tribunal judgement
-
వంశధార జలాల వివాదానికి చరమగీతం
సాక్షి, అమరావతి: వంశధార నదీ జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదానికి ముగింపు పలుకుతూ ఇచ్చిన తుది తీర్పునే వీడబ్ల్యూడీటీ (వంశధార జల వివాదాల ట్రిబ్యునల్) ఖరారు చేసింది. సెప్టెంబర్ 13, 2017న ఇచ్చిన తుది తీర్పుపై అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956 సెక్షన్–5(3) కింద ఒడిశా సర్కార్ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఈ మేరకు సోమవారం వీడబ్ల్యూడీటీ చైర్మన్ జస్టిస్ డాక్టర్ ముకుందకం శర్మ ఉత్తర్వులు జారీ చేస్తూ కేంద్రానికి నివేదించారు. వంశధార ట్రిబ్యునల్ తుది తీర్పును నోటిఫై చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తే.. ఆ తీర్పు అమల్లోకి వస్తుంది. తుది తీర్పును సవాల్ చేస్తూ ఒడిశా సర్కార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం ఆధారంగా కేంద్రం ఆ తీర్పును నోటిఫై చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఏడున్నరేళ్లపాటు విచారణ.. వంశధార జలాల వివాదాన్ని ఏడున్నరేళ్లపాటు విచారించిన ట్రిబ్యునల్ సెప్టెంబర్ 13, 2017న ఇరు రాష్ట్రాలకు సమన్యాయం చేస్తూ తుది తీర్పు ఇచ్చింది. ఇందులో ప్రధానాంశాలు.. – సెప్టెంబరు 30, 1962న ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు.. వంశధారలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 115 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని అంచనా. ట్రిబ్యునల్ వాటిని చెరి సగం అంటే 57.5 టీఎంసీల చొప్పున పంపిణీ చేసింది. – శ్రీకాకుళం జిల్లాలో నేరడి వద్ద వంశధారపై బ్యారేజీ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఈ బ్యారేజీ నుంచి నీటిని ఇరు రాష్ట్రాలు వాడుకోవాలని సూచించింది. బ్యారేజీ కుడి వైపు స్లూయిజ్‌ల ద్వారా రోజుకు ఎనిమిది వేల క్యూసెక్కుల చొప్పున తరలించడానికి ఏపీకి అనుమతి ఇచ్చింది. తీర్పు అమలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన ఆర్నెళ్లలోగా బ్యారేజీ ఎడమ వైపు నుంచి నీటిని వాడుకోవడానికి వీలుగా ఏపీకి ప్రతిపాదనలు పంపాలని ఒడిశాకు సూచించింది. – నేరడి బ్యారేజీ నిర్మాణానికయ్యే వ్యయాన్ని ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో ఏపీ, ఒడిశాలు భరించాలని పేర్కొంది. – నేరడి బ్యారేజీలో ముంపునకు గురయ్యే 106 ఎకరాల భూమిని సేకరించి ఏపీ ప్రభుత్వానికి అప్పగించాలని ఒడిశాను ఆదేశించింది. ఇందుకు పరిహారాన్ని ఒడిశాకు చెల్లించాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. – కాట్రగడ్డ సైడ్‌వియర్ హెడ్ రెగ్యులేటర్‌ను జూన్ 1 నుంచి ఎనిమిది టీఎంసీలు తరలించే వరకు లేదా నవంబర్ 30 వరకు తెరిచి ఉంచాలని పేర్కొంది. – నేరడి బ్యారేజీ పూర్తయ్యాక కాట్రగడ్డ సైడ్‌వియర్‌ను పూర్తిగా తొలగించాలని షరతు విధించింది. – ఈ తీర్పు అమలును పర్యవేక్షించడానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సీఈ అధ్యక్షతన, ఇరు రాష్ట్రాల అధికారులు సభ్యులుగా అంతర్రాష్ట్ర పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. ఒడిశా అభ్యంతరాలను తోసిపుచ్చిన ట్రిబ్యునల్.. ఒడిశా లేవనెత్తిన అభ్యంతరాలపై విచారణ జరిపిన వంశధార ట్రిబ్యునల్ వాటిని తోసిపుచ్చింది. వంశధారలో 115 టీఎంసీల లభ్యత లేదన్న వాదనను కొట్టిపారేసింది. ఎంత నీటి లభ్యత ఉంటే.. అంత నీటిని దామాషా పద్ధతిలో చెరి సగం పంచుకోవాలని ఆదేశించింది. కాట్రగడ్డ సైడ్‌వియర్ నుంచి వాడుకునే జలాలపై పర్యవేక్షణ కమిటీ వేయాలన్న సూచననూ తోసిపుచ్చింది. తీర్పు అమలును పర్యవేక్షించేందుకు అంతర్రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మరో కొత్త కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. వంశధార జలాల వివాద క్రమం ఇదీ.. – ఫిబ్రవరి, 2006: ఏపీ ప్రభుత్వం చేపట్టిన వంశధార ప్రాజెక్టు ఫేజ్–2, స్టేజ్–2పై అభ్యంతరం తెలుపుతూ కేంద్రానికి ఫిర్యాదు చేసిన ఒడిశా. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956 సెక్షన్–3 ప్రకారం ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి వివాదాన్ని పరిష్కరించాలని ప్రతిపాదన – ఏప్రిల్ 24, 2006: వివాదాన్ని పరిష్కరించేందుకు ఏపీ, ఒడిశా జలవనరుల అధికారులతో కేంద్ర జలవనరుల శాఖ అధికారుల మొదటి సమావేశం.. చర్చలు విఫలం – డిసెంబర్ 5, 6, 2006: ఇరు రాష్ట్రాల అధికారులతో కేంద్ర అధికారుల రెండో దఫా సమావేశం.. చర్చలు విఫలం – మార్చి 2, 2007: ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఉన్నత స్థాయి సమావేశం.. చర్చలు విఫలం – ఏప్రిల్ 30, 2007: అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956 ప్రకారం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి.. వంశధార వివాదాన్ని పరిష్కరించాలని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన ఒడిశా –ఫిబ్రవరి 6, 2009: ఈ వివాదంపై విచారించిన సుప్రీంకోర్టు.. ఆర్నెళ్లలోగా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి, వివాదాన్ని పరిష్కరించాలని కేంద్రానికి ఆదేశం – ఏప్రిల్ 24, 2010: వంశధార జల వివాదాల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసిన కేంద్రం – డిసెంబర్ 17, 2013: కాట్రగడ్డ సైడ్‌వియర్ నిర్మాణానికి ఏపీకి అనుమతి ఇస్తూ కేంద్రానికి మధ్యంతర నివేదిక ఇచ్చిన వంశధార ట్రిబ్యునల్ – సెప్టెంబర్ 15, 2014: వంశధార ట్రిబ్యునల్ మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఒడిశా.. కాట్రగడ్డ సైడ్‌వియర్ నిర్మాణ పనులను ఏపీ కొనసాగించవచ్చన్న సుప్రీంకోర్టు – సెప్టెంబర్ 13, 2017: తుది తీర్పు జారీ చేసిన వంశధార ట్రిబ్యునల్ – డిసెంబర్ 12, 2017: తుది తీర్పుపై అభ్యంతరాలను లేవనెత్తిన ఒడిశా సర్కార్ – జూన్ 21, 2021: ఒడిశా అభ్యంతరాలను తోసిపుచ్చుతూ.. తుది తీర్పును ఖరారు చేస్తూ కేంద్రానికి నివేదిక ఇచ్చిన వంశధార ట్రిబ్యునల్ -
'ఆ' ఇళ్లను తిరిగి ఇచ్చేయండి!
సాక్షి, భువనగిరి: తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పట్టించుకోవడం లేదని, న్యాయం చేయాలని కోరుతూ ఓ తండ్రి భువనగిరి ఆర్డీఓ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు. ఇరివురి వాదనలు విన్న అనంతరం తండ్రి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొడుకులకు తగిన బుద్ధి చెబుతూ తండ్రి కష్టపడి నిర్మించుకున్న మూడు ఇళ్లను తిరిగి ఇచ్చేయాలని ఆ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రానికి చెందిన బొడ్డు యాదగిరికి నలుగురు కుమారులు బొడ్డు నర్సింహులు, సుదర్శన్, ఉపేందర్, సత్యనారాయణలు ఉన్నారు. తాను సంపాదించి నిర్మించుకున్న ఇళ్లల్లో ఉంటూ తన కొ డులకు తనను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారని, వృద్ధాప్య వయస్సులో ఉన్నా.. తన పోషణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించా రని తండ్రి యాదగిరి మే 24న ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. యాదగిరి కేసు విచారణను స్వీకరించిన ట్రిబ్యునల్ చైర్మన్, భువనగిరి ఆర్డీఓ జి.వెంకటేశ్వర్లు అతడి కుమారులకు సమన్లు జారీ చేశారు. జూలై 8న ట్రిబ్యునల్ చైర్మన్ ఎదుట హాజరైన యాదగిరి కుమారులు తన తండ్రి పోషణకు ఒక్కొక్కరు రూ.2500 చొప్పున రూ.10వేలను ఇస్తామని పేర్కొన్నారు. దీనికి యాదగిరి అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను తిరిగి ఇప్పించాలని ట్రిబ్యునల్‌ను కోరారు. ఇరువురి వాదనలు విన్న ఆర్డీఓ గత నెల 23వ తేదిన తీర్పునిచ్చారు. రాజాపేట మండల కేంద్రం లోని 7–47, 7–41, 7–51 నంబర్లు గల ఇళ్లను ఖాళీ చేసి యాదగిరికి స్వాధీనం చేయాలని తీర్పునిస్తూ ఉత్తర్వులు జారీ చేశా రు. అదే విధంగా యాదగిరికి తగిన రక్షణ కల్పించాలని సూచిస్తూ పోలీసులను ఆదేశిస్తూ ఈ నెల 8న ట్రిబ్యునల్ మరోమారు ఉత్తర్వులు ఇచ్చింది. -
బినామీ కేసులకు అప్పిలేట్ ట్రిబ్యునల్
న్యూఢిల్లీ: బినామీ లావాదేవీల కేసుల సత్వర విచారణకు అపిలేట్ ట్రిబ్యునల్, న్యాయ నిర్ణాయక ప్రాధికార సంస్థల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా అప్పిలేట్ ట్రిబ్యునల్, న్యాయ నిర్ణాయక ప్రాధికార సంస్థలు విధులు నిర్వర్తించనున్నాయి. కోల్‌కతా, ముంబై, చెన్నైలలో ప్రాధికార సంస్థకు అనుబంధ బెంచ్‌లు ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటన జారీ అయింది. ఈ సంస్థ చైర్మన్‌ను సంప్రదించిన తరువాత బెంచ్‌ల ఏర్పాటుపై నోటిఫికేషన్ వెలువడుతుంది. ఈ రెండు సంస్థల ఏర్పాటుతో బినామీ కేసులు వేగంగా, సమర్థవంతంగా పరిష్కారమవుతాయని ప్రకటనలో పేర్కొన్నారు. బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధ చట్టం కింద తీసుకున్న చర్యలకు న్యాయ నిర్ణాయక ప్రాధికార సంస్థ తొలి సమీక్ష వేదికగా పనిచేస్తుంది. ప్రాధికార సంస్థ ఆదేశాలను అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో సవాలు చేయొచ్చు. ఆశా సమన్వయకర్తల భత్యాల పెంపు: ఆశా సమన్వయకర్తల పర్యవేక్షణ భత్యాలను పెంచడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ పచ్చజెండా ఊపింది. అక్టోబర్ నుంచి ఒక్కో క్షేత్రస్థాయి పర్యవేక్షణ పర్యటనకు రూ.250కి బదులు రూ.300 చెల్లిస్తారు. ఫలితంగా ఆశా సమన్వయకర్తలు నెలకు పొందే మొత్తం వేతనం రూ.5 వేల నుంచి రూ.6 వేలకు పెరగనుంది. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 41 వేల ఆశా సమన్వకర్తలను ప్రోత్సహించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. కేబినెట్ నిర్ణయం పట్ల ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా హర్షం వ్యక్తం చేశారు. సాధారణంగా ఆశా కార్యకర్తల నుంచే సమన్వయకర్తలను ఎంపికచేస్తారు. ∙ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో దేశవ్యాప్తంగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ (ఐఐఎస్ఎస్) ఏర్పాటుకు ఆమోదం. -
మృతుడి కుటంబానికి రూ.40 లక్షల పరిహారం
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన రామేశ్వర్ చౌదరీ (47) కుటుంబానికి 40లక్షల పరిహారం చెల్లించాల్సిందిగా ట్రిబ్యునల్ కోర్టు పేర్కొంది. ఈ మేరకు ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదం జరిగిన సమయంలో చూసిన ప్రత్యక్ష సాక్షి రూపేందర్ సింగ్ చెప్పిన ఆధారాలను ఎమ్ఏసీటీ అధికారి అజయ్ కుమార్ జైన్ సేకరించారు. 2011లో జూలై 12న ద్విచక్రవాహనంపై వెళుతున్న రామేశ్వర్‌ను వెనకనుంచి వేగంగా వస్తున్న ఓ బస్సు ఢీకొట్టడంతో ఆయన అక్కడిక్కడే మృతిచెందిన సంగతి తెలిసిందే. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే రామేశ్వర్ మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా సాక్షి చెప్పిన వివరాలను డ్రైవర్, బస్సు యజమాని కోర్టు ఎదుట ఖండించారు. వీరి వాదనతో ట్రిబ్యునల్ ఏకీభవించలేదు. బస్సుకు చెందాల్సిన భీమా మొత్తాన్ని బాధితుడి కుటుంబానికి ఇవ్వాలని కోర్టు సూచించింది. -
‘కృష్ణా’ చిక్కుముళ్లెన్నో!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి ఇప్పటికే తీరని నష్టం జరిగిందని ప్రజలు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారం అప్పుడే అయిపోలేదు. ఇదే ట్రిబ్యునల్‌తో మరింత ముప్పు పొంచి ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లులో పొందుపరిచిన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కాలపరిమితి పొడిగింపు అంశం ఎన్నో కొత్త వివాదాలను, సందేహాలను లేవనెత్తుతోంది. చివరకు ట్రిబ్యునల్ పొడిగింపునకు చట్టబద్ధత ఉంటుందా? ఇటీవల వెలువరించిన తీర్పు చెల్లుబాటవుతుందా? వంటి సందేహాలకూ దారితీస్తోంది. ఒక బేసిన్లో మూడు రాష్ట్రాల నడువు వివాదాల పరిష్కారానికి ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు కాగా, దీన్ని కొత్తగా ఏర్పడబోయే రెండు రాష్ట్రాల నీటి సవుస్యల (పలు బేసిన్లు) పరిష్కారం కోసం పొడిగిస్తే... దానికి చట్టబద్ధత ఉంటుందా అనేది ఒక సందేహం. అలాంటప్పుడు మొన్న వెలువరించిన తీర్పు చెల్లుబాటవుతుందా అనేది వురో సందేహం. ఎందుకంటే కీలకమైన క్యాచ్మెంట్ ఏరియూ, అందులో వచ్చిచేరే నీటి పరిమాణం ఆధారంగా పంపకాలు ఉండాలంటూ తెలంగాణవాదులు చేస్తున్న డివూండ్ ఎలాగూ ట్రిబ్యునల్ ఎదుటకు వస్తుంది. అదే జరిగితే ఎక్కువ క్యాచ్మెంట్ ఏరియూ ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర అదే కోణంలో తవుకూ పంపకాలు జరపాలని కొత్తగా వాదన ఎత్తుకునే ప్రమాదం ఉంది. వాటికి ఇంప్లీడ్ అయ్యేందుకూ చట్టపరంగా అవకాశాలూ ఉంటాయి. రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ చిక్కుముడి! బ్రిజేశ్ ట్రిబ్యునల్(ట్రిబ్యునల్-2) గత నెలలో వెలువరించిన తుది తీర్పులో రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు విరుద్ధమైన అనేక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపు, మిగులు జలాల పంపకం, నీటి లభ్యతకు పాటించిన 65 శాతం డిపెండబులిటి పద్ధతి వంటి అంశాల కారణంగా రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. దీంతో ఈ తీర్పును వ్యతిరేకిస్తూ న్యాయపోరాటంతో పాటు, రాజకీయ పోరాటాన్నీ కొనసాగించాలని అఖిలపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అయితే ఈ ప్రక్రియ ఇలా కొనసాగుతుండగానే, బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌ను కొనసాగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ముసాయిదా బిల్లులో స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన ప్రక్రియ ముగిసిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై ఈ ట్రిబ్యునల్ చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. అయితే అసలు చిక్కు ఇక్కడే మొదలవుతుంది. ఇదీ సమస్య: బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు అమలు కాకుండా ఇప్పటికే సుప్రీంస్టే విధించింది. తాము చెప్పేవరకూ ఈ తీర్పును నోటిఫై చేయువద్దని ఇంతకుముందే చెప్పింది. ఈ తీర్పులో ఆయా రాష్ట్రాలు, ప్రాంతాలు, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేశారు. ఉదాహరణకు రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులకు ఎంతెంత నీరు అనే విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ప్రాజెక్టులకు ఎంత నీరు, తెలంగాణలోని ప్రాజెక్టులకు ఎంత నీటి కేటాయింపులు ఉన్నాయనే విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశారు. అలాగే నీటి విడుదలకు సంబంధించి ప్రత్యేక బోర్డులు కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్‌ను కొనసాగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా నీటి కేటాయింపులు లేదా సవరణలు చేయాలంటేనే ట్రిబ్యున ల్ను ఏర్పాటు చేస్తారు. దాంతో ప్రస్తుత ట్రిబ్యునల్ కొనసాగితే... కొత్తగా ఏర్పడే రాష్ట్రాలే కాకుండా కృష్ణా బేసిన్‌లోని అన్ని రాష్ట్రాలు కూడా తమ డిమాండ్లను మరోసారి తెరపైకి తీసుకురావచ్చు. నీటి పంపకాల్లో ఇప్పటికే భారీగా లబ్ధి పొందిన ఎగువ రాష్ట్రాలు మరోసారి తమ ప్రయోజనాల కోసం ఒత్తిడి తీసుకువచ్చే అవకాశమూ ఉంది. తీర్పును నిలిపివేయాలా? ప్రస్తుత ట్రిబ్యునల్‌ను కొనసాగిస్తే తాజాగా ఇచ్చిన తీర్పు అమలు కాకుండా చూడాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు విధించిన స్టేతో సంబంధం లేకుండా నేరుగా ట్రిబ్యునలే స్వయంగా తన తీర్పును తాత్కాలికంగా పెండింగ్‌లో పెట్టాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒకపక్క తీర్పు అమల్లో ఉండి, అదే నదిపై రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను పరిశీలించడం సాధ్యం కాదంటున్నారు. ఒకవేళ అదే జరిగి, తీర్పు అమల్లోకి రాకుండా ట్రిబ్యునల్ పనిచేయడం మొదలుపెడితే ఎగువ రాష్ట్రాలు కూడా పార్టీలుగా మారుతాయి. అప్పుడు నాలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ నీటి పంచాయితీ మొదలవుతుంది. ఏ విధంగా పరిశీలించినా ట్రిబ్యునల్‌ను కొనసాగించడం వల్ల కృష్ణా నీటి పంపకం సమస్య మళ్లీ మొదటికొచ్చే పరిస్థితి ఏర్పడింది. అదే జరిగితే ఎగువ రాష్ట్రాలకు మరింత ప్రయోజనంగా మారనుందనే ఆందోళన నె లకొంది.