకూడదు. అలాగే నెగటివిటీకి ఎంత దూరంగా ఉంటే అంతమంచిది కూడా. అందుకు అవసరమైన రోడ్‌మ్యాప్‌ను ఫుల్ కమిట్‌మెంట్(Full Commitment)తో రూపొందించుకుని పక్కగా అమలయ్యేలా చిత్తశుద్ధి చూపాలి.
వాస్తవాన్ని గుర్తించాలి!
జీవితంలో ఒక్క మెట్టు ఎక్కుకుంటూ పోవాలంటారు పెద్దలు. ఒకేసారి నాలుగైదు మెట్లు ఎక్కాలని ప్రయత్నిస్తే ఏం జరుగుతుందో మనకు తెలియంది కాదు. అలాగే.. మార్పు ఓ చిన్న అడుగుతోనే మొదలువుతుంది. కాబట్టి స్టో అండ్ స్టడీ విన్ ది రేస్ బాటలోనే పయనించాలి. అలాంటప్పుడే విజయవంతమయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.
సమస్య ఏమిటంటే.. చాలాసార్లు మనం అసాధారణమైన లక్ష్యాలను ఎంచుకుంటుంటాం. వాటి సాధన క్రమంలో తడబడుతుంటాం. అందుకే వాస్తవానికి దగ్గరగా, నిజం చేసుకునేందుకు వీలుగా ఉన్న నిర్ణయాలే తీసుకోవాలి. అలాగే చిన్నపాటి లక్ష్యంతో పని మొదలు పెట్టడం ద్వారా ఉన్నత లక్ష్యానికి దారులు సులువుగా వేసుకోవచ్చు. అలాగని.. ఇక్కడ ‘తగ్గడం’ ఎంతమాత్రం అవదు. ఇలా చేస్తేనే దీర్ఘకాలిక లేదంటే ఉన్నత లక్ష్యాలను చేరుకోవడం సులువవుతుంది.
రెగ్యులర్ వైఖరి వద్దు..
మనం చాలాసార్లు కొత్త ఏడాది వచ్చింది కదా అని.. ఏదో ఒక తీర్మానం చేసేస్తారు. కానీ, దాని అమలుకంటూ ఓ సరైన ప్రణాళిక వేసుకోరు. దాని వల్ల అంతా డిస్టర్బెన్స్ కలుగుతుంది. అందుకే సాధించాలనుకుంటున్న లక్ష్యం గురించి పక్కాగా ఆలోచించాలి. నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకోవడం వల్ల ఆచరణలో పెట్టడమూ సలువవుతుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
పంచుకుంటేనే ఫలితం!
ఈ ఏడాది లక్ష్యసాధనలో.. మీతోపాటు తోడుగా ప్రయాణం చేసేందుకు మరికొందరిని వెతికి పట్టుకోగలిగితే మార్గం మరింత సుగమమం అయినట్లే. కలసికట్టుగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతో ఎన్నో ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.
రివ్యూ ఈజ్ ఫర్ బెటర్ రిజల్ట్
ప్రయాణంలో కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు చేస్తున్న పనిని మరోసారి సమీక్షించుకోవాలి. ఇప్పటివరకు ఎదురైన ఆటంకాలు ఏమిటి? ఇప్పటివరకు ఏ వ్యూహం బాగా పనిచేసింది? ఏది సరిగా పనిచేయలేదు? అన్నది పరిశీలించుకోవాలి. చిన్నపాటి విజయానికైనా సరే సంబరాలు చేసుకోవాలి. అది పట్టుదలను మరింతగా పెంచుతుంది. అలాగే.. రోజువారీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకోగలిగినా అనుకున్న లక్ష్యం వైపు వెళ్లేందుకు అవి సాయపడతాయి.
కొత్తగా సాధించడం కాదు.. కోల్పోయింది తిరిగి తెచ్చుకోవడంలోనే మాంచి కిక్ దొరుకుతుంది! అలా పొందడంలో ఎక్కువ ప్రేరణ పొందగలుగుతారు.
Comments
Please login to add a commentAdd a comment