మెగాస్టార్‌గా పేరోందిన ప్రఖ్యాత నటుడు చిరంజీవి కుటుంబం, ఆయన బంధువుల మద్య విభేదాలు ఏర్పడ్డాయా? అనే చర్చ అటు సినీ వర్గాల్లోను.. ఇటు రాజకీయ వర్గాల్లోను జోరుగా సాగుతోంది. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభిమానులకు, జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పొందిన మరో స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు మధ్య తీవ్రస్థాయిలో రగడ జరుగుతోంది. దీనికి తొలుత పవన్ కళ్యాణే అజ్యం పోయడం విశేషం.
తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అర్జున్ ఏమైన పుడింగా అంటూ ప్రశ్నించారు. ఆయనకు తోడుగా మరికొందరు జనసేన నేతలు సైతం అర్జున్‌ను కించపరుస్తూ విమర్శలు కురిపించారు. దీంతో మెగా కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయి అనే అభిప్రాయం వచ్చింది. చిరంజీవి సినిమాల్లో స్వయంగానే ఎదిగినా, ఆయన మామ మరో ప్రఖ్యాత నటుడు అల్లు రామలింగయ్య ప్రభావంతో కూడా బాగా అభివృద్ది చెందారు. అల్లు రామలింగయ్య కుమార్తెను ఆయన వివాహం ఆడారు. బావ మరిది అల్లు అరవింద్‌తో కలిసి పలు హిట్ సినిమాలు తీశారు. చిరంజీవి, అల్లు అరవింద్‌లు ఒక బ్రాండ్‌గా మారారు. ఆ తర్వాత కాలంలో..
చిరంజీవి సోదరులు నాగబాబు, పవన్ కల్యాణ్‌లు సినీరంగంలోకి రాగా... పవన్ కల్యాణ్ ఒక క్రేజ్ తెచ్చుకున్నారు. తదుపరి తరంలో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ్ సినీరంగంలోకి వచ్చి వెలుగొందుతున్నారు. ఇదే కుటుంబంకు చెందిన వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ సినీ రంగంలో తమ ప్రభావాన్ని చూపుతున్నారు. మరోవైపు అల్లు అరవింద్ పెద్ద నిర్మాతగా పెరగడమే కాకుండా, ఆయన కుమారుడు అల్లు అర్జున్ స్టార్ హిరో అయ్యారు. మాస్ ఫాలోయింగ్‌ను తెచ్చుకున్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్‌లు రాజకీయాల్లోకి వెళ్లారు. గెలుపు ఓటములు చవిచూశారు. అల్లు అర్జున్ రాజకీయాల జోలికి వెళ్లలేదు. కానీ..
ఈ మధ్య నంద్యాలలో ఎన్నికల సమయంలో తన స్నేహితుడు అయిన వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి దగ్గరికి వెళ్లి వచ్చారు. కాని అక్కడ ఆయన ఎన్నికల ప్రచారం చేసింది లేదు. ఆయన రాక తెలిసి పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి వచ్చారు. అది పవన్ కల్యాణ్‌కు జనసేన మద్దతుదారుల కోపానికి కారణం అయ్యింది. 2019 ఎన్నికల సమయంలో కూడా అర్జున్ వెళ్లివచ్చినా అప్పుడు విమర్శలు రాలేదు. ఈ సారి ఎందుకో పవన్ కళ్యాణే పరోక్షంగా బయటపడిపోయారు. బెంగుళూరులో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో అటవీ పర్యావరణ శాఖ మంత్రి హోదాలో మాట్లడుతూ, కలప స్మగ్లింగ్ ప్రస్తావన తెచ్చారు. ఆ క్రమంలో సినీ హీరోలు స్మగర్ల పాత్రలు వేస్తున్నారని అక్షేపణ తెలిపారు. ఇది అల్లు అర్జున్‌ను ఉద్దేశించే అని, అయనపై ద్వేషంతోనే పవన్ కల్యాణ్ మాట్లాడారని అర్జున్ అభిమానులు భావించారు.
.. దానిపై రకరకాల కామెంట్స్ సోషల్ మీడియాలో సాగాయి. దీనికి అల్లు అర్జున్ పరోక్షంగానే సమాధానం ఇస్తూ... తాను తన మిత్రుల కోసం తగ్గేదేలే అని స్పష్టం చేసారు. దీనితో పవన్ అభిమానులు మరింత అగ్రహం చెందారు. ఆ టైంలో అల్లు అర్జున్‌కు మద్దతుగా మామ చంద్రశేఖర్ రెడ్డి టీవీలకు ఇంటర్వూలు ఇచ్చారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.. హద్దులు దాటి మాట్లాడారు. అల్లు అర్జున్ ఏమైనా పుడింగా? అని ప్రశ్నించారు. అయనకు ఫ్యాన్స్ ఎవరు ఉన్నారు?ఉన్నదంతా మెగా ఫ్యాన్స్. బ్రాంచీలు, షామియానా కంపెనీల గూరించి తెలియదంటూ ఏవేవో మాట్లడేశారు. దీంతో ఈ వివాదం చినికి చినికి గాలి వానగా మారింది.
అల్లు అర్జున్ ఒక్క చోటకు వెళితే అక్కడ కూడా ఓటమే జరిగిందని... ఆయన తండ్రి అరవింద్‌ను గతంలో అర్జున్ గెలిపించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. నిజానికి బొలిశెట్టి ఇలా రియాక్ట్ కానక్కర్లేదు. అర్జున్‌కు కొంత మెగా బ్రాండ్ ఉపయోగపడితే ఉపయోగపడి ఉండవచ్చు. అలాగని ఆయన తండ్రి అరవింద్‌కు ఉన్న సామర్థ్యం తెలియనిది కాదు. ప్రముఖ నిర్మాతగానే కాకుండా సినిమా ఫీల్డ్‌లోని ఇతర విభాగాలలో ఆయనకు చాలా పట్టు ఉంది. అరవింద్ కావాలనుకుంటే అర్జున్‌తో ఎన్నో సినిమాలు నిర్మించగలరు. అలాగే.. అర్జున్‌కు సినీ రంగంలో ఎంతో డిమాండ్ ఉంది.
జనసేన నేతలు అలాంటి వ్యక్తిని బెదిరించడం సబబు కాదు. మరో జనసేన నేత అయితే అల్లు అర్జున్ సినిమాలు ఎలా ఆడతాయో చూస్తామని రెచ్చిపోయారు. ఇది చాలా తప్పు. రాజకీయాలు వేరు. సినిమాలు వేరు. ఆ సంగతి విస్మరించి మాట్లాడితే దానివల్ల పవన్ కల్యాణ్‌కు కూడా నష్టం జరగవచ్చు. కేవలం పవన్ మెప్పు కోసం బొలిశెట్టికాని మరికొందరు కాని అలా మాట్లాడినట్టు అనిపిస్తోంది.
.. అర్జున్ నంద్యాల వెళితే అక్కడ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి గెలవలేదని వీరు ఎత్తిపొడిచారు. అది ఎలా ప్రామాణికం అవుతుందో అర్థం కాదు. ఆ మాటకు వస్తే, ఎన్నికలలో ఇంతకుముందు చిరంజీవి ఒక చోట, పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు. అంత మాత్రాన వారికి అభిమానులు లేరని, పలుకుబడి లేదని ఏవరైన అన్నారా?. సినిమా పాత్రలకు రాజకీయ పాత్రలకు సంబంధం పెట్టదలిస్తే పవన్ కల్యాణ్ సంబంధించి ఎన్నో ఉదాహరణలు దోరుకుతాయి.
అయన తన సినిమాల్లో అడపిల్లలను సరాదాగా అయినా వేధించిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు దాన్ని తప్పు పట్టగలమా? చిరంజీవి నెగెటివ్ రోల్స్ కూడా పోషించారు. మరి సినిమా హిరోలు ఎవరూ అలాంటి పాత్రలు పోషించకూడదు అన్నది పవన్ అభిప్రాయం అయితే.. ఇక నుంచి ఆయన అలాంటి పాత్రలు వేయకూడదు. ఆ మాటకు వస్తే.. సినిమాల్లో హిరోగా ఎన్నో డైలాగ్‌లు చెప్పిన అయన రాజకీయాల్లో పూర్తి విరుద్ధంగా అబద్ధాలు, మాటలు మార్చడం వంటివి ఎన్నో చేస్తున్నారు. అనేక విషయాల్లో పొంతన లేకుండా మాట్లడుతున్నారు.
సూపర్ సిక్స్ అంటూ మోసపూరిత హమీలు ఇచ్చారు. అదర్శాలు వల్లించే ఒక సినీ హిరో ఇలా మోసం చేయవచ్చా? అంటే ఏమని సమాధానం ఇస్తారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంతో సినీ, రాజకీయ రంగం మధ్య సంబంధాలు పెరిగాయి. ఎన్టీఆర్ కంటే చంద్రబాబు సినిమా వాళ్లను ఎక్కువగా వాడుకోగలిగారని అంటారు. కోట శ్రీనివాస్ రావు అప్పట్లో ఒక రాజకీయ సినిమాల్లో ఎన్టీఆర్ పాత్ర పోషిస్తే, ఆయన అభిమానులు ఆయనపై దౌర్జన్యం చేసారు. ఆ సంగతి తెలిసిన ఎన్టీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌కు, కృష్ణకు రాజకీయాల్లో అసలు పడేది కాదు. ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా కృష్ణ విజయ నిర్మల ప్రచారం చేశారు. చిరంజీవి, బాలకృష్ణలతో కలిసి విభిన్నమైన పాత్రల్లో నటించిన రోజా వైఎస్సార్‌సీపీ పక్షాన ఎమ్మెల్యే, మంత్రి అయ్యారు. రాజకీయంగా పరస్పర విమర్శలు కూడా సాగాయి. గతంలో మాగుంట సుబ్బిరామి రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటి చేసినప్పుడు అయనతో వ్యక్తిగత సంబంధాల రిత్యా కొంత మంది సినీ నటులు ప్రచారం చేసేవారు. చిరంజీవి కూడా అలాగే కొందరికి మద్దతు ఇచ్చారు. ఇప్పటికి ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నట్టుగా లెక్క. కాని ఇటీవలి ఎన్నికలలో జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్, బీజేపీ అభ్యర్ధి సియం రమేష్‌కు ఓపెన్‌గా మద్దతు ఇచ్చారు. మరి దాన్ని సమర్ధించాలా... తప్పుబట్టాలా?.
గతంలో విజయశాంతి ఒంగోలులో సుబ్బిరామిరెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. సినీనటి సౌందర్య రాజకీయాల్లో లేకపోయినా బీజేపీకి ప్రచారం చేయడానికి వస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఇలా రాజకీయ, సినీ రంగాలకు అవినాభావ సంబంధాలు కొనసాగుతున్నాయి. అంత మాత్రన వారు నటించిన పాత్రలకు, వారు మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలకు లింక్ చేసి విమర్శించడం అర్థ రహితమే కావచ్చు.
ఈ నేపథ్యంలో మెగా కుటుంబంలో తగాదాలు ఏర్పడ్డాయన్న భావన వస్తుంది. గతంలో పవన్‌కు, చిరంజీవి, నాగబాబులకు మధ్య గ్యాప్ వచ్చిందని అనేవారు. నాగబాబు అయితే నేరుగా పవన్ అభిమానులపై చిరాకుపడ్డారు. కానీ ఆ తర్వాత వీరంతా కలిసిపోయారు. ఇప్పుడు కూడా అలాగే జరగవచ్చు. అల్లు అర్జున్ తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోయి, వీళ్లతో రాజీపడతారా? లేదా? అనేది అప్పుడే చెప్పలేం. ఇవి అన్నీ పరిశీలిస్తే పవన్ కల్యాణ్ అభిమానులు ఈ మధ్య మరీ రెచ్చిపోయి ఇలాంటి కామెంట్‌ల రూపంలో పిచ్చి పనులు చేస్తున్నారేమో అనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు పాలన అనుభవం లేదంటూ మాట్లాడి పరువు తీసుకున్నారు. ముందు ఆయనకు తన అభిమానులుగాని, జనసేన కార్యకర్తలు కాని తగు సలహాలు ఇచ్చి, ఆ తర్వాతే ఇంకెవరి జోలికైనా వెళితే బెటర్.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment