Tribunal Judgment
-
ఉద్యోగిని వేధించిన కంపెనీ.. నష్టపరిహారం కోట్లలోనే..?
లండన్: యూకేలో రాయల్ మెయిల్ మాజీ ఉద్యోగి కామ్ ఝూటి కంపెనీలో జరుగుతున్న అవకతవకలపై ఎంప్లాయి ట్రిబ్యునల్ లో చేసిన పోరాటానికి ఫలితంగా సదరు కంపెనీ ఆమెకు రూ.24 కోట్లు పరిహారం చెల్లించాల్సిందిగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. 2014లో రాయల్ మెయిల్ మీడియా ప్రతినిధిగా పనిచేస్తోన్న బ్రిటీష్ ఇండియన్ కామ్ ఝూటికి తన సహచర ఉద్యోగికి చట్టవిరుద్ధంగా బోనస్ అందుతున్న విషయంపై అనుమానమొచ్చింది. దీంతో విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకుని వెళ్ళింది. తీరా యాజమాన్యం ఆమె ఫిర్యాదుకు స్పందించకపోగా ఆమెను తిరిగి వేధించడం ప్రారంభించింది. విషయం బయటకు పొక్కకుండా ఉంచేందుకు మొదట ఆమెకు మూడు నెలల జీతం ఇస్తామన్న రాయల్ మెయిల్ ప్రతినిధి తర్వాత ఏడాది జీతం ఇస్తామని కూడా ఆశ చూపించారు. ఝూటి అందుకు అంగీకరించకపోవడంతో వేధించడం ప్రారంభించారు. వేధింపులకు తాళలేక ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి తానెదుర్కొన్న శారీరక, మానసిక సమస్యలను వివరిస్తూ 2015లో సుప్రీం కోర్టులోని ఎంప్లాయి ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత 2022లో ట్రిబ్యునల్ రాయల్ మెయిల్ కంపెనీలో తారాస్థాయిలో అవినీతి జరిగిందని, ఉద్యోగి పట్ల యాజమాన్యం వేధింపులు కూడా నిజమేనని ఇచ్చిన నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. కామ్ ఝూటి పట్ల రాయల్ మెయిల్ కంపెనీ వ్యవహరించిన తీరు అభ్యంతరకరమైనదని, ఆమె అనుభవించిన మానసిక క్షోభ వర్ణనాతీతమని తక్షణమే ఆమెకు వారు రూ.24 కోట్లను పరిహారంగా చెల్లించాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే కంపెనీ వారు మాత్రం ఈ తీర్పును సవాలు చేస్తూ.. ప్రస్తుతానికైతే రెండున్నర లక్షలు పరిహారం చెల్లించారు. ఇది కూడా చదవండి: తిరుగుబాటు నాయకుడు ప్రిగోజిన్ తో పుతిన్ భేటీ..? -
ఎప్పటి నీటి లెక్కలు అప్పటికే..
సాక్షి, అమరావతి: ఒక నీటి సంవత్సరం (జూన్ 1 నుంచి మే 31 వరకు)లో ఒక రాష్ట్రం వాడుకోని కోటా జలాలను మరుసటి నీటి సంవత్సరంలో వాడుకోవడానికి ఆ రాష్ట్రానికే అనుమతిస్తే.. మరో రాష్ట్రం హక్కులను దెబ్బతీసినట్లవుతుందని తెలంగాణ సర్కార్‌కు కృష్ణాబోర్డు తేల్చిచెప్పింది. కోటాలో వాడుకోకుండా మిగిలిన నీళ్లు క్యారీ ఓవర్ జలాలే అవుతాయని స్పష్టం చేసింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం క్యారీ ఓవర్ జలాలపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని తెగేసి చెప్పింది. రెండు రాష్ట్రాలు సంప్రదింపులు జరుపుకొని.. ఏకాభిప్రాయం ద్వారా వాటిని వాడుకోవడానికి అవకాశం ఉంటుందని సూచించింది. గతేడాది జూన్ 6న ఇదే అంశాన్ని అటు తెలంగాణ సర్కార్‌కు.. ఇటు కృష్ణాబోర్డుకు సీడబ్ల్యూసీ తేల్చిచెప్పింది. అయినా సరే.. తెలంగాణ సర్కార్ కోటాలో మిగిలిన నీటిని వచ్చే ఏడాది వాడుకుంటామంటూ వితండవాదన మళ్లీ తెరపైకి తెస్తూ వివాదం రాజేస్తుండటం గమనార్హం. నీటి నిల్వపై నేరుగా ప్రభావం నాగార్జునసాగర్‌లో కోటాలో వాడుకోని జలాలను మరుసటి సంవత్సరం వాడుకుంటామని తెలంగాణ సర్కార్ ఇటీవల కృష్ణాబోర్డును కోరింది. తెలంగాణ సర్కార్ ప్రతిపాదనకు కృష్ణాబోర్డు అంగీకరిస్తే.. సాగర్‌లో నీటినిల్వపై నేరుగా ప్రభావం చూపుతుంది. కొత్త నీటి సంవత్సరంలో వచ్చే వరద జలాలతో నిండాక.. మిగులు జలాలను దిగువకు వదిలేయాల్సి ఉంటుంది. అంటే తెలంగాణ సర్కార్ కోటాలో వాడుకోని నీటిని మరుసటి సంవత్సరం వాడుకోవడానికి అనుమతిస్తే ఏపీ హక్కులను దెబ్బతీసినట్లవుతుందన్నది స్పష్టమవుతోంది. కేంద్ర జలసంఘం తెగేసిచెప్పినా సరే.. కృష్ణాజలాల్లో 2021–22లో కోటాలో వాడుకోకుండా మిగిలిన 47.79 టీఎంసీలను 2022–23లో నాగార్జునసాగర్ కింద వినియోగించుకుంటామని గతేడాది తెలంగాణ సర్కార్ కృష్ణాబోర్డును కోరింది. దీనిపై కృష్ణాబోర్డు సీడబ్ల్యూసీని సంప్రదించింది. కోటాలో వాడుకోని నీళ్లన్నీ క్యారీ ఓవర్ జలాలే అవుతాయని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం వాటిపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని తేల్చిచెప్పింది. అయినా తెలంగాణ సర్కార్ అదే ప్రతిపాదనను తెరపైకి తేవడంపై కృష్ణాబోర్డు అసహనం వ్యక్తం చేస్తోంది. (చదవండి: ‘అమరావతి’ పట్టాల పంపిణీని హర్షిస్తూ భారీ ర్యాలీ) -
‘జల వివాదాల’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: అంతర్ రాష్ట్ర జల వివాదాలను వేగంగా, ఓ క్రమపద్ధతిలో పరిష్కరించేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించింది. అంతర్ రాష్ట్ర నదీ జల వివాదాల (సవరణ) బిల్లు–2019 బిల్లును లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. బిల్లును కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రవేశపెడుతూ, వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదాలను పరిష్కరించడంలో ప్రస్తుతం ఉన్న ట్రిబ్యునళ్లు విఫలమయ్యాయనీ, కాబట్టి పరిష్కార విధా నంలో మార్పు అవసరమన్నారు. ఓ కేసులో అయితే 33 ఏళ్లయినా వివాదాన్ని ట్రిబ్యునల్ పరిష్కరించలేకపోయిందని చెప్పారు. కోర్టులు లేదా ట్రిబ్యునళ్లు నీటిని సృష్టించలేవనీ, అందరూ జల సంరక్షణపై దృష్టిపెట్టాలని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచంలోని జనాభాలో 18 శాతం మంది ఇండియాలోనే ఉన్నారనీ, కానీ ప్రపంచంలోని మంచి నీళ్లలో 4 శాతమే మన దేశంలో ఉండటంతో ఇది తీవ్ర సమస్యగా మారనుందని మంత్రి చెప్పారు. సభలో చర్చ సందర్భంగా కావేరీ జల వివాదంపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సభ్యులు వాగ్వాదానికి దిగడంతో స్పీకర్ ఓం బిర్లా వారిని సముదాయించారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల సభ్యులు మాట్లాడుతూ, రాష్ట్రాలను సంప్రదించేలా ఈ బిల్లులో నిబంధనలు లేవనీ, ఇది సమాఖ్య వ్యవస్థపై దాడి అని అన్నారు. బిల్లులో ఏముంది?: అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం–1956ను సవరించేం దుకు కేంద్రం ఈ బిల్లును తెచ్చింది. వేర్వేరు ధర్మాసనాలతో ఒకే ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేయడం, వివాదాలను పరిష్కరించేందుకు ఓ కాలపరిమితి విధించి, కచ్చితంగా ఆ సమయంలోపు సమస్య పరిష్కారమయ్యేలా చూడటం ఈ బిల్లు ప్రత్యేకతలు. సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి ట్రిబ్యునల్‌కు నేతృత్వం వహిస్తారు. అవసరమైనప్పుడు ధర్మాసనాలను ఏర్పాటు చేస్తా రు. వివాదం పరిష్కారమయ్యాక అవి రద్దవుతాయి. గరిష్టంగా రెండేళ్లలోపు వివాదాన్ని ట్రిబ్యునల్ పరిష్కరించాల్సి ఉంటుంది. -
బదిలీల కథ మొదటికి..!
- తహసీల్దార్ల బదిలీ ఉత్తర్వులు రద్దు చేసిన ట్రిబ్యునల్ - పాత స్థానాల్లోనే నియమించాలని ఆదేశాలు - ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన ఐదుగురు తహసీల్దార్లు - తాజాగా బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం మొగ్గు - ప్రభుత్వం నిర్ణయం మేరకు నడుచుకుంటామని వెల్లడి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తహసీల్దార్ల బదిలీల కథ అడ్డం తిరిగింది. కలెక్టర్ జారీచేసిన బదిలీ ఉత్తర్వులను రద్దు చేస్తూ ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఇతర జిల్లాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించి వెనక్కివచ్చిన తహసీల్దార్లకు పాత స్థానాల్లోనే పోస్టింగ్‌లు ఇవ్వాలని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు, ప్రభుత్వ పెద్దల సిఫార్సులతో బదిలీలు జరిగాయనే ఆరోపణలు రావడంతో సతమతమవుతున్న యంత్రాంగాన్ని తాజాగా ట్రిబ్యునల్ తీర్పు మరింత ఇరకాటంలో పడేసింది. సొంత జిల్లా/ మూడేళ్లు పైబడి ఒకే జిల్లాలో పనిచేస్తున్న తహసీల్దార్లకు స్థానచలనం క ల్పించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ క్రమంలో ఎన్నికల వేళ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తహసీల్దార్లు ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో వీరంతా జిల్లాకు తిరిగొచ్చారు. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్ బి. శ్రీధర్ వెనక్కివచ్చిన తహసీల్దార్లకు పోస్టింగ్‌లిచ్చారు. అయితే, బదిలీల పర్వంలో రాజకీయ ఒత్తిళ్లు శృతిమించడం, సమర్థతను గాకుండా పైరవీలు చేసుకున్నవారికే పెద్ద పీట వేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. తెలంగాణ గెజిటెట్ అధికారుల(టీజీఓ) సంఘం ఏకంగా తమ అసంతృప్తిని ప్రభుత్వానికి కూడా తెలియపరిచింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వారిని కాదని, మరో సంఘం సిఫార్సులకు ప్రాధాన్యమిచ్చారని ఆ సంఘం అభ్యంతరం తెలిపింది. ఈ క్రమంలోనే 13 మంది తహసీల్దార్లు కొత్త మండలాల్లో బాధ్యతలు స్వీకరించలేదు. దీంతో జిల్లాలో రెవెన్యూ పాలనా వ్యవస్థ స్తంభించింది. ప్రభుత్వమే నేరుగా నియమించిన డిప్యూటీ తహసీల్దార్లు కూడా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి ‘స్టే’ తెచ్చుకున్నారు. మరోవైపు తాజాగా మరో ఐదుగురు తహసీల్దార్లు వసంతకుమారి (శంకర్పల్లి), దేవుజా (ఘట్కేసర్), శ్రీనివాస్(శామీర్‌పేట), యాదయ్య (షాబాద్), ప్రేంకుమార్ (ఉప్పల్) కూడా ట్రిబ్యునల్ ద్వారా స్టే పొందారు. కలెక్టర్ ఉత్తర్వులు రద్దు చేస్తూ, పాత స్థానాల్లోనే వీరిని నియమించాలని ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు రద్దు? ట్రిబ్యునల్ ఉత్తర్వులతో బదిలీల అంశం మొదటికొచ్చింది. కోర్టును ఆశ్రయించిన ఐదుగురికి పాత స్థానాల్లో పోస్టింగ్ ఇవ్వాలని నిర్దేశించిన ట్రిబ్యునల్.. అదేసమయంలో రెండు విడతలుగా కలెక్టర్ జారీచేసిన బదిలీ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. దీంతో బదిలీలపై మీమాంస నెలకొంది. ట్రిబ్యునల్ తీర్పును పరిశీలిస్తే బదిలీల ప్రక్రియను మళ్లీ కొత్తగా చేపట్టాలని స్పష్టమవుతుందని, దీనిపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జిల్లా యంత్రాంగం స్పష్టం చేస్తోంది. మరోవైపు ఇప్పటికే ఆయా చోట్ల విధులు నిర్వర్తిస్తున్న తహసీల్దార్లకు తాజా పరిణామం మింగుడుపడడంలేదు. బదిలీల ప్రక్రియ రాద్ధాంతం సృష్టించడం, ఉద్యోగసంఘాలు రెండుగా చీలిపోవడం జిల్లా ఉన్నతాధికారులకు కూడా తలనొప్పిగా తయారైంది. మరోవైపు మునుపెన్నడూలేని విధంగా బదిలీల్లో ప్రజాప్రతినిధులు తలదూర్చడం కూడా యంత్రాంగానికి ఇబ్బంది మారింది.