![AP ENC told Telangana ENC About Krishna River Water - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/10/KRISHNA-RIVER-BOARD.jpg.webp?itok=8KahL_cx)
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ జలాల్లో వాటా, కేటాయింపు, వినియోగం లెక్కలు ఆ నీటి సంవత్సరంతోనే ముగుస్తాయని ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తేల్చిచెప్పారు. మే 31లోగా తెలంగాణ వాటా జలాలను వినియోగించుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కొత్త నీటి సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి అంటే జూన్ 1 నాటికి మిగిలిన జలాలు ఉమ్మడి కోటా కిందకు వస్తాయని స్పష్టం చేశారు. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయపురే అధ్యక్షతన వర్చువల్ పద్ధతిన శుక్రవారం త్రిసభ్య కమిటీ సమావేశమైంది. తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ మాట్లాడుతూ.. మే 31లోగా తమకు కేటాయించిన జలాలను వినియోగించుకోలేమని.. మిగిలిన జలాలను 2021–22లో వాడుకుంటామని ప్రతిపాదించారు. దీనిపై ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ నీటి సంవత్సరం లెక్కలు ఆ నీటి సంవత్సరంతోనే ముగుస్తాయని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో డీఎం రాయపురే స్పందిస్తూ.. ఈ అంశాన్ని కేంద్ర జల సంఘానికి (సీడబ్యూసీకి) నివేదిస్తామన్నారు. సీడబ్ల్యూసీ ఇచ్చే నివేదిక ఆధారంగా కోటాలో మిగిలిన జలాల అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టానికంటే దిగువ వరకు నీటిని వినియోగించుకున్నారని తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ చేసిన వ్యాఖ్యలను ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి తిప్పికొట్టారు. ఎడమగట్టు కేంద్రంలో తెలంగాణ యథేచ్చగా విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు జలాలను తరలించడం వల్లే శ్రీశైలంలో నీటిమట్టం కనీస స్థాయి కంటే దిగువకు చేరిందని గుర్తు చేశారు. ఈ అంశంపై ఎప్పటికప్పుడు కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశామని, విద్యుత్ ఉత్పత్తిని నిలుపుదల చేయాలని బోర్డు జారీ చేసిన ఉత్తర్వులను తుంగలో తొక్కి ఇప్పుడు ఇలా వ్యాఖ్యలు చేయడం సబబు కాదని హితవు పలికారు. నాగార్జునసాగర్ కుడి కాల్వ కింద తాగునీటి అవసరాల కోసం ఏడు టీఎంసీలను విడుదల చేయాలని నారాయణరెడ్డి ప్రతిపాదించారు. దీనిపై డీఎం రాయపురే స్పందిస్తూ పూర్తి స్థాయి బోర్డు సమావేశంలో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుందామని ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment