అధ్వానంగా సాక్షరభారత్ సెంటర్ల పనితీరు | aim of sakshara bharat gets down | Sakshi
Sakshi News home page

అధ్వానంగా సాక్షరభారత్ సెంటర్ల పనితీరు

Published Sun, Jun 1 2014 2:45 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

aim of sakshara bharat gets down

మెదక్:ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. ప్రతి ఒక్కరి చదువు దేశానికి వెలుగు అన్నది మేధావుల నినాదం. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సాక్షరభారత్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అయితే గ్రామ సమన్వయ కర్తలు సక్రమంగా పని చేయకపోవడంతో ప్రభుత్వం లక్ష్యం నెరవేరడం లేదు. రికార్డుల్లో మాత్రం వేల సంఖ్యలో అక్షరాస్యులుగా మారుతున్నారని అధికారులు చూపుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
 
 వందల సంఖ్యలో కూడా అక్షరాలు నేర్చుకున్న వారు లేరన్నది సత్యం. కొత్తగా కొలువుదీరనున్న ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. తల్లి ఒడే పిల్లలకు మొదటి పాఠశాల కాబట్టి మహిళలు అక్షరాస్యులుగా మారితే వారి పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుం దని భావించిన ప్రభుత్వం సాక్షరభారత్ పథకాన్ని ప్రారంభించింది. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా 2010 సెప్టెంబర్ 8న దేశ వ్యాప్తంగా సాక్షరభారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండు సంవత్సరాల లోపు పిల్లలను ఈ కేంద్రాల్లో చేరుకొని వారికి అక్షరాస్యులుగా నేర్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. ఇందులో భాగంగా మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు గానూ 46 మంది గ్రామ కోఆర్డినేటర్లను నియమించారు.
 
 వీరి విధుల పర్యవేక్షణకు మండల కోఆర్డినేటర్ ను కూడా నియమించారు. అన్ని గ్రామాల్లో కేంద్రాలను ప్రారంభించారు. ప్రస్తుతం కొన్ని సెంటర్లలో మినహా ఎక్కడా వలంటీర్లు పనిచేయడం లేదు. మండలంలో 7,500 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరి కోసం 750 సెంటర్లు ప్రారంభించారు. మండల వ్యాప్తంగా ఒక్క సెంటర్ కూడా సక్రమంగా నడవడం లేదన్నది సత్యం. గ్రామ సమన్వయ కర్తకు నెలకు రూ. రెండు వేల గౌరవ వేతనం ఇస్తున్నారు. ఒక్కో అభ్యాసకుడికి నోట్‌బుక్, పెన్సిల్, మెండర్, రబ్బరు, ప్రైమరీ, బ్రిడ్జి బుక్స్ అందిస్తున్నట్టు అధికారులు లెక్కలు చూపుతున్నా అవి సమన్వయ కర్తల వద్దే ఉంటాయన్నది వాస్తవం. మండలంలోని 23 సెంటర్లకు ప్రతి రోజూ రెండు దినపత్రికలు, ఒక మాస పత్రిక, కరంటు బిల్లుకు నెలకు రూ. వంద చొప్పున చెల్లిస్తున్నారు. సెంటర్లలో వసతులు కల్పించేందుకు అల్మారా, ఒక కార్పెట్, పది కుర్చీలను అందజేశారు. అభ్యాసకులు ఆడుకోవడానికి ఆటవస్తువులను సమకూర్చారు. ఇవి కూడా ఆయా సెంటర్లలో కనబడడం లేదు. పథకం లక్ష్యం బాగున్నా పాలకులు, అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ప్రజా ధనం వృథా అవుతోంది. కొత్త ప్రభుత్వమైనా ఈ పథకంపై దృష్టి పెట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement