లండన్ : కరోనా మహమ్మారి యువతీ యువకులను ఏమీ చేయలేదని, వయసు పైబడినవారికే ప్రాణాంతకమని అది బయటపడిన మొదట్లో వైద్యులు భావించారు. కానీ రానురాను అన్ని వయసులవారిపై అది తీవ్ర ప్రభావం చూపుతుంది. తాజాగా బ్రిటన్‌లో కరోనావైరస్‌తో 13 ఏళ్ల బాలుడు మృతి చెందడం తీవ్ర ఆందోళనలు కలిగిస్తోంది. కొద్ది రోజుల క్రితం బాలుడికి కరోనావైరస్ లక్షణాలు కనిపించడంతో లండన్‌లోని కింగ్స్ కాలేజీ ఆస్పత్రిలో తరలించి చికిత్స అందించారు. ఊపిరి తీసుకోవడం ఇబ్బంది కావడంతో వెంటిలేటర్లపై ఉంచి శ్వాస అందించారు. ఈ తరుణంలో బాలుడు కోమాలోకి వెళ్లాడని, కొన్ని గంటల తర్వాత మృతి చెందారని మంగళవారం సాయంత్రం లండన్ వైద్యులు వెల్లడించారు. బ్రిటన్‌లో కరోనా బారిన పడి మృతిచెందిన పిన్న వయస్కుడు ఇతనేనని వైద్యులు పేర్కొన్నారు.
(చదవండి : అన్ని వయస్కులవారికీ కరోనా ప్రాణాంతకమే!)
మరోవైపు బెల్జియంలో కూడా కరోనా మహమ్మారికి ఓ 12 ఏళ్ల బాలిక బలైంది. ఈ వయసువారు కోవిడ్-19తో మరణించటం చాలా అరుదని బెల్జియం ప్రభుత్వ ప్రతినిధి ఎమ్మాన్యుయేల్ ఆండ్రే తెలిపారు. ఆ బాలిక మరణంతో తాము షాక్‌కు గురయ్యామన్నారు. కాగా, బ్రిటన్‌లో ఇప్పటికి వరకు 1789 మంది కరోనాతో మృతి చెందారు. గడచిన 24 గంటల్లోనే 381 మంది మృతి చెందడం గమనార్హం. ఆదేశంలో ఇప్పటి వరకు 25,150 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment