river link system
-
‘నీటి’ మీద లెక్కలు
సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి అనుసంధానం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లో నీటి లభ్యతపై జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) లెక్కను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కొట్టిపారేస్తోంది. తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, గోదావరి–కావేరి అనుసంధానంలో ప్రతిపాదించిన ఇచ్చంపల్లి ప్రాజెక్టు మధ్య ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు వినియోగించుకున్న నికర జలాల్లో 177 టీఎంసీలు మిగులు ఉందని ఎన్‌డబ్ల్యూడీఏ లెక్క కట్టింది. సీడబ్ల్యూసీ దీనికి విరుద్ధంగా చెబుతోంది. గోదావరిలో ఎక్కడా నికర జలాల్లో మిగులు లేదని సీడబ్ల్యూసీ తేల్చిచెప్పింది. దాంతో గోదావరిలో నీటి లభ్యతపై సంయుక్తంగా శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని సీడబ్ల్యూసీ, ఎన్డబ్ల్యూడీఏలను కేంద్ర జల్ శక్తి శాఖ ఆదేశించింది. మహానది–గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా 760 టీఎంసీల జలాలను కృష్ణా, పెన్నా, కావేరి బేసిన్లకు తరలించాలని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఆ లెక్కకు ప్రాతిపదిక ఏమిటో? శ్రీరాం సాగర్ ప్రాజెక్టు – ఇచ్చంపల్లి మధ్య తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకోగా.. ఇచ్చంపల్లి వద్ద నికర జలాల్లో 177 టీఎంసీల మిగులు జలాలు ఉంటాయని ఎన్‌డబ్ల్యూడీఏ లెక్కకట్టింది. ఇంద్రావతి సబ్ బేసిన్లో ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 105 టీఎంసీలు, జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు నీటి ఆవిరి కింద కేటాయించిన 52 టీఎంసీలకు మిగులు జలాలు 177 టీఎంసీలు జత చేసి 334 టీఎంసీలను గోదావరి–కావేరి అనుసంధానంలో తరలించడానికి ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. దీన్ని సీడబ్ల్యూసీ అంగీకరించడంలేదు. శ్రీరాం సాగర్ – ఇచ్చంపల్లి మధ్య 177 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్లు ఏ ప్రాతిపదికన లెక్కగట్టారని ఎన్‌డబ్ల్యూడీఏను ప్రశ్నించింది. గోదావరి బేసిన్లో ఎక్కడా నికర జలాల్లో మిగులు లేదని పేర్కొంది. కోటా నీటిని ఛత్తీస్‌గఢ్ వాడుకుంటే గోదావరి–కావేరి అనుసంధానం ప్రశ్నార్థకమవుతుందంది. శ్రీరాం సాగర్– ఇచ్చంపల్లి మధ్య వరద జలాల్లో మిగులు అనుమానమేనని సీడబ్ల్యూసీ పేర్కొంది. 50 శాతం లభ్యత.., గరిష్టంగా వరద వచ్చే రోజుల్లో ఇచ్చంపల్లి వద్ద 247 టీఎంసీల లభ్యత ఉండే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. -
గోదావరి–కావేరి అనుసంధానానికి రూ. 39,275 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి (జీ–సీ) నదుల అనుసంధానం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.39,274.92 కోట్ల వ్యయం కానుందని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) అంచనా వేసింది. ఈ మేరకు ప్రాజెక్టు సవివర నివేదిక (డీపీఆర్)ను రూపొందించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరితో కృష్ణాను, కృష్ణాతో పెన్నాను, పెన్నాతో కావేరి నదులను అనుసంధానిస్తామ ని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ప్రాజెక్టు మొత్తం పొడవు 1,211 కి.మీగా ఉండనుందని పేర్కొంది. నదుల అనుసంధానంపై కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ మార్చి 6న హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశమై గోదావరి–కావేరి అనుసంధానంపై చర్చించనుంది. ఈ సమావేశానికి సంబంధించిన ఎజెండా నోట్లో ఈ విషయాలను ఎన్‌డబ్ల్యూడీఏ వెల్లడించింది. భాగస్వామ్య రాష్ట్రాల అభిప్రాయాల మేరకు డీపీఆర్‌లకు తుదిరూపు ఇచ్చామని, ఇక ఈ ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియను ప్రారంభిస్తామని పేర్కొంది. ఏ బేసిన్‌కు ఎంత వాటా?: గోదావరి బేసిన్లో మిగులు జలాల లభ్యత లేదని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇప్పటికే తేల్చిచెప్పింది. గోదావరిలో ఛత్తీస్‌గఢ్ వాటాగా ఉన్న 283 టీఎంసీల నుంచి ప్రస్తుతం ఆ రాష్ట్రం వాడుకోని 141 టీఎంసీలనే తరలిస్తామని ఎన్‌డబ్ల్యూడీఏ పేర్కొంటోంది. 141 టీఎంసీల్లో 45.1 టీఎంసీలను కృష్ణా బేసిన్లో, 35.3 టీఎంసీలను పెన్నా బేసిన్లో, 38.7 టీఎంసీలను కావేరి బేసిన్లో, 9.8 టీఎంసీలను మలప్రభ సబ్‌బేసిన్‌లో వాడుకోనుండగా 10.1 టీఎంసీలను చెన్నై నగరానికి, 2.2 టీఎంసీలను పుదుచ్చేరికి తరలిస్తామని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. రాష్ట్రాలవారీగా చూస్తే తెలంగాణకు 42.6 టీఎంసీలు, ఏపీకి 41.8 టీఎంసీలు, తమిళనాడుకి 38.6 టీఎంసీలు, కర్ణాటకకు 9.8 టీఎంసీ లు, పుదుచ్చేరికి 2.2 టీఎంసీలను కేటాయించనున్నారు. రాష్ట్రంలో 2.38 లక్షల హెక్టార్ల ఆయకట్టు గోదావరి–కావేరి అనుసంధానంతో తెలంగాణ, ఏపీ, తమిళనాడులో మొత్తం 3,98,490 హెక్టార్ల కొత్త ఆయకట్టుకు సాగునీరు లభించడంతోపాటు 1,75,407 హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. మొత్తం 5,73,897 హెక్టార్లకు ప్రయోజనం కలగనుంది. తెలంగాణలో 9.46 టీఎంసీలతో 80 వేల హెక్టార్ల కొత్త ఆయకట్టును సృష్టించడంతోపాటు 24.96 టీఎంసీలతో 1,58,236 హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ జరపనున్నట్టు ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదనలు పేర్కొంటున్నాయి. రాష్ట్రానికి మొత్తం 34.43 టీఎంసీలతో 2,38,236 హెక్టార్లకు ప్రయోజనం కలగనుంది. మరో 3 టీఎంసీలను తాగునీటి అవసరాలకు, 5.19 టీఎంసీలను పారిశ్రామిక అవసరాల కోసం రాష్ట్రానికి కేటాయించనున్నారు. ఏపీలో 2.19 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఏపీలో 31.39 టీఎంసీలతో 2,19,271 హెక్టార్ల కొత్త ఆయకట్టుతోపాటు 0.6 టీఎంసీలతో 2727 హెక్టార్ల స్థిరీకరణను ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. మొత్తం 31.99 టీఎంసీలతో 2,21,998 హెక్టార్లకు ఏపీలో లబ్ధి కలగనుంది. తాగునీటి అవసరాలకు 4.2, పారిశ్రామిక అవసరాలకు 5.65 టీఎంసీలను ఆ రాష్ట్రానికి కేటాయించింది. తమిళనాడులో 13.13 టీఎంసీలతో 99,219 హెక్టార్ల కొత్త ఆయకట్టు, 3.67 టీఎంసీలతో 14,444 హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణను ప్రతిపాదించింది. 9.35 టీఎంసీలను ఆ రాష్ట్ర తాగునీటి, 12.46 టీఎంసీలను పారిశ్రామిక అవసరాలకు కేటాయించింది. రూ.2817.62 కోట్లతో బెడ్తి–వార్ధా అనుసంధానం కర్ణాటకలోని బెడ్తి–వార్ధా అనుసంధానం ప్రాజెక్టుకు రూ.2,817.62 కోట్ల అంచనాలతో డీపీఆర్‌ను సిద్ధం చేసినట్లు ఎన్‌డబ్ల్యూడీఏ పేర్కొంది. గోదావరి–కావేరి, బెడ్తి–వార్ధా అనుసంధానికి మొత్తం రూ.42,092.54 కోట్లు కానుందని ఎజెండా నోట్లో పేర్కొంది. 52 కి.మీల బెడ్తి–వార్ధా అనుసంధానంతో 18.5 టీఎంసీలను తరలించి 1.05 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నట్టు పేర్కొంది. -
AP: నదుల అనుసంధానానికి ‘నిరా’
సాక్షి, అమరావతి: దేశంలో నదుల అనుసంధానం పనులు చేపట్టడానికి నేషనల్ ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ అథారిటీ(ఎన్‌ఐఆర్‌ఏ – నిరా) పేరుతో ప్రత్యేకంగా సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖకు జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదించింది. కడలిపాలవుతోన్న నదీ జలాలను మళ్లించి.. దేశాన్ని సుభిక్షం చేసేందుకు నదుల అనుసంధానం చేపట్టాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో నదుల అనుసంధానంపై అధ్యయనం చేసిన ఎన్‌డబ్ల్యూడీఏ హిమాలయ నదులను అనుసంధానం చేసేందుకు 14, ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడానికి 16 ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు నదుల అనుసంధానం చేపట్టాలని 2012 ఫిబ్రవరి 27న సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నదుల అనుసంధానం కోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేస్తూ 2014 సెప్టెంబరు 23న కేంద్ర జల్ శక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 90ః10 నిష్పత్తిలో నిధులు నదుల అనుసంధానంపై అధ్యయనం, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు తయారు చేయడానికి, రాష్ట్రాలతో సంప్రదింపులు జరపడానికి ఎక్కువ సమయం పడుతుందని ఎన్‌డబ్ల్యూడీఏ కేంద్రానికి తెలిపింది. ఈ సమస్యను అధిగమించడానికి ‘నిరా’ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది. జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే నదుల అనుసంధానం పనులు చేపట్టడానికి 90 శాతం నిధులను కేంద్రం సమకూర్చాలని పేర్కొంది. మిగతా 10 శాతం నిధులను ప్రయోజనం పొందే రాష్ట్రాలు ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో భరించాలని సూచించింది. కేంద్రం, రాష్ట్రాలు నిధులను ‘నిరా’కు అందజేస్తే.. పనులు చేపడుతుందని పేర్కొంది. కెన్–బెట్వా నదుల అనుసంధానం నుంచే ‘నిరా’కు బాధ్యతలు అప్పగించాలని సూచించింది. ఎన్‌డబ్ల్యూడీఏ చేసిన ఈ ప్రతిపాదనలపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేస్తే నదుల అనుసంధానం పనులకు మార్గం సుగమమవుతుంది. ఏకాభిప్రాయానికి కసరత్తు ఏకాభిప్రాయంతో నదుల అనుసంధానాన్ని చేపట్టడానికి ప్రత్యేక కమిటీ ప్రయత్నాలు చేస్తోంది. ఎప్పటికప్పుడు రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతూ ఏకాభిప్రాయం సాధించడానికి చర్యలు చేపట్టింది. కెన్–బెట్వా నదుల అనుసంధానానికి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు అంగీకరించాయి. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమక్షంలో కెన్–బెట్వా నదుల అనుసంధానం ఒప్పందంపై ఆ రాష్ట్రాల సీఎంలు యోగి ఆదిత్యనాథ్, శివరాజ్‌సింగ్ చౌహన్లు గతేడాది మార్చి 22న సంతకం చేశారు. 2017–18 ధరల ప్రకారం ఈ ప్రాజెక్టుకు రూ.35,111.24 కోట్ల వ్యయం అవుతుంది. ఈ నేపథ్యంలో గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ నదుల అనుసంధానం కోసం ఈ నాలుగు నదుల పరీవాహక ప్రాంతంలోని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ పనులకు 2018–19 ధరల ప్రకారం రూ.60,361 కోట్లు అవసరం అవుతుందని అంచనా. ఇదే రీతిలో మిగిలిన నదుల అనుసంధానానికి ప్రత్యేక కమిటీ రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోంది. -
నదుల అనుసంధానం.. ఓ భగీరథయత్నం
సాక్షి, అమరావతి: నదుల అనుసంధానం అంటే.. ఎవరో కట్టిన కాలువలో నాలుగు చెంబుల నీళ్లు ఎత్తిపోయడమా.. ఆ కాలువలో వర్షపు నీటిని చూపించి రెండు నదులను అనుసంధానించేశామంటూ కోట్లు ఖర్చుపెట్టి ఈవెంట్లు చేయడమా... వేర్వేరు మార్గాలలో పయనించే రెండు నదులను అనుసంధానించడం ఓ భగీరథయత్నం.. ఇందుకు నిధులు మాత్రమే కాదు నిబద్ధత, దృఢ దీక్ష కూడా అవసరమే. పాలకులకు అవి ఉన్నప్పుడే అనుసంధాన యత్నాలు ఫలిస్తాయి. రెండు కాదు.. మూడు కాదు రాష్ట్రంలో మొత్తంగా ఆరు చోట్ల నదుల అనుసంధానం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రం పరిధిలోని నదుల అనుసంధానం పనులను వేగవంతం చేస్తూనే గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ వంటి అంతర్రాష్ట్ర నదుల అనుసంధానంపైనా కేంద్రంతో కలిసి కసరత్తు చేస్తోంది. నదుల అనుసంధానం అంటే ఇదీ.. నదుల అనుసంధానానికి కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) 2016లో మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం ఒక నదిపై బ్యారేజీ నిర్మించి.. అక్కడి నుంచి వరద జలాలను మరో నదిపై నిర్మించే బ్యారేజీలోకి తరలించినప్పుడే ఆ రెండు నదులు అనుసంధానం చేసినట్లు లెక్క. గోదావరి నదిపై ఎలాంటి బ్యారేజీ నిర్మించకుండా..దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేసిన పోలవరం కుడి కాలువ మీదుగా పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా ప్రకాశం బ్యారేజీలోకి 2016లో గోదావరి జలాలను తరలించడం ద్వారా గోదావరి–కృష్ణా నదులను అనుసంధానం చేసినట్లు నాటి సీఎం చంద్రబాబు ప్రకటించడాన్ని అప్పట్లో సీడబ్ల్యూసీ ఖండించడం గమనార్హం. రూ.145.34 కోట్లతో వంశధార–నాగావళి అనుసంధానం నాగావళి నదిలో వరద ఆలస్యంగా రావడం, నారాయణపురం ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల ఖరీఫ్‌లో ఆయకట్టుకు సకాలంలో నీళ్లందించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 ఫేజ్–2లో హిరమండలం రిజర్వాయర్‌కు తరలించిన వంశధార నీటిని, ఆ రిజర్వాయర్ మట్టికట్ట 5.6 కి.మీ వద్ద నుంచి 33.583 కి.మీల పొడవున హెచ్చెల్సీ(హైలెవల్ కెనాల్)ను తవ్వి రోజుకు 600 క్యూసెక్కులను నారాయణపురం ఆనకట్టకు ఎగువన నాగావళి నదిలోకి పోయడం ద్వారా ఆ రెండు నదులను అనుసంధానం చేసి, ఆయకట్టును సస్యశ్యామలం చేసే పనులను రూ.145.34 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే 31.30 కి.మీ పొడవున హెచ్చెల్సీ తవ్వకం పనులను పూర్తి చేసింది. కేవలం 2.283 కి.మీల కాలువ తవ్వకం పనులు మాత్రమే మిగిలాయి. వాటిని ఖరీఫ్ నాటికి పూర్తి చేసి.. వంశధార–నాగావళి అనుసంధానాన్ని సాకారం చేయనున్నది. దీని వల్ల నారాయణపురం ఆనకట్ట కింద 39,179 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు హెచ్చెల్సీ కింద కొత్తగా ఐదు వేల ఎకరాలకు నీళ్లందించడం ద్వారా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోలవరం నుంచి గోదావరి–కృష్ణా, గోదావరి–ఏలేరు అనుసంధానం ► పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా గోదావరి జలాలను గ్రావిటీపై ప్రకాశం బ్యారేజీలోకి తరలించడం ద్వారా గోదావరి–కృష్ణా అనుసంధానం చేసే పనులకు 2004లో సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి.. 2022 నాటికి కుడి కాలువ ద్వారా గ్రావిటీపై గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఆ క్రమంలో పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. దీని వల్ల కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ► పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో 57.85 కి.మీల వద్ద నుంచి గోదావరి జలాలను ఏలేరు రిజర్వాయర్‌లోకి ఎత్తిపోయడం ద్వారా గోదావరి–ఏలేరు నదులను అనుసంధానం చేసే పనులనూ 2022 నాటికి పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీని వల్ల ఏలేరు రిజర్వాయర్ కింద 53,017 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ► పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ నుంచి 80 టీఎంసీలను తరలించడం ద్వారా వంశధార, నాగావళి పరీవాహక ప్రాంతాల్లో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లందించే పనులను దశలవారీగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టింది. ► పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా గోదావరి జలాలను గ్రావిటీపై ప్రకాశం బ్యారేజీలోకి తరలించడం ద్వారా గోదావరి–కృష్ణా అనుసంధానం చేసే పనులకు 2004లో సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి.. 2022 నాటికి కుడి కాలువ ద్వారా గ్రావిటీపై గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఆ క్రమంలో పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. దీని వల్ల కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ► పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో 57.85 కి.మీల వద్ద నుంచి గోదావరి జలాలను ఏలేరు రిజర్వాయర్‌లోకి ఎత్తిపోయడం ద్వారా గోదావరి–ఏలేరు నదులను అనుసంధానం చేసే పనులనూ 2022 నాటికి పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీని వల్ల ఏలేరు రిజర్వాయర్ కింద 53,017 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ► పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ నుంచి 80 టీఎంసీలను తరలించడం ద్వారా వంశధార, నాగావళి పరీవాహక ప్రాంతాల్లో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లందించే పనులను దశలవారీగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టింది. కృష్ణా–పెన్నా–స్వర్ణముఖి అనుసంధానం.. తెలుగుంగ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా(శ్రీశైలం రిజర్వాయర్)–పెన్నా (సోమశిల రిజర్వాయర్)ను ఇప్పటికే అనుసంధానం చేశారు. సోమశిల వరద కాలువ 12.52 కి.మీ నుంచి రోజుకు 2,500 క్యూసెక్కులను తరలించి.. చిత్తూరు జిల్లాలోని స్వర్ణముఖి నదిలో పోయడం ద్వారా కృష్ణా–పెన్నా–స్వర్ణముఖి నదులను అనుసంధానం చేసే పనులను ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టింది. ఈ అనుసంధానం ద్వారా 1.23 లక్షల ఎకరాలకు నీళ్లందించనున్నారు. స్వర్ణముఖి నది పెన్నా ఉప నది. కృష్ణా–పెన్నా–పాపాఘ్ని అనుసంధానం.. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం కింద 2009 నాటికే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కృష్ణా–పెన్నా నదులను అనుసంధానం చేశారు. పెన్నా ఉప నది అయిన పాపాఘ్ని పరీవాహక ప్రాంతం పూర్తిగా వర్షాభావ ప్రాంతంలో ఉంది. దీని వల్ల పాపాఘ్నిలో నీటి లభ్యత తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో గాలేరు–నగరి ద్వారా శ్రీశైలం నుంచి తరలించిన కృష్ణా నదీ వరద జలాలు.. గాలేరు–నగరి ప్రధాన కాలువ 56 కి.మీ వద్ద నుంచి జలాలను ఎత్తిపోసి.. పాపాఘ్ని నదిపై 4.56 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన వెలిగల్లు రిజర్వాయర్‌లోకి తరలించే పనులను చేపట్టారు. దీని ద్వారా 26 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. కృష్ణా–వేదవతి అనుసంధానం.. కృష్ణా ఉప నది అయిన వేదవతిపై అనంతపురం జిల్లాలో భైరవానితిప్ప ప్రాజెక్టును 1956లో నిర్మించారు. ఈ ప్రాజెక్టు కింద 12 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. టీడీపీ సర్కార్ హయాంలో కర్ణాటకలో వేదివతిపై చెక్ డ్యామ్‌లు నిర్మించడంతో బీటీపీలోకి చుక్క నీరు చేరడం లేదు. శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీ–నీవా ద్వారా తరలించే నీటిని జీడిపల్లి రిజర్వాయర్ నుంచి బీటీపీలోకి ఎత్తిపోయడం ద్వారా కృష్ణా–వేదవతి నదుల అనుసంధానం పనులను రూ.968 కోట్లతో చేపట్టింది. దీని ద్వారా బీటీపీ కింద 12 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు వర్షాభావ ప్రాంతంలోని కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో చెరువులను నింపడం ద్వారా మరో 10,323 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ అనుసంధానంపై కసరత్తు... గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ అనుసంధానంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. జానంపల్లి నుంచి గోదావరి–కృష్ణా(నాగార్జునసాగర్)–పెన్నా(సోమశిల)–కావేరీ(గ్రాండ్ ఆనకట్ట) అనుసంధానం చేసేలా ఎన్‌డబ్ల్యూడీఏ(జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) రూపొందించిన ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాలను చెబుతూ.. తక్కువ వ్యయంతో గరిష్టంగా వరద జలాలను ఒడిసి పట్టి.. రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ప్రత్యామ్నాయ ప్రతిపాదనలనూ సిద్ధం చేయాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశాక.. వాటిని ఎన్‌డబ్ల్యూడీఏకు పంపి.. పనులు చేపట్టాలని నిర్ణయించారు. కేసీ కెనాల్‌తోనే నదుల అనుసంధానానికి నాంది.. తుంగభద్ర నదిపై కర్నూలు జిల్లాలో సుంకేశుల వద్ద ఆనకట్ట నిర్మించి, అక్కడి నుంచి వైఎస్సార్ జిల్లాలో పెన్నా నదిని అనుసంధానిస్తూ కేసీ కెనాల్ తవ్వకం పనులను 1863లో ప్రారంభించిన డచ్ సంస్థ 1870 నాటికి పూర్తి చేసింది. ఈ కాలువను నౌకా మార్గంగా వినియోగించుకుని వ్యాపారం చేసేది. వాణిజ్య కార్యకలాపాల కోసం ఈ కాలువను 1882లో ఈస్ట్ ఇండియా కంపెనీ డచ్ సంస్థ నుంచి రూ.3.02 కోట్లకు కొనుగోలు చేసింది. సర్ ఆర్ధర్ కాటన్ ప్రతిపాదన మేరకు కేసీ కెనాల్‌ను 1933లో సాగునీటి వనరుగా మార్చింది. ఈ కాలువ కింద ప్రస్తుతం 2.65 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. దేశంలో కేసీ కెనాల్ ద్వారానే నదుల అనుసంధానం చేయడం ప్రథమం కావడం గమనార్హం. కేసీ కెనాల్ స్ఫూర్తితోనే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టినట్లు ఎన్‌డబ్ల్యూడీఏ స్పష్టం చేసింది. తుంగభద్ర–పెన్నా–చిత్రావతి అనుసంధానం.. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా తుంగభద్రపై తుంగభద్ర డ్యామ్‌ను నిర్మించారు. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ ద్వారా తుంగభద్ర జలాలను పెన్నాపై నిర్మించిన మధ్య పెన్నార్ ప్రాజెక్టులోకి.. అక్కడి నుంచి చిత్రావతిపై నిర్మించిన చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి తరలించేలా ప్రణాళిక రూపొందించి.. పనులు ప్రారంభించారు. ఈ పనులు 2009 నాటికి పూర్తయ్యాయి. దీని ద్వారా తద్వారా తుంగభద్ర–పెన్నా–చిత్రావతి అనుసంధానం పనులను 2009 నాటికి దివంగత సీఎం వైఎస్ పూర్తి చేశారు. దీని ద్వారా 1,90,035 ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. నదుల అనుసంధానానికి రాష్ట్రమే స్ఫూర్తి.. చెన్నైకి తాగునీటిని సరఫరా చేయడం కోసం కృష్ణా నది నుంచి తన కోటాలో నుంచి ఐదు టీఎంసీల చొప్పున కేటాయించేందుకు ఫిబ్రవరి 15,1976న మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలు అంగీకరించాయి. ఈ నీటిని శ్రీశైలం జలాశయం నుంచి తరలించేలా అక్టోబర్ 27, 1977న ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య ఒప్పందం కుదిరింది. చెన్నైకి తాగునీటిని అందించడంతోపాటు 29 టీఎంసీల కృష్ణా వరద జలాలు, 30 టీఎంసీల పెన్నా వరద జలాలను ఒడిసి పట్టి.. కర్నూల్, వైఎస్సార్ కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 5.75 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా తెలుగుగంగ ప్రాజెక్టును చేపట్టేందుకు 1978లో ప్రభుత్వం సర్వే పనులను చేపట్టింది. ఈ పనులను 2009 నాటికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. తెలుగుగంగలో భాగంగా కృష్ణా(శ్రీశైలం)–పెన్నా(సోమశిల)–పూండి రిజర్వాయర్(తమిళనాడు)ను అనుసంధానం చేశారు. దేశంలో అంతర్రాష్ట్ర నదుల అనుసంధానానికి ఈ పథకమే స్ఫూర్తి అని ఎన్‌డబ్ల్యూడీఏ పేర్కొంది. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యం సముద్రంలో కలుస్తున్న వరద జలాలను ఒడిసి పట్టి.. బీడు భూములకు మళ్లించి.. రాష్ట్రాన్ని సుభిక్షం చేయడమే లక్ష్యంగా నదులను అనుసంధానం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆ మేరకు రాష్ట్రం పరిధిలోని ఆరు అనుసంధానాల పనులను చేపట్టాం. వంశధార–నాగావళి, గోదావరి–కృష్ణా, గోదావరి–ఏలేరు, కృష్ణా–పెన్నా–స్వర్ణముఖి, కృష్ణా–పెన్నా–పాపాఘ్ని, కృష్ణా–వేదవతి అనుసంధానం పనులను వేగవంతం చేశాం. సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రానికి అత్యధిక ప్రయోజనం చేకూరేలా గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ అనుసంధానం చేయడంపై కసరత్తు చేస్తున్నాం. నదులను అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్–ఇన్–చీఫ్, జలవనరుల శాఖ -
పర్యావరణ అనుమతులు అవసరమా? కాదా?
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో నదుల అనుసంధానంపై నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ శాఖకు జాతీయ హరిత ట్రెబ్యునల్(ఎన్జీటీ) అదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా పట్టిసీమ, పురుషోత్త పట్నం, చింతలపూడి, గోదావరి-పెన్నా అనుసంధాన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు అవసరమా? కాదా? అనే విషయంపై కూడా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఎన్జీటీ కోరింది. వారం రోజుల్లో నిర్ణయం తీసుకొని నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ, ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను పిబ్రవరి 22కు వాయిదా వేసింది. ఏపీలో నదుల అనుసంధానం పేరిట అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారంటూ ఎన్జీటీలో మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్, త్రినాథ్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. గోదావరి డెల్టాకు నష్టం జరుగుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నదులు అనుసంధానం చేస్తున్నారని పిటీషనర్లు తమ వాదన వినిపించారు. పిటీషనర్ల వాదనలు విన్న ఎన్జీటీ కేంద్ర పర్యావరణ శాఖ, ఏపీ కాలుష్య నియంత్రణ మండలిలో కూడా వీటిపై పిర్యాదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. -
నదుల అనుసంధానంతోనే కరువుకు చెక్
విడపనకల్లు: నదుల అనుసంధానం ద్వారా కరువును శాశ్వతంగా పాలద్రోలవచ్చని రిటైర్డ్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ టీబీ రవి అన్నారు. శనివారం ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నదుల అనుసంధానంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నదులు అనుసంధానం చేయడం ద్వారా గోదావరి నది ద్వారా సముద్రంలోకి వృథాగా పోతున్న 3 వేల టీఎంసీల జలాలను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. నదుల అనుసంధానం ద్వారా భూగర్బ జలాలు పెరగడమే కాకుండా పరిశ్రమలు కూడా ఎక్కువ వస్తాయని తెలిపారు. తద్వారా ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు. అనంతరం విద్యార్థులు నదుల అనుసంధానంపై అడిగిన పలు సందేహాలకు అడిగి నివృతి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రామచంద్రమూర్తి, వైస్ ప్రిన్పిపాల్ వేణుగోపాల్‌రెడ్డి, అధ్యాపకులు ఓబుళేసు, మిద్దె మల్లికార్జున, కిరణ్, సుధాకర్ పాల్గొన్నారు.