sakshara bharat
-
గౌరవ వేతనాలివ్వడంలో నిర్లక్ష్యం తగదు
- సాక్షర భారత్ ప్రారంభోత్సవంలో జెడ్పీ చైర్మన్ రాజశేఖర్ కర్నూలు సీక్యాంప్: సాక్షర భారత్ కో-ఆర్డినేటర్లకు గౌరవ వేతనాలు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం తగదని జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ అన్నారు. శుక్రవారం కర్నూలు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సాక్షర భారత్ 7వ అక్షరాస్యత ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ.. రెండు సంవత్సరాలుగా జిల్లాలోని ఎంసీఓ, వీసీవోలకు గౌరవ వేతనాలు ఇవ్వడం లేదన్నారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడుల దృష్టికి తీసుకెళతామన్నారు. సాక్షర భారత్ పనితీరులో జిల్లా 12వ స్థానంలో ఉండడం విడ్డూరంగా ఉందన్నారు. తీసుకురావాలని గౌరవ వేతనాల విషయాన్ని అసెంబ్లీలో చాలా సార్లు ప్రస్తావించానని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేదన్నారు. ఓర్వకల్లు మండలానికి చెందిన పొదుపు మహిళలు సాక్షర భారత్ ద్వారా చదువు నేర్చుకుని ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో సీఆర్పీలుగా పనిచేస్తూ మంచి జీతాలు పొందుతున్నారని గుర్తు చేశారు. ఏజేసీ రామస్వామి, సాక్షార భారత్ జిల్లా ఉపసంచాలకులు జయప్రద, డీఆర్డీఎ పీవో జ్యోతి, కర్నూలు ఎంపీడీవో మాధవీలత తదితరులు పాల్గొన్నారు. -
మోడల్ వయోజన విద్య కేంద్రం ప్రారంభం
సంగం : మండలంలోని సిద్దీపురానికి మంజూరైన మోడల్ వయోజన విద్యాకేంద్రాన్ని ఎంపీపీ దగుమాటి కామాక్షమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు దేవసహాయంలు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జయరామయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం మోడల్ వయోజన విద్యాకేంద్రాలను ఏర్పాటుచేసిందన్నారు. జిల్లాకు ఆరు కేంద్రాలు మంజూరు కాగా అందులో సిద్దీపురం ఒకటన్నారు. ఈ కేంద్రానికి రూ.2.50 లక్షలతో కంప్యూటర్, కుర్చీలు, వయోజనులకు అవసరమైన ఆటవస్తువులు, వేయింగ్ మిషన్, కుట్టుమిషన్ తదితర వస్తువులను అందజేశారన్నారు. ఎంపీపీ మాట్లాడుతూ నిరక్ష్యరాసులపై సాక్షరభారత్ కో–ఆర్డినేటర్లు ప్రత్యేకశ్రద్ధ పెట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకుని సిద్దీపురం గ్రామాన్ని సంపూర్ణ అక్షరాస్యత గ్రామంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అనంతరం జెడ్పీటీసీ, అన్నారెడ్డిపాళెం సాగునీటి సంఘం అధ్యక్షుడు సూరా శ్రీనివాసులురెడ్డిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైస్ ప్రెసిడెంట్ వెంగళరెడ్డి, వెంగారెడ్డిపాళెం మాజీ సర్పంచ్ ఆనం ప్రసాద్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
సాక్షర భారత్ కోఆర్డినేటర్ ఆత్మహత్యాయత్నం
శాయంపేట: వరంగల్ జిల్లా శాయంపేట మండల సాక్షర భారత్ కో ఆర్డినేటర్ గురువారం ఆత్మహత్యాయత్నం చేశాడు. 16 నెలలుగా తనకు వేతనాలు అందడం లేదంటూ సాక్షర భారత్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న కుమారస్వామి ఎంపీడీవో కార్యాలయం వద్ద వంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు. కమీషన్ ఇవ్వనందున వేతనాల ఫైలుపై ఎంపీపీ రమాదేవి సంతకం చేయడంలేదని అతడు వాపోయాడు. -
అధ్వానంగా సాక్షరభారత్ సెంటర్ల పనితీరు
మెదక్:ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. ప్రతి ఒక్కరి చదువు దేశానికి వెలుగు అన్నది మేధావుల నినాదం. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సాక్షరభారత్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అయితే గ్రామ సమన్వయ కర్తలు సక్రమంగా పని చేయకపోవడంతో ప్రభుత్వం లక్ష్యం నెరవేరడం లేదు. రికార్డుల్లో మాత్రం వేల సంఖ్యలో అక్షరాస్యులుగా మారుతున్నారని అధికారులు చూపుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వందల సంఖ్యలో కూడా అక్షరాలు నేర్చుకున్న వారు లేరన్నది సత్యం. కొత్తగా కొలువుదీరనున్న ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. తల్లి ఒడే పిల్లలకు మొదటి పాఠశాల కాబట్టి మహిళలు అక్షరాస్యులుగా మారితే వారి పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుం దని భావించిన ప్రభుత్వం సాక్షరభారత్ పథకాన్ని ప్రారంభించింది. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా 2010 సెప్టెంబర్ 8న దేశ వ్యాప్తంగా సాక్షరభారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండు సంవత్సరాల లోపు పిల్లలను ఈ కేంద్రాల్లో చేరుకొని వారికి అక్షరాస్యులుగా నేర్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. ఇందులో భాగంగా మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు గానూ 46 మంది గ్రామ కోఆర్డినేటర్లను నియమించారు. వీరి విధుల పర్యవేక్షణకు మండల కోఆర్డినేటర్ ను కూడా నియమించారు. అన్ని గ్రామాల్లో కేంద్రాలను ప్రారంభించారు. ప్రస్తుతం కొన్ని సెంటర్లలో మినహా ఎక్కడా వలంటీర్లు పనిచేయడం లేదు. మండలంలో 7,500 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరి కోసం 750 సెంటర్లు ప్రారంభించారు. మండల వ్యాప్తంగా ఒక్క సెంటర్ కూడా సక్రమంగా నడవడం లేదన్నది సత్యం. గ్రామ సమన్వయ కర్తకు నెలకు రూ. రెండు వేల గౌరవ వేతనం ఇస్తున్నారు. ఒక్కో అభ్యాసకుడికి నోట్‌బుక్, పెన్సిల్, మెండర్, రబ్బరు, ప్రైమరీ, బ్రిడ్జి బుక్స్ అందిస్తున్నట్టు అధికారులు లెక్కలు చూపుతున్నా అవి సమన్వయ కర్తల వద్దే ఉంటాయన్నది వాస్తవం. మండలంలోని 23 సెంటర్లకు ప్రతి రోజూ రెండు దినపత్రికలు, ఒక మాస పత్రిక, కరంటు బిల్లుకు నెలకు రూ. వంద చొప్పున చెల్లిస్తున్నారు. సెంటర్లలో వసతులు కల్పించేందుకు అల్మారా, ఒక కార్పెట్, పది కుర్చీలను అందజేశారు. అభ్యాసకులు ఆడుకోవడానికి ఆటవస్తువులను సమకూర్చారు. ఇవి కూడా ఆయా సెంటర్లలో కనబడడం లేదు. పథకం లక్ష్యం బాగున్నా పాలకులు, అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ప్రజా ధనం వృథా అవుతోంది. కొత్త ప్రభుత్వమైనా ఈ పథకంపై దృష్టి పెట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.