కోసిగి మండలం జుమ్మాలదిన్నెలో పాడుబడిన ఇల్లు
పేదరికం వారి బతుకుల్ని నాగరిక సమాజానికి దూరం చేసింది. బుక్కెడు బువ్వ పెట్టే నేల తల్లిని నమ్ముకుంటే.. వాన చినుకు రాలక బతుకులు ‘సుగ్గి’(వలస) పాలయ్యాయి. బతికేందుకు దారిలేని దుర్భర పరిస్థితుల్లో మగ్గుతున్న వారికి తమ జీవితాల్ని అక్షరం మారుస్తుందన్న నమ్మకం లేకపోయింది. దాంతో చదువుకూ దూరమయ్యారు. భూస్వాములు దోపిడి, పాలకుల అలసత్వంతో అలముకున్న పేదరికం, నిరక్షరాస్యత ఆ పేద జీవితాల్లో మరింత చీకటి నింపింది. అందుకే మూఢనమ్మకాలు, కట్టుబాట్లే జీవితంగా మార్చుకుని వెనుకబాటుతనానికి అలవాటుపడిపోయారు. మగపిల్లాడు పుడితే సమాజంలో గౌరవంగా చూస్తారనే అమాయకత్వంతో అబ్బాయి కోసం ఎంతమంది ఆడపిల్లల్నైనా కనేలా ఒత్తిడి చేస్తారు. పురిట్లోనే ఎందరో తల్లీబిడ్డలు ప్రాణాలు పోతున్నా.. కట్టుబాట్ల ప్రసవాలతో ఆడవాళ్లను ఆస్పత్రి గడప తొక్కనీయరు. మగబిడ్డ కోసం ఎంత మంది ఆడపిల్లల్నైనా పుట్టించుకునే కుటుంబాలు... అప్పటికీ అబ్బాయి పుట్టకపోతే మరో పెళ్లికి సిద్ధమయ్యే మగవాళ్లు.. పిల్లల్ని బడికి పంపడం కంటే కూలికి తీసుకెళ్లడమే వాళ్లకు తెలిసిన నాగరికత. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్‌లోని మంత్రాలయం, ఆదోని, ఎమ్మిగూరు, ఆలూరు ప్రాంత పల్లెల్లో దుర్భర పరిస్థితులకు కారణాలు అన్వేషించేందుకు ‘సాక్షి’ బృందం ఆ గ్రామాల్లో పర్యటించింది.
మొగిలి రవివర్మ, సాక్షి, కర్నూలు: ఆదోని డివిజన్‌లోని ఈ పల్లెల దుస్థితిపై మా బృందం అనేక మందిని ప్రశ్నించగా.. ‘కౌతాళం మండలంలోని గోతులదొడ్డి, రౌదూరు గ్రామాలతో పాటు మరికొన్ని ఫ్యాక్షన్ పల్లెల్లో పొట్టేలు మాంసం, మద్యం ఇస్తే హత్యలకు తెగించేవారున్నారు. ఇదంతా పేదరికం వల్ల వచ్చిన దుస్థితి’ అని చెప్పుకొచ్చారు. ఆదోని డివిజన్‌లోని ఎక్కువ శాతం పల్లెల్లో ఊరినిండా పేదరికం. చేద్దామంటే చేతినిండా పనుండదు. బతకాలంటే వలస పోవాల్సిందే. వర్షాధార పంటలు పండక చుట్టుముట్టిన పేదరికం. వారి బతుకులు ఇంత దారుణంగా ఉండడానికి నిరక్షరాస్యత మరో ప్రధాన కారణం. ఆదోని డివిజన్‌లోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు, ఆదోని నియోజకవర్గాలలోని పల్లెల్లో పర్యటించినప్పుడు.. ఇప్పటికీ ఇలాంటి పల్లెలు ఉన్నాయా! అనిపిస్తుంది. ఉండేందుకు సరైన ఇళ్లు లేవు. పారిశుద్ధ్యంపై అసలు అవగాహన లేదు. కర్ణాటక సరిహద్దులో ఈ గ్రామాలు విసిరేసినట్లుంటాయి.
పేదరికంతో చిన్నాభిన్నం
ఈ ప్రాంతంలో జనాభా ఎక్కువ! భూమి తక్కువ. మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి మండల జనాభా (2011 ప్రకారం) 69,275 మంది. మండలంలోని వ్యవసాయభూమి 45వేల ఎకరాలు మాత్రమే! ఈ ప్రాంతంలో వ్యవసాయమంటే వర్షాధారమే. సాగునీటి వనరులు అతి తక్కువ! వర్షం వస్తే వేరుశనగ సాగు చేస్తారు. లేదంటే ఆ ఏడాది పంటల్లేక, కూలీ పనులు దొరక్క వలస పోవాల్సిందే. ఎన్నో ఏళ్లుగా ఇదే పరిస్థితి ఇక్కడ కొనసాగుతోంది. ఒక్కోసారి పదేళ్లలో 7–8 ఏళ్లు వర్షమే ఉండదు. దీంతో ఇంటిల్లిపాది బెంగళూరు, సేలం, గుంటూరుకు వలస పోతారు. ఇప్పటికీ పూరిగుడిసెలు, ప్లాస్టిక్ కవర్లు, నాలుగు రాతి బండల మధ్య ఇళ్లుగా జీవిస్తున్న కుటుంబాలు ప్రతీ పల్లెలో పదుల సంఖ్యలో కన్పిస్తాయి.
దొరల పెత్తనంతో దుర్భరం
ఇక్కడ దొరల పెత్తనం ఎక్కువ! 30 ఏళ్ల క్రితం వరకూ ఈ పల్లెలన్నీ వారి కనుసన్నల్లోనే నడిచాయి. అన్ని రకాల అరాచకాలు, ఆకృత్యాల వల్ల వీరి బతుకులు మరింత దుర్భరంగా మారాయి. ప్రజలు అక్షరం నేరిస్తే అక్రమాలపై తిరుగుబాటు చేస్తారనే దుర్మార్గపు ఆలోచనలతో టీచర్లను బడికి వెళ్లకుండా అడ్డుకునేవారు. టీచర్లు దొరల ఇంటికెళ్లి సంతకం చేసి, వారి ఇంట్లో సాయంత్రం వరకూ ఉండి వెళ్లిపోవాలి. దీంతో ‘అక్షర వెలుగులు’ ఆ పల్లెల్ని సోకలేదు. ఈ ప్రాంతంలో దేశ ఆర్మీకి మందుగుండు సామగ్రి, తుపాకులు, ట్యాంకర్లు తయారుచేసే పరిశ్రమను ఏర్పాటు చేయాలని కేంద్రం గతంలో ప్రకటించింది. ఉపాధి దొరికితే ప్రజలు ఆర్థికంగా బలపడతారని, దాంతో తమ ఆధిపత్యం పోతుందనే దుర్భుద్దితో ఆ ప్రాజెక్టును అడ్డుకున్నారు. ఇలా ఎన్నో కారణాలతో ఈ ప్రాంతం చాన్నాళ్లు పేదరికం, నిరక్షరాస్యతతో మగ్గిపోయింది. కోసిగి మండలంలో అక్షరాస్యత కేవలం 28.4 శాతమే. నిరక్షరాస్యతలో దేశంలో మూడోస్థానంలో ఉంది. 40 శాతం కంటే తక్కువ ఉన్న మండలాలు కర్నూలు జిల్లాలో 10 వరకూ ఉన్నాయి.
చిన్నారులకు శాపం.. మేనరిక వివాహాలు
ఆదోని డివిజన్ ప్రాంతంలోని పిల్లల్లో అంగవైకల్యం ఎక్కువగా ఉండడం మేం చూశాం. దానిపై అధికారుల్ని ఆరాతీస్తే.. ఆ కుటుంబాల్లో మేనరిక వివాహాలు ఎక్కువ కావడంతో పిల్లల్లో దుష్పరిణామాలు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పారు. ఒకే ఇంట్లో నాలుగైదు తరాలుగా మేనరిక వివాహాలు చేసుకున్నవారూ ఉన్నారు. మేనరికం వల్ల పిల్లల్లో దుష్పరిణామాలు వస్తాయన్న అవగాహన కూడా వారికి లేదు. తరాలు మారుతున్నా కొన్ని కట్టుబాట్లు, సంప్రదాయాలు వీరిని సామాజికంగా, ఆర్థికంగా ముందడుగు వేయకుండా చేశాయి. అందుకు ఒక ఉదాహరణ మూడేళ్ల చిన్నారి ఉష.. కోసిగి మండలం జుమ్మాలదిన్నెలో అమల ప్రవల్లిక కూతురు ఉషా(3)కు లివర్‌వాపు వ్యాధి సోకింది. కర్నూలులో చూపిస్తే నయం కాలేదు. చివరకు నంద్యాలలో చూపించారు. మూడేళ్ల పాప కేవలం 8కిలోల బరువు మాత్రమే ఉంది. ఇటీవల 1.5 కిలోలు పెరిగింది. ఎందుకని ఆరా తీస్తే మేనరిక వివాహం. అమల తల్లిది మేనరికమే.
మగపిల్లల కోసం రెండో పెళ్లికి సిద్ధం
కోసిగి, కౌతాళం, మంత్రాలయం మండలాల్లో ఆర్డీటీ(రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్టు) స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. మగపిల్లాడి కోసం దాదాపు 10 మంది ఆడపిల్లల వరకూ కనే కుటుంబాలు, ఆడపిల్లల కోసం రెండో పెళ్లి చేసుకున్న మగవాళ్లున్న కుటుంబాలు 454 వరకూ ఉన్నట్లు తేల్చారు. ‘మగపిల్లాడు పుడితే వంశం నిలుస్తుంది. కొడుకుంటే సమాజంలో గౌరవం’ అని మూఢనమ్మకం కట్టుబాటుగా అమలవుతోంది. అనారోగ్యంతో ఉన్న పిల్లల్ని ఆస్పత్రుల్లో చూపించాలనే కనీస అవగాహన కూడా వారికి లేదు. జబ్బు చేస్తే ఆస్పత్రులకు ఎందుకు వెళ్లడం లేదని కొన్ని కుటుంబాల్ని మేం ప్రశి్నంచగా.. ‘ఆస్పత్రికి వెళ్లం.. అది మా కట్టబాటు’ అన్న సమాధానం వచ్చింది.
అబ్బాయిలు బడికి.. అమ్మాయిలు కూలికి
మగబిడ్డను బడికి పంపిస్తారు. ఆడపిల్లలైతే కూలికి తీసుకెళ్తారు. ఇదేంటని కొందరి తల్లులను ఆరా తీస్తే ‘ఆడబిడ్డకు సదువెందుకయ్యా! కూలికి పోతే నూటేబై వత్తాది. సుగ్గికి పోతే ఇంగా ఎక్కువొత్తాది!’ అని చెప్పుకొచ్చారు. కొందరు ఆడపిల్లలు ఇంటివద్దే వారి చెల్లెళ్లకు కాపలా ఉంటారు.
కోసిగి, వాడి రైలులో రేనిగాయలు అమ్ముతున్న బాలిక
ఒకరికోసం ఒకరు ఇంటివద్దే..
జుమ్మాలదిన్నెకు చెందిన శ్రీదేవికి ఐదుగురు ఆడపిల్లలు. మగపిల్లవాడి కోసం ఐదుగురు ఆడపిల్లల వరకూ వేచిచూశారు. వారిలో ఒక్కరూ బడికి వెళ్లడం లేదు. ఎందుకని మా బృందం ప్రశ్నిస్తే.. ‘ రెండో అమ్మాయి కోసం పెద్దపాప నాగవేణిని ఇంటివద్దనే ఉంచాం. మూడో పాప కోసం రెండో అమ్మాయిని ఇంటి దగ్గర పెట్టి పెద్దమ్మాయిని మాతో తీసుకెళ్లేవాళ్లం. అలా ఒకరి కోసం మరొకరిని ఇంటి వద్దే ఉంచాం. దీంతో ఎవరూ బడికెళ్లలేదు.’ అని శ్రీదేవి చెప్పుకొచ్చింది.
ఆర్థికంగా చేయూతనివ్వాలి
ఈ ప్రాంతంలో పేదరికం వల్ల పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. ఇక అమ్మాయిల విషయంలో పూర్తి వివక్ష కొనసాగుతోంది. ఆర్థికంగా చేయూత అందితే అప్పుడు చదువుకోవాలన్న ఆసక్తి పెరగడంతో పాటు ఆడపిల్లలపై వివక్ష తగ్గుతుంది. ఈ విషయంలో అందరూ నడుం బిగించి ఆ ప్రాంతాల్లో చైతన్యం తీసుకురావాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘బడిబాట’ వంటి వాటితో కొంత ప్రయోజనం ఉండవచ్చు.
– లక్ష్మణ్ రెడ్డి, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు
ఆదోని డివిజన్‌ను ప్రత్యేక ప్రాంతంగా పరిగణించాలి
రాష్ట్రంలోనే ఆదోని విద్యాపరంగా వెనుకంజలోఉంది. ఇప్పటికీ పాత భావాలే చలామణిలో ఉన్నాయి. మూఢనమ్మకాలు ఎక్కువ. ఆడపిల్లలంటే చిన్నచూపు. ఆధునిక వైద్యంపై విశ్వాసం లేదు. ఇక్కడ భారీ ఎత్తున చైతన్యం, ఆడ, మగ ఒక్కటే అనే ఉద్యమం తీసుకురావాలి. పేదరిక నిర్మూలన, అక్షరాస్యత పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మూఢనమ్మకాల నిర్మూలనకు చైతన్యం కలిగించాలి. ఆ ప్రాంతాన్ని స్పెషల్‌జోన్‌గా పరిగణించి చర్యలు తీసుకోవాలి.
– గేయానంద్, జనవిజ్ఞాన వేదిక
Comments
Please login to add a commentAdd a comment