వివాహ బంధనం | special story on child marriages | Sakshi
Sakshi News home page

వివాహ బంధనం

Published Tue, Oct 24 2017 8:01 AM | Last Updated on Tue, Oct 24 2017 8:01 AM

special story on child marriages

పేరు అంజనమ్మ(19). రాయచోటిì ప్రాంతం. ఆమెకు ఐదేళ్ల క్రితంవివాహమైంది. ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లిదండ్రులదికర్ణాటకలోని బళ్లారి.  భర్త పనుల కోసం దూరప్రాంతాలకు వెళ్లి వచ్చేవాడు. ఆమెకు సరైనఆహారం అందక కాన్పు కూడా కష్టమైంది.అతికష్టం మీద బతికి బయట పడింది.చిన్న వయసులో వివాహం చేయడంతోపాపను ఎలా చూసుకోవాలో తెలిసేది కాదు. దగ్గరలోని అంగన్‌వాడీ కేంద్రానికివెళ్లడం వల్ల ఇప్పుడిప్పుడే విషయాలు తెలుసుకుంటోంది.నా బిడ్డను బాగా చదివించి వివాహ వయసు వచ్చిన తర్వాతేవివాహం చేస్తానని చెబుతోంది.

వివాహం.. జీవితాంతం మిగిలే తీపి గుర్తు.. పెళ్లితో వ్యక్తిగత సంబంధం బాధ్యతల బంధం.. .అనుబంధాల హరివిల్లుగా పెనవేసుకుంటాయి.. ఇది మరిచిపోలేని అనుభవం. ఇది నాణేనికి ఒకవైపు చిత్రం. మరో వైపు పరికిస్తే..  బాల్య వివాహం జీవితానికో శాపం. అనారోగ్యానికి హేతువు. వ్యక్తిగత స్వాతంత్య్రానికి విఘాతం. చదువుకునే వయసులో సంసార బాధ్యతల చట్రంలో పిల్లలు చిక్కుకుంటారు. కాలంతోపాటు ఆధునికత కొత్త పుంతలు తొక్కుతున్నా బాల్య వివాహాల జాడ్యం సమాజాన్ని వదల్లేదు.  నిరక్షరాస్యత, అవగాహన లోపం, సంప్రదాయం, మూఢ నమ్మకాలే ఇందుకు పునాదులవుతున్నాయి. జిల్లాలో రాయచోటి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి.

పురుషునికి 21 ఏళ్లు, స్త్రీకి 18 ఏళ్లు నిండే వరకు పెళ్లి చేయరాదని చట్టం చెబుతోంది. కానీ పాఠశాల వయస్సులోనే పెళ్లి పీటలు ఎక్కుతున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. ఇది మారుమూల గ్రామాల్లో అధికంగా చోటుచేసుకుంటోంది. బాల్య వివాహాల విషయంలో ప్రచార లోపమే బాలికలకు శాపంగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తల్లిదండ్రుల నిరక్షరాస్యత.. పూర్తిగా అవగాహన లేకపోవడం, చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడమే బాల్య వివాహాలు జరగడానికి ప్రధాన కారణం. సర్వోన్నత న్యాయస్థానం బాల్య వివాహాల విషయంలో చాలా కఠినంగా తీర్పులు ఇచ్చినా యంత్రాంగంలో కదలిక లేకపోవడం శోచనీయం. బాల్య వివాహాలపై సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ అండ్‌ సోషియల్‌ స్ట్రాటజీ సంస్థ ఇటీవల సర్వే నిర్వహించింది. సంస్థ నివేదికలో ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయని పేర్కొంది.

ఇవే అనర్థాలు
బాల్య వివాహాల వల్ల ఎన్నో అనర్థాలు తలెత్తుతాయని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. చిన్నతనంలో గర్భం దాల్చడం వల్ల ప్రసవ సమయంలో ఎక్కువ సమస్యలు ఎదురవుతాయని పేర్కొంటున్నారు. తల్లీబిడ్డలు ఇద్దరికీ ప్రాణహాని ఎక్కువగా ఉంటుందని, బిడ్డ వైకల్యంతో పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురై తీవ్ర ఇబ్బందులు పడతారని అంటున్నారు. చిన్నతనంలో కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకోవాల్సి రావడంతో ఎక్కువ శాతం మంది తీవ్ర ఒత్తిడికి లోనవుతారన్నారు. మెదడు, ఇతర శరీర అవయవాలు సరిగా పరివర్తన చెందకముందే వివాహం చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అవగాహన లోపంతో చిన్న చిన్న విషయాలకే మనస్పర్థలు వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పౌష్టికాహారం తీసుకుంటూ చక్కగా చదువుకోవాల్సిన సమయంలో వివాహం జరగడం వల్ల దూషణ, హింస, అవమానాలకు గురి కావాల్సి వస్తోందని హెచ్చరిస్తున్నారు.

బాల్య వివాహాలకు కారణాలు
తల్లిదండ్రులు బాలికకు ఎంత త్వరగా పెళ్లి చేస్తే అంత త్వరగా తమ బాధ్యత తీరిపోతుందని భావిస్తారు. చిన్నప్పుడే వివాహం చేస్తే తమకు నచ్చిన వాడికి ఇవ్వవచ్చని, తక్కువ ఖర్చుతో పని పూర్తవుతుందన్న భావన తల్లిదండ్రుల్లో నెలకొంది. పెద్దయ్యాక వివాహం చేస్తే వ్యక్తిగత అభిప్రాయాలు, అధిక కట్నాలు ఇవ్వాల్సి వస్తుందన్న భయం ఉంది. వయస్సుకు వచ్చిన యువతి ఇంటిలో ఉంటే లైంగిక వేధింపులు, ఇతర  సమస్యలు ఎదురవుతాయని భావిస్తున్నారు. సామాజికంగా, ఆర్థికంగా యువతి భవిష్యత్తుకు వివాహం ఒక ప్రధాన మార్గమన్నది తల్లిదండ్రుల నమ్మకం. ఇంటిలో పెద్దలు, వృద్ధులు మనవరాళ్ల వివాహాలను కళ్లారా చూడాలని తొందర పెట్టడం, మేనరిక సమస్యలు. నిరక్షరాస్యత, అవగాహన లోపం, బాల్య వివాహ నిషేధ చట్టం అమలు కాకపోవడం, కుటుంబాల్లో సరైన నిబద్ధత కనిపించకపోవడం తదితర కారణాలు తల్లిదండ్రులను వేధిస్తున్నాయి.

చట్టం ఏం చెబుతుందంటే...
2006లో బాల్య వివాహాల నిషేధ చట్టంలోని జీఓ నెంబర్‌. 13 ప్రకారం 18 ఏళ్లు నిండని బాలికలకు వివాహాలు చేస్తే కఠినంగా శిక్షించవచ్చు.
వివాహం చేసే పురోహితుడు, పాస్టర్, ఖాజీను వెంటనే అరెస్టు చేసే అధికారం ఈ చట్టం ద్వారా వచ్చింది. వీరికి రెండేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమాన విధించవచ్చు.
బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిని కూడా కఠినంగా శిక్షించవచ్చని చట్టం చెబుతోంది.
1923 బాల్య వివాహాల చట్టం కన్నా 2006లో చేసిన చట్టం కూడా కఠినమైంది.  బాల్య వివాహాల నిర్మూలన విషయంలో యంత్రాంగానికి సర్వహక్కులు కల్పించారు. కానీ అధికారుల అలసత్వంతో చిన్నారుల నిండు జీవితం నాశనమై పోతోంది.

ఐసీడీఎస్‌దే కీలకపాత్ర
బాల్య వివాహాలను అడ్డుకోవడంలో స్త్రీ శిశు సంక్షేమశాఖదే కీలకపాత్ర. అంగన్‌వాడీ కార్యకర్తలు బాల్య వివాహాలను గుర్తిస్తే ఉన్నతాధికారులతోపాటు పోలీసులకూ సమాచారం ఇవ్వాలి. బాల్య వివాహంపై స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసే అధికారం అంగన్‌వాడీ కార్యకర్తలకు ఉంది. ఇందుకోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఉంది. బాల్య వివాహం జరుగుతుందన్న సమాచారం ఉంటే నేరుగా ఛైల్డ్‌లైన్‌ 1098 నంబరుకు లేదా పోలీసు డయల్‌ యువర్‌ 100కు ఫిర్యాదు చేయవచ్చు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు.

నాకు 13 ఏళ్లకే పెళ్లి చేశారు. నాకు కానీ, నా భర్తకు కానీ బతకడానికి ఏ ఆధారం లేదు. దీనికి తోడు వివాహం అయిన ఏడాదిలోనే గర్భం దాల్చాను. ప్రసవ సమయంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాను. అధికంగా రక్తస్రావం అయింది. తల్లీబిడ్డ ఇద్దరికీ కష్టమేనని చెప్పడంతో భర్తతో పాటు కుటుంబ సభ్యులంతా దిగులు చెందారు. ఎలాగోలా దేవుడి దయతో బతికి బయటపడ్డాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 4 ఏళ్లుగా ఏదో రకంగా అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నాను.      – రాయచోటి శివారు కాలనీకి చెందిన వివాహిత

మా  తల్లిదండ్రులు కేరళలో కూలిపనులకు వెళ్లాలన్న కారణంతో నాకు 14 ఏళ్లకే పెళ్లి చేశారు. పెళ్లి అయిన ఏడాదికే గర్భం దాల్చాను. ప్రసవ సమయంలో భర్త , అత్తమామలు ఐసీయూలో వైద్యం ఇప్పించి తల్లీబిడ్డలను కాపాడుకున్నారు.  చదువుకోకపోవడం వల్లనే మా అమ్మానాన్నలు చెప్పిన విధంగా , వారు చేసినప్పుడే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం నెలలో సగం రోజులు అనారోగ్యంతో బాధపడుతూ, మరో సగం రోజులు భర్తతో కలిసి పనులు చేస్తూ పాపను పోషించుకుంటున్నాను.     –సుండుపల్లె మండలానికి చెందిన వివాహిత

మా కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో నన్ను 15 ఏళ్లకే లారీ డ్రైవర్‌కు ఇచ్చి వివాహం చేశారు. మా ఇద్దరి వయస్సులో కూడా చాలా (8సంవత్సరాలు) తేడా ఉండేది. అయితే వివాహం అయిన 3 సంవత్సరాలకే రోడ్డుప్రమాదంలో నా భర్త చనిపోయారు. అప్పటి నుంచి నా జీవితం అంధకారంలో ఉండిపోయింది . అత్తమామల ఇల్లు వదిలి, అమ్మానాన్నల దగ్గరే ఉంటున్నాను. చదువుకోవాలన్న ఆలోచన రావడంతో దూరవిద్య కేంద్రం ద్వారా డిగ్రీ చదువుకుంటున్నాను. గతంలోనే నన్ను మా వాళ్లు బాగా చదివించి ఉంటే కుటుంబానికి అండగా ఉండేదాన్ని.  వివాహ వయస్సు వచ్చిన తరువాత పెళ్లి చేసుకునేదాన్ని.–చిన్నమండెం మండలానికి చెందిన వివాహిత

బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవు – వసంతాభాయ్, సీడీపీఓ , రాయచోటి
బాల్య వివాహాలను ప్రోత్సహించే కుటుంబ సభ్యులు, పెద్దలపై కఠిన చర్యలు తీసుకుంటాం. అడపిల్లలను బాగా చదివించాలి. వివాహ వయస్సు 18సంవత్సరాలు దాటిన తరువాతనే వారికి పెళ్లి చేయాలి. ఈ విషయంపైన అంగన్‌వాడీ కేంద్రాల్లో, అవగాహన సదస్సుల్లో తెలియజేస్తున్నాము. బాల్య వివాహాలు చేయడం వల్ల బాలికలు శారీరకంగా అనేక ఇబ్బందులకు గురవుతారు.   బాల్య వివాహాల విషయాన్ని 1098 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి చెప్పండి, చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement