దేముడా.. ఓ మంచి దేముడా.. నా జీవితంలో ఇంకో ఏడాది గడిచిపోయింది.. వయసు ఏడాది పెరిగింది తప్ప జీవితంలో మార్పులేం రాలేదు.. కాలం మారింది.. మారిందంటే వానాకాలం పోయి చలికాలం వచ్చిందని కాదు.. కాలాన్ని బట్టి మనుషులు బుద్ధులు మారినై అంటున్నా.. మనుషులు మారినారు.. అదిగో మళ్ళా మనుషులు మారడం అంటే ఆడోల్లు మగాళ్లుగ.. మగాళ్లు ఆడోళ్లలా మారడం కాదు.. మనిషి తీరు మారింది అంటున్నా.. మీ దేవుళ్ళు మాత్రం యుగయుగాలుగా ఒకేలా ఉంటున్నారు కానీ..
మావాళ్లేంది సిచ్యువేషన్ బట్టి మారిపోతున్నారు.. నువ్వు పుట్టించినప్పుడే పర్మినెంట్ చిప్ కదా పెట్టాలి.. మంచివాడికి ఒక చిప్.. అంటే వాడు చచ్చేవరకు మంచివాడిగా ఉండాలి.. వెధవలకు ఇంకో చిప్.. అలా పెడితే బాగుణ్ణు కదయ్యా.. మొబైల్ ఫోన్లలో ఆటో అప్డేట్ ఉన్నట్లు .. ఫోన్లో సెట్టింగ్స్ మారిపోతున్నట్లు ఫ్రెండ్స్.. చుట్టాలు.. బంధువులు కూడా అప్డేట్ ఐపోతున్నారు స్వామి.. అంటే వాళ్ళంతట వాళ్లే మారిపోతున్నారు.. నేనేమో ఇంకా వాళ్ళు ఎప్పట్లానే ఉన్నారేమో అని చూస్తుంటే ఫోన్లో యాప్స్ సపోర్ట్ చేయనట్లుగానే వాళ్ళు నా మైండ్ సెట్ కు సూటవకుండా ఫోన్ కు.. బ్లూ టూత్ కనెక్ట్ కాకుండా ఉంటున్నట్లు ఉండిపోతున్నారు.
అంతా రివర్స్ లో ఉంటోంది ఏంది స్వామీ
అదేంటో స్వామీ.. నేను నాలుగేళ్ళ క్రితం వరకూ నానా ఇబ్బందులో ఉండేవాణ్ణి.. ఆ సమయంలో కాస్త కలిగిన మా చుట్టాలంతా నావాళ్ళ మాదిరిగానే ఉండేవాళ్ళు. నా ఉద్యోగం పోయిందని సంతోషంతోనో.. వీడికి బాగా అయిందన్న ఆనందంతోనో తెలీదు కానీ ఎంతోమంది పలకరించారు. వాళ్ళ గొప్పతనం చాటుకోవడం కోసమేనేమో.. బియ్యం పంపిన బంధువులు.. వెయ్యి వేసిన చుట్టాలు ఉన్నారు.. కానీ ఆ వెయ్యి.. ఆ బియ్యం వాళ్ళ దాతృత్వాన్ని చెప్పుకోవడానికి.
నా అసమర్థతను చాటడానికి వాడుకున్నారని తరువాత తెలిసింది. అదేంటో స్వామి.. విత్తనాల్లో కల్తీ.. ఆహారంలో కల్తీ.. నూనెకల్తీ.. టీపొడి కల్తీ విన్నాను కానీ ఈ ఏడాది ఏకంగా బంచువుల్లోనే కల్తీగాళ్లను చూసాను స్వామి.. వాళ్ళ ఇంటికి భోజనానికి పిలుస్తారు.. పోన్లే అభిమానంతో పిలిచారేమో అని వెళతానా.. కూర్చోబెట్టి వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకుంటూ నా అసమర్థతను .. నా పేదరికాన్ని తరచూ గుర్తు చేస్తున్నారు.. అవమానంతో ముద్ద గొంతు దిగలేదయ్యా.. పోనీ బయటి బంధువులు ఎవరో ఇలా చేశారంటే ఒకే ఒకే.. అందరూ నావాళ్లు.. ఆత్మీయులు అని నమ్మినవాళ్ళే ఇలా చేస్తుంటే ఇక ఎవర్ని నమ్మాలయ్యా ..
కూట్లో బుగ్గిపోసే రకం
నాతో గడిపి గడిపి కష్ఠాలు.. బాధలకు కూడా బోరొచ్చిందేమో.. నాక్కాస్త గ్యాపిచ్చాయి.. రాత్రి పగలు కష్టించాను.. చిన్నా పెద్ద .. ఏపని దొరికితే అది చేశాను.. చిన్న ఉద్యోగం.. పదిరూపాయలు ఆదాయం.. కాస్త నడుపునిండా బువ్వ.. ఇంట్లో భార్యాబిడ్డలతో కాసిన్ని స్మైలీ సన్నివేశాలు దొరికాయి. వాటిని ఫోన్లో స్టోర్ చేసేలోపే మళ్ళీ ఫేక్ పాత్రధారులు ఎదురయ్యారు. ఏంటీ ఏదో ఆఫర్ తగిలిందట కదా.. ఏదో అయిందట కదా అంటూ ఓ ఫంక్షన్లో సెటైర్లు.. కొందరు ఇలాగే రాత్రికిరాత్రి ఎదిగిపోతుంటారు అంటూ ఎత్తిపొడుపులు.. నేను నిద్రపోని రాత్రులు.. ముద్ద తినని పొద్దులు.. నడిచి నడిచి తిరిగిన నా కళ్ళు.. కునుకు లేక ఇంకిన నా కళ్ళు... ఇవన్నీ వీళ్లకు తెలుసా ? తెలీదు.. నేను ముద్దలేక ఏడుస్తుంటే సంబరంలో వీళ్ళీ.. నేను కడుపునిండా తింటుంటే కడుపు మంటతోనూ వీళ్ళే .. వద్దు స్వామి.. ఇలాంటి నకిలీలు నాకొద్దు.. వీళ్ళను నానుంచి తీసెయ్యి.. ఫోన్లనుంచి నంబర్లు తీసేసినట్లు నా మైండ్ నుంచి వెళ్ళాను తీసెయ్యి.. ఒరిజినల్ .. మనసున్నవాళ్లను నాకు దగ్గర చెయ్యి.. ఈ కొత్త ఏడాదిలో నాకు ఇంకేం వద్దు.. ఒరిజినల్ మనుషులను ఇవ్వు చాలు..
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment