న్యూఢిల్లీ : బ్రిటన్‌లోని వివిధ విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థినులపై లైంగిక దాడులు రోజురోజుకు పెరిగి పోతున్నాయి. గత నాలుగేళ్ల కాలంలోనే పదింతలు పెరగడం పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. 2014లో కేవలం 65 లైంగిక దాడులు చోటు చేసుకోగా అవి 2018లో 626కు చేరుకున్నాయి. బర్మింగ్‌హామ్ కేంబ్రిడ్జి యూనివర్శిటీ, ఈస్ట్ ఆంగ్లియా లెక్కల ప్రకారం ఆ ఏడాది దాదాపు 2000 రేప్‌లు, లైంగిక దాడులు, వేధింపు సంఘటనలు చోటు చేసుకున్నాయని ‘ఛానల్ 4 న్యూస్’ దర్యాప్తులో తేలింది. వీటిలో ఎక్కువ సంఘటనలు కేసుల వరకు వెళ్లలేదు. కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతారనే ఆందోళనతో చాలా సంఘటనలపై బాధితులైన విద్యార్థినులు ఫిర్యాదు చేయలేదు. కొందరు ఫిర్యాదు చేయడానికి ధైర్యంగా ముందుకు వెళితే వారిని యూనివర్శిటీల నుంచే అధికారులు తొలగించి వేశారట.
ఆకతాయి అబ్బాయిలు చిత్తుగా తాగడం ఈ దారుణాలు పెరగడానికి ఓ కారణమైతే, తల్లిదండ్రులు పిల్లల్ని హద్దుల్లో ఉంచకపోవడం మరో కారణమని సామాజిక శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. తమపై జరిగిన లైంగిక దాడులు జరిగిన విషయాన్ని కొంత మంది విద్యార్థినులు బయటకు చెప్పుకోలేక పోతున్న నేపథ్యంలో కేంబ్రిడ్జ్‌లో అలాంటి సంఘటనల గురించి ఆకాశ రామన్నలు ఫిర్యాదు చేయడానికి ఆన్‌లైన్ ఫిర్యాదుల కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. గత కొంతకాలంలో లైంగిక దాడులు మరీ పెరిగిన నేపథ్యంలో యూనివర్శిటీ అధికారులు ‘సెక్స్‌వెల్ అసాల్ట్ అడ్వైజరీ సెల్స్’ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ విభాగాలు మహిళలు తమకు జరిగిన అన్యాయాలను సక్రమంగా ఫిర్యాదు చేయడానికి తోడ్పడుతున్నాయి.
60 శాతం మంది మహిళలు కళాశాలల నుంచి నేడు సురక్షితంగా ఇంటికి వెళ్లలేమని ఓ అధ్యయనంలో వెల్లడించారు. తమకు ఉద్దేశపూర్వకంగానే అనవసరంగా తాకుతున్నారని 35 శాతం మహిళలు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment