కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు దేశరాజధాని ఢిల్లీ సిద్ధమైంది. ఈరోజు (మంగళవారం) మధ్యాహ్నం నుంచే రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ నడిబొడ్డున ఉన్న కన్నాట్ ప్లేస్, ఇండియా గేట్ తదితర ప్రాంతాల్లో జనం సందడి చేయనున్నారు.
న్యూ ఇయర్‌ను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు వేడుకలు సవ్యంగా సాగేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. కన్నాట్ ప్లేస్, ఇండియా గేట్‌లకు అనుసంధానమైన రహదారులపై రాత్రి 8 గంటల నుండి వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. ఈ సమయంలో అన్ని వాహనాలను ఇతర మార్గాల్లో మళ్లించనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ఏఐ ఆధారిత కెమెరాలతో పహారా కాస్తున్నారు. అనుమానితులపై నిఘా ఉంచేందుకు వీటిని వినియోగించనున్నారు.
ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన యోధా వాహనాల్లో కమాండోలను మోహరించనున్నారు. వీరు రోడ్లపై తిరుగుతూ అల్లర్లకు పాల్పడేవారి ఆటకట్టించనున్నారు. దీనికి తోడు ఢిల్లీలోని రద్దీ ప్రాంతాల్లో 600 మంది పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలను కూడా మోహరించారు. కన్నాట్ ప్లేస్‌లో 50కి పైగా పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో పోలీసులు మోటార్ సైకిళ్లపై నిరంతరం గస్తీ తిరగనున్నారు. సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసు సిబ్బంది జనం మధ్యలో తిరుగుతూ, ప్రజలకు రక్షణ అందించనున్నారు.
నూతన సంవత్సర వేడుకల్లో రాజకీయ పార్టీలు, సంస్థలు అనుమతి లేకుండా ప్రదర్శనలు నిర్వహించకూడదనే నిబంధన విధించారు. ఇండియా గేట్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నియంత్రించడానికి ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు విస్తృతమైన తనిఖీలు చేపట్టనున్నారు. ఇండియా గేట్ వద్ద పార్కింగ్ స్థలం పరిమితంగా ఉన్నందున సందర్శకులు ప్రజా రవాణాను ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. మద్యం తాగి వాహనం నడిపినా, అతివేగంగా వాహనం నడిపినా, జిగ్-జాగ్ తరహాలో ప్రమాదకరమైన డ్రైవింగ్ చేసినా వారిపై వివిధ సెక్షన్ల కింద జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశాలున్నాయి.
ఇది కూడా చదవండి: Year Ender 2024: రక్షణరంగంలో విజయాలు.. సరికొత్త రికార్డులు
Comments
Please login to add a commentAdd a comment