లినెట్ ఆల్ఫ్రే
ప్రకృతి ఎన్నో తియ్యనైన పండ్లను మనకు ప్రసాదిస్తుంది. వాటిలో చాలా వరకు వివిధ కారణాలతో వ్యర్థమవుతుంటాయి. ఈ విషయాన్ని గమనించిన లినెట్ ఆల్ఫ్రే .. జామ్ తయారు చేసి పళ్ల వ్యర్థాలను తగ్గిస్తూ.. మరోపక్క ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. 79 ఏళ్ల వయసులోనూ ఆమె చురుకుగా జామ్ తయారీ ఫ్యాక్టరీని నడిపించడం విశేషం.
బ్రిటిష్ ఇండియన్ అయిన లినెట్ యుక్తవయసులో కశ్మీర్‌కు చెందిన వ్యక్తిని పెళ్లిచేసుకున్నారు. దీంతో ఆమె ఇండియాలోనే స్థిరపడిపోయారు. వివాహం తరువాత భర్తతో కొన్నాళ్లు బిహార్‌లో ఉన్న లినెట్ అనంతరం ఢిల్లీ, ముంబైలకు మకాం మార్చారు. ఈ క్రమంలోనే 1992లో ఒకసారి లినెట్ హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడ కొద్దిరోజులు ఉన్న లినెట్‌కు హిమాచల్ ప్రదేశ్ వాతావరణం బాగా నచ్చింది. దీంతో భార్యాభర్తలు ఇక్కడే స్థిరపడాలని నిర్ణయించుకుని హిమాచల్ ప్రదేశ్‌లో స్థిర నివాసం ఏర్పర చుకున్నారు.
లినెట్ నివసించే ప్రాంతంలో ఆప్రికాట్, పీచ్, యాపిల్, కివి పండ్లు అధికంగా పండుతాయి. అయితే కొన్నిసార్లు వేగంగా గాలి వీచడం, కోతులు సగం కొరికిపడేయడం వల్ల వృథా అవుతుండేవి. ఇది గమనించిన లిన్నెట్ వాటిని ఎలాగైనా ఉపయోగపడే విధంగా మార్చాలనుకున్నారు. ఈ క్రమంలోనే లిన్నెట్ తల్లి జామ్ తయారీ తనకు గుర్తుకు వచ్చింది. వృథాగా పాడైపోయే పండ్ల నుంచి జామ్ తయారు చేసి స్థానికులకు ఇస్తుండడంతో అది బాగా పాపులర్ అయ్యింది. దీంతో 1999లో లినెట్ ఏకంగా భావురా గ్రామంలో ‘భూయిరా’ జామ్ ఫ్యాక్టరిని∙స్థాపించారు. ఫ్యాక్టరీ అయితే సులభంగా పెట్టారు కానీ, గ్రామం కావడంతో పవర్ కట్స్ ఎక్కువగా ఉండేవి. దీంతో ఫ్యాక్టరిని నడపడం కష్టంగా ఉండేది. అయినప్పటికి అనేక సమస్యలు ఎదుర్కొని ప్రస్తుతం 75 టన్నుల పండ్లతో 48 రకాల జామ్‌లు తయారు చేస్తున్నారు. రోజుకి 850 జామ్ బాటిల్స్‌తో సంవత్సరానికి రెండు కోట్ల రూపాయల టర్నోవర్‌తో ముందుకు దూసుకుపోతున్నారు.
రసాయనాలు వాడరు..
జామ్ ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి రసాయనాలు వాడరు. వాటికి బదులు నిమ్మరసం, యాపిల్ జ్యూస్, పంచదారను వినియోగిస్తున్నారు. లినెట్ తయారు చేసే జామ్‌లలో బ్లాక్‌బెర్రి జామ్, స్ట్రాబెర్రి ప్రిజర్వ్, బ్లాక్ బెర్రి ప్రిజర్వ్‌లు బాగా పాపులర్ అయినవి. ఇంకా ఈ జామ్‌లలో పంచదార కలపనివి కూడా ఉండడం విశేషం. కోట్ల రూపాయల ఆదాయాన్ని సృష్టిస్తూ వందలమంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు లినెట్.
Comments
Please login to add a commentAdd a comment