లండన్: యూకేలో రాయల్ మెయిల్ మాజీ ఉద్యోగి కామ్ ఝూటి కంపెనీలో జరుగుతున్న అవకతవకలపై ఎంప్లాయి ట్రిబ్యునల్ లో చేసిన పోరాటానికి ఫలితంగా సదరు కంపెనీ ఆమెకు రూ.24 కోట్లు పరిహారం చెల్లించాల్సిందిగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
2014లో రాయల్ మెయిల్ మీడియా ప్రతినిధిగా పనిచేస్తోన్న బ్రిటీష్ ఇండియన్ కామ్ ఝూటికి తన సహచర ఉద్యోగికి చట్టవిరుద్ధంగా బోనస్ అందుతున్న విషయంపై అనుమానమొచ్చింది. దీంతో విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకుని వెళ్ళింది.
తీరా యాజమాన్యం ఆమె ఫిర్యాదుకు స్పందించకపోగా ఆమెను తిరిగి వేధించడం ప్రారంభించింది. విషయం బయటకు పొక్కకుండా ఉంచేందుకు మొదట ఆమెకు మూడు నెలల జీతం ఇస్తామన్న రాయల్ మెయిల్ ప్రతినిధి తర్వాత ఏడాది జీతం ఇస్తామని కూడా ఆశ చూపించారు. ఝూటి అందుకు అంగీకరించకపోవడంతో వేధించడం ప్రారంభించారు. వేధింపులకు తాళలేక ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి తానెదుర్కొన్న శారీరక, మానసిక సమస్యలను వివరిస్తూ 2015లో సుప్రీం కోర్టులోని ఎంప్లాయి ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది.
ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత 2022లో ట్రిబ్యునల్ రాయల్ మెయిల్ కంపెనీలో తారాస్థాయిలో అవినీతి జరిగిందని, ఉద్యోగి పట్ల యాజమాన్యం వేధింపులు కూడా నిజమేనని ఇచ్చిన నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. కామ్ ఝూటి పట్ల రాయల్ మెయిల్ కంపెనీ వ్యవహరించిన తీరు అభ్యంతరకరమైనదని, ఆమె అనుభవించిన మానసిక క్షోభ వర్ణనాతీతమని తక్షణమే ఆమెకు వారు రూ.24 కోట్లను పరిహారంగా చెల్లించాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది.
అయితే కంపెనీ వారు మాత్రం ఈ తీర్పును సవాలు చేస్తూ.. ప్రస్తుతానికైతే రెండున్నర లక్షలు పరిహారం చెల్లించారు.
ఇది కూడా చదవండి: తిరుగుబాటు నాయకుడు ప్రిగోజిన్ తో పుతిన్ భేటీ..?
Comments
Please login to add a commentAdd a comment