Royal Mail
-
ఉద్యోగిని వేధించిన కంపెనీ.. నష్టపరిహారం కోట్లలోనే..?
లండన్: యూకేలో రాయల్ మెయిల్ మాజీ ఉద్యోగి కామ్ ఝూటి కంపెనీలో జరుగుతున్న అవకతవకలపై ఎంప్లాయి ట్రిబ్యునల్ లో చేసిన పోరాటానికి ఫలితంగా సదరు కంపెనీ ఆమెకు రూ.24 కోట్లు పరిహారం చెల్లించాల్సిందిగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. 2014లో రాయల్ మెయిల్ మీడియా ప్రతినిధిగా పనిచేస్తోన్న బ్రిటీష్ ఇండియన్ కామ్ ఝూటికి తన సహచర ఉద్యోగికి చట్టవిరుద్ధంగా బోనస్ అందుతున్న విషయంపై అనుమానమొచ్చింది. దీంతో విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకుని వెళ్ళింది. తీరా యాజమాన్యం ఆమె ఫిర్యాదుకు స్పందించకపోగా ఆమెను తిరిగి వేధించడం ప్రారంభించింది. విషయం బయటకు పొక్కకుండా ఉంచేందుకు మొదట ఆమెకు మూడు నెలల జీతం ఇస్తామన్న రాయల్ మెయిల్ ప్రతినిధి తర్వాత ఏడాది జీతం ఇస్తామని కూడా ఆశ చూపించారు. ఝూటి అందుకు అంగీకరించకపోవడంతో వేధించడం ప్రారంభించారు. వేధింపులకు తాళలేక ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి తానెదుర్కొన్న శారీరక, మానసిక సమస్యలను వివరిస్తూ 2015లో సుప్రీం కోర్టులోని ఎంప్లాయి ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత 2022లో ట్రిబ్యునల్ రాయల్ మెయిల్ కంపెనీలో తారాస్థాయిలో అవినీతి జరిగిందని, ఉద్యోగి పట్ల యాజమాన్యం వేధింపులు కూడా నిజమేనని ఇచ్చిన నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. కామ్ ఝూటి పట్ల రాయల్ మెయిల్ కంపెనీ వ్యవహరించిన తీరు అభ్యంతరకరమైనదని, ఆమె అనుభవించిన మానసిక క్షోభ వర్ణనాతీతమని తక్షణమే ఆమెకు వారు రూ.24 కోట్లను పరిహారంగా చెల్లించాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే కంపెనీ వారు మాత్రం ఈ తీర్పును సవాలు చేస్తూ.. ప్రస్తుతానికైతే రెండున్నర లక్షలు పరిహారం చెల్లించారు. ఇది కూడా చదవండి: తిరుగుబాటు నాయకుడు ప్రిగోజిన్ తో పుతిన్ భేటీ..? -
అరుణ గ్రహానికి లేఖ.. ఖర్చెంతో తెలుసా?
ఐదేళ్ల చిన్నారి అలివర్ గిడ్డింగ్స్ కి ఓ చిత్రమైన ఆలోచన వచ్చింది. భవిష్యత్తులో వ్యోమగామి కావాలనుకుంటున్న ఈ చిన్నారి అరుణగ్రహానికి ఓ లేఖ రాయాలని నిర్ణయించుకున్నాడు. కానీ అక్కడెక్కడో భూమికి ఆమడ దూరంలో ఉన్న అరుణుడికి లేఖ రాయాలంటే ఎలా? లేఖను అక్కడికి పంపేందుకు ఎంత ఖర్చు అవుతుంది? ఇదే విషయాన్ని తెలుసుకోవాలని ఆ బాలుడు బ్రిటన్‌కు చెందిన 'రాయల్ మెయిల్'కు లేఖ రాశాడు. కానీ ఆ సంస్థకు కూడా ఈ విషయం తెలియదు. అందుకే వారు అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా' సహాయం కోరారు. మొత్తానికి అరుణ గ్రహానికి లేఖను పంపాలంటే అక్షరాలా 23,860ల డాలర్లు (రూ. 15.90 లక్షలు) ఖర్చు అవుతుందని తేల్చారు. ఇంత భారీ వ్యయమా? అని ఆశ్చర్యపోకండి. ఈ ఖర్చు ఎలా అవుతుందో కూడా 'రాయల్ మెయిల్' వివరించింది. 'ప్రస్తుతం ఇంధన ధరలు బాగా పెరిగిపోయాయి. ఆ ప్రభావం ఇతర గ్రహాలకు పంపే లేఖలపై కూడా పడుతుంది. నాసా గతంలో అరుణ గ్రహానికి పంపిన కూరియాసిటీ రోవర్ కోసం దాదాపు రూ. 700 మిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చు చేసింది. ఈ వ్యోమనౌక చాలా చిన్నది. కాబట్టి ఇందులోని ప్రదేశం చాలా విలువైందని చెప్పవచ్చు. వ్యోమనౌక బరువును బట్టి.. అరుణగ్రహానికి అది చేరుకోవడానికి అయ్యే ఖర్చును లెక్కిస్తారు. వంద గ్రాములకు పైగా బరువున్న వస్తువును ఆ గ్రహానికి పంపాలంటే దాదాపు 18వేల డాలర్ల ఖర్చు అవుతుంది' అని రాయల్ మెయిల్ చిన్నారి అలివర్కు రాసిన ప్రత్యుత్తరంలో వివరించింది. ఫస్ట్ క్లాస్ రాయల్ స్టాంపులు అన్ని కలుపుకొని ఈ లేఖ కోసం దాదాపు 24 వేల డాలర్ల ఖర్చు అవుతుందని తెలిపింది. వాయవ్య ఇంగ్లండ్‌లోని లిథమ్ సెయింట్ అన్నెస్లో ఉండే అలివర్ ఈ లేఖతో నిరాశ చెంది ఉంటాడు. అయినప్పటీ 'రాయల్ మెయిల్' తనకు సమాధానం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మరో లేఖ రాశాడు. 'అరుణ గ్రహానికి లేఖ రాయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. దీనికి చాలా స్టాంపులు అవసరమవుతాయి' అంటూ చమత్కరించాడు.