British Indian
-
Madhumita Murgia: డీప్‌ఫేక్ గుట్టు ఆమెకు తెలుసు
ఇప్పుడు డీప్‌ఫేక్‌ల వివాదం నడుస్తోంది. ఎన్నికల సమయంలోనే కాదు సర్వ కాలాల్లోనూ డీప్‌ఫేక్ వీడియోలు ప్రముఖులకు పెద్ద సవాలు. ఇక స్త్రీలకు ఇవి పీడగా పరిణమించాయి. వీటి గుట్టుమట్లు ఏమిటో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నీడలో ఎలా జాగ్రత్తగా జీవించాలో తెలియచేస్తోంది ఆ రంగంలో నిపుణురాలు మధుమితా ముర్గియా.‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో తయారయ్యే డీప్‌ఫేక్ వీడియోలు ఎంత కచ్చితంగా ఉంటాయంటే నిజమైనవా, అబద్ధమైనవా కనిపెట్టడం బ్రహ్మతరం కూడా కాదు. డీప్‌ఫేక్ వీడియోలు ఎవరినీ వదలవు. ప్రముఖులు వీటివల్ల అభాసుపోలు కావచ్చు. కాని మామూలు స్త్రీలు దీని బాధితులవుతారు. డీప్‌ఫేక్‌లో వీడియోను మార్ఫింగ్ చేయొచ్చు. అంటే మీరు పోర్క్‌లో నడుస్తుంటే బీచ్‌లో నడుస్తున్నట్టుగా మార్చవచ్చు. దుస్తులతో ఉంటే దుస్తులు లేకుండా చేయొచ్చు. మరో పద్ధతి ‘ఇమేజ్ క్రియేటింగ్’. అంటే మీ వీడియో ఏమీ లేకపోయినా మీ ఇమేజ్ను పూర్తిగా సృష్టించి దానిని కావల్సినట్టుగా ఆడించవచ్చు. డీప్‌ఫేక్‌లో ఏ స్త్రీనైనా పోర్నోగ్రఫీ వీడియోలో ఉన్నట్టుగా భ్రమింపచేయవచ్చు. అదొక్కటే కాదు నిషేధిత సమయాల్లో నిషేధిత ప్రదేశాల్లో సంఘవ్యతిరేక శక్తుల మధ్య ఉన్నట్టుగా కూడా మిమ్మల్ని చూపోచ్చు. దీనికి అంతం లేదు. రాజకీయ ఉపన్యాసాలను డీప్‌ఫేక్‌తో మార్చి ఇబ్బంది పెట్టడం చాలా సులువు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో ప్రమాదాలు అన్ని ఉన్నాయి. ఈ టెక్నాలజీ నాశనం అయ్యేది కాదు. మరింత పెరిగేది. దీని పట్ల ఎరుకతో ఉండటమే చేయగలిగింది’ అంటుంది మధుమితా ముర్గియా. ఆమె ఏ.ఐ. ఎక్స్పర్ట్.బ్రిటిష్ ఇండియన్ముంబైలో మూలాలు కలిగిన మధుమితా ముర్గియా లండన్‌లో పెరిగింది. అక్కడే చదువుకుంది. బయోలజిస్ట్గా, ఇమ్యూనాలజిస్ట్గా పని చేస్తూ టెక్ ఇండస్ట్రీ గురించి ఆసక్తి పెంచుకుంది. లండన్‌కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికకు ఏ.ఐ. ఎడిటర్‌గా పని చేస్తూ వ్యాపోర ప్రయోజనాల కోసం మన డేటా ఎలా వాడబడుతున్నదో, చేతిలోని ఫోన్ వల్ల మన ప్రైవసీకి ఎలా భంగం కలుగుతున్నదో ఆమె ప్రపంచానికి తెలియచేస్తూ వస్తోంది. అంతేకాదు ఈ విషయాల గురించి ఆమె రాసిన తాజా పుస్తకం ‘కోడ్ డిపెండెంట్’కు మంచి ప్రశంసలు వస్తున్నాయి. 2024 సంవత్సరానికి ఆమె బెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నలిస్ట్‌గా బ్రిటిష్ ప్రెస్ అవార్డ్‌ను గెలుచుకుంది.ఏ.ఐ.తో మంచి: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో మూడు రంగాల్లో మంచి జరుగుతున్నదని అంటుంది మధుమిత. ‘ఆరోగ్య రంగంలో రిపోర్ట్‌ల ఆధారంగా పేషెంట్ వ్యాధిని ఏ.ఐ.తో గొప్ప స్పెషలిస్ట్ స్థాయిలో అంచనా కట్టొచ్చు. దీనివల్ల డాక్టర్ అపోయింట్మెంట్ కోసం వేచి ఉండే బాధ తప్పింది. ఫార్మాసూటికల్ రంగంలో కూడా ఏ.ఐ సేవలు బాగా ఉపయోగపడతాయి. ఇక సైన్స్ రంగంలో చేయాల్సిన పరిశోధనలు సులువవుతాయి. విద్యారంగంలో విద్యార్థుల రీసెర్చ్ కోసం ఏ.ఐ. ఉపయోగపడుతుంది. నేర పరిశోధనలో ఏ.ఐ.ని వాడి నేరస్తులను పట్టుకుంటున్నారు. ఇవన్నీ మంచి విషయాలే’ అంటుందామె.చెడు ఎంతో ఉంది:‘ఏ.ఐ. వల్ల రాబోయే ఐదేళ్లలో ఫొటోగ్రాఫర్లు అనేవాళ్లే లేకుండా పోవచ్చు. ఏ.ఐ. సహాయంతో ఎవరైనా సరే గొప్ప ఫొటోలు తీయవచ్చు. రచయితల బదులు ఏ.ఐ.తో కథలు రాయవచ్చు. కంప్యూటర్ల మీద జరగాల్సిన చాలా పనులు మనుషులు లేకుండానే జరిగే స్థితి రావచ్చు. దీనివల్ల లాభాలు సంస్థలకు వచ్చిన మనుషుల ఉనికి అంటే ఉద్యోగుల ఉనికి ఆందోళనలో పడుతుంది. చేతిలో ఫోన్ ఉంటే ఏ.ఐ. ద్వారా మీ ప్రతి కదలికను గుర్తించవచ్చు. మీరు ఇంట్లో ఉన్నా సురక్షితం కాదు. మీరు యాప్స్ ద్వారా కొనే వస్తువులను, మీరు వెళ్లే ఆస్పత్రులను, మీరు కొనే మందులను, వెళ్లే రెస్టరెంట్లను బట్టి రాబోయే కాలంలో మీ జీవితం ఎలా ఉంటుందో ఊహించి మీ చేత ఏమేమి కొనిపించాలో మిమ్మల్ని ఎలా వినియోగదారునిగా మార్చాలో ఏ.ఐ. ఆయా కంపెనీలకు చెబుతుంది. గతంలో ఒక టెక్నాలజీని అనేక ఏళ్లు పరీక్షించి జనానికి మేలు కలిగే విధంగా వదిలేవారు. ఏ.ఐ. లాంటివి మంచి చెడ్డలు పరీక్షించకనే వదిలారు. అవి రోజు రోజుకూ శక్తి పుంజుకుంటున్నాయి. ఏ.ఐ. నుంచి తప్పించుకోలేము. అలాగని మరీ అంత భయం కూడా అక్కర్లేదు. మానవశక్తి, మానవ జ్ఞానం కృత్రిమ యాంత్రిక జ్ఞానం కంటే ఎప్పుడూ గొప్పవే’ అంటోంది మధుమిత. -
చాలా బాధ కలిగింది, ప్రతీదీ నిజం కాదు..ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు!
Deeply Disturbed Zara Patel Reacts: నటి రష్మిక మందన్న వైరల్ డీప్‌ఫేక్ వీడియోకు సంబంధించిన ఒరిజినల్ వీడియో బ్రిటిష్-ఇండియన్ఇన్ఫ్లుయెన్సర్ జారా పటేల్‌దే. ఈ నేపథ్యంలో తన ఫేస్‌తో రష్మిక ముఖంతో ఏఐ ద్వారా క్రియేట్ చేసిన డీప్ ఫేక్ వీడియో వివాదంపై జారా పటేల్ స్పందించారు. ఈ సంఘటన తనను చాలా ఆవేదనకు గురిచేసిందన్నారు. ఈ సంఘటనతో ఇంటర్నెట్లో మహిళలు, అమ్మాయిల భద్రతపై మరింత ఆందోళన కలుగుతోందని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రముఖ నటి ముఖాన్ని ఉపయోగించి ఎవరో డీప్‌ఫేక్ వీడియోను రూపొందించినట్లు తన దృష్టికి వచ్చిందనీ, ఈ వీడియోతో తనకు ఎలాంటి ప్రమేయం లేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఈ ఫేక్ వీడియో చూసి చాలా ఆందోళన చెందాను అంటూ జారా పటేల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా రష్మికకు తను సానుభూతిని ప్రకటించారు. ఇకపై సోషల్ మీడియాలో యువతులు, మహిళలు ఏదైనా పోస్ట్ చేయాలంటేనే భయపడాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఇంటర్నెట్లో వస్తున్న ప్రతీదీ నిజం కాదు. దయచేసి ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి అంటూ ఆమె నెటిజన్లుకు సూచించారు. (రష్మిక డీప్ ఫేక్ వీడియో: గాయని చిన్మయి శ్రీపాద ఫైర్) కాగా సంచలనం రేపిన టాలీవుడ్ నటి రష్మిక డీప్‌ఫేక్ వీడియో ఆధునిక టెక్నాలజీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మరో భయంకర కోణంపై ఆందోళన రాజేసింది. సోషల్ మీడియాలో బిగ్‌బీ, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సహా పలువురు ప్రముఖులు స్పందించారు. (రష్మిక డీప్ ఫేక్ వీడియో: కేంద్ర మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ) హీరోయిన్లు, సెలబ్రిటీ మహిళలతోపాటు, సాధారణ మహిళలు, టీనేజ్ అమ్మాయిల ఉనికికి ముప్పుగా మారుతోందంటూ ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. (రష్మిక డీప్ ఫేక్ వీడియో : ఎమ్మెల్సీ కవిత రియాక్షన్) -
ఉద్యోగిని వేధించిన కంపెనీ.. నష్టపరిహారం కోట్లలోనే..?
లండన్: యూకేలో రాయల్ మెయిల్ మాజీ ఉద్యోగి కామ్ ఝూటి కంపెనీలో జరుగుతున్న అవకతవకలపై ఎంప్లాయి ట్రిబ్యునల్ లో చేసిన పోరాటానికి ఫలితంగా సదరు కంపెనీ ఆమెకు రూ.24 కోట్లు పరిహారం చెల్లించాల్సిందిగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. 2014లో రాయల్ మెయిల్ మీడియా ప్రతినిధిగా పనిచేస్తోన్న బ్రిటీష్ ఇండియన్ కామ్ ఝూటికి తన సహచర ఉద్యోగికి చట్టవిరుద్ధంగా బోనస్ అందుతున్న విషయంపై అనుమానమొచ్చింది. దీంతో విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకుని వెళ్ళింది. తీరా యాజమాన్యం ఆమె ఫిర్యాదుకు స్పందించకపోగా ఆమెను తిరిగి వేధించడం ప్రారంభించింది. విషయం బయటకు పొక్కకుండా ఉంచేందుకు మొదట ఆమెకు మూడు నెలల జీతం ఇస్తామన్న రాయల్ మెయిల్ ప్రతినిధి తర్వాత ఏడాది జీతం ఇస్తామని కూడా ఆశ చూపించారు. ఝూటి అందుకు అంగీకరించకపోవడంతో వేధించడం ప్రారంభించారు. వేధింపులకు తాళలేక ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి తానెదుర్కొన్న శారీరక, మానసిక సమస్యలను వివరిస్తూ 2015లో సుప్రీం కోర్టులోని ఎంప్లాయి ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత 2022లో ట్రిబ్యునల్ రాయల్ మెయిల్ కంపెనీలో తారాస్థాయిలో అవినీతి జరిగిందని, ఉద్యోగి పట్ల యాజమాన్యం వేధింపులు కూడా నిజమేనని ఇచ్చిన నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. కామ్ ఝూటి పట్ల రాయల్ మెయిల్ కంపెనీ వ్యవహరించిన తీరు అభ్యంతరకరమైనదని, ఆమె అనుభవించిన మానసిక క్షోభ వర్ణనాతీతమని తక్షణమే ఆమెకు వారు రూ.24 కోట్లను పరిహారంగా చెల్లించాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే కంపెనీ వారు మాత్రం ఈ తీర్పును సవాలు చేస్తూ.. ప్రస్తుతానికైతే రెండున్నర లక్షలు పరిహారం చెల్లించారు. ఇది కూడా చదవండి: తిరుగుబాటు నాయకుడు ప్రిగోజిన్ తో పుతిన్ భేటీ..? -
బర్మింగ్హమ్ లార్డ్ మేయర్‌గా బ్రిటిష్ ఇండియన్
లండన్: ఇంగ్లాండ్‌లోని బర్మింగ్హమ్ నగర లార్డ్ మేయర్‌గా బ్రిటిష్–ఇండియన్ కౌన్సిలర్ చమన్‌లాల్ ఎన్నికయ్యారు. తద్వారా బర్మింగ్హమ్ తొలి బ్రిటిష్–ఇండియన్ మేయర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. సిక్కు మతంలోని రవిదాసియా వర్గానికి చెందిన చమన్ లాల్ భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం హోషియార్పూర్ జిల్లాలోని పఖోవాల్ గ్రామంలో జన్మించారు. బ్రిటిష్ ఇండియా సైన్యంలో పనిచేసిన ఆయన తండ్రి సర్దార్ హర్నామ్‌సింగ్ బంగా 1954లో ఇంగ్లాండ్‌కు వలస వచ్చారు. బర్మింగ్హమ్లో స్థిరపడ్డారు. చమన్‌లాల్ 1964లో తన తల్లి సర్దార్నీ జై కౌర్‌తో కలిసి ఇంగ్లాండ్‌కు చేరుకున్నారు. అప్పటి నుంచి బర్మింగ్‌హమ్‌లోనే నివసిస్తున్నారు. చమన్ లాల్ 1971లో విద్యావతిని వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజకీయాలపై ఆసక్తితో చమన్‌లాల్ 1989లో లేబర్ పార్టీలో చేరారు. అసమానతలు, వివక్షకు వ్యతిరేకంగా జరిగిన సామాజిక పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారు. -
లీనా నాయర్: సమానంగా చూడండి చాలు
ఆమె మహిళ అనో .. సపోర్ట్ లేదనో.. పని మెల్లిగా నేర్చుకుంటుందో... మైనారిటీ వర్గమనో.. సానుభూతి చూపారంటే.. దానినే సవాల్‌గా తీసుకొని మరింత శక్తిమంతంగా ఎదగాలని తన జీవితాన్ని ఉదాహరణగా చూపుతుంది లీనా నాయర్. లీనా నాయర్ బ్రిటిష్ ఇండియన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌గా అంచెలంచెలుగా ఎదిగిన శక్తి. 30 సంవత్సరాల పాటు ఉద్యోగ నిర్వహణలో ఎన్నో క్రియాశీలక పదవులను చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యునిలీవర్ కంపెనీని జెండర్ బ్యాలెన్స్డ్ కంపెనీగా నిలబెట్టింది. వరల్డ్ వైడ్ లగ్జరీ బ్రాండ్ చానెల్ సీఈవోగా ఉన్న లీనా పుట్టి పెరిగింది మహారాష్ట్రలో. ఇప్పుడు వందకుపైగా దేశాల్లో లక్షలాది మంది ఉద్యోగుల బాధ్యతను సమర్థవంతంగా నడిపిస్తూ మహిళాశక్తిని ఈ తరానికి చాటుతోంది. ► జెండర్ బ్యాలెన్స్.. ఫ్రెంచ్ లగ్జరీ హౌజ్ కోకో చానెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఈ ఏడాది జనవరి నుంచి దిగ్విజయంగా విధులను నిర్వర్తిస్తోంది లీనా నాయర్. అంతకుముందు యూనిలీవర్‌కు నాయకత్వం వహించారు. వందకు పైగా దేశాలలో సుమారు లక్షా యాభై వేల మంది బాధ్యత ఆమె మీద ఉంది. 1990 మొదట్లో నాయర్ జంషెడ్‌పూర్‌లోని హిందూస్థాన్ యూనిలీవర్లో మేనేజ్మెంట్ ట్రైనీగా చేరినప్పుడు, ఆ కంపెనీ ఉద్యోగుల్లో కేవలం రెండు శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. ఆమె కిందటేడాది బయటకు వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్త కంపెనీ నిర్వహణలో లింగ సమతుల్యత ఉందని ప్రకటించింది. అంటే, నాయర్ తనదైన ముద్ర ఏ స్థాయిలో ఆ కంపెనీలో వేసిందనేది స్పష్టం అవుతుంది. ► లగ్జరీ మార్కెట్.. ఫ్యాషన్ దిగ్గజంగా కోకో చానెల్ కంపెనీకి 112 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. లగ్జరీ కన్జ్యూమర్ గూడ్స్ మార్కెటోకి దూసుకెళ్లేలా చేసిన మొదటి వ్యక్తి నాయర్ ఏమీ కాదు. అంతకుముందు అనుభవజ్ఞుడైన ఆంటోనియా బెల్లోని ఉన్నాడు. ఇప్పుడు అతను మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. అతనితో పాటు మరికొంత నిష్ణాతులైన వ్యక్తులు ఈ నిచ్చెన మీద ఇప్పటికే ఉన్నారు. అంటే, వారందరి మధ్య నాయర్‌కి ఆ పదవిని కట్టపెట్టారంటే ఆమె శక్తి సామాన్యమైనది కాదనేది స్పష్టం అవుతుంది. అంతేకాదు, ఆ పదవి ఆమెకు మరింత సవాల్‌తో కూడుకున్నదన్నమాటే. 53 ఏళ్ల వయసులో ఆమె ఈ ఘనత వహించిన కంపెనీని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి సర్వసిద్ధంగా ఉందన్నమాట. ఆమెకు ఇదేమీ కొత్తగాకాదు. ప్రపంచవ్యాప్త యునిలీవర్‌లో 30 సంవత్సరాలు పనిచేసిన మొదటి ఆసియా, మొదటి మహిళ, అతి పిన్న వయస్కురాలు.. అనే రికార్డు ఆమె ఖాతాలో ఉంది. ఆంగ్లో–డచ్ కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీలో ఫ్యాక్టరీ ఫ్లోర్ లెవెల్ మేనేజర్‌గా అంతస్తులో పనిచేసిన మొదటి మహిళ, నైట్ షిఫ్ట్‌లో పనిచేసిన మొదటి మహిళగానూ నాయర్‌కు పేరుంది. ► ప్రతిరోజూ సవాల్.. ‘లీనా తను ఏ పని చేసినా దానికో గొప్ప విలువ ఇస్తుంది. ఏ పాత్ర పోషించినా అందుకు తగిన శక్తి సామర్థ్యాలను చూపడంలో దిట్ట. అందుకే ఆమెకు అంతటా అత్యంత గౌరవం. ఆమె తన కొత్త పాత్రలో రాణిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని కోకో చానెల్‌కు ఎంపికైన సందర్భంలో యునిలీవర్ మాజీ చైర్మన్ దాడి సేత్ ఆమె గురించి గొప్పగా చెప్పారు. కిందటేడాది డిసెంబర్లో నాయర్‌ను సీఇవోగా నియమించాలని చానెల్ తన నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు, ఇది పరిశ్రమకే వైవిధ్యమైన మైలురాయిగా అంతా ప్రశంసించారు. ‘నా కెరీర్ ప్రారంభ రోజుల్లో కాలేజీల్లోనూ, కంపెనీల్లోనూ ఒక మహిళగా నా స్థానం ఉండేది. ఉన్నతస్థాయిని సాధించడానికి ప్రతిరోజూ సవాల్‌గా ఉండేది. నామీద ఎవరికైనా సానుభూతి ఉంది అంటే నాకు నేనే అట్టడుగున ఉన్నట్టు అనిపించేది. దానిని నేను చాలా వ్యక్తిగతంగా తీసుకునేదాన్ని. అందుకే, నన్ను నేను ఉన్నతంగా మలుచుకోవడానికి ఇప్పటికీ ప్రతిరోజూ ప్రయత్నిస్తుంటాను’ అని సవినయంగా చెబుతారు నాయర్. బహుశా అందుకే ఆమె ఎదుగుదల ఈ రీతిలో సాధ్యమైందేమో! ► చిన్న పట్టణం నుంచి ... మహారాష్ట్రలోని చిన్న పట్టణమైన కొల్హాపూర్‌లో జన్మించిన నాయర్, ఎలక్ట్రానిక్స్, టెలి కమ్యూనికేషన్ లో ఇంజినీరింగ్ చేసింది. కాలేజీ పూర్తయిన రోజుల్లో ఒక రోజు కాలేజీ ప్రొఫెసర్ ఆమెను కూర్చోబెట్టి ‘నీవు ఇప్పటికి ఒక అందమైన ఇంజినీర్వే. కానీ, విధి నిర్వహణలో సత్తా చూపగల నైపుణ్యం కలిగి ఉన్నావని భావిస్తున్నాను’ అని చెప్పారట. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో వివరిస్తుంది నాయర్. ఆ తర్వాత పట్టుదలతో ఎంబీయేలో గోల్డ్‌మెడల్ సాధించింది. హిందూస్థాన్ యూనిలీవర్ ఎంపిక చేసుకున్న 15 వేల మంది మగవారిలో అతి కొద్దిమంది స్త్రీలలో ఒకరిగా నాయర్ ట్రైనీగా చేరింది. -
బుకర్ ప్రెజ్ రేసులో సంజీవ్ సహోతా
లండన్: ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ కోసం ఈ ఏడాది 13 మంది రచయతలు పోటీ పడుతున్నారు. బుకర్ ప్రెజ్ లాంగ్ లిస్టులోని ఈ 13 మందిలో భారతీయ సంతతికి చెందిన సంజీవ్ సహోతా కూడా ఉన్నారు. ఆయన రచించిన చైనా రూమ్ నవల్లో వలసదారుల అనుభవాల విషయంపై నవలలో అద్భుతమైన మలుపు ఉందని జడ్జిలు ప్రశంసించారు. 1960ల్లో సంజీవ్ తాత బ్రిటన్‌కు వలసవచ్చారు. 2015లో సైతం ఆయన బుకర్ ప్రైజ్‌కు షార్ట్ లిస్టయ్యారు. 2017లో ఆయన యూరోపియన్ యూనియన్ సాహిత్య బహుమతి అందుకున్నారు. తాజా పుస్తకం చైనా రూమ్ పలువురి ప్రశంసలు పొందింది. ప్రస్తుతం ఫ్రైజ్ కోసం పోటీ పడుతున్న జాబితాలో సంజీవ్‌తో పాటు గత విజేత కజో ఇషిగురో, దక్షిణాఫ్రికా రచయత డామన్‌గాలట్, అమెరికా రచయత రిచర్డ్ పవర్స్, శ్రీలంక రచయత అనుక్ అరుద్‌ప్రగాశమ్, కెనడాకు చెందిస రబెల్ కస్క్, అమెరికాకు చెందని నాథన్ హారిస్ తదితర లబ్దప్రతిష్టులు ఉన్నారు. ఈ 13 మంది నుంచి ఆరుగురి రచనలను షార్ట్‌లిస్ట్ చేసి సెప్టెంబర్ 14న ప్రకటిస్తారు. ఈ ఆరుగురికి 2,500 పౌండ్ల బహుమతి లభిస్తుంది. అంతిమ విజేతను నవంబర్3న ప్రకటిస్తారు. విజేతకు 50వేల పౌండ్ల ప్రైజ్‌మనీ దక్కుతుంది. 2020లో ఈ బహుమతిని షుగ్గీ బీన్ అనే నవలకు స్కాటిష్ అమెరికన్ రచయత డగ్లస్ స్టూవార్డ్ అందుకున్నారు. -
జామ్ బామ్మ లినెట్!
ప్రకృతి ఎన్నో తియ్యనైన పండ్లను మనకు ప్రసాదిస్తుంది. వాటిలో చాలా వరకు వివిధ కారణాలతో వ్యర్థమవుతుంటాయి. ఈ విషయాన్ని గమనించిన లినెట్ ఆల్ఫ్రే .. జామ్ తయారు చేసి పళ్ల వ్యర్థాలను తగ్గిస్తూ.. మరోపక్క ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. 79 ఏళ్ల వయసులోనూ ఆమె చురుకుగా జామ్ తయారీ ఫ్యాక్టరీని నడిపించడం విశేషం. బ్రిటిష్ ఇండియన్ అయిన లినెట్ యుక్తవయసులో కశ్మీర్‌కు చెందిన వ్యక్తిని పెళ్లిచేసుకున్నారు. దీంతో ఆమె ఇండియాలోనే స్థిరపడిపోయారు. వివాహం తరువాత భర్తతో కొన్నాళ్లు బిహార్‌లో ఉన్న లినెట్ అనంతరం ఢిల్లీ, ముంబైలకు మకాం మార్చారు. ఈ క్రమంలోనే 1992లో ఒకసారి లినెట్ హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడ కొద్దిరోజులు ఉన్న లినెట్‌కు హిమాచల్ ప్రదేశ్ వాతావరణం బాగా నచ్చింది. దీంతో భార్యాభర్తలు ఇక్కడే స్థిరపడాలని నిర్ణయించుకుని హిమాచల్ ప్రదేశ్‌లో స్థిర నివాసం ఏర్పర చుకున్నారు. లినెట్ నివసించే ప్రాంతంలో ఆప్రికాట్, పీచ్, యాపిల్, కివి పండ్లు అధికంగా పండుతాయి. అయితే కొన్నిసార్లు వేగంగా గాలి వీచడం, కోతులు సగం కొరికిపడేయడం వల్ల వృథా అవుతుండేవి. ఇది గమనించిన లిన్నెట్ వాటిని ఎలాగైనా ఉపయోగపడే విధంగా మార్చాలనుకున్నారు. ఈ క్రమంలోనే లిన్నెట్ తల్లి జామ్ తయారీ తనకు గుర్తుకు వచ్చింది. వృథాగా పాడైపోయే పండ్ల నుంచి జామ్ తయారు చేసి స్థానికులకు ఇస్తుండడంతో అది బాగా పాపులర్ అయ్యింది. దీంతో 1999లో లినెట్ ఏకంగా భావురా గ్రామంలో ‘భూయిరా’ జామ్ ఫ్యాక్టరిని∙స్థాపించారు. ఫ్యాక్టరీ అయితే సులభంగా పెట్టారు కానీ, గ్రామం కావడంతో పవర్ కట్స్ ఎక్కువగా ఉండేవి. దీంతో ఫ్యాక్టరిని నడపడం కష్టంగా ఉండేది. అయినప్పటికి అనేక సమస్యలు ఎదుర్కొని ప్రస్తుతం 75 టన్నుల పండ్లతో 48 రకాల జామ్‌లు తయారు చేస్తున్నారు. రోజుకి 850 జామ్ బాటిల్స్‌తో సంవత్సరానికి రెండు కోట్ల రూపాయల టర్నోవర్‌తో ముందుకు దూసుకుపోతున్నారు. రసాయనాలు వాడరు.. జామ్ ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి రసాయనాలు వాడరు. వాటికి బదులు నిమ్మరసం, యాపిల్ జ్యూస్, పంచదారను వినియోగిస్తున్నారు. లినెట్ తయారు చేసే జామ్లలో బ్లాక్‌బెర్రి జామ్, స్ట్రాబెర్రి ప్రిజర్వ్, బ్లాక్ బెర్రి ప్రిజర్వ్‌లు బాగా పాపులర్ అయినవి. ఇంకా ఈ జామ్లలో పంచదార కలపనివి కూడా ఉండడం విశేషం. కోట్ల రూపాయల ఆదాయాన్ని సృష్టిస్తూ వందలమంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు లినెట్. -
ప్రపంచ బాల మేధావి ఈశ్వర్ శర్మ
లండన్: ఆధ్యాత్మిక యోగాలో సాధించిన విజయాలకుగానూ పదేళ్ల స్కూల్ విద్యార్థి, బ్రిటిష్ ఇండియన్ ఈశ్వర్ శర్మను ప్రపంచ బాల మేధావి–2020 అవార్డుతో బ్రిటన్ సత్కరించింది. 30 విభిన్న (బైకింగ్, కొరియోగ్రఫీ, ఫిట్నెస్, మార్షల్ ఆర్ట్స్ తదితర) రంగాల్లో సత్తాచాటిన ప్రపంచంలోని 45 దేశాలకు చెందిన బాల మేధావులను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. అందులో ఇంగ్లండ్‌లోని కెంట్ కేంద్రంగా పనిచేస్తున్న ఈశ్వర్ శర్మ యోగాలో అసాధారణ ప్రతిభ కనబర్చినందుకు ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ‘45 దేశాల నుంచి 15 వేల మంది దరఖాస్తుదారుల్లో ప్రపంచ బాల మేధావి అవార్డుకు ఎంపికైనందుకు గర్వంగా ఉంది. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం. విద్యార్థులకు యోగా చాలా ముఖ్యం.’అని అవార్డు తీసుకుంటున్న సందర్భంగా శర్మ చెప్పాడు. -
‘టైమ్’లో ఇండియన్ టీన్స్
హూస్టన్: టైమ్ మ్యాగజైన్ 2018 ఏడాదికి సంబంధించి ప్రకటించిన అత్యంత ప్రభావశీల టీనేజర్ల కేటగిరీలో ముగ్గురు భారత సంత తి విద్యార్థులు చోటు సంపాదించారు. వారి వారి విభాగాల్లో విశేష ప్రతిభ చూపించిన ఇండో–అమెరికన్ కావ్య కొప్పరపు, రిషబ్ జైన్, బ్రిటిష్–ఇండియన్ అమికా జార్జ్‌లు మొదటి 25 స్థానాల్లో నిలిచారు. ప్యాంక్రియాటిక్ కేన్సర్‌ను నయం చేయగలిగే సామర్థ్యం ఉన్న అల్గారిథమ్‌ను ఎనిమిదో తరగతి చదువుతున్న రిషబ్ జైన్ అభివృద్ధి చేశాడు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న కావ్య కొప్పరపు అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్ మెదడు కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారి మెదడు కణజాలాన్ని క్షుణ్నంగా స్కాన్ చేయగలదు. ఈ సాఫ్ట్వేర్ సహాయంతో మెదడుకు సంబంధించిన కణజాల అమరిక, రంగు, సాంద్రత, ఆకృతి వంటి వాటిని పరిశీలించవచ్చు. ఈ వ్యాధికి సంబంధించి ప్రతి రోగికి విడివిడిగా చికిత్సా విధానాన్ని అందుబాటులోకి తేవాలన్నదే కావ్య లక్ష్యం అని, ప్రస్తుతం ఆ దిశగా ఆమె పనిచేస్తోందని టైమ్ చెప్పింది. ఇక అమికా జార్జ్ మహిళల కోసం ఫ్రీ పీరియడ్స్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. రుతుక్రమ సమయంలో మహిళలకు అవసరమయ్యే సామగ్రిని ప్రభుత్వాలే వారికి అందజేసేలా అమికా కృషి చేస్తోంది. బ్రిటన్‌లో అనేకమంది బాలికలు పీరియడ్స్ సమయంలో స్కూళ్లకు రావడం లేదని, ఆ సమయంలో వారికి అవసరమైన సామగ్రి అందుబాటులో లేకపోవడమేనని కారణమని అమికా తెలిపింది. -
కోహ్లి పెయింటింగ్‌కు అత్యధిక ధర
బర్మింగ్‌హోమ్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పెయింటింగ్‌ను ఓ అభిమాని అత్యధిక ధర వెచ్చించి కొనుగోలు చేశారు. బ్రిటీష్ ఇండియన్ పూనమ్ గుప్తా అనే పారిశ్రామికవేత్త రూ.2.4 కోట్లుకు కోహ్లీ పెయింటింగ్‌ను దక్కించుకున్నారు. ప్రఖ్యాత చిత్రకారుడు శషా జెఫ్రీ కోహ్లీ ఐపీఎల్ ప్రయాణాన్ని పెయింటింగ్ మార్చిన విషయం తెలిసిందే. ఇటీవల కోహ్లి చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పూనమ్ గుప్తా ఈ పెయింటింగ్‌ను కొనుక్కున్నారు. భారత యువ ఆటగాళ్లు ఆటలోనే కాకుండా ఆఫ్ ఫీల్డ్‌లో సేవా కార్యాక్రమాలు చేపట్టడం హర్షనీయమని, నా అభిమాన చిత్రకారుడు నా అభిమాన క్రికెటర్ పెయింట్ వేయడంతో కొనుక్కున్నట్లు పూనమ్ తెలిపారు. ప్రపంచంలోనే గొప్ప చిత్రకారుడిగా గుర్తింపు పొందిన శషా యువీ, ధోనీ చారిటీల కోసం కూడా పెయింటింగ్‌లు వేశారు.