సగం మందికి సంతకం రాదు | Telangana Have 48.39 Percent Of Illiteracy Over The Age Of 35 Years People | Sakshi
Sakshi News home page

సగం మందికి సంతకం రాదు

Published Tue, Mar 10 2020 1:58 AM | Last Updated on Tue, Mar 10 2020 1:58 AM

Telangana Have 48.39 Percent Of Illiteracy Over The Age Of 35 Years People - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 35 ఏళ్లు దాటిన వారిలో 48.39 శాతం మంది నిరక్షరాస్యులే ఉన్నారు. అంటే దాదాపు సగం మంది నిరక్షరాస్యులేనన్న మాట. ఇక 50 ఏళ్లు పైబడిన వారిలో 35.85 శాతం మందే అక్షరాస్యులు ఉన్నారు. అంతేకాదు.. జాతీయ సగటు అక్షరాస్యత శాతం 72.98 ఉంటే రాష్ట్రంలో అక్షరాస్యత శాతం 66.54 ఉంది. జాతీయ సగటు అక్షరాస్యతతో పోలిస్తే 6.44 శాతం తక్కువగా ఉంది. ఈ విషయాన్ని ‘సోషియో ఎకనామిక్‌ ఔట్‌లుక్‌’స్పష్టం చేస్తోంది. జాతీయ స్థాయిలో రాష్ట్రం దిగువ నుంచి మూడో స్థానంలో ఉండటాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం... యువతకు విద్యను అందించడమే కాదు వయోజనులను అక్షరాస్యులను చేసే కార్యక్రమాన్ని సైతం భుజానికెత్తుకుంది. రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యతగల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు స్వయంగా సీఎం కేసీఆర్‌ నడుం బిగించారు. ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌ నినాదాన్ని ఇచ్చి అక్షరయజ్ఞం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో ఎమ్మెల్యేలు సహా ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లోనూ రూ.100 కోట్లు ఇందుకోసమే కేటాయించారు. 

గతేడాది నుంచే చర్యలు చేపట్టినా..
రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచేందుకు ప్రభుత్వం గతేడాదే కార్యాచరణ ప్రారంభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనల మేరకు ‘ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌’అమలుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మొదట గ్రామాలపై దృష్టి సారించింది. రెండో దశ పల్లె ప్రగతిలో గ్రామ పంచాయతీలవారీగా 18 ఏళ్లు పైబడిన వారిలో అక్షరాస్యులు ఎందరు.. నిరక్షరాస్యులు ఎందరు అన్నది గుర్తించేందుకు సర్వే నిర్వహించింది. ఆ తరువాత పైలట్‌ ప్రాజెక్టుగా ‘స్టూడెంట్‌–పేరెంట్‌/గ్రాండ్‌ పేరెంట్‌ లిటరసీ’కార్యక్రమాన్ని గతేడాది సెప్టెంబర్‌లో ప్రారంభించింది. ఇందులో విద్యార్థులు తమ తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు, నానమ్మలకు చదవు చెప్పే కార్యక్రమాన్ని నిర్వహించారు. 1,779 పాఠశాలకు చెందిన 1,38,707 మంది విద్యార్థులు ఇందులో పాల్గొనగా 1,64,068 మంది నిరక్షరాస్యులు నమోదు చేసుకున్నారు. ఇప్పుడు రెండో దశలో పట్టణాల్లోనూ నిరక్షరాస్యులను గుర్తించి ‘ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌’ను యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో ప్రజాప్రతినిధులు సహా చదువుకున్న వారందరినీ భాగస్వాములను చేసేందుకు కసరత్తు చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement