కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రభుత్వం వాదనలు
సాక్షి, న్యూఢిల్లీ: ఇకనైనా తమ వాటా దక్కని పక్షంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రయోజనం లేదని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్-2 ముందు కుండ బద్దలు కొట్టి చెప్పింది. గత పాలకులు చూపిన వివక్షతో కృష్ణా నదీ జలాల్లో సరైన వాటా పొందలేకపోయామని నివేదించింది. కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదంపై జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ జరుపుతున్న విచారణలో భాగంగా మూడో రోజు తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ బుధవారం కూడా వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీటి పంపకాలు జరగాలని పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89లో పేర్కొనలేదని అన్నారు.
సెక్షన్ 89ను ఏపీ, తెలంగాణ మధ్య సమస్యగా చూడటం సరికాదన్నారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరపాలని సెక్షన్ 89లో పేర్కొన్నారని ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చారు. ఎగువ రాష్ట్రాలు అడ్డగోలుగా ప్రాజెక్టులు నిర్మించడంతోనే తెలంగాణకు అన్యాయం జరిగిందని వివరించారు. ఎగువ రాష్ట్రాలు తాగు, సాగునీటి అవసరాలకే కాకుండా విద్యుదుత్పత్తి కోసం, ఇతర అవసరాల కోసమూ కృష్ణా జలాలను వినియోగిస్తున్న సంగతిని వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా ఎత్తిపోతల పథకాలే శరణ్యమయ్యాయని, ఇప్పుడు నీటి వాటాలో కూడా అన్యాయం జరిగితే రాష్ట్రం ఎడారిగా మారుతుందన్నారు.
ఎగువ రాష్ట్రా ల్లో పడిన వర్షాలే కింద ఉన్న తెలుగు రాష్ట్రాలకు దిక్కని గుర్తుచేశారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతలో ఏపీ భూభాగం 9 శాతమే అయినా కృష్ణా నీటిలో 22.4% పొందుతోంద ని, తెలంగాణ భూభాగం 12% ఉన్నా 6% నీళ్లు కూడా రావడం లేదన్నారు. కృష్ణా నదీ జలాలకు సంబంధించి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణకు అతి తక్కువ సాగునీరు లభిస్తోందని తెలిపారు. వాదనలు కొనసాగించేందుకు సమయం కోరడంతో అందుకు అంగీకరించిన ట్రిబ్యునల్ తదుపరి విచారణను జూలై 8, 9, 14, 15 తేదీలకు వాయిదా వేసింది.