ఆర్‌ఐఎల్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ డీప్ ఫేక్ వీడియో కలకలం
రూ. 7.1 లక్షలు కోల్పోయిన మహిళా వైద్యురాలు
కేసు నమోదు
‘కూటికోసం కోటి విద్యలు’ అనేదాన్ని ‘కోటి మోసాలు’గా మార్చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఏదో ఒక రకంగా ప్రజలను మభ్య పెట్టి, మోసాలకు పాల్పడుతున్నారు. ఈ కోవలోకి డీప్ ఫేక్ వీడియోలు వచ్చి చేరుతున్నాయి. సామాన్యుల నుంచి, ఉన్నతాధికారులు, డాక్టర్లు, ఆఫీసర్లు. హై ఫ్రొఫైల్ వ్యక్తుల దాకా నమ్మించి బోల్తా కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా బిలియనీర్, ప్రముఖ వ్యాపారవేత్త పేరుతో డీప్ ఫేక్ వీడియో ద్వారా రూ.7లక్షలు మోసానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.
ఏం జరిగిందంటే..
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పేరుతో తయారు చేసిన డీప్ ఫేక్ వీడియో ద్వారా ముంబైలోని అంధేరికి చెందిన మహిళా ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ కె హెచ్ పాటిల్ నుంచి రూ.7 లక్షలు కొల్లగొట్టారు నేరగాళ్లు. అధిక రాబడి కోసం ‘రాజీవ్ శర్మ ట్రేడ్ గ్రూప్’ కంపెనీకి చెందిన బీసీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అకాడమీలో చేరాలని అంబానీ రికమెండ్ చేస్తున్నట్టు ఈ వీడియోను సృష్టించారు. తద్వారా తక్కువ పెట్టుబడికే, అధిక రాబడులు వస్తాయని నమ్మ బలికారు.
ఏప్రిల్ 15న తన ఇన్‌స్టాగ్రాంలో ఈ వీడియోను చూసిన పాటిల్ ఆన్‌లైన్‌లో వెరిఫై చేయడానికి ప్రయత్నించినా కూడా అసలు విషయాన్ని పసిగట్టలేకపోయింది. లండన్, ముంబైలో కార్యాలయాలు ఉన్నాయని నమ్మి, పలుమార్లు నగదును డిపాజిట్ చేసింది. మే-జూన్ నెలల మధ్య 16 వేర్వేరు ఖాతాల్లో మొత్తంగా రూ. 7.1 లక్షలు జమ చేయగా, దీనికి రూ.30 లక్షల లాభాన్ని ఆర్జించినట్టు ట్రేడింగ్ వెబ్ సైట్‌లో కనిపిస్తోంది. కానీ దానిని విత్‌డ్రా చేసుకొనే అవకాశంలేకపోవడంతో అనుమానం వచ్చింది. చివరికి మోస పోయానని గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు డాక్టర్ పాటిల్ డబ్బు బదిలీ చేసిన 16 బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. ఈ లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment