శ్రీశైలంప్రాజెక్ట్/ విజయపురిసౌత్/సత్రశాల (రెంటచింతల)/తాడేపల్లి రూరల్ : ఆయా ప్రాజెక్టుల నుంచి శుక్రవారం నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో పరీవాహక ప్రాంతాల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయం గత మూడురోజులుగా గరిష్టస్థాయి 885 అడుగుల వద్ద ఉంది.
ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి వస్తున్న నీటి ప్రవాహాన్ని బట్టి దిగువ ప్రాజెక్ట్‌లకు నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి జూరాల, సుంకేసుల నుంచి 1,26, 281 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. 2గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు 55, 782 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాం నీటిమట్టం 884.60 అడుగులకు చేరుకుంది.
సాగర్ 12 క్రస్ట్‌గేట్ల ద్వారా..
నాగార్జునసాగర్ నుంచి 12 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ జలాశయం 12 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 96,324 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయ నీటిమట్టం 589.30 అడుగుల వద్ద ఉండగా, ఇది 309.9534 టీఎంసీలకు సమానం.
పులిచింతల నుంచి..
నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు ద్వారా 1,93,966 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేశారు. ప్రాజెక్టు రిజర్వాయర్‌లో గరిష్ట నీటి సామర్థ్యం 7.080 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 6.860 టీఎంసీలు నిల్వ ఉంది.
ప్రకాశం బ్యారేజ్ నుంచి..
ప్రకాశం బ్యారేజ్ వద్దకు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు రావడంతో ప్రాజెక్టు 70 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు 2 లక్షల 20 వేల 500క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్ట్, ఇతర వాగుల నుంచి 2 లక్షల 36 వేల 158 క్యూసెక్కుల వరదనీరు ప్రకాశం బ్యారేజ్‌కు వచ్చి చేరుతోంది.
బ్యారేజీ రిజర్వాయర్‌లో 12 అడుగుల నీటిమట్టం కొనసాగుతుండగా.. తూర్పు డెల్టా కాలువకు 8 వేల 632 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 7 వేల 26 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment