
కట్టడి సరే.. ఏటా మరింత పెరుగుదల ఆధునిక సమాజంగా చెప్పుకుంటున్నప్పటికీ, దేశంలో బాల్య వివాహాల పూర్తి స్థాయి కట్టడి జరగడంలేదు. పైగా ఏడాదికేడాది ఈ సంఖ్య పెరుగుతుండడం మరో ఆసక్తికర అంశం. అధికారికంగానే లెక్కలు వందల్లో ఉన్నాయంటే, అనధికారికంగా పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రాజ్యసభలో తాజాగా కేంద్ర స్త్రీ, శిశుసంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను వెల్లడించింది. – సాక్షి, అమరావతి
మంత్రిత్వశాఖ పేర్కొన్నఅంశాల్లో ముఖ్యమైనవి
బాల్య వివాహాలు అరికట్టేందుకు, వీటితో సంబంధం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా బాల్య వివాహాల నిషేధ చట్టంలోని సెక్షన్‌లో సవరణలు తీసుకుని రావడం జరిగింది. ఈ సవరణతో రాష్ట్ర ప్రభుత్వాలకు బాల్య వివాహాల నిషేధం అమలు వ్యవహారాల అధికారులను నియమించుకునే అధికారాన్ని కల్పించారు. బాల్య వివాహాలను నిరోధించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తులపై విచారణ జరిపి చర్యలు తీసుకునే అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించారు.
బాల్య వివాహాలను ప్రోత్సహించవద్దని, అటువంటి వారికి సహకరించడం వంటి చర్యలు చేయవద్దని స్థానిక నివాసితులకు తెలియజేయడంతో పాటు బాల్య వివాహాల వల్ల ఉత్పన్నమయ్యే దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించడం, బాల్య వివాహాల సమస్యపై సమాజాన్ని చైతన్యవంతం చేయడం అధికారుల విధులు.
ఈ అధికారులందరూ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రత్యక్ష నియంత్రణలో పనిచేస్తారు. బాల్య వివాహాలను నిరుత్సాహపరచడంతో పాటు లింగ సమానత్వం కోసం బేటీ బచావోృ బేటీ పఢావో పథకాన్ని ‘మిషన్ శక్తి’ పేరుతో కేంద్ర అమలు చేస్తోంది. బాల్య వివాహాల నిరోధించేందుకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది.

Comments
Please login to add a commentAdd a comment