30 షాపులకు దరఖాస్తు చేసిన ఒడిశా మద్యం వ్యాపారి
నోయిడా నుంచి రంగంలోకిమరి కొందరు..
ఎక్కువ దరఖాస్తులు రాకుండా మద్యం వ్యాపారుల ప్రయత్నాలు
తాజా పరిణామాలతో కంగుతున్న విశాఖ మద్యం సిండికేట్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలో మద్యం వ్యాపారంపై ఆధిపత్యం చెలాయించాలనుకున్న సిండికేట్‌కు తీవ్ర పోటీ ఎదురవుతోంది. ఒడిశాకు చెందిన వ్యాపారి వివేక్ సాహు సిండికేట్‌కు ఊహించని షాక్‌నిచ్చారు. నోయిడాకు చెందిన కొంత మంది మద్యం వ్యాపారులు కూడా ఇక్కడ వ్యాపారంపై కన్నేశారు. విశాఖలో మద్యం దుకాణాల కోసం కొంత మంది సిండికేట్‌గా ఏర్పడి ఎక్కువ దరఖాస్తులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఎవరెవరు ఏయే షాపులను దక్కించుకోవాలనే విషయంపై సోమవారం రాత్రి సీతమ్మధారలోని ఒక మద్యం వ్యాపారి గెస్ట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. ప్రధానంగా 8 మంది మద్యం సిండికేట్ల మధ్య ప్రాథమికంగా అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. అయితే.. ఇందుకు భిన్నంగా ఒడిశాకు చెందిన మద్యం వ్యాపారి వివేక్ సాహు ఏకంగా 30 షాపులకు దరఖాస్తు చేశారు. నోయిడాకు చెందిన వ్యాపారులు 10 షాపుల వరకూ దరఖాస్తు చేస్తున్నట్టు సమాచారంతో స్థానిక సిండికేట్ కంగుతింది. ఆయా వ్యాపారులకు లాటరీలో షాపులు దక్కితే... వాటిని ఏ విధంగా చేజిక్కించుకోవాలనే అంశంపై తాజాగా సిండికేట్ సభ్యులు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
సిండికేట్ నేతృత్వంలో మార్పు.. కొత్త ఎమ్మెల్యే ప్రవేశం
విశాఖ మద్యం సిండికేట్ మొదటగా దరఖాస్తులు ఎక్కువ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఇందుకోసం మద్యం వ్యాపారంలో ఉన్న ప్రధానమైన 8 మంది సిండికేట్‌గా ఏర్పడ్డారు. ఈ సిండికేట్ మొన్నటివరకు ముందుండి నడిపించిన ఎమ్మెల్యే స్థానంలో.. కొత్త ఎమ్మెల్యే సారథ్యం వహించేలా ప్రణాళిక రచించారు. తద్వారా షాపులకు ఎక్కువ పోటీ రాకుండా జాగ్రత్తపడ్డారు. మరోవైపు ఇప్పటికే ప్రభుత్వ మద్యం దుకాణం నడుస్తున్న భవనాల వద్ద వ్యవహారం మొదలుపెట్టారు. ఆయా భవన యజమానులతో మాట్లాడుకుని.. అవి తమకే వచ్చేలా చూసుకున్నారు.
ఇందుకోసం ఎకై ్సజ్ శాఖలోని కొద్ది మంది అధికారులు కూడా సహకరించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ మద్యం దుకాణాలున్న భవనాన్ని ఫలానా మద్యం వ్యాపారులకే అద్దెకు ఇవ్వాలని కొద్ది మంది అధికారులు చర్చలు జరిపారు. అలా అయితేనే మీకు పాత అద్దెలను సక్రమంగా వచ్చేలా చూస్తామని.. లేని పక్షంలో ఇబ్బందులు తప్పవని కొద్ది మందిని బెదిరించినట్టు తెలుస్తోంది. కాగా.. లాటరీ పూర్తయిన తర్వాత వ్యాపారులు షాపులను 12నే తెరిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అంతేకాకుండా ప్రధానమైన ప్రాంతాలన్నింటిలో తమ షాపులే ఉండేలా జాగ్రత్తపడ్డారు. ఒకవేళ ఎవరైనా కొత్తవాళ్లకు షాపులు వస్తే.. భవనాలు దక్కకుండా, ప్రధానమైన ప్రాంతాల్లో వారు వ్యాపారం చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఒడిశా, నోయిడా నుంచి మద్యం వ్యాపారులు రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు.
విశాఖలో తక్కువ దరఖాస్తులు
ఉమ్మడి విశాఖ జిల్లాలో 331 మద్యం షాపులకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో విశాఖ జిల్లా పరిధిలోని 155 షాపులకు గానూ మంగళవారం సాయంత్రం 5 గంటల సమయానికి 878 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో షాపునకు సగటున 6 దరఖాస్తులు కూడా రాలేదు. అనకాపల్లి జిల్లాలో 136 షాపులకుగానూ 1,076 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో షాపునకు 8 దరఖాస్తులు వచ్చాయి. అల్లూరి జిల్లాలో 40 మద్యం షాపుల్లో 36 షాపులకు మాత్రమే దరఖాస్తులు రాగా... మరో 4 షాపులకు దరఖాస్తులు రాలేదు. 36 షాపులకు మొత్తం 330 దరఖాస్తులు వచ్చాయి.
సాధారణంగా విశాఖలో మద్యం వ్యాపారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. ఒక్కో షాపునకు కనీసం 40 నుంచి 50 మంది పోటీపడతారని ఊహించారు. ఇందుకు భిన్నంగా దరఖాస్తుల ప్రక్రియ ముగిసే సమయానికి సగటున 10 మందికి మించి పోటీపడే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఒడిశా, నోయిడాల నుంచి పోటీ రావడంతో సిండికేట్ సభ్యులు తర్జనభర్జన పడుతున్నారు. ఎలాగైనా వారికి షాపులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక వేళ లాటరీలో షాపులు వస్తే వాటిని ఎలా చేజిక్కించుకోవాలనే విషయంపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment