అరుణ గ్రహానికి లేఖ.. ఖర్చెంతో తెలుసా? | Q: How much would it cost to send a letter to Mars A: Nearly $24,000 | Sakshi
Sakshi News home page

అరుణ గ్రహానికి లేఖ.. ఖర్చెంతో తెలుసా?

Published Sun, Dec 6 2015 5:47 PM | Last Updated on Thu, Apr 4 2019 5:21 PM

అరుణ గ్రహానికి లేఖ.. ఖర్చెంతో తెలుసా? - Sakshi

అరుణ గ్రహానికి లేఖ.. ఖర్చెంతో తెలుసా?

ఐదేళ్ల చిన్నారి అలివర్ గిడ్డింగ్స్ కి ఓ చిత్రమైన ఆలోచన వచ్చింది. భవిష్యత్తులో వ్యోమగామి కావాలనుకుంటున్న ఈ చిన్నారి అరుణగ్రహానికి ఓ లేఖ రాయాలని నిర్ణయించుకున్నాడు. కానీ అక్కడెక్కడో భూమికి ఆమడ దూరంలో ఉన్న అరుణుడికి లేఖ రాయాలంటే ఎలా? లేఖను అక్కడికి పంపేందుకు ఎంత ఖర్చు అవుతుంది? ఇదే విషయాన్ని తెలుసుకోవాలని ఆ బాలుడు బ్రిటన్‌కు చెందిన 'రాయల్‌ మెయిల్‌'కు లేఖ రాశాడు. కానీ ఆ సంస్థకు కూడా ఈ విషయం తెలియదు. అందుకే వారు అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా' సహాయం కోరారు. మొత్తానికి అరుణ గ్రహానికి లేఖను పంపాలంటే అక్షరాలా 23,860ల డాలర్లు (రూ. 15.90 లక్షలు) ఖర్చు అవుతుందని తేల్చారు.

ఇంత భారీ వ్యయమా? అని ఆశ్చర్యపోకండి. ఈ ఖర్చు ఎలా అవుతుందో కూడా 'రాయల్‌ మెయిల్‌'  వివరించింది. 'ప్రస్తుతం ఇంధన ధరలు బాగా పెరిగిపోయాయి. ఆ ప్రభావం ఇతర గ్రహాలకు పంపే లేఖలపై కూడా పడుతుంది. నాసా గతంలో అరుణ గ్రహానికి పంపిన కూరియాసిటీ రోవర్‌ కోసం దాదాపు రూ. 700 మిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చు చేసింది. ఈ వ్యోమనౌక చాలా చిన్నది. కాబట్టి ఇందులోని ప్రదేశం చాలా విలువైందని చెప్పవచ్చు. వ్యోమనౌక బరువును బట్టి.. అరుణగ్రహానికి అది చేరుకోవడానికి అయ్యే ఖర్చును లెక్కిస్తారు. వంద గ్రాములకు పైగా బరువున్న వస్తువును ఆ గ్రహానికి పంపాలంటే దాదాపు 18వేల డాలర్ల ఖర్చు అవుతుంది' అని రాయల్‌ మెయిల్‌ చిన్నారి అలివర్‌కు రాసిన ప్రత్యుత్తరంలో వివరించింది.

ఫస్ట్‌ క్లాస్‌ రాయల్ స్టాంపులు అన్ని కలుపుకొని ఈ లేఖ కోసం దాదాపు 24 వేల డాలర్ల ఖర్చు అవుతుందని తెలిపింది. వాయవ్య ఇంగ్లండ్‌లోని లిథమ్‌ సెయింట్ అన్నెస్‌లో ఉండే అలివర్‌ ఈ లేఖతో నిరాశ చెంది ఉంటాడు. అయినప్పటీ 'రాయల్‌ మెయిల్‌' తనకు సమాధానం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మరో లేఖ రాశాడు. 'అరుణ గ్రహానికి లేఖ రాయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. దీనికి చాలా స్టాంపులు అవసరమవుతాయి' అంటూ చమత్కరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement