ఇప్పుడు డీప్‌ఫేక్‌ల వివాదం నడుస్తోంది. ఎన్నికల సమయంలోనే కాదు సర్వ కాలాల్లోనూ డీప్‌ఫేక్ వీడియోలు ప్రముఖులకు పెద్ద సవాలు. ఇక స్త్రీలకు ఇవి పీడగా పరిణమించాయి. వీటి గుట్టుమట్లు ఏమిటో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నీడలో ఎలా జాగ్రత్తగా జీవించాలో తెలియచేస్తోంది ఆ రంగంలో నిపుణురాలు మధుమితా ముర్గియా.
‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో తయారయ్యే డీప్‌ఫేక్ వీడియోలు ఎంత కచ్చితంగా ఉంటాయంటే నిజమైనవా, అబద్ధమైనవా కనిపెట్టడం బ్రహ్మతరం కూడా కాదు. డీప్‌ఫేక్ వీడియోలు ఎవరినీ వదలవు. ప్రముఖులు వీటివల్ల అభాసుపోలు కావచ్చు. కాని మామూలు స్త్రీలు దీని బాధితులవుతారు. డీప్‌ఫేక్‌లో వీడియోను మార్ఫింగ్ చేయొచ్చు. అంటే మీరు పోర్క్‌లో నడుస్తుంటే బీచ్‌లో నడుస్తున్నట్టుగా మార్చవచ్చు. దుస్తులతో ఉంటే దుస్తులు లేకుండా చేయొచ్చు.
మరో పద్ధతి ‘ఇమేజ్ క్రియేటింగ్’. అంటే మీ వీడియో ఏమీ లేకపోయినా మీ ఇమేజ్‌ను పూర్తిగా సృష్టించి దానిని కావల్సినట్టుగా ఆడించవచ్చు. డీప్‌ఫేక్‌లో ఏ స్త్రీనైనా పోర్నోగ్రఫీ వీడియోలో ఉన్నట్టుగా భ్రమింపచేయవచ్చు. అదొక్కటే కాదు నిషేధిత సమయాల్లో నిషేధిత ప్రదేశాల్లో సంఘవ్యతిరేక శక్తుల మధ్య ఉన్నట్టుగా కూడా మిమ్మల్ని చూపోచ్చు. దీనికి అంతం లేదు. రాజకీయ ఉపన్యాసాలను డీప్‌ఫేక్‌తో మార్చి ఇబ్బంది పెట్టడం చాలా సులువు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో ప్రమాదాలు అన్ని ఉన్నాయి. ఈ టెక్నాలజీ నాశనం అయ్యేది కాదు. మరింత పెరిగేది. దీని పట్ల ఎరుకతో ఉండటమే చేయగలిగింది’ అంటుంది మధుమితా ముర్గియా. ఆమె ఏ.ఐ. ఎక్స్‌పర్ట్.
బ్రిటిష్ ఇండియన్
ముంబైలో మూలాలు కలిగిన మధుమితా ముర్గియా లండన్‌లో పెరిగింది. అక్కడే చదువుకుంది. బయోలజిస్ట్‌గా, ఇమ్యూనాలజిస్ట్‌గా పని చేస్తూ టెక్ ఇండస్ట్రీ గురించి ఆసక్తి పెంచుకుంది. లండన్‌కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికకు ఏ.ఐ. ఎడిటర్‌గా పని చేస్తూ వ్యాపోర ప్రయోజనాల కోసం మన డేటా ఎలా వాడబడుతున్నదో, చేతిలోని ఫోన్ వల్ల మన ప్రైవసీకి ఎలా భంగం కలుగుతున్నదో ఆమె ప్రపంచానికి తెలియచేస్తూ వస్తోంది. అంతేకాదు ఈ విషయాల గురించి ఆమె రాసిన తాజా పుస్తకం ‘కోడ్ డిపెండెంట్’కు మంచి ప్రశంసలు వస్తున్నాయి. 2024 సంవత్సరానికి ఆమె బెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నలిస్ట్‌గా బ్రిటిష్ ప్రెస్ అవార్డ్‌ను గెలుచుకుంది.
ఏ.ఐ.తో మంచి: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో మూడు రంగాల్లో మంచి జరుగుతున్నదని అంటుంది మధుమిత. ‘ఆరోగ్య రంగంలో రిపోర్ట్‌ల ఆధారంగా పేషెంట్ వ్యాధిని ఏ.ఐ.తో గొప్ప స్పెషలిస్ట్ స్థాయిలో అంచనా కట్టొచ్చు. దీనివల్ల డాక్టర్ అపోయింట్‌మెంట్ కోసం వేచి ఉండే బాధ తప్పింది. ఫార్మాసూటికల్ రంగంలో కూడా ఏ.ఐ సేవలు బాగా ఉపయోగపడతాయి. ఇక సైన్స్ రంగంలో చేయాల్సిన పరిశోధనలు సులువవుతాయి. విద్యారంగంలో విద్యార్థుల రీసెర్చ్ కోసం ఏ.ఐ. ఉపయోగపడుతుంది. నేర పరిశోధనలో ఏ.ఐ.ని వాడి నేరస్తులను పట్టుకుంటున్నారు. ఇవన్నీ మంచి విషయాలే’ అంటుందామె.
చెడు ఎంతో ఉంది:
‘ఏ.ఐ. వల్ల రాబోయే ఐదేళ్లలో ఫొటోగ్రాఫర్లు అనేవాళ్లే లేకుండా పోవచ్చు. ఏ.ఐ. సహాయంతో ఎవరైనా సరే గొప్ప ఫొటోలు తీయవచ్చు. రచయితల బదులు ఏ.ఐ.తో కథలు రాయవచ్చు. కంప్యూటర్ల మీద జరగాల్సిన చాలా పనులు మనుషులు లేకుండానే జరిగే స్థితి రావచ్చు. దీనివల్ల లాభాలు సంస్థలకు వచ్చిన మనుషుల ఉనికి అంటే ఉద్యోగుల ఉనికి ఆందోళనలో పడుతుంది. చేతిలో ఫోన్ ఉంటే ఏ.ఐ. ద్వారా మీ ప్రతి కదలికను గుర్తించవచ్చు. మీరు ఇంట్లో ఉన్నా సురక్షితం కాదు.
మీరు యాప్స్ ద్వారా కొనే వస్తువులను, మీరు వెళ్లే ఆస్పత్రులను, మీరు కొనే మందులను, వెళ్లే రెస్టరెంట్లను బట్టి రాబోయే కాలంలో మీ జీవితం ఎలా ఉంటుందో ఊహించి మీ చేత ఏమేమి కొనిపించాలో మిమ్మల్ని ఎలా వినియోగదారునిగా మార్చాలో ఏ.ఐ. ఆయా కంపెనీలకు చెబుతుంది. గతంలో ఒక టెక్నాలజీని అనేక ఏళ్లు పరీక్షించి జనానికి మేలు కలిగే విధంగా వదిలేవారు. ఏ.ఐ. లాంటివి మంచి చెడ్డలు పరీక్షించకనే వదిలారు. అవి రోజు రోజుకూ శక్తి పుంజుకుంటున్నాయి. ఏ.ఐ. నుంచి తప్పించుకోలేము. అలాగని మరీ అంత భయం కూడా అక్కర్లేదు. మానవశక్తి, మానవ జ్ఞానం కృత్రిమ యాంత్రిక జ్ఞానం కంటే ఎప్పుడూ గొప్పవే’ అంటోంది మధుమిత.
Comments
Please login to add a commentAdd a comment