బాల్యానికి సంకెళ్లు..
బడిబాట పట్టాల్సిన బాలలు పనిబాట పడుతున్నారు.. పలకా బలపం పట్టాల్సిన చేతితో గిన్నెలు శుభ్రం చేస్తున్నారు.. పాఠాలు చదువుకోవాల్సిన సమయంలో చెత్తపేపర్లు ఏరుకుంటున్నారు.. ఇలా ఆటపాటలతో ఆహ్లాదంగా సాగాల్సిన బాల్యం చెత్తకుప్పల పాలవుతోంది..
- నగరంలో పెరిగిపోతున్న బాలకార్మికుల సంఖ్య నాలుగు వేలకు పైగా ఉన్నారని అంచనా
- పేదరికం, నిరక్షరాస్యతే కారణమంటున్న అధికారులు పనిబాట పడుతున్న బాలలు
- నేరమని తెలిసినా ప్రోత్సహిస్తున్న యజమానులు
సాక్షి, ముంబై: నగరంలో బాల కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉందని ఓ సామాజిక సంస్థ నిర్వహించిన సర్వే ఆధారంగా తేలింది. దాదాపు 4 వేల మంది బాల కార్మికులు నగరంలో పనిచేస్తున్నారని సంస్థ గుర్తించింది. వీరిని పనిలో పెట్టుకున్న వారిపై నగర పోలీసులు గట్టి నిఘా ఉంచారు. ఈ సందర్భంగా ఓ పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. నగరంలో ఉన్న బాల కార్మికులకు విముక్తి కలిగించడానికి ఓ ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. దీనిని త్వరలోనే అమలు చేయనున్నామన్నారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో పోలీసులు దాదాపు 100 మంది బాల కార్మికులను విముక్తి చేశారు. గత ఏడాదితో పోల్చితే ఈ సంఖ్య ఎక్కువగానే ఉందని అధికారి తెలిపారు.
ఈ సందర్భంగా సోషల్ సర్వీస్ బ్రాంచ్ (ఎస్‌ఎస్‌బీ)డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేష్ పాటిల్ మాట్లాడుతూ.. ఈ ఏడాది దాదాపు నాలుగు వేల మంది చిన్నారులను బాలకార్మికుల నుంచి విముక్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ మేరకు ప్రతిరోజూ తాము కొన్ని ప్రాంతాలను తనిఖీ చేస్తున్నామన్నారు. అంతేకాకుండా స్థానికుల సహాయం కూడా తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. బాల కార్మికులను గుర్తించి పునరావాసం కల్పించినప్పటికీ వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడం చేత తిరిగి అదే వృత్తిని ఎంచుకుంటున్నారని ఎస్‌ఎస్‌బీ అధికారులు విచారం వ్యక్తం చేశారు.
ఇందులో ఎక్కువ శాతం బాలలు ఇండ్లలో పని చేసేవారేనన్నారు. అదేవిధంగా మరికొందరు లెదర్, జరీ, హోటళ్లలో పనిచేస్తుండగా, మరికొందరు చెత్తకుప్పల్లో కాగితాలు ఏరుకుంటూ ఉంటారని తెలిపారు. ఇదిలా ఉండగా కొందరు వ్యసనాలకు బానిసలైన తల్లిదండ్రులు డబ్బుల కోసం తమ పిల్లలతో బలవంతంగా భిక్షాటన చేయిస్తారని వారు తెలిపారు. బాలకార్మికుల్లో ఎక్కువ మంది వలస కుటుంబాలకు చెందినవారేనని చెప్పారు.
వీరంతా మురికివాడల్లో ఉంటూ యజమానుల వద్ద తక్కువ వేతనం తీసుకుంటూ ఎక్కువ గంటలు పనిచేస్తారని తెలిపారు. అందుకే నేరమని తెలిసినా ఎక్కువ శాతం యజమానులు బాలకార్మికులను పనిలో పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని వివరించారు. బాలకార్మికుల్లో ఎక్కువశాతం బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచేకాక పక్క దేశమైన నేపాల్‌వాసులే ఉంటారని అధికారి తెలిపారు. వీరు ఐదు నుంచి 16 ఏళ్ల వయసు మధ్యలో ఉంటారని పేర్కొన్నారు. కాగా, బాలలను పనిలో పెట్టుకున్న వారికి చట్ట ప్రకారం రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 20 వేల నుంచి 50 వేల జరిమానా కూడా విధిస్తారు.