‘కరువు కార్యాచరణ’ తేల్చాలి
‘కరువు కార్యాచరణ’ తేల్చాలి
Published Wed, Sep 17 2014 1:46 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
కృష్ణా ట్రిబ్యునల్‌కు నేడు టీ సర్కారు ప్రత్యేక నివేదిక
గతంలో కృష్ణానీటిని పూర్తిగా వాడుకున్న ఎగువరాష్ట్రాలు
దిగువప్రాంతాలు కరువుతో తీవ్ర ఇక్కట్లపాలు
ఎగువ రాష్ట్రాల కోటా పెంచడంతో మరింత ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లో ఆశించిన స్థాయి నీటి లభ్యత లేని కరువు సంవత్సరాల్లో ఆ నీటిని ఎలా పంచుకోవాలో, ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కార్యాచరణ ఏమిటో ముందుగా ఖరారు చేయాలని తెలంగాణ ప్రభుత్వం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌ను బలంగా కోరుతోంది. భవిష్యత్తులో కృష్ణాలో నీటిలోటు ఏర్పడే సంవత్సరాల్లో దిగువకు నీటిప్రవాహాలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉన్న దృష్ట్యా, ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని బుధవారం ట్రిబ్యునల్‌కు ఓ ప్రత్యేక నివేదిక సమర్పించనుంది. గతంలో రెండేళ్లపాటు ఇలాంటి పరిస్థితులు నెలకొని తెలంగాణ ప్రాంతం తీవ్ర కరువును ఎదుర్కొన్న అంశాన్ని పేర్కొంటూ, ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు, సకాలంలో నీటివిడుదల జరిపేలా చొరవ చూపాలని అందులో కోరనుంది.
గత అనుభవాలు భయానకం..
బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా 2,130 టీఎంసీల కృష్ణా జలాల లభ్యతను నిర్ధారించి మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734, ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల మేర కేటాయింపులు జరిపారు. ట్రిబ్యునల్ రికార్డుల ప్రకారం 2002-03 ఏడాదిలో కృష్ణాలో కేవలం1,239 టీఎంసీల నీటి లభ్యత ఉండగా, ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలకే ఈ నీరు సరిపోయింది. మహారాష్ట్రకు కేటాయించిన 585 టీఎంసీల నీటిని పూర్తిగా వినియోగించుకోగా, కర్ణాటక తన వాటా 734 టీఎంసీల్లో 654 టీఎంసీల మేర వినియోగించుకుంది. దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చుక్క నీరు అందలేదు. తర్వాతి ఏడాది సైతం కృష్ణాలో నీటిలభ్యత లేకపోవడంతో రాష్ట్రానికి నీరందలేదు. దీంతో ఆ రెండేళ్లు రాష్ట్రం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది.
కోటాల పెంపుతో మరీ ప్రమాదం
తదనంతరం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 65 శాతం డిపెండబిలిటీతో జరిపిన కేటాయింపులతో మహారాష్ట్రకు 666 టీఎంసీలు, కర్ణాటకు 911 టీఎంసీలు కేటాయింపులు పెంచింది. భవిష్యత్తులో 1,500 నుంచి 1,600ల టీఎంసీల మేర నీటి లభ్యత ఉన్నా రెండు రాష్ట్రాలకే అవి సరిపోతాయి. దిగువన ఉన్న రాష్ట్రానికి చుక్కనీరు రాదు. గతంలో రెండేళ్లు వరుసగా నీళ్లు రాని పరిస్థితులు మున్ముందు రావన్న నమ్మకం లేదు. అదే జరిగితే తెలంగాణకు రావాల్సిన 298 టీఎంసీల నికర జలాలు, 77 టీఎంసీల మేర మిగులు జలాలు ఆ రెండు రాష్ట్రాలకే దక్కుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎగువన ఉన్న రాష్ట్రాలు ఒక నిర్దిష్ట ప్రాతిపదికతో ఉన్న నీటిలో అవసరాల మేర కిందకి వదిలేలా నిర్ణయించాల్సిన బాధ్యత ట్రిబ్యునల్‌పై ఉందని తెలంగాణ వాదిస్తోంది. ఇదే అంశాన్ని తేల్చాలని బుధవారం బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు అఫిడవిట్ సమర్పించనుంది.
ఇవీ చేదు అనుభవాలు...
ఏడాది కృష్ణా జలాల లభ్యత మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్
2002-03 1,239 టీఎంసీలు 585టీఎంసీలు 654టీఎంసీలు 0
2003-04 1,252 టీఎంసీలు 585టీఎంసీలు 667 టీఎంసీలు 0
2 ట్రిబ్యునల్‌ల కేటాయింపులు (టీఎంసీల్లో)
రాష్ట్రం బచావత్ బ్రిజేష్
ఆంధ్రప్రదేశ్ 811 1,001
మహారాష్ట్ర 585 666
కర్ణాటక 734 911
మొత్తం 2,130 2,578
బచావత్ (75 శాతం డిపెండబిలిటీ)
బ్రిజేష్ (65 శాతం డిపెండబిలిటీ)
Advertisement
Advertisement