సాక్షి, అమరావతి: వంశధార నదీ జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదానికి ముగింపు పలుకుతూ ఇచ్చిన తుది తీర్పునే వీడబ్ల్యూడీటీ (వంశధార జల వివాదాల ట్రిబ్యునల్) ఖరారు చేసింది. సెప్టెంబర్ 13, 2017న ఇచ్చిన తుది తీర్పుపై అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956 సెక్షన్–5(3) కింద ఒడిశా సర్కార్ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఈ మేరకు సోమవారం వీడబ్ల్యూడీటీ చైర్మన్ జస్టిస్ డాక్టర్ ముకుందకం శర్మ ఉత్తర్వులు జారీ చేస్తూ కేంద్రానికి నివేదించారు. వంశధార ట్రిబ్యునల్ తుది తీర్పును నోటిఫై చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తే.. ఆ తీర్పు అమల్లోకి వస్తుంది. తుది తీర్పును సవాల్ చేస్తూ ఒడిశా సర్కార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం ఆధారంగా కేంద్రం ఆ తీర్పును నోటిఫై చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది.
ఏడున్నరేళ్లపాటు విచారణ..
వంశధార జలాల వివాదాన్ని ఏడున్నరేళ్లపాటు విచారించిన ట్రిబ్యునల్ సెప్టెంబర్ 13, 2017న ఇరు రాష్ట్రాలకు సమన్యాయం చేస్తూ తుది తీర్పు ఇచ్చింది. ఇందులో ప్రధానాంశాలు..
– సెప్టెంబరు 30, 1962న ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు.. వంశధారలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 115 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని అంచనా. ట్రిబ్యునల్ వాటిని చెరి సగం అంటే 57.5 టీఎంసీల చొప్పున పంపిణీ చేసింది.
– శ్రీకాకుళం జిల్లాలో నేరడి వద్ద వంశధారపై బ్యారేజీ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఈ బ్యారేజీ నుంచి నీటిని ఇరు రాష్ట్రాలు వాడుకోవాలని సూచించింది. బ్యారేజీ కుడి వైపు స్లూయిజ్‌ల ద్వారా రోజుకు ఎనిమిది వేల క్యూసెక్కుల చొప్పున తరలించడానికి ఏపీకి అనుమతి ఇచ్చింది. తీర్పు అమలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన ఆర్నెళ్లలోగా బ్యారేజీ ఎడమ వైపు నుంచి నీటిని వాడుకోవడానికి వీలుగా ఏపీకి ప్రతిపాదనలు పంపాలని ఒడిశాకు సూచించింది.
– నేరడి బ్యారేజీ నిర్మాణానికయ్యే వ్యయాన్ని ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో ఏపీ, ఒడిశాలు భరించాలని పేర్కొంది.
– నేరడి బ్యారేజీలో ముంపునకు గురయ్యే 106 ఎకరాల భూమిని సేకరించి ఏపీ ప్రభుత్వానికి అప్పగించాలని ఒడిశాను ఆదేశించింది. ఇందుకు పరిహారాన్ని ఒడిశాకు చెల్లించాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది.
– కాట్రగడ్డ సైడ్‌వియర్ హెడ్ రెగ్యులేటర్‌ను జూన్ 1 నుంచి ఎనిమిది టీఎంసీలు తరలించే వరకు లేదా నవంబర్ 30 వరకు తెరిచి ఉంచాలని పేర్కొంది.
– నేరడి బ్యారేజీ పూర్తయ్యాక కాట్రగడ్డ సైడ్‌వియర్‌ను పూర్తిగా తొలగించాలని షరతు విధించింది.
– ఈ తీర్పు అమలును పర్యవేక్షించడానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సీఈ అధ్యక్షతన, ఇరు రాష్ట్రాల అధికారులు సభ్యులుగా అంతర్రాష్ట్ర పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది.
ఒడిశా అభ్యంతరాలను తోసిపుచ్చిన ట్రిబ్యునల్..
ఒడిశా లేవనెత్తిన అభ్యంతరాలపై విచారణ జరిపిన వంశధార ట్రిబ్యునల్ వాటిని తోసిపుచ్చింది. వంశధారలో 115 టీఎంసీల లభ్యత లేదన్న వాదనను కొట్టిపారేసింది. ఎంత నీటి లభ్యత ఉంటే.. అంత నీటిని దామాషా పద్ధతిలో చెరి సగం పంచుకోవాలని ఆదేశించింది. కాట్రగడ్డ సైడ్‌వియర్ నుంచి వాడుకునే జలాలపై పర్యవేక్షణ కమిటీ వేయాలన్న సూచననూ తోసిపుచ్చింది. తీర్పు అమలును పర్యవేక్షించేందుకు అంతర్రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మరో కొత్త కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
వంశధార జలాల వివాద క్రమం ఇదీ..
– ఫిబ్రవరి, 2006: ఏపీ ప్రభుత్వం చేపట్టిన వంశధార ప్రాజెక్టు ఫేజ్–2, స్టేజ్–2పై అభ్యంతరం తెలుపుతూ కేంద్రానికి ఫిర్యాదు చేసిన ఒడిశా. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956 సెక్షన్–3 ప్రకారం ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి వివాదాన్ని పరిష్కరించాలని ప్రతిపాదన
– ఏప్రిల్ 24, 2006: వివాదాన్ని పరిష్కరించేందుకు ఏపీ, ఒడిశా జలవనరుల అధికారులతో కేంద్ర జలవనరుల శాఖ అధికారుల మొదటి సమావేశం.. చర్చలు విఫలం
– డిసెంబర్ 5, 6, 2006: ఇరు రాష్ట్రాల అధికారులతో కేంద్ర అధికారుల రెండో దఫా సమావేశం.. చర్చలు విఫలం
– మార్చి 2, 2007: ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఉన్నత స్థాయి సమావేశం.. చర్చలు విఫలం
– ఏప్రిల్ 30, 2007: అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956 ప్రకారం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి.. వంశధార వివాదాన్ని పరిష్కరించాలని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన ఒడిశా
–ఫిబ్రవరి 6, 2009: ఈ వివాదంపై విచారించిన సుప్రీంకోర్టు.. ఆర్నెళ్లలోగా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి, వివాదాన్ని పరిష్కరించాలని కేంద్రానికి ఆదేశం
– ఏప్రిల్ 24, 2010: వంశధార జల వివాదాల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసిన కేంద్రం
– డిసెంబర్ 17, 2013: కాట్రగడ్డ సైడ్‌వియర్ నిర్మాణానికి ఏపీకి అనుమతి ఇస్తూ కేంద్రానికి మధ్యంతర నివేదిక ఇచ్చిన వంశధార ట్రిబ్యునల్
– సెప్టెంబర్ 15, 2014: వంశధార ట్రిబ్యునల్ మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఒడిశా.. కాట్రగడ్డ సైడ్‌వియర్ నిర్మాణ పనులను ఏపీ కొనసాగించవచ్చన్న సుప్రీంకోర్టు
– సెప్టెంబర్ 13, 2017: తుది తీర్పు జారీ చేసిన వంశధార ట్రిబ్యునల్
– డిసెంబర్ 12, 2017: తుది తీర్పుపై అభ్యంతరాలను లేవనెత్తిన ఒడిశా సర్కార్
– జూన్ 21, 2021: ఒడిశా అభ్యంతరాలను తోసిపుచ్చుతూ.. తుది తీర్పును ఖరారు చేస్తూ కేంద్రానికి నివేదిక ఇచ్చిన వంశధార ట్రిబ్యునల్
Comments
Please login to add a commentAdd a comment