
కావ్య, అమికా, రిషబ్
హూస్టన్: టైమ్ మ్యాగజైన్ 2018 ఏడాదికి సంబంధించి ప్రకటించిన అత్యంత ప్రభావశీల టీనేజర్ల కేటగిరీలో ముగ్గురు భారత సంత తి విద్యార్థులు చోటు సంపాదించారు. వారి వారి విభాగాల్లో విశేష ప్రతిభ చూపించిన ఇండో–అమెరికన్ కావ్య కొప్పరపు, రిషబ్ జైన్, బ్రిటిష్–ఇండియన్ అమికా జార్జ్‌లు మొదటి 25 స్థానాల్లో నిలిచారు. ప్యాంక్రియాటిక్ కేన్సర్‌ను నయం చేయగలిగే సామర్థ్యం ఉన్న అల్గారిథమ్‌ను ఎనిమిదో తరగతి చదువుతున్న రిషబ్ జైన్ అభివృద్ధి చేశాడు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న కావ్య కొప్పరపు అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్ మెదడు కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారి మెదడు కణజాలాన్ని క్షుణ్నంగా స్కాన్ చేయగలదు.
ఈ సాఫ్ట్‌వేర్ సహాయంతో మెదడుకు సంబంధించిన కణజాల అమరిక, రంగు, సాంద్రత, ఆకృతి వంటి వాటిని పరిశీలించవచ్చు. ఈ వ్యాధికి సంబంధించి ప్రతి రోగికి విడివిడిగా చికిత్సా విధానాన్ని అందుబాటులోకి తేవాలన్నదే కావ్య లక్ష్యం అని, ప్రస్తుతం ఆ దిశగా ఆమె పనిచేస్తోందని టైమ్ చెప్పింది. ఇక అమికా జార్జ్ మహిళల కోసం ఫ్రీ పీరియడ్స్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. రుతుక్రమ సమయంలో మహిళలకు అవసరమయ్యే సామగ్రిని ప్రభుత్వాలే వారికి అందజేసేలా అమికా కృషి చేస్తోంది. బ్రిటన్‌లో అనేకమంది బాలికలు పీరియడ్స్ సమయంలో స్కూళ్లకు రావడం లేదని, ఆ సమయంలో వారికి అవసరమైన సామగ్రి అందుబాటులో లేకపోవడమేనని కారణమని అమికా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment