- సెక్షన్ 89 స్ఫూర్తి 4 రాష్ట్రాలకు నీటి పంపకమే.. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ సర్కారు వాదనలు
- ఏపీ అదనంగా 400 టీఎంసీలను వాడుకుంటోందని తెలంగాణ ఆక్షేపణ
- ఆగస్ట్ 16న తదుపరి విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాలను 4 రాష్ట్రాలకు పంచాలన్న తెలంగాణ ప్రభుత్వ వాదనలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకీభవించింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఇరు రాష్ట్రాల వాదనలు శనివారం కొనసాగాయి. తదుపరి విచారణను ఆగస్ట్ 16కు బ్రిజేష్ కుమార్ వాయిదా వేశారు. ట్రిబ్యునల్ ఎదుట ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వాదనలు వినిపించారు. ప్రాజెక్ట్‌ల వారీగా నిర్దిష్ట కేటాయింపులు జరపాలని ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 89 స్పష్టంగా పేర్కొందని గుర్తుచేశారు. అందువల్ల 4 రాష్ట్రాల్లోని ప్రాజెక్ట్‌లను పరిగణనలోకి తీసుకొని నీటి కేటాయింపులు చేయాలని కోరారు.
గతంలో రాష్ట్రాల విభజన జరిగినప్పుడు బేసిన్ పరిధిలో ఉండే రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకొని కేటాయింపులు జరిగాయని తెలిపారు. సెక్షన్ 89 స్ఫూర్తి 4 రాష్ట్రాల్లో ప్రాజెక్ట్‌ల వారీగా నీటి కేటాయింపులేనని చెప్పారు. అంతకు ముందు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలను వినిపించారు. కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు వాదిస్తున్నట్లుగా నీటి పంపకాలను ఏపీ, తెలంగాణ కు పరిమితం చేయరాదన్నారు. ఏపీ, తెలంగాణాకు పరిమితం చేయడం విభజన చట్టంలోని సెక్షన్ 89 స్ఫూర్తికి విరుద్ధమన్నారు.
కేవలం రెండు రాష్ట్రాలకే నీటి కేటాయింపులను పరిమితం చేస్తే తెలంగాణ కు ఆన్యాయమే జరుగుతుందని. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నా ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల నీటి కేటాయింపు జరిగిందని, తెలంగాణ కు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలుగా ఒక ఒప్పందం జరిగిందని, ఇప్పటికీ అదే అమలవుతోందని వైద్యనాథన్ వివరించారు. ఏపీకి 512 టీఎంసీల హక్కు మాత్రమే ఉన్నా అదనంగాా 400 టీఎంసీలను వాడుకుంటోందని ఆక్షేపించారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణ కు 90 టీఎంసీల నీరు ఏపీ నుంచి రావాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత ట్రిబ్యునల్ ప్రాజెక్ట్ వారీగా నీటి కేటాయింపులు చేసే సమయంలో ఈ విషయాన్ని పరిశీలించాలని కోరారు. ఏపీ ప్రభుత్వం గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్‌లోకి నీటిని తరలిస్తే ఎగువ రాష్ట్రాలైన తెలంగాణ కు 45 టీఎంసీలు, కర్నాటక, మహారాష్ట్రలకు 35 టీఎంసీలు ఇవ్వాల్సి ఉంటుందని వైద్యనాథన్ పేర్కొన్నారు.
‘కృష్ణా’పై రాష్ట్ర వాదనతో ఏకీభవించిన ఏపీ
Published Sun, Jul 10 2016 3:09 AM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM
Advertisement
Advertisement