తగ్గిన వరద
నాగావళి శాంతించింది. వరద ఉధృతి తగ్గింది. కానీ జిల్లాలో వరుణుడి ప్రతాపం ఎక్కువైంది. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం జిల్లాపై పడింది. ఆగకుండా ఒక మోస్తరునుంచి... భారీ వర్షాలు కురుస్తుండటంతో... మళ్లీ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మరో రెండురోజులపాటు వానలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించే ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు.
విజయనగరం గంటస్తంభం: బంగాళాఖాతంలో ఈ నెల 15వ తేదీ నుంచి ఏర్పడిన అల్పపీడన ప్రభావం తో ఒడిశాలో రెండురోజులపాటు భారీ వర్షాలు కురిశాయి. దీనివల్ల నాగావళి ఉప్పొంగి విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాలను ఆదివారం ముంచెత్తింది. తోటపల్లి ప్రాజెక్టు నుంచి నీరు భారీగా విడుదల చేసి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవడంతో ఒక విధంగా నష్టనివారణకు తోడ్పడ్డారు. మొత్తమ్మీద ఒడిశాలో ఇప్పుడు వర్షాలు తగ్గడంతో నాగావళి నీటి ప్రవాహం తగ్గింది.
నీటమునిగిన పల్లెలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఆదివారం నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పూర్ణపాడు, కళ్లికోట, దుగ్గి, గుణానపురం, బాసంగి, గుంప, దుమ్మలపాడు తదితర గ్రామాల్లో నీరు చేరిన విషయం విదితమే. అక్కడ 22ఇళ్లు కూడా ఖాళీ చేయించారు. తోటపల్లికి ఉన్న ఎనిమిది గేట్లు ఎత్తేసి లక్ష క్యూసెక్కులకుపైగా నీటిని కిందకు విడుదల చేశారు. సోమవారం ఇన్‌ఫ్లో తగ్గడంతో ఆరుగేట్లు దించేసి కేవలం రెండు గేట్లు ద్వారా మాత్రమే నీటిని కిందకు పంపిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా నుంచి ఆంధ్రాతీరంవైపు కదులుతుండడంతో జిల్లాలో వర్షాలు జోరందుకున్నాయి. మొన్నటి వరకు కొన్ని ప్రాంతాలకే పరిమితమైనా సోమవారం జిల్లా వ్యాప్తంగా కురిశాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఆగకుండా జల్లులు పడటం విశేషం. మంగళవారం మరింత ఎక్కువగా పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. సోమవారం కురిసిన వర్షాలకు జనజీవనానికి తీవ్ర ఇబ్బంది కలిగింది.
అప్రమత్తమైన అధికారులు
అల్పపీడనానికి నైరుతి రుతుపవనాలు ప్రభావం తోడు కావడంతో జిల్లాలో మంగళవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. పార్వతీపురం డివిజన్ కంటే విజయనగరం డివిజన్‌లోనే ఎక్కువగా ఉంటాయని కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. బుధవారం ఉదయం వరకు వర్షాలు ఉంటాయని, తర్వాత బంగాళాఖాతంలో పరిస్థితిని బట్టి మార్పులు ఉంటాయని తెలిపారు. వర్షాలు ఉధృతం కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ వివేక్‌యాదవ్ జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. మంగళవారం «భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న సమాచారం నేపథ్యంలో రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్, రోడ్లు, భవనాలు, పౌరసరఫరాలు, ఇతర కీలక శాఖలన్నింటినీ అప్రమత్తం చేశారు.
ముఖ్యంగా ఎలాంటి ఆపద సంభవించినా వెంటనే సహాయక చర్యలందించేందుకు కలెక్టరేట్‌తోపాటు రెండు ఆర్డీవో కార్యాలయాలు, 34 మండలాల తహసీల్దారు కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. 24గంటలు పని చేసే విధంగా అధికారులు, సిబ్బందిని నియమించారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆదివారం నాగావళి వరద ఉధృతకారణంగా చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రప్పించిన 30మంది ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని ఇక్కడే ఉంచారు. తీరప్రాంతంలో మత్స్యకారులను అప్రమత్తం చేశారు. అక్కడ అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
కంట్రోల్ రూంలు:
కలెక్టరేట్: 08922 236947
టోల్‌ఫ్రీ నెం:
1077(బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి మాత్రమే)
విజయనగరం ఆర్డీవో కార్యాలయం:
08922 276888
పార్వతీపురం ఆర్డీవో కార్యాలయం:
08963 221006
డి.సెక్షన్ : 9440178300 ఎస్.ఎన్.మూర్తి.
డీఆర్వో: 9491012012