సాక్షి, అమరావతి: వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణానికి సహకరించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ను కోరారు. ఈ మేరకు ఆయన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు శనివారం లేఖ రాశారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం విషయంలో నెలకొన్న సమస్యలను సంప్రదింపుల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. సంప్రదింపులకోసం వచ్చి కలుస్తానని, సమయం కేటాయించాలని ఒడిశా సీఎంను కోరారు. అనేక సంవత్సరాలుగా వివిధ అంశాల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు నమ్మకమైన.. సుహృద్భావ వాతావరణంలో పరస్పర సహకారంతో కలసి పనిచేస్తున్నాయని, అంతేగాక పరస్పర సంప్రదింపుల ద్వారా అనేక అంశాలను పరిష్కరించుకుంటున్నామని జగన్ తన లేఖలో గుర్తు చేశారు.
నేరడితో ఏపీతోపాటు ఒడిశాకూ ఉపయోగం..
వంశధార జలవివాదాల ట్రిబ్యునల్ 13–09–2017న ఇచ్చిన తుది తీర్పును సీఎం వైఎస్ జగన్ లేఖలో ప్రస్తావిస్తూ.. వంశధారపై నేరడి బ్యారేజ్ నిర్మాణానికి ఏపీకి ట్రిబ్యునల్ అనుమతించిందని తెలిపారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం వల్ల ఏపీతోపాటు ఒడిశా అవసరాలకు ఉపయోగపడుతుందని వివరించారు. నేరడి బ్యారేజ్ ఎడమ వైపున లెఫ్ట్ హెడ్ స్లూయిజ్ నిర్మాణానికి కూడా ట్రిబ్యునల్ అనుమతించిందని, ఇది ఒడిస్సా రాష్ట్రం అవసరాలను తీరుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ బ్యారేజీ నిర్మాణం వల్ల ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. దీనివల్ల కరువు ప్రాంతాలైన ఏపీలోని శ్రీకాకుళం జిల్లాతోపాటు ఒడిశాలోని గజపతి జిల్లాలోని ప్రజల సాగు, తాగు నీటి అవసరాలు తీరతాయని తెలిపారు. ఈ బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేయడం కోసం రెండు రాష్ట్రాల రైతులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని జగన్ పేర్కొన్నారు. ఏటా వరద జలాల్లో 75 శాతం అంటే.. సుమారు 80 టీఎంసీలు వృథాగా సముద్రంలోకి పోతోందన్నారు. మానవుని అవసరాలకు నీరు చాలా ప్రధానమైనదని, అలాగే పరిమితంగా ఉండే నీటి వనరులను పరిరక్షించుకోకపోతే భవిష్యత్‌లో నీటికొరతకు అవకాశముందని ఆయన తెలిపారు.
ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పరిష్కరించుకుందాం..
ఒడిశా రాష్ట్రం కొన్ని అంశాల్లో స్పష్టత కోసం వంశధార ట్రిబ్యునల్‌తోపాటు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడాన్ని లేఖలో సీఎం జగన్ ప్రస్తావించారు. ప్రధానంగా సూపర్‌వైజరీ కమిటీ పనితీరుపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారని, అయితే ఆ విషయంపై నేరడి బ్యారేజ్ ఆపరేషన్‌లోకి వచ్చే ముందుగానే ఇరు రాష్ట్రాలు ఇచ్చుపుచ్చుకునే ధోరణిలో పరిష్కరించుకోవచ్చునని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ తీర్పునకు అనుగుణంగా నేరడి బ్యారేజ్ నిర్మాణానికి ఒడిశా ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. సమస్యలను ఇరు రాష్ట్రాలు పరస్పరం సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జగన్ పునరుద్ఘాటిస్తూ.. ఈ నేపథ్యంలో చర్చల కోసం తగిన సమయం కేటాయించాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment