‘కృష్ణా’ చిక్కుముళ్లెన్నో! | no proper justice on krishna river | Sakshi
Sakshi News home page

‘కృష్ణా’ చిక్కుముళ్లెన్నో!

Published Sun, Dec 15 2013 3:22 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM

‘కృష్ణా’ చిక్కుముళ్లెన్నో! - Sakshi

‘కృష్ణా’ చిక్కుముళ్లెన్నో!

 సాక్షి, హైదరాబాద్:  కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి ఇప్పటికే తీరని నష్టం జరిగిందని ప్రజలు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారం అప్పుడే అయిపోలేదు. ఇదే ట్రిబ్యునల్‌తో మరింత ముప్పు పొంచి ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లులో పొందుపరిచిన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కాలపరిమితి పొడిగింపు అంశం ఎన్నో కొత్త వివాదాలను, సందేహాలను లేవనెత్తుతోంది. చివరకు ట్రిబ్యునల్ పొడిగింపునకు చట్టబద్ధత ఉంటుందా? ఇటీవల వెలువరించిన తీర్పు చెల్లుబాటవుతుందా? వంటి సందేహాలకూ దారితీస్తోంది. ఒక బేసిన్‌లో మూడు రాష్ట్రాల నడువు వివాదాల పరిష్కారానికి ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు కాగా, దీన్ని కొత్తగా ఏర్పడబోయే రెండు రాష్ట్రాల నీటి సవుస్యల (పలు బేసిన్లు) పరిష్కారం కోసం పొడిగిస్తే... దానికి చట్టబద్ధత ఉంటుందా అనేది ఒక సందేహం. అలాంటప్పుడు మొన్న వెలువరించిన తీర్పు చెల్లుబాటవుతుందా అనేది వురో సందేహం. ఎందుకంటే కీలకమైన క్యాచ్‌మెంట్ ఏరియూ, అందులో వచ్చిచేరే నీటి పరిమాణం ఆధారంగా పంపకాలు ఉండాలంటూ తెలంగాణవాదులు చేస్తున్న డివూండ్ ఎలాగూ ట్రిబ్యునల్ ఎదుటకు వస్తుంది. అదే జరిగితే ఎక్కువ క్యాచ్‌మెంట్ ఏరియూ ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర అదే కోణంలో తవుకూ పంపకాలు జరపాలని కొత్తగా వాదన ఎత్తుకునే ప్రమాదం ఉంది. వాటికి ఇంప్లీడ్ అయ్యేందుకూ చట్టపరంగా అవకాశాలూ ఉంటాయి.
 
 రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ చిక్కుముడి!
 బ్రిజేశ్ ట్రిబ్యునల్(ట్రిబ్యునల్-2) గత నెలలో వెలువరించిన తుది తీర్పులో రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు విరుద్ధమైన అనేక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపు, మిగులు జలాల పంపకం, నీటి లభ్యతకు పాటించిన 65 శాతం డిపెండబులిటి పద్ధతి వంటి అంశాల కారణంగా రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. దీంతో ఈ తీర్పును వ్యతిరేకిస్తూ న్యాయపోరాటంతో పాటు, రాజకీయ పోరాటాన్నీ కొనసాగించాలని అఖిలపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అయితే ఈ ప్రక్రియ ఇలా కొనసాగుతుండగానే, బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌ను కొనసాగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ముసాయిదా బిల్లులో స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన ప్రక్రియ ముగిసిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై ఈ ట్రిబ్యునల్ చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. అయితే అసలు చిక్కు ఇక్కడే మొదలవుతుంది.
 ఇదీ సమస్య: బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు అమలు కాకుండా ఇప్పటికే సుప్రీంస్టే విధించింది. తాము చెప్పేవరకూ ఈ తీర్పును నోటిఫై చేయువద్దని ఇంతకుముందే చెప్పింది. ఈ తీర్పులో ఆయా రాష్ట్రాలు, ప్రాంతాలు, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేశారు. ఉదాహరణకు రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులకు ఎంతెంత నీరు అనే విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు.
 
  ఆంధ్రా ప్రాంతానికి చెందిన ప్రాజెక్టులకు ఎంత నీరు, తెలంగాణలోని ప్రాజెక్టులకు ఎంత నీటి కేటాయింపులు ఉన్నాయనే విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశారు. అలాగే నీటి విడుదలకు సంబంధించి ప్రత్యేక బోర్డులు కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్‌ను కొనసాగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా నీటి కేటాయింపులు లేదా సవరణలు చేయాలంటేనే ట్రిబ్యున ల్‌ను ఏర్పాటు చేస్తారు. దాంతో ప్రస్తుత ట్రిబ్యునల్ కొనసాగితే... కొత్తగా ఏర్పడే రాష్ట్రాలే కాకుండా కృష్ణా బేసిన్‌లోని అన్ని రాష్ట్రాలు కూడా తమ డిమాండ్లను మరోసారి తెరపైకి తీసుకురావచ్చు. నీటి పంపకాల్లో ఇప్పటికే భారీగా లబ్ధి పొందిన ఎగువ రాష్ట్రాలు మరోసారి తమ ప్రయోజనాల కోసం ఒత్తిడి తీసుకువచ్చే అవకాశమూ ఉంది.
 
 తీర్పును నిలిపివేయాలా?
 ప్రస్తుత ట్రిబ్యునల్‌ను కొనసాగిస్తే తాజాగా ఇచ్చిన తీర్పు అమలు కాకుండా చూడాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు విధించిన స్టేతో సంబంధం లేకుండా నేరుగా ట్రిబ్యునలే స్వయంగా తన తీర్పును తాత్కాలికంగా పెండింగ్‌లో పెట్టాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒకపక్క తీర్పు అమల్లో ఉండి, అదే నదిపై రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను పరిశీలించడం సాధ్యం కాదంటున్నారు. ఒకవేళ అదే జరిగి, తీర్పు అమల్లోకి రాకుండా ట్రిబ్యునల్ పనిచేయడం మొదలుపెడితే ఎగువ రాష్ట్రాలు కూడా పార్టీలుగా మారుతాయి. అప్పుడు నాలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ నీటి పంచాయితీ మొదలవుతుంది. ఏ విధంగా పరిశీలించినా ట్రిబ్యునల్‌ను కొనసాగించడం వల్ల కృష్ణా నీటి పంపకం సమస్య మళ్లీ మొదటికొచ్చే పరిస్థితి ఏర్పడింది. అదే జరిగితే ఎగువ రాష్ట్రాలకు మరింత ప్రయోజనంగా మారనుందనే ఆందోళన నె లకొంది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement