అక్కడ రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు
వాతావరణం అనుకూలించక కొండపైనే ఇద్దరు భక్తులు
విజయనగరం క్రైమ్: చార్‌ధామ్ యాత్రకు వెళ్లి ప్రతికూల వాతావరణం కారణంగా కేదార్‌నాథ్ ఆలయం ప్రాంతంలో కొండపై విజయనగరం జిల్లాకు చెందిన భక్తులు చిక్కుకుపోయారు. ఢిల్లీకి చెందిన సదరన్ ట్రావెల్స్ ద్వారా ఇటీవల చార్‌ధామ్ యాత్రకు ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 30 మంది వెళ్లారు. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన నలుగురు ఉన్నారు. రెండు రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తుండడం, వాతావరణం అనుకూలించకపోవడంతో భక్తులు కొండలపైనే నిలిచిపోయారు.
జిల్లాకు చెందిన నలుగురిలో గొట్టాపు త్రినాథరావు దంపతులు గురువారం హెలికాప్టర్‌లో కొండ కిందకు వచ్చేశారు. డిప్యూటీ తహసీల్దార్ కొట్నాన శ్రీనివాసరావు, ఆయన భార్య హేమలత ఇంకా కేదార్‌నాథ్ కొండపైనే ఉన్నారు. కేదార్‌నాథ్ ఆలయం ప్రాంతంలో వాతావరణం అనుకూలంగా లేదని హెలికాప్టర్ ప్రయాణం నిలిపివేశారని, తాము కొండపైనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నట్లు స్థానిక విలేకరులకు వారు శుక్రవారం ఫోన్‌లో తెలిపారు.
భోజన, వసతి లభించక ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయం కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు దృష్టికి వెళ్లడంతో ఆయన అక్కడి అధికారులతో మాట్లాడారు. శుక్రవారం కొంత మేరకు వాతావరణం సహకరించడంతో రెండు హెలికాప్టర్‌లు మాత్రమే కేదార్‌నాథ్ ఆలయం వద్దకు వెళ్లగలిగాయని, అయితే వాటిలో ఏపీ వారికి అవకాశం ఇవ్వకపోవడంతో కొండపైనే ఉండిపోయారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment