నీళ్లపై గరంగరం! | Water Disputes Of Andhra Pradesh And Telangana | Sakshi
Sakshi News home page

నీళ్లపై గరంగరం!

Published Fri, Jul 2 2021 1:30 AM | Last Updated on Fri, Jul 2 2021 1:38 AM

Water Disputes Of Andhra Pradesh And Telangana - Sakshi

విద్యుదుత్పత్తి నిలిపివేయాలంటూ గురువారం పులిచింతల ప్రాజెక్టు వద్ద టీఎస్‌ జెన్‌కో ఎస్‌ఈతో మాట్లాడుతున్న ప్రాజెక్టు ఎస్‌ఈ

♦ ప్రాజెక్టుల్లో సరిపడా జలాలు లేకున్నా తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోందని, నీళ్లు వృథాగా పోతున్నాయని, ఆపాలని ఏపీ సర్కారు అంటోంది. తమ హక్కు మేరకే ప్రాజెక్టుల్లో జల విద్యుత్‌ ఉత్పత్తి చేసుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దీనిపై ఇరు రాష్ట్రాల రాజకీయ నాయకుల మధ్య విమర్శల పర్వం నడుస్తోంది. 

♦ శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద రెండు వైపులా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పోలీసులను మోహరించాయి. తెలంగాణ సర్కారు జూరాల వద్ద నిఘా పెట్టింది.

♦ ఏపీ ప్రభుత్వం కర్నూలు జిల్లాలోని ఆర్డీఎస్, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల వద్ద రెండు ప్లటూన్ల చొప్పన బలగాలను మోహరించింది. చెక్‌పోస్టులు పెట్టి తనిఖీలు 
నిర్వహిస్తోంది. 


నాగార్జునసాగర్‌/ధరూరు/అమరచింత/హుజూర్‌నగర్‌ (చింతలపాలెం)/దోమలపెంట (అచ్చంపేట):   కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల్లో తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి.. దానిని ఆపాలంటూ ఆంధ్రప్రదేశ్‌ అధికారుల విజ్ఞప్తులు, ప్రయత్నాలతో పరిస్థితి వేడెక్కుతోంది. ఇరు రాష్ట్రాల రాజకీయ నాయకుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇప్పటికే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రాజెక్టుల వద్ద తమవైపు సరిహద్దుల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించాయి. విద్యుత్‌ ఉత్పత్తి ఆపాలంటూ ఏపీ అధికారులు గురువారం ఆయా ప్రాజెక్టుల వద్ద తెలంగాణ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చేందుకు ప్రయత్నించారు. వారిని ఇక్కడి పోలీసులు అడ్డుకుని, వెనక్కి పంపేశారు. ప్రాజెక్టుల సమీపంలో ఏపీ నుంచి వస్తున్న వాహనాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. దీనితో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. మరోవైపు ఏపీ కూడా తమవైపు బందోబస్తు కట్టుదిట్టం చేసింది. నాగార్జునసాగర్‌ డ్యామ్‌ వద్ద 240 మందిని, పులిచింతల వద్ద 300 మందిని మోహరించింది.

నాగార్జునసాగర్‌ వద్ద హడావుడి 


నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తిని నిలిపివేయాలని కోరుతూ.. గురువారం తెలంగాణ జెన్‌కో అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు వస్తున్న ఏపీ అధికారులను ఇక్కడి పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించారు. ఏపీ అధికారుల నుంచి వినతిపత్రం తీసుకునేందుకు తెలంగాణ అధికారులు నిరాకరించారు. ఇదే సమయంలో ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న వాహనాలను పోలీసులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు ఇరువైపులా రెండు రాష్ట్రాలు పోలీసులను మోహరించాయి. 

పులిచింతల వద్ద 250 మందితో గస్తీ
పులిచింతల ప్రాజెక్టులోని తెలంగాణ పవర్‌ హౌజ్‌లో విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేయాలంటూ ప్రాజెక్ట్‌ ఎస్‌ఈ రమేశ్‌బాబు గురువారం టీఎస్‌ జెన్‌కో ఎస్‌ఈ దేశ్యానాయక్‌కు వినతిపత్రం అందజేశారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో ఉన్న పులిచింతల ప్రాజెక్టు డ్యాం వద్ద వారు భేటీ అయ్యారు. ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉన్నప్పుడు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ నీటిని వదిలితే.. సముద్రంలో కలవడం తప్ప ప్రయోజనం లేదని, విద్యుత్‌ ఉత్పత్తి ఆపాలని ఏపీ అధికారులు కోరారు. అయితే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని జెన్‌కో ఎస్‌ఈ చెప్పారు. కాగా పులిచింతల డ్యామ్, పవర్‌హౌజ్‌ ప్రాంతాల్లో దాదాపు 250 మంది సాయుధ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. సాగర్‌లో విద్యుత్‌ ఉత్పత్తితో పులిచింతలకు 36వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోగా వస్తోంది. పులిచింతల టీఎస్‌ జెన్‌కో కేంద్రంలో 30 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ, 4 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నట్టు అధికారులు తెలిపారు.  

జూరాల దగ్గర భద్రత పెంపు 


కృష్ణా ప్రాజెక్టులో విద్యుత్‌ ఉత్పత్తి అంశం వేడెక్కడంతో.. జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ఎగువ, దిగువ జల విద్యుత్‌ కేంద్రాల వద్ద ప్రభుత్వం భద్రతను మరింతగా పెంచింది. మూడు రోజులుగా ఇక్కడ పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. ప్రాజెక్టుపైకి వెళ్లే జీరో పాయింట్‌ దగ్గర, ప్రాజెక్టు కంట్రోల్‌ రూం సమీపంలో, జెన్‌కో జల విద్యుత్‌ కేంద్రం వద్ద పహారా ఏర్పాటు చేశారు. ఇక ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు గురువారం ఉదయమే జూరాల ప్రాజెక్టుపై రాకపోకలను నిలిపివేశారు. అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా గేట్లు మూసి, వాహనాలను నిలిపేస్తే ఎలాగని స్థానికులు, వాహనదారులు నిలదీయడంతో రాకపోకలకు అనుమతించారు. శుక్రవారం ఉదయం నుంచి రాకపోకలను పూర్తిగా ఆపేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. 
 

నిఘా నీడలో శ్రీశైలం ఎడమ ప్లాంట్‌


తెలంగాణ జెన్‌కో పరిధిలోని శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రం, ఆ పరిసర ప్రాంతాలన్నీ పోలీస్‌ వలయంలో ఉన్నాయి. వంద మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి తెలంగాణలోకి ప్రవేశించే మార్గాల్లో నిఘా పెట్టారు. ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రంలోని ఐదు యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుత్‌ కేంద్రంలోకి ఇంజనీర్లు, ఉద్యోగులకు తప్ప ఇతరులెవరినీ అనుమతించడం లేదు. గురువారం అచ్చంపేట డీఎస్పీ నర్సింహులు భూగర్భకేంద్రాన్ని సందర్శించి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement