ఇంతకీ అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్‌లో పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో?.. అని ఇంతకాలం అటు రాజకీయ వర్గాలు, ఇటు సినీ వర్గాలు ఒక కుతూహలంతో ఎదురు చూశాయి. తీరా ఆయన ఓపెన్ అయ్యేసరికి.. ఆయన తన అభిప్రాయం చెప్పకపోయి ఉంటేనే బాగుండు అనుకుంటున్నాయి. ఈ ఇష్యూపై మీడియా చిట్‌చాట్‌లో పవన్ మాట్లాడి.. ఇంకా గంటలు కూడా గడవలేదు. కానీ, ఈ కామెంట్లు ఎంత ఫాస్ట్‌గా ప్రభావం చూపాయంటే.. మెగా వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మళ్లీ తన్నుకుంటూ సోషల్ మీడియాలో రచ్చ చేసేంతలా.. !
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ జైలుకెళ్లి వచ్చాక దాదాపు సినీ పరిశ్రమ మొత్తం ఆయన్ని పరామర్శించింది. పవన్ మాత్రం ఇక్కడికైతే రాలేదు. ‘‘వచ్చేస్తున్నారహో..’’ అంటూ థంబ్‌నెయిల్స్‌తో సోషల్ మీడియాలో ఊదరగొట్టేశారు. అల్లుడి కోసం కదిలి వస్తున్నాడంటూ ఊహాగానాలు ప్రచారం చేశారు. అయితే అల్లు వారిని కనీసం ఫోన్ ద్వారా అయినా ఆయన పరామర్శించినట్లు ఎక్కడా సమాచారం లేదు. ఇది అల్లు అర్జున్ అభిమానులతో పాటు పవన్ అభిమానులను ఒకింత ఇబ్బందికి గురి చేసింది.
వరుసకు మామ బంధుత్వంతోనైనా బన్నీని కలిసి ఉంటేనే.. పెద్దరికం నిలబెట్టుకున్నట్లు ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. మరోవైపు.. ఈ ఇష్యూ మొదట్లో రాజకీయంగా తాము ఇబ్బందికి గురవుతున్నామన్న అభద్రతాభావం సినీ పెద్దల్లో కనిపించింది. అలాంటి టైంలో దాదాపు ముప్పై ఏళ్లపాటు సినీ రంగంలో ఉన్న పవన్ కల్యాణ్ తమకు మద్దతుగా ఒక్క మాట అయినా అంటారేమోనని యావత్ సినీ పరిశ్రమ భావించింది. కానీ, ఇవేవీ జరగక.. తనదైన శైలిలో కన్‌ఫ్యూజింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. పవన్ ఏమన్నారో యధాతథంగా ఓసారి గమనిస్తే..
‘‘ప్రజలు సినిమా హీరోల పట్ల ప్రేమ, ఆదరణ చూపుతారు. హీరో వస్తున్నారంటే అభిమానులు ఎగబడతారు. మేము సినిమా థియేటర్‌కు వెళ్లడం ఎప్పుడో మానేశాం. విజయనగరంలో నన్ను కూడా ముందు వద్దనే చెప్పారు. చిరంజీవి(Chiranjeevi) ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్‌కు వెళ్లేవారు. నేనూ అలాగే వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయంలో స్టాఫ్ అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సింది. ఆయన వెళ్లి కూర్చున్నాక... ఘటన గురించి చెప్పి తీసుకెళ్లాల్సింది. చట్టం అందరికీ సమానం!. అర్జున్ విషయంలో ముందూ, వెనుక ఏం జరిగిందో తనకు తెలియదు. కానీ..
ఇటువంటి ఘటనల్లో పోలీసులను నేను తప్పు పట్టను. ఎందుకంటే వారు ముందు భద్రత గురించి ఆలోచన చేస్తారు.
.. అర్జున్‌కు చెప్పి ఉన్నా ఒక్కోసారి ఆ అరుపుల్లో అతనికి వినిపించలేదేమో. అల్లు అర్జున్ తరపున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్లి ఉంటే బాగుండేది. అప్పుడు రచ్చ అవకుండా ఉండేది. ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలచి వేసింది. ఇంతమంది మేము అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సింది. అభివాదం చేయకపోతే... ఆ నటుడుపై ప్రజల్లో వేరే భావన ఉంటుంది. పొగరు, బలుపు అని అందరూ చర్చ పెడతారు. ఈ ఘటనలో నా వల్ల చనిపోయారనే వేదన అర్జున్‌లో ఉంటుంది. వెళ్లి ఆ బిడ్ట కోసం మేమున్నాం అనే భరోసా ఇవ్వాలి. సినిమా అంటే టీం... అందరూ భాగస్వామ్యం ఉండాలి. ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారు. ఇది కరెక్ట్ కాదు.
ఈ ఘటనలో గోటితో పోయే దానిని గొడ్డలి వరకు తెచ్చారనేది నా అభిప్రాయం
అల్లు అర్జున్(Allu Arjun Row) విషయంలో ఎక్కడో మానవతా ధృక్పథం లోపీంచింది. అందరూ రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సింది. అది చేయకపోవడం వల్ల ప్రజల్లో ఆగ్రహం వచ్చింది. రేవంత్ రెడ్టిపై ప్రజలు విమర్శలు చేసే అవకాశం ఉందని.. సీఎం హోదాలో ఆయన స్పందించారు. రేవంత్ రెడ్డికి రాంచరణ్, అల్లు అర్జున్‌లు చిన్ననాటి నుంచీ తెలుసు. అర్జున్ మామ కాంగ్రెస్ నేత కూడా.
కొన్నిసార్లు పరిస్థితులు బట్టి నిర్ణయాలు ఉంటాయి.
రేవంత్ రెడ్టి చాలా గొప్ప నాయకుడు. కింద నుంచి ఎదిగారు. సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అలా చేశారు అని నేను అనుకోవడం లేదు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) వీటన్నింటికీ మించిన నాయకుడు. ఆయన వైఎస్సార్‌సీపీ విధానాల తరహాలో అక్కడ(తెలంగాణలో) వ్యవహరించలేదు. అక్కడ బెన్‌ఫిట్ షోలు, టిక్కెట్లు ధర పెంపుకు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పుష్ప సినిమాకు బెనిఫిట్ షో, టికెట్ రేట్లు పెంచారు. ఆయన సహకారంతోనే సినిమాల కలెక్షన్లు పెరిగాయి. ‘సలార్’, ‘పుష్ప2’వంటి సినిమాలకు భారీ వసూళ్లు వచ్చాయి. ‘పుష్ప2’ సినిమాకు సీఎం రేవంత్ పూర్తిగా సహకరించారు. టికెట్ రేట్ల పెంపునకు అవకాశం ఇవ్వడం కూడా చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడమే అవుతుంది.
మరి మనం రేవంత్ రెడ్డిను ఎలా తప్పు బడతాము?.
రెండ్రోజుల కిందట.. ఇదే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కడప రిమ్స్ వద్ద మీడియాతో మాట్లాడుతుండగా.. ఓ విలేకరి అల్లు అర్జున్ ఎపిసోడ్ గురించి ప్రశ్నించారు. ఇది సంబంధం లేని ప్రశ్న అంటూ పవన్ దాటవేసే యత్నం చేశారు. ‘‘మీ ఫ్యామిలీ మెంబర్ కదా?’’ అని అదే విలేకరి ప్రశ్నించగా.. ఆవేశంతో ఊగిపోయిన పవన్.. ‘‘ఇప్పుడు మనుషులు మరణిస్తుంటే సినిమాల గురించి ఎందుకు? పెద్ద పెద్ద సమస్యలకు సంబంధించిన విషయాలు అడగండి. మనస్ఫూర్తిగా చెబుతున్నాను.. బియాండ్ సినిమా గురించి డిబేట్ పెట్టండి. ఇక్కడ సమస్యల గురించి మాట్లాడండి. అరాచకాలపై డిబేట్ పెట్టండి'' అని క్లాస్ పీకారు.
కట్ చేస్తే.. దిల్ రాజుతో భేటీ అయిన సందర్భంలోనే అల్లు అర్జున్ ఇష్యూ.. ఆయనకు పెద్ద సమస్యగా కనిపించిందేమో!. అందుకే ప్రధానంగా భావించి చాలాసేపు మాట్లాడారు. ఒకవైపు తన అల్లుడిదే తప్పనంటూ.. మరోవైపు చంద్రబాబు శిష్యుడనో లేకుంటే తోటి పొలిటీషియన్ అనో కాకుంటే ఒక స్టేట్‌కు సీఎం అనో.. రేవంత్ చేసిందే కరెక్ట్ అంటూ ప్రశంసలు గుప్పించారాయన. అదే సమయంలో.. ఇక్కడ పాపం అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారు అంటూ కర్రతో కాల్చి ఆపై బర్నల్ రాసినంత పని చేశారు.
ఒకప్పుడు పవన్ కల్యాణ్(P)awan Kalyan) ప్రసంగాలు అంటే.. గజిబిజి గందరగోళంగా ఉండేవన్న పేరు ఉండేది. ఆయన ఎప్పుడు.. ఏం మాట్లాడాతారో అర్థంకాక అభిమానులు తలలు పట్టుకునేవారు. అదృష్టవశాత్తూ.. ఎన్నికల టైంలో ఆయన్నొక తోపుగా సోషల్ మీడియా విపరీతమైన హైప్ తెచ్చి పెట్టింది. అయితే.. డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన వైఖరిలో మార్పు వస్తుందేమోనని భావించిన అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. పైపెచ్చు.. పబ్లిక్‌గా అభిమానులనే తిడుతూ పబ్లిక్‌గా అసహనం ప్రదర్శిస్తున్నారు.
మొత్తంగా కర్ర విరగకూడదు.. పాము చావకూడదు అనే చందాన హీరో అల్లు అర్జున్ వ్యవహారంపై పవన్ మాట్లాడారు. అయితే ఇది ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పిస్తే.. ఇలాగైనా తమ లీడర్‌కు ఎలివేషన్ ఇద్దామని భావించిన ఆయన ఫ్యాన్స్‌ను మాత్రం షరామాములుగా అయోమయంలో పడేసింది. ఏది ఏమైనా పవన్ తన వ్యాఖ్యలతో మరోసారి ఫ్యాన్స్ వార్‌కు మాత్రం ఆజ్యం పోశారు.
Comments
Please login to add a commentAdd a comment