Award Winner
-
సూపర్ మహిళా గేమరే కాదు.. అంతకుమించిన అందగత్తె కూడా! (ఫొటోలు)
-
‘దైవ కణం’ ఉందన్న శాస్త్రవేత్త... కన్నుమూశాడు!
ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత పీటర్ హిగ్స్ (94) కన్నుమూశారు. విశ్వం ఎలా ఉద్భవించిందనేది వివరించడంలో సహాయపడే ‘హిగ్స్ బాసన్’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన పీటర్ హిగ్స్ అనారోగ్యం కారణంగా ఏప్రిల్ 8న తన ఇంట్లో మరణించినట్లు స్కాటిష్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. హిగ్స్ బాసాన్ సిద్ధాంతానికి బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాంకోయిస్ ఇంగ్లెర్ట్‌తో కలిసి హిగ్స్ నోబెల్ అవార్డు అందుకున్నారు. యాభై ఏళ్లుగా స్కాటిష్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హిగ్స్ మరణంతో భౌతిక శాస్త్ర ప్రపంచం ఒక ధ్రువతారను కోల్పోయిందనడంలో సందేహం లేదు. హిగ్స్ గొప్ప అధ్యాపకుడని, యువ శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాత అని స్కాటిష్ యూనివర్సిటీ పేర్కొంది. హిగ్స్ మహనీయుడని ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పీటర్ మాథిసన్ అన్నారు. అతని దార్శనికత, ఊహా ప్రపంచం మన విజ్ఞానాన్ని సుసంపన్నం చేశాయని, వేలాది మంది శాస్త్రవేత్తలు అతని రచనల నుంచి ప్రేరణ పొందారని పేర్కొన్నారు. హిగ్స్ బాసన్ సిద్ధాంతం అంటే ఏమిటి? సుమారు 1300 కోట్ల ఏళ్ల క్రితం ఓ మహా విస్ఫోటంతో ఈ విశ్వం మొత్తం ఆవిర్భవించిందని శాస్త్రవేత్తలు చాలామంది అంగీకరించే సిద్ధాంతం. అయితే ఈ మహా విస్ఫోటం కచ్చితంగా ఎలా జరగింది? అణువులు, పరమాణువులు ఎలా పుట్టుకొచ్చాయి? ఆ తరువాతి క్రమంలో నక్షత్రాలు, గ్రహాలు ఎలా ఏర్పాడ్డాయి అన్నది ఇప్పటికీ స్పష్టత లేని అంశం. 1964లో పీటర్ హిగ్స్ మరో ఐదుగురు శాస్త్రవేత్తలతో కలిసి విశ్వ ఆవిర్బావ క్రమానికి సంబంధించి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కణాలన్నింటికీ ద్రవ్యరాశిని సమకూర్చే కణం ఒకటి ఉందని ఆయన ప్రతిపాదించారు. విశ్వవ్యాప్తమైన ఒక క్షేత్రంలో (హిగ్స్ ఫీల్డ్)లో కదులుతూ ఈ బోసాన్ ఇతర కణాలకు ద్రవ్యరాశిని అందిస్తుందన్న ప్రతిపాదనపై హిగ్స్తోపాటు అనేక ఇతర శాస్త్రవేత్తలూ చాలా పరిశోధనలు చేశారు. అయినప్పటికీ ఈ కణం ఉనికి స్పష్టం కాకపోవడంతో దీన్ని ‘దైవ కణం’ అని పిలిచేవారు కూడా. ఈ దైవ కణం ఉనికిని గుర్తించేందుకు స్విట్జర్లాండ్ సరిహద్దుల్లో ఓ భారీ పరిశోధన ఒకటి చేపట్టారు శాస్త్రవేత్తలు. వందల కోట్ల రూపాయల ఖర్చుతో భూగర్భంలో నిర్మించిన ప్రయోగశాలల ద్వారా అసలు ఈ హిగ్స్ బాసాన్ కణం ఉందా? లేదా? నిర్ధారించేందుకు ప్రయత్నించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫ్రిజరేటర్ కూడా ఉన్న ఈ ప్రయోగశాలలో రెండు ఫొటాన్లను కాంతి వేగంతో పరుగెత్తించి ఢీకొట్టించడం ఫలితంగా అతిసూక్ష్మ సమయంపాటు ఏర్పడే మహా విస్ఫోట కాలం నాటి పరిస్థితులను విశ్లేషించడం ద్వారా బాసాన్ ఉనికిని 2012లో నిర్ధారించగలిగారు కూడా. -
రామ్కీ ఇన్ఫ్రాకు విశ్వకర్మ పురస్కారాలు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 15వ సీఐడీసీ విశ్వకర్మ అవార్డుల కార్యక్రమంలో వివిధ విభాగాల్లో పురస్కారాలు లభించాయి. ఉత్తమ నిర్మాణ ప్రాజెక్టులు, సామాజిక అభివృద్ధి..ప్రభావం, ప్రొఫెషనల్‌గా అత్యుత్తమంగా నడుస్తున్న సంస్థ తదితర విభాగాల్లో ఈ అవార్డులు దక్కినట్లు కంపెనీ తెలిపింది. నిర్మాణ రంగంలో తాము పాటించే అత్యుత్తమ ప్రమాణాలకు ఇవి నిదర్శనమని రామ్కీ ఇన్ఫ్రా ఎండీ వై.ఆర్. నాగరాజ తెలిపారు. ప్లానింగ్ కమిషన్ (ప్రస్తుతం నీతి ఆయోగ్), భారతీయ నిర్మాణ పరిశ్రమ కలిసి ఏర్పాటు చేసిన కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ (సీఐడీసీ) ఈ పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించింది. -
షేక్స్పియరే తన పవర్
‘ఏ యుద్ధం ఎందుకు జరిగెనో? ఏ రాజ్యం ఎన్నాళ్లుందో? తారీఖులు, దస్తావేజులు... ఇవి కావోయ్ చరిత్రకర్థం’... మహాకవి మాట తిరుగులేని సత్యం అయినప్పటికీ కొన్నిసార్లు యుద్ధాలు, తారీఖులు, ప్రేమ పురాణాలు, ముట్టడికైన ఖర్చులు... చారిత్రక పరిశోధనకు అవసరం. ఏ సమాచారమూ వృథా పోదు. వర్తమానంలో ఉండి ఆనాటి మొగల్, బ్రిటిష్ ఇండియాలోకి వెళ్లడం అంత తేలిక కాదు. అలుపెరగని పరిశోధన కావాలి. అంతకుముందు కనిపించని ప్రత్యేక వెలుగు ఏదో ఆ పరిశోధనలో ప్రతిఫలించాలి. అందమైన శైలికి అద్భుతమైన పరిశోధన తోడైతే...అదే ‘కోర్టింగ్ ఇండియా’ పుస్తకం. ఫ్రొఫెసర్ నందిని దాస్ రాసిన ‘కోర్టింగ్ ఇండియా: ఇంగ్లాండ్, మొఘల్ ఇండియా అండ్ ది ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్’ పుస్తకం ప్రతిష్ఠాత్మకమైన బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్–2023 గెలుచుకుంది... ఇంట్లో, తరగతి గదిలో, పుస్తకాల్లో, టీవీల్లో విన్న కథల ద్వారా నందిని దాస్‌కు షేక్స్పియర్ ఇష్టమైన రచయితగా మారాడు. ఆ మహా రచయితపై ఇష్టం ఆంగ్ల సాహిత్యంపై ఇష్టంగా మారింది. ఆయన పుస్తకాలు తన మనోఫలకంపై ముద్రించుకుపోయాయి. అలనాటి ప్రయాణ సాహిత్యం నుంచి భిన్న సంస్కృతుల మధ్య వైరు«ధ్యాల వరకు నందినికి ఎన్నో అంశాలు ఆసక్తికరంగా మారాయి. పరిశోధిస్తూ, రాసే క్రమంలో తన మానసిక ప్రపంచం విశాలం అవుతూ వచ్చింది. యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లో నందిని దాస్ ప్రొఫెసర్. షేక్స్పియర్ సాహిత్యం ఆమెకు కొట్టిన పిండి. ఆమె పేరు పక్కన కనిపించే విశేషణం...‘స్పెషలిస్ట్ ఇన్ షేక్స్పియర్ స్టడీస్’ కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీలో బీఏ ఇంగ్లీష్ చేసింది నందిని. ఆ తరువాత స్కాలర్‌షిప్‌పై యూనివర్శిటీ కాలేజి, ఆక్స్‌ఫర్డ్‌లో చేరింది. కేంబ్రిడ్జీ, ట్రినిటీ కాలేజిలో ఎంఫిల్, పీహెచ్డీ చేసింది. ఒక ప్రచురణ సంస్థలో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్‌గా పని చేసిన నందిని సంవత్సరం తరువాత మళ్లీ అకాడమిక్ రిసెర్చ్‌లోకి వచ్చింది. ఇక తాజా విషయానికి వస్తే... ‘ది పవర్ ఆఫ్ గుడ్ రైటింగ్’గా విశ్లేషకులు కీర్తించిన ‘కోర్టింగ్ ఇండియా’ యూరోపియన్ల హింసా ధోరణి గురించి చెప్పింది. రాయబార కార్యాలయాల అసమర్థతను ఎత్తి చూపింది. మొఘల్ రాజకీయాలను ఆవిష్కరించింది. ‘ ఆనాటి బ్రిటన్, ఇండియాలకు సంబంధించి వాస్తవిక చిత్రాన్ని ఆవిష్కరించింది నందిని. మొగల్ రాజుల ఒడిదొడుకుల నుంచి బ్రిటీష్ వైఖరి వరకు ఈ పుస్తకంలో ఎన్నో కనిపిస్తాయి’ అంటాడు బ్రిటీష్ అకాడమీ బుక్‌ప్రైజ్– ఛైర్ ఆఫ్ ది జ్యూరీ ప్రొఫెసర్ చార్లెస్ ట్రిప్. -
ప్రతిభకు మారు పేరు ఆ ఊరు
అది ఆదివాసీ గ్రామం. ఆ ఊరికి సర్పంచ్ ఓ మహిళ. అక్కడ రాజకీయాల్లేవు. ఉన్నదంతా జనంలో ఐకమత్యమే. ఊరిలో అవినీతికి తావు లేదు. అభివృద్ధికి చిరునామాగా మారింది. ఊరంతా సస్యశ్యామలంగా ఉంది. జీవవైవిధ్యతకు ప్రతీకగా నిలిచింది. సర్పంచ్ ప్రతిభకు మారుపేరయింది. తెలంగాణ, కుమ్రుం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, మార్లవాయి గ్రామం. ఆ గ్రామ సర్పంచ్ ప్రతిభ మంగళవారం నాడు (మే, 23వ తేదీ) ఇంటర్నేషనల్ బయో డైవర్సిటీ డే సందర్భంగా ‘తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ’ అవార్డు అందుకున్నారు కనక ప్రతిభ. తన ప్రతిభతో గ్రామాన్ని నందనవనంగా మార్చిన ఆమె సాక్షితో పంచుకున్న విశేషాలివి. ‘‘మహిళా రిజర్వేషన్లో భాగంగా మా పంచాయితీని మహిళలకు కేటాయించారు. చదువుకున్న వాళ్లయితే బాగుంటుందని మా ఊరి వాళ్లందరూ 2019లో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగని నేను ఎక్కువేమీ చదువుకోలేదు. డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగా పెళ్లయింది. ఊరిని బాగు చేయాలనే సంకల్పం ఉంటే ఈ చదువైనా చాలు. మా ఊరి జనాభా 708, మొత్తం కుటుంబాలు 130. ప్రాథమిక పాఠశాల, ఆశ్రమ పాఠశాల కూడా ఉంది. ఇక అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ భవనం ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత 26 మంది మహిళలకు చేతన ఫౌండేషన్ ద్వారా టైలరింగ్‌లో శిక్షణ ఇప్పించి, ఎస్బీఐ– ఆర్‌ఎస్‌ఈటీ సహకారంతో కుట్టు మిషన్లు ఇప్పించాను. వాళ్లకు చేతిలో పని ఉండడానికి ఆశ్రమ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ కుట్టే ఏర్పాటు చేశాం. డ్వాక్రా గ్రూపులు పదకొండున్నాయి. డ్వాక్రా డబ్బుతో కొంతమంది కిరాణా దుకాణాలు పెట్టుకున్నారు. వీథి వీథీ తెలుసు! మా ఊరిలో ప్రతి వీథీ, ప్రతి కుటుంబమూ తెలుసు. బడి వయసు పిల్లలందరినీ బడికి పంపించాలని ఇంటింటికీ వెళ్లి చెబుతుంటాను. అలాగే పదేళ్లలోపు ఆడపిల్లలందరికీ ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకం కింద బ్యాంకు ఖాతాలు తెరిపించాను. పంచాయితీలకు కేంద్ర ప్రభుత్వ సహకారం బాగుంది. వీథులన్నీ సిమెంట్ రోడ్లు వచ్చాయి. అన్ని ఇళ్లకూ టాయిలెట్లున్నాయి. కిరోసిన్ దీపం వెలిగించాల్సిన అవసరం లేదు, అన్ని ఇళ్లకూ కరెంట్ ఉంది. వందకు పైగా ఇళ్లలో దీపం పథకం గ్యాస్ సిలిండర్లున్నాయి. చదువుకున్న వాళ్ల కోసం చిన్నపాటి వీథి గ్రంథాలయం కూడా పెట్టాం. అలాగే హరితహారంలో భాగంగా మొక్కలు నాటాం. గ్రామంలో ఏ మూలకెళ్లినా పచ్చదనం పరిఢవిల్లుతోంది. మంచినీటి సౌకర్యం, పరిశుభ్రతలో భాగంగా ఎప్పటికప్పుడు డ్రైనేజీ శుభ్రం చేయించడం, ప్లాస్టిక్ వాడకంలో విచక్షణ, తడిచెత్త– పొడి చెత్త పట్ల అవగాహన వంటివన్నీ జీవవైవిధ్య పురస్కారం ఎంపికకు ప్రమాణాలయ్యాయి. అందరూ ఇంటిపన్ను కడతారు మా ఊరిలో అంతా క్రమశిక్షణతో నడుచుకుంటారు. అందరూ ఇంటి పన్ను కడతారు. అంతకుముందెప్పుడో ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయి. ఎక్కువమందికి మంచి ఇళ్లున్నాయి. కొంతమంది పెంకుటిళ్లలో ఉంటే, ఇప్పటికీ కొంతమంది మట్టికప్పు ఇళ్లలోనే ఉన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మాత్రం రాలేదు. మా ఊరి వాళ్ల గొప్పమనసు ఏమిటంటే... ఊరి బాగు కోసం ఏ పని చేపట్టినా అంతా కలసి వస్తారు. అందరూ ఇంకుడు గుంతలు తవ్వుకున్నారు. జీవవైవిధ్యత నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాల్లో మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించడంలో సంతోషంగా ముందుకు వస్తారు. వీథులకు రెండువైపులా రకరకాల మొక్కలు నాటాం. గిరి వికాస్ పథకం ద్వారా వ్యవసాయానికి 30 బావులు తవ్వించాం. అంతకు ముందు ఇరవై బావులుండేవి. ఊరిలో ఎక్కువమంది వ్యవసాయం చేస్తారు. ఒక్కొక్కరికి పదెకరాలకు తక్కువ లేకుండా భూమి ఉంది. అసలే భూమి లేని వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లకు ఉపాధి హామీ పనుల కార్డు ఉంది. పొలాలకు గట్లు, చెరువు పూడిక తీయడం, పొలాల్లోకి వెళ్లడానికి మట్టిరోడ్లు వేయడం వంటి పనులు ఉపాధి హామీలో చేయిస్తాం. ఆకలి, పేదరికం మా ఊరి పొలిమేరలకు కూడా రావు. వ్యవసాయంతోపాటు ఆవులు, గేదెలు, మేకలు, కోళ్లు పెంచుకుంటారు. ప్రతి ఒక్కరూ పని చేస్తారు. సంతోషంగా జీవిస్తారు. ► ఉత్తమ గ్రామ పంచాయితీ 2021 అక్టోబర్ ► ఉత్తమ మహిళా సర్పంచ్ 2021 మార్చి 8 ► జాతీయ స్థాయిలో సంసద్ ఆదర్శ గ్రామీణ యోజనలో ఉత్తమ గ్రామ పంచాయితీ ► పేదరికరహిత, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో మొదటి స్థానం ► బెస్ట్ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ అవార్డు 2023 మా ఊరికి సర్పంచ్‌గా నేను తొలి మహిళను. మహిళ అయిన కారణంగా నన్ను తక్కువ చేసి చూడడం మా దగ్గర ఉండదు. అంతా అభిమానంగా ఉంటారు. ఊరందరూ ఒక మాట మీద ఉంటారు కాబట్టి నేను ఇన్ని పనులు చేయగలుగుతున్నాను’’ అని గ్రామ తొలి మహిళగా తన అనుభవాలను వివరించారు ప్రతిభ. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అలనాటి ఆకాశ వాణి
‘‘కలదు ఆ శారదకు వీణ కరములందు కలదు ఈ శారదకు వీణ గళమునందు కలదు ఆ శారద కవుల కవితలందు కలవు కవితలే ఈమె గానామృతమందు శారద కాని శారదకు శారదలోగల సత్కళా సుధా సారదకున్... విశారదకు సాదర పూర్వ నమస్సుమాంజలులు’’ రేడియో కళాకారిణి శారదా శ్రీనివాసన్‌కు ఆచార్య ఆత్రేయ కలం నుంచి జాలువారిన ప్రశంస ఇది. 19.6.1977వ తేదీన ఆత్రేయ స్వహస్తాలతో రాసిన ఈ లేఖ శారదా శ్రీనివాసన్ దగ్గర ఇంకా భద్రంగా ఉంది. ఈ నెల రెండవ తేదీన హైదరాబాద్‌లో ‘లాడ్లీ మీడియా అండ్ అడ్వర్టైజింగ్ అవార్డ్స్ ఫర్ జెండర్ సెన్సిటివిటీ’ ప్రాంతీయ పురస్కారం అందుకున్నారామె. 45 ఏళ్ల కిందటి ఆత్రేయ గారి ప్రశంస, ఇప్పుడు ఈ పురస్కారానికి మధ్య ఆమె అందుకున్న గౌరవాలను లెక్క పెట్టడం సాధ్యం కాని పని. అలాగే ఆమె గళమిచ్చిన పాత్రల సంఖ్య కూడా! వేలల్లో ఉంది. తనకు గుర్తింపు, గౌరవం అన్నీ రేడియోతోనే అన్నారామె. శారదా శ్రీనివాసన్ తన రేడియో ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు. గళం దేవుడిచ్చాడు! ఉచ్చారణ ఇల్లు నేర్పించింది! ‘‘నేను పుట్టింది కృష్ణాజిల్లా, అవనిగడ్డ. మా నాన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగి. అప్పుడు అక్కడ ఉద్యోగం చేసేవారు. నాకు భగవంతుడు చక్కటి గొంతునిచ్చాడు. చక్కగా ఉచ్చరించడం మా ఇంట్లో అలవడింది. ఏ తొందరపాటులోనో ఒకపదంలో ఒక్క ఒత్తును సరిగ్గా పలకకపోయినా సరే ఉపేక్షించేవారు కాదు, ‘ఏం పలికావు? మళ్లీ పలుకు’ అని కోప్పడుతూ ఎప్పటికప్పుడు సరిదిద్దేవారు. మేము తణుకులో ఉన్నప్పుడు నన్నయ భట్టారకుని జయంతి సందర్భంగా పాఠశాల బాలికలకు పద్యపఠనం నిర్వహించారు. నేను కూడా ఓ నాలుగు పద్యాలు కంఠతా పట్టి ఆ పోటీల్లో వినిపించాను. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. బహుమతితో ఇంటికి వస్తే మా నాన్న ఏమన్నారో తెలుసా... ‘ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షం అన్నట్లు, నీకు ప్రథమ బహుమతి వచ్చిందా’ అని నవ్వారు. యాదృచ్ఛికంగా మొదలైంది! మేము విజయవాడ, మాచవరంలో ఉన్నప్పుడు హిందీకాలేజ్లో ప్రవీణ, ప్రచారక్ చేస్తున్న రోజుల్లో అనుకోకుండా వచ్చింది అవకాశం. రేడియో కాంటాక్ట్ కోసం వాయిస్ టెస్ట్ చేశారు. మా లెక్చరర్ చొరవతో వాయిస్ టెస్ట్‌లో పాల్గొనడం, సెలెక్ట్ కావడం జరిగిపోయింది. ఇది 1956–57ల నాటి మాట. అలా మొదలైన నా ఆకాశవాణి ప్రయాణంలో నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. 1995 ఆగస్టులో రిటైరయ్యే వరకు నేను గళమిచ్చిన ప్రతి కార్యక్రమం నాకు ఒక పాఠమే. నన్ను సమగ్రంగా తయారు చేసిన యూనివర్సిటీ రేడియో. నవరసాలూ గొంతులోనే పానుగంటి వారి రచనల్లోని పాతతరం తెలుగు భాషను ఒంటపట్టించుకోవడం కొంచెం శ్రమ అనిపించేది. అంతే తప్ప మరెక్కడా ఇబ్బంది పడలేదు. బాలగంగాధర తిలక్ ‘సుప్తశిల’ నేను చాలా బాగా చేశానని నాకనిపించిన నాటిక. రంగస్థలం మీద నటించేటప్పుడు హావభావాలు ప్రేక్షకులకు కనిపిస్తుంటాయి. రేడియోలో అలా కాదు. నవరసాలనూ గొంతులోనే పలికించాలి. అంతేకాదు, శ్రోతలకు మేము కనిపించడం లేదు కదా అని ఒకే చోట కూర్చుని మాట్లాడుతూ నాటికను రికార్డు చేస్తే జీవం రాదు. ఒక గదిలో నుంచి మరో గదిలోకి వెళ్తున్న సన్నివేశంలో కానీ, ఒక పాత్ర ఇంటి నుంచి బయటకు వెళ్తూ ‘వెళ్లొస్తాను’ అంటూ వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు మొదటి అక్షరం పలకడానికి చివరి అక్షరం పలకడానికి మధ్య మైక్‌కు దూరం వెళ్తేనే ఆ సన్నివేశం శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలను దర్శకులు చెప్పరు. ఎవరికి వారు సాధనలో తెలుసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం... ఉచ్చారణ ఉద్దేశం ఏమిటి? ఎదుటి వారికి తెలియాల్సిన ఒక విషయాన్ని మనం చెబుతున్నామనే కదా! పదాలను ఎక్కడ ఆపాలో, ఎక్కడ కలిపి పలకాలో స్పష్టత లేకపోతే వినేవాళ్లకు విషయం ఎలా తెలుస్తుంది? టీవీలో వార్తలు చదివే వాళ్లు ఈ ఒక్క నియమాన్ని పాటిస్తే బావుణ్ణనిపిస్తుంటుంది. ఉత్సాహాన్నిచ్చింది ఇక నా కుటుంబ విషయానికి వస్తే... చెన్నై నుంచి వచ్చిన ఫ్లూట్ ఆర్టిస్ట్ శ్రీనివాసన్‌తో రేడియోలోనే పరిచయమైంది. పెళ్లి చేసుకున్నాం. మాకు ఒకమ్మాయి నీరద. నాటికల ద్వారా ఎన్నో జీవితాలను ఆయా పాత్రల్లో ఇమిడిపోయినంతగా చదివాను. అందుకే ఎన్నో కోణాలను అర్థం చేసుకోగలిగాను. ముందే చెప్పాను కదా... ఆకాశవాణి అనే యూనివర్సిటీలో పట్టా పొందిన విద్యార్థిని నేను. ఈ రోజు లాడ్లీ్ల వంటి సంస్థ గుర్తించడానికి కారణమూ రేడియోనే. ఎనభై ఎనిమిదేళ్ల వయసులో ఈ అవార్డు నాకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఇప్పటికీ గళం సహకరిస్తూ ఉండడం నా అదృష్టమనే చెప్పాలి’’ అని సంతోషాన్ని వ్యక్తం చేశారు రేడియో ఆర్టిస్ట్, రచయిత శారదా శ్రీనివాసన్. ఆకాశవాణి... నా బడి గుడి! నాటికలు నా ప్రధాన విభాగం. అయినప్పటికీ స్పోకెన్ వర్డ్ ఆర్టిస్ట్‌గా రకరకాల స్క్రిప్టులు చదివాను. సాహిత్యం, చరిత్ర, నవలాపఠనం, వైద్య కథనాలు, మహిళలు – పిల్లల అంశాలు, కార్మికుల కార్యక్రమాలు, పిల్లల పాఠ్యాంశాలు... ఇలా అదీ ఇదీ అని పరిమితం కాకుండా అన్ని విభాగాల్లోనూ నా గొంతు వినిపించాను. యువవాణి మినహా రేడియోలో అన్ని విభాగాల్లోనూ నా గొంతు వినిపించాను. -
Priyaswara Bharti: ప్రేరణనిచ్చే ప్రియస్వరం
పట్టుమని పదేళ్లు కూడా నిండకముందే తండ్రి మరణం, దీనికితోడు ఆర్థిక పరిస్థితులు దిగజారి భవిష్యత్ శూన్యంగా కనిపించింది. విధి వంచించిందని సర్దిచెప్పుకుని ముందుకు సాగుతోన్న తరుణంలో ఎంతో ఇష్టమైన చెల్లి, తల్లి అకాల మరణాలు అమాంతం పాతాళంలోకి లాగినట్టు అనిపించాయి. అయినా ఏమాత్రం భయపడకుండా ఎదురవుతోన్న ఆటుపోట్లను బలంగా మార్చుకుని సామాజిక వేత్తగా, డైరెక్టర్‌గా రాణిస్తోంది ప్రియస్వర భారతి. 21 ఏళ్లకే జీవితానికి సరిపడినన్ని కష్టాలను అనుభవించిన ప్రియస్వర నేడు అవార్డు విన్నింగ్ డాక్యుమెంటరీలు తీస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో చిన్న గ్రామానికి చెందిన ప్రియ స్వరభారతి. నలుగురు సంతానంలో ఒకరు. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రైవేటు స్కూలు టీచర్స్. భారతికి తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు అనుకోకుండా తండ్రికి యాక్సిడెంట్ అయ్యింది. మెరుగైన చికిత్సనందించేందుకు పాట్నాకు తీసుకెళ్లారు. ప్రారంభంలో ఆరునెలలు అనుకున్న చికిత్స మూడేళ్లపాటు కొనసాగింది. దీంతో కుటుంబం మొత్తం అక్కడే ఉండాల్సి వచ్చింది. ఉన్నదంతా ఖర్చుపెట్టి చికిత్స చేయించినప్పటికీ ఫలితం దక్కకపోగా, తండ్రిని కోల్పోయారు. మరోపక్క ఆర్థిక ఆధారం లేక నలుగురూ మూడేళ్లు స్కూలుకు వెళ్లలేదు. ట్యూషన్లు చెబుతూ... తండ్రి చనిపోయాక భారతి తల్లి ఉద్యోగం చేసినప్పటికీ కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. దీంతో తల్లికి సాయపడేందుకు హోమ్ ట్యూషన్స్ చెప్పేది భారతి. ఇదే సమయంలో స్కూలుకు వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో ఎక్స్ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్‌ను నేర్పించే కిల్కారి సంస్థలో చేరింది. అక్కడ సైన్స్ ప్రాజెక్టుపై మక్కువ ఏర్పడడంతో ఎంతో ఆసక్తిగా నేర్చుకునేది. దీంతో 2013లో కిల్కారి నుంచి యూనిసెఫ్‌కు ఎంపికైన 20 మందిలో భారతి ఒకరు. కిల్కారి, యూనిసెఫ్ ద్వారా పిల్లల హక్కుల గురించి వివరంగా తెలుసుకుని తన తోటి వలంటీర్లతో కలిసి ‘బీహార్ యూత్ ఫర్ చైల్డ్ రైట్స్’ పేరుతో సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా పిల్లలకు విద్య, బాలల హక్కులపై అవగాహన కల్పించడం, బాల్యవివాహాలు, మహిళలు, ప్రత్యుత్పత్తి అవయవాల ఆరోగ్యంపై అవగాహన కల్పించేది. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ వివిధ వర్క్‌షాపులు, వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. చెల్లితో కలిసి డైరెక్టర్‌గా... ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అసోసియేషన్, కిల్కారి సంస్థలు రెండు కలిసి పదిరోజుల పాటు డైరెక్షన్ లో ఉచితంగా వర్క్‌షాపు నిర్వహించాయి. అప్పుడు యూనిసెఫ్ అడ్వైజరీ బోర్డు యువ యంగ్ పీపుల్ యాక్షన్ టీమ్‌లో సభ్యురాలిగా కొనసాగుతోన్న భారతి సినిమాటోగ్రఫీపై ఆసక్తితో పదిరోజులపాటు వర్క్‌షాపుకు హాజరైంది. తరువాత తన చెల్లి ప్రియాంతరాతో కలిసి ‘గెలటాలజీ’ డాక్యుమెంటరీ తీసింది. తొమ్మిదో జాతీయ సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ డాక్యుమెంటరీకి స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. తరువాత 2019లో పట్నాను ముంచెత్తిన వరద బీభత్సాన్ని కళ్లకు కట్టేలా ‘ద అన్నోన్ సిటీ, మై ఓన్ సిటీ ఫ్లడెడ్’ పేరుతో మరో డాక్యుమెంటరీ రూపొందించింది. ఈ డాక్యుమెంటరీకి కూడా ఆర్ట్స్ అండ్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్పెషల్ జ్యూరీ అవార్డు వరించింది. 2018 నుంచి డాక్యుమెంటరీలు తీస్తూ జాతీయ, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు పంపిస్తూ అనేక అవార్డులను అందుకుంది. ప్రస్తుతం పట్నా యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ చదువుతున్న భారతి కొన్ని పెద్ద ప్రాజెక్టులకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. అవకాశాలు సృష్టించుకోవాలి అవకాశాలు వాటంతట అవే మన దగ్గరికి రావు. మనమే సొంతంగా సృష్టించుకుని ముందుకు సాగాలి. అప్పుడే జీవితంలో ఎదగగలుగుతాము. అదే నా విజయ రహస్యం. – ప్రియస్వర భారతి -
Srishti Bakshi: గ్రేట్ ఛేంజ్మేకర్
కొన్ని సంవత్సరాల క్రితం...‘ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో తల్లీకూతుళ్లు సామూహిక అత్యాచారానికి గురయ్యారు’ అనే వార్త చదివిన తరువాత శ్రీష్ఠి బక్షీ మనసు మనసులో లేదు. కళ్ల నిండా నీళ్లు. బాధ తట్టుకోలేక తాను చదివింది కుటుంబసభ్యులు, స్నేహితులతో పంచుకుంది. ‘ఇలాంటివి మన దేశంలో సాధారణం’ అన్నారు వాళ్లు. ఈ స్పందనతో శ్రీష్ఠి బాధ రెట్టింపు అయ్యింది. ఇలా ఎవరికి వారు సాధారణం అనుకోవడం వల్లే పరిస్థితి దిగజారిపోతుంది. ఒక దుస్సంఘటన జరిగితే దానిపై ఆందోళన, ఆవేదన వ్యక్తం అవుతుంది తప్ప నిర్దిష్టమైన కార్యాచరణ మాత్రం కనిపించడం లేదు’ అనుకుంది. ఆరోజంతా శ్రిష్ఠి అదోలా ఉంది. ఈ నేపథ్యంలోనే తన వంతుగా ఏదో ఒకటి చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. మహిళలకు సంబంధించిన భద్రత, హక్కుల గురించి అవగాహన కలిగించడానికి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకుంది. దీనికి ముందు రకరకాల కేస్‌స్టడీలు, పరిశోధన పత్రాలు చదివింది. ఆధునిక సాంకేతిక జ్ఞానంతో అపూర్వ విజయాలు సాధించిన సాధారణ మహిళల గురించి అధ్యయనం చేసింది. బెంగాల్‌లోని ఒక పనిమనిషి సరదాగా యూట్యూబ్‌లో వంటలకు సంబంధించిన రకరకాల వీడియోలను పోస్ట్ చేసేది. కొద్దికాలంలోనే ఆమె యూట్యూబ్ స్టార్‌గా ఎదిగి ఆర్థికంగా బాగా సంపాదించడాన్ని స్ఫూర్తిగా తీసుకుంది. ఆశీర్వాదం తీసుకుంటూ... తమిళనాడు గ్రామీణ ప్రాంతానికి చెందిన తల్లీకూతుళ్లు వాట్సాప్ కేంద్రంగా దుస్తుల వ్యాపారం మొదలుపెట్టి ఘన విజయం సాధించారు... ఇలాంటి ఎన్నో స్ఫూర్తిదాయక విజయాల గురించి తెలుసుకుంది. ఇలాంటి ఎన్నో విజయగాథలను తన పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనుకుంది. ‘టెక్నాలజీతో సులభంగా అనుసంధానం అయ్యే ఈరోజుల్లో చాలామంది మహిళలు దానికి దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం డిజిటల్ నిరక్షరాస్యత. వారికి డిజిటల్ నాలెడ్జ్‌ను దగ్గర చేస్తే ఎన్నో అద్భుతాలు సాధించగలరు’ అనుకుంది శ్రిష్ఠి బక్షీ. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల గుండా 3,800 కి.మీల పాదయాత్ర చేసింది. ఈ యాత్రలో ఎంతోమంది మహిళలు ఎన్నో సమస్యలను తనతో పంచుకున్నారు. పరిష్కార మార్గాల గురించి లోతైన చర్చ జరిగిదే. ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించింది. తాజా విషయానికి వస్తే... హక్కుల నుంచి సాధికారత వరకు వివిధ విషయాల్లో విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన శ్రిష్టి బక్షీని ఐక్యరాజ్యసమితి ప్రతిష్ఠాత్మక ‘ఛేంజ్మేకర్’ అవార్డ్ వరించింది. 150 దేశాలకు చెందిన 3000 మంది మహిళల నుంచి ఈ అవార్డ్‌కు శ్రిష్ఠిని ఎంపికచేశారు. ‘యూఎన్ ఎస్డీజీ యాక్షన్ అవార్డ్‌ల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సోషల్ ఛేంజ్మేకర్స్తో మాట్లాడే అవకాశం లభిస్తుంది. వారి అనుభవాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. వ్యక్తిగతంగానే కాదు సమష్టిగా కూడా సమాజం కోసం పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది’ అంటుంది శ్రిష్ఠి. ‘సమీకరణ, స్ఫూర్తి, ఒకరితో ఒకరు అనుసంధానం కావడం ద్వారా సుందర భవిష్యత్‌ను నిర్మించుకోవచ్చు. మనం ఎలా జీవిస్తే మంచిది అనే విశ్లేషణకు ఇవి ఉపయోగపడతాయి. పునరాలోచనకు అవకాశం ఉంటుంది’ అంటుంది ఎస్డీజీ యాక్షన్ క్యాంపెయిన్ కమిటీ. ఇ–కామర్స్ స్ట్రాటజిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న శ్రిష్ఠి హాంకాంగ్‌లో పెద్ద ఉద్యోగం చేసేది. ‘నా జీవితం ఆనందమయం’ అని ఆమె అక్కడే ఉండి ఉంటే ‘ఛేంజ్మేకర్’గా యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించేది కాదు. టెక్నాలజీతో సులభంగా అనుసంధానం అయ్యే ఈరోజుల్లో చాలామంది మహిళలు దానికి దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం డిజిటల్ నిరక్షరాస్యత. వారికి డిజిటల్ నాలెడ్జ్‌ను దగ్గర చేస్తే ఎన్నో అద్భుతాలు సాధించగలరు. ఆ వార్త చదివిన తరువాత తన కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. ‘నేనేం చేయలేనా!’ అని భారంగా నిట్టూర్చింది. అంతమాత్రాన శ్రిష్ఠి బక్షీ బాధలోనే ఉండిపోలేదు. బాధ్యతతో ముందడుగు వేసింది... -
భారత సంతతి యూకే మంత్రి సుయెల్లాకు క్వీన్ అవార్డు
లండన్: భారత సంతతికి చెందిన బ్రిటన్ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మాన్ (42) మొట్టమొదటి క్వీన్ ఎలిజబెత్–2 ఉమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు. లండన్‌లో శనివారం జరిగిన 20వ ఆసియన్ అఛీవర్స్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆమె తల్లిదండ్రులు అవార్డును అందుకున్నారు. బ్రేవర్మన్ తల్లి తమిళ మూలాలున్న ఉమ, తండ్రి గోవాకు చెందిన క్రీస్టీ ఫెర్నాండెజ్. సుయెల్లా లండన్‌లో జన్మించారు. బ్రిటన్‌లో పలు రంగాల్లో విజయాలు సాధించిన దక్షిణాసియాకు చెందిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేస్తుంటారు. -
శ్రీజేశ్కు ‘వరల్డ్ గేమ్స్ అథ్లెట్’ అవార్డు
భారత హాకీ జట్టు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ ప్రతిష్టాత్మక ‘వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. అడ్వెంచర్ క్రీడాకారుడు అల్బెర్టో గైన్స్ లోపెజ్ (స్పెయిన్), వుషూ ప్లేయర్ గియోర్డనో (ఇటలీ)లతో శ్రీజేశ్ పోటీ æపడ్డాడు. ఓటింగ్‌లో శ్రీజేశ్కు 1,27,647 ఓట్లు రాగా, లోపెజ్కు 67, 428, మైకేల్‌కు 52,046 ఓట్లే పోలయ్యాయి. భారత్ తరఫున 2020లో మహిళల హాకీ కెప్టెన్ రాణి రాంపాల్‌కు ఈ అవార్డు లభించింది. -
Sridhar Bevara: ఆకలినీ.. అవనినీ.. అవమానాలనూ జయించాడు
ఆకలితో జరిగిన యుద్ధంలో ఓడిన ప్రతిసారి తనను తాను రక్షించుకున్నాడు. ఈ క్రమంలో మనసుకు గాయమైనా లక్ష్యం కోసం భరించాడు. తనను వేధిస్తున్న సమాజానికి సరైన సమాధానం చెప్పాలన్న కాంక్షతో అడుగు ముందుకేశాడు. తరుముకొచ్చే అవసరం నుంచి.. సృజనాత్మక ఆలోచన పుట్టుకొచ్చింది. అప్పటి వరకూ అసాధ్యమైన పనిని సులభసాధ్యం చేసే.. సరికొత్త ఆలోచనై మెరిసింది. అదే అతన్ని విజయతీరాలకు చేర్చింది. తన ప్రతిభతో ఆకలినీ.. అవనినీ.. అవమానాలనూ జయించాడు. ప్రతి ఓటమి నుంచి పాఠం నేర్చుకుంటూ.. వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగాడు. ఒకప్పుడు కోడిని చంపి.. చికెన్ డెలివరీ చేసిన అతనే.. ఈ రోజు ప్రపంచ వాణిజ్య విభాగంలో తనకంటూ ఓ పేజీని సృష్టించుకున్నాడు. ఆకలి, ఆవేదనలో నుంచి పుట్టికొచ్చిన అక్షరాలను ఆకళింపు చేసుకుని ప్రపంచస్థాయి రచయితగా ఎదిగాడు. పేదరికంతో మొదలైన అతని జీవన ప్రస్థానం.. నేడు పదుగురికి సాయం చేసే స్థాయికి చేరింది. మేధో శ్రమకే అంకితమైన ఒక అసమాన యాత్రికుని ప్రయాణమిది. ఆ యువకుడి పేరే శ్రీధర్ బెవర. సాక్షి, విశాఖపట్నం: శ్రీధర్ బెవర పుట్టింది శ్రీకాకుళం జిల్లా రాజాం. కుటుంబాన్ని పేదరికం వెక్కిరించడంతో తల్లి శ్రీధర్‌తో పాటు తన నలుగురు పిల్లలను ఒక్కొక్కరిని ఒక్కో బంధువు ఇంట్లో పెట్టింది. అక్కడైనా తన పిల్లలకు కష్టాలు లేకుండా మూడు పూటలా తిండి దొరుకుతుందనీ.. చక్కగా చదువుకుంటారనీ.! అలా ఒకే గూటి పక్షులను వేర్వేరు ప్రాంతాలకు పంపించేసింది. శ్రీధర్‌ను గుంటూరులో, శ్రీధర్ అక్క శైలజను వాళ్ల పెదనాన్న ఇంట్లో, అన్నయ్య మురళి, తమ్ముడు గిరిధర్‌ను విశాఖలోని బంధువుల ఇంటికి అప్పగించింది. శ్రీధర్ గుంటూరులోని పెద్దమ్మ వాళ్ల అబ్బాయి ఇంట్లో ఆశ్రయం పొందారు. పదో తరగతి వరకు అక్కడే కాలం వెళ్లదీశారు. చివరి పరీక్ష రాసి ఇంటికి వచ్చిన రోజున.. ఇక నుంచి ఇక్కడ ఉండొద్దని బంధువులు ఆయనకు తెగేసి చెప్పేశారు. అక్కడే.. కొత్త ఆలోచనలకు బీజం ఏదైనా పనిలో చేరి సమస్యల నుంచి బయటపడాలని భావించాడు శ్రీధర్. విశాఖ డెయిరీలో పాల ప్యాకెట్లు తీసుకుని టీ దుకాణాలకు డెలివరీ బాయ్‌గా ప్రస్థానం ప్రారంభించారు. కష్టపడుతున్నా.. ఆదాయం రాకపోవడంతో చికెన్ దుకాణంలో మాంసం కొట్టేందుకు పనికి కుదిరాడు. కోడిని చంపడం వంటి దృశ్యాలతో చూసిన శ్రీధర్ బెదిరిపోయి జ్వరం బారిన పడ్డారు. కూటి కోసం ఆ పనిలోనే కొనసాగాడు. ఆ సమయంలోనే కొత్త ఆలోచనలకు బీజం పడింది. అపార్ట్మెంట్లు, ఇంటింటికీ వెళ్లి ముందు రోజే చికెన్ ఆర్డర్ తీసుకునేవాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆర్డర్లు సరఫరా చేసేవాడు. అక్క శైలజ పేరుతో చిన్నపాటి వ్యాపారం ప్రారంభించాడు. మంచి లాభాలొచ్చినా.. రేయింబవళ్లు పని చేయడంతో శ్రీధర్ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఫలితంగా ఆ వ్యాపారానికి కూడా మధ్యలోనే స్వస్తి చెప్పాడు. కుంగదీసిన అన్నయ్య మరణం ఇంతలో అన్నయ్య మురళీధర్ క్యాన్సర్ బారిన పడి 2017లో కన్నుమూశాడు. దీంతో అందరూ ఉన్నా ఒంటరిగా మారిపోయిన శ్రీధర్.. ఆ బాధ నుంచి కోలుకుని అన్నయ్య పేరుతో బీఎంఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. పేద పిల్లలకు విద్యాదానం, ప్రజలకు నిత్యావసరాల పంపిణీ, ఇతర సేవాకార్యక్రమాలు చేపడుతున్నాడు. ఆకలి ముందు చదువు ఓడిపోయింది పదో తరగతి పరీక్షలో మంచి మార్కులతో పాసయ్యారు శ్రీధర్. గుంటూరు నుంచి బయటకు వచ్చిన తర్వాత విశాఖలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్లో చేరారు. ఆకలి కారణంగా చదువులో వెనకబడిపోయాడు. అన్నయ్య మురళి, తమ్ముడు గిరిధర్ కూడా బంధువుల ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ముగ్గురూ కలిసి ఒకే రూమ్‌లో జీవనం ప్రారంభించారు. అన్నయ్య మురళి తండ్రిగా బాధ్యతను భుజానికెత్తుకున్నారు. అప్పటికే అన్నయ్య మురళి పెద్దింటి అమ్మాయి లక్ష్మీ భారతిని ప్రేమించి.. పెళ్లి చేసుకుని రూమ్‌కు తీసుకొచ్చేశారు. ఆ ముగ్గురితో పాటు లక్ష్మీభారతి కూడా అదే చిన్న రూమ్‌లో తలదాచుకుంది. తల్లిలా వారిని లాలించింది. ఆర్థిక సమస్యలు.. ఆకలి బాధలతో చదువుపై దృష్టి సారించలేకపోయారు శ్రీధర్. ఇంటర్లో తప్పారు. దీంతో తను కన్న కలలన్నీ కల్లలయ్యాయ్. తాజ్‌లో వెయిటర్.. డిగ్రీలో ఫెయిల్ విశాఖలోని తాజ్ హోటల్లో వెయిటర్ ఉద్యోగాలు పడటంతో శ్రీధర్ అక్కడ పనికి చేరాడు. బ్యాంకెట్ వెయిటర్‌గా 14 గంటల పాటు నిలబడి పనిచేసేవాడు. ఉదయం 10 నుంచి రాత్రి ఒంటి గంట వరకు పని పూర్తి చేసి.. ఆ సమయంలో వాహనాలు లేక 5 కిలోమీటర్లు నడుచుకుంటూ రూమ్‌కు వెళ్లేవాడు. ఆ సమయంలో పోలీసులు శ్రీధర్‌ను అదుపులోకి తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. క్రమంగా వెయిటర్‌గా మంచి గుర్తింపు వచ్చింది. వైజాగ్‌కు ప్రముఖులు ఎవరొచ్చినా సర్వ్ చేసేందుకు శ్రీధర్‌నే ఎంపిక చేసే వారు. వెయిటర్‌గా చేస్తూనే బీకామ్‌లో చేరాడు. పని ఒత్తిడితో మూడేళ్ల డిగ్రీ పూర్తయ్యే సరికి 15 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. కొత్త జీవితం వైపు అడుగులు ఎదుగు బొదుగూ లేని జీవితంతో పోరాటం చేస్తున్న శ్రీధర్‌కు అన్నయ్య మురళీ మాటలు కొత్త జీవితం వైపు అడుగులు వేసేలా చేశాయి. అప్పటికే దుబాయ్‌లో స్థిరపడ్డ మురళీ.. శ్రీధర్‌ను డిగ్రీ పూర్తి చేసి ఎంబీఏ చేయాలని సూచించాడు. ఆయన మాట ప్రకారం వాటిని పూర్తి చేసిన శ్రీధర్ దుబాయ్ వెళ్లిపోయాడు. అంతే.. అక్కడి నుంచి శ్రీధర్ జీవితం పూర్తిగా మారిపోయింది. చిన్న చిన్న కంపెనీల్లో ఉద్యోగం మొదలు పెట్టిన ఆయన.. ఎల్జీ, పానాసోనిక్ కంపెనీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. మళ్లీ ఇండియా వచ్చి ఐఐఎం–అహ్మదాబాద్‌లో అడ్వాన్స్డ్ బిజినెస్ కోర్సు చదివి.. 37 ఏళ్లకే జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగాడు. పానాసోనిక్ మిడిల్ ఈస్ట్–ఆఫ్రికా విభాగం ఇన్చార్జిగా నియమితులయ్యారు. రచయితగా.. రికార్డు.. ఆకలి, ఆవేదన నుంచే అక్షరాలు ధ్వనిస్తాయన్నది అక్షర సత్యమని శ్రీధర్ కవిత్వం వింటే అర్థమవుతుంది. చిన్నతనం నుంచి కవితలు, కథలు రాయడం అలవాటు చేసుకున్న శ్రీధర్.. క్రమంగా మంచి రచయితగా మారారు. తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా కొన్నేళ్ల కిందట మూమెంట్ ఆఫ్ సిగ్నల్ అనే పుస్తకాన్ని ఇంగ్లిష్‌లో రచించారు. ఇది అమెజాన్‌లో బెస్ట్ సెల్లర్‌గా రికార్డు సృష్టించింది. ప్రపంచంలో ప్రసిద్ధ రచయితలతో పాటు సాహితీ విమర్శకులు.. ఈ పుస్తకానికి ప్రశంసల జల్లు కురిపించారు. నాయకత్వ లక్షణాలపై శ్రీధర్ రాసిన ‘ది రోరింగ్ ల్యాంబ్స్’ వ్యక్తిత్వ వికాస నవల చరిత్ర సృష్టించింది. ఈ–కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ నిర్వహించిన పాపులర్ బుక్స్ ఆఫ్–2021లో శ్రీధర్ ‘ది రోరింగ్ ల్యాంబ్స్’ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. తొమ్మిది విభాగాల్లో ఐదేసి పుస్తకాల చొప్పున పోటీ నిర్వహించింది. ఇందులో ది రోరింగ్ ల్యాంబ్స్ పుస్తకం బిజినెస్ అండ్ ఎకనమిక్స్ విభాగంలో స్థానం దక్కించుకుంది. ఈ పోటీల్లో అన్ని విభాగాల్లోనూ చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ రచయిత శ్రీధర్ కావడం విశేషం. కొన్నేళ్లుగా బిజినెస్ అండ్ ఎకనమిక్స్ విభాగంలో అమెరికాకు చెందిన రచయితల పుస్తకాలే మొదటిస్థానంలో నిలిచేవి. తొలిసారిగా ఓ భారతీయ రచయిత ఆ రికార్డుని తుడిచిపెట్టేసి నంబర్ వన్‌గా అవతరించారని అమెజాన్ సంస్థ ప్రశంసించింది. అంతే కాదు.. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగానూ శ్రీధర్ తన ప్రస్థానాన్ని సాగిస్తున్నారు. చిన్నప్పటి నుంచి సమస్యలు చుట్టిముట్టినా.. పడిలేచిన కెరటం లా పైకెగిరిన అతని జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిద్దాం. పారిశ్రామికవేత్తగా పయనం తాను పనిచేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి పారిశ్రామికవేత్తగా ప్రయాణం ప్రారంభించాడు శ్రీధర్. అన్నయ్య పేరుతో బీఎంఆర్ ఇన్నోవేషన్స్ అనే ఫైనాన్షియల్ కన్సెల్టెన్సీ కార్పొరేట్ సంస్థను ప్రారంభించాడు. రుణం పొందేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలు పడే ఇబ్బందుల నుంచి గట్టెక్కించి.. రుణ మంజూరుకు సహాయం చేసేదే ఈ సంస్థ. పలు దేశాలకు ఈ సంస్థ రుణాలు మంజూరు చేసింది. మన కేంద్ర ప్రభుత్వానికి కూడా సహాయం అందించడం విశేషం. ఇటీవలే గోవా ప్రభుత్వం కన్వెన్షన్ సెంటర్ స్థాపించేందుకు రుణ మంజూరు ప్రక్రియ శ్రీధర్ కంపెనీతోనే జరిగింది. దీంతో శ్రీధర్‌ను గోవా ప్రభుత్వం స్టేట్ ఇన్నోవేషన్ కౌన్సిల్‌కు మెంటర్‌గా నియమించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇన్వెస్ట్మెంట్ ఇండియా సంస్థతో కలిసి దేశానికి వివిధ పనులకు సంబంధించి రుణాల మంజూరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం కూడా శ్రీధర్‌తో భేటీ అయ్యింది. ఒకప్పుడు ఆకలి తీర్చుకునేందుకు పని దొరుకుతుందని ఎదురు చూడగా... ఇప్పుడు అనేక దేశాలు శ్రీధర్ బెవర కోసం ఎదురు చూస్తున్నాయి. ఇదీ కదా.. అసలైన విజయమంటే.! -
కాకతీయం.. చారిత్రక నృత్య సౌరభం
ప్రజల్లో చైతన్యం నింపేలా కూచిపూడి నృత్యకళకు ఆధునికతను జోడించారామె. కాలం పరిచయం చేస్తున్న నృత్యరీతులను కళ్లకు అద్దుకున్నారు. మన సంస్కృతిని రాబోయే తరాలకు తెలియజేయాలనే తపనతో నృత్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. చారిత్రక అద్భుత కళా సౌందర్యాన్ని మన ముందుకు అంచెలంచెలుగా తీసుకువస్తున్నారు ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి, తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అవార్డు గ్రహీత డాక్టర్ జి.పద్మజారెడ్డి. కాకతీయుల కాలంలో తెలుగు నేలను అసమాన ధైర్య సాహసాలతో, అత్యంత సమర్థ వంతంగా పరిపాలించిన రాణి రుద్రమదేవి మేనమామ జాయపసేనాని. ఆయన రచించిన ‘నృత్యరత్నావళి’ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ‘కాకతీయం’ అనే నృత్య దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించి, 2017లో ప్రదర్శించారు పద్మజారెడ్డి. ఆ తరువాయి భాగం నేటి సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో కాకతీయం–2 పేరుతో ప్రదర్శన ఇస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఆమె నృత్య అకాడమీకి వెళ్లినప్పుడు శిష్యబృందంతో సాధన చేస్తూ కనిపించారు. ‘సాక్షి’తో ముచ్చటించారు. ‘‘శాస్త్రీయ నృత్యరీతులు అనగానే మనకు కూచిపూడి, భరతనాట్యం వంటివి కళ్లముందు నిలుస్తాయి. కానీ, తెలంగాణ రాష్ట్రానికి ఓ ప్రత్యేకమైన నృత్యరీతి ఉంది. అదే కాకతీయం. కాకతీయుల నృత్యకళ అనగానే మనకు సాధారణంగా పేరిణి నృత్యం గుర్తుకు వస్తుంది. కానీ, జాయపసేనాని రచించిన ‘నృత్యరత్నావళి’లోని నృత్యరీతులను చూస్తే వాటిని పరిచయం చేయడానికి ఒక జీవితకాలం సరిపోదేమో అనిపిస్తుంది. సముద్రమంతటి ఆ కళను నేను ఏ కొద్దిగానైనా పరిచయం చేయగలిగితే అదే పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఏడేళ్ల కృషి కూచిపూడి నృత్యకారిణిగా ఐదు దశాబ్దాలుగా ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ వచ్చాను. సత్కారాలు పొందాను. ఒకానొక సందర్భం లో రచయిత పప్పు వేణుగోపాలరావు ఆంగ్లంలోకి అనువదించిన ‘నృత్యరత్నావళి’ పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు ఇంత మంచి కళారీతిని పరిచయం చేయకుండా ఉండగలమా?! అంతటి సమర్థత నాలో ఉందా?! అనే ఎన్నో సందేహాలు తలెత్తాయి. విజయదుంధుభి వేళ ఆనందహేల, శృంగార, క్రోధ, కరుణ.. ఇలా నవరసాల కాకతీయ సౌరభాలు ఈ నృత్యరీతుల్లో కనిపిస్తాయి. ఇదొక సవాల్. నేను గతంలో చేసిన నృత్యరీతులన్నీ సవాల్‌గా తీసుకుని చేసినవే. ఈ కళారూపాన్ని కూడా నేటి ప్రజలకు పరిచేయాల్సిందే అనుకున్నాను. దీంట్లో భాగంగా వరంగల్లోతో పాటు ఎన్నో గ్రంథాలయాలు, కాకతీయుల గుడులన్నీ సందర్శించాను. గైడ్స్‌తో మాట్లాడాను. పరిశోధకులను కలిశాను. ఏడేళ్లుగా ‘కాకతీయం’ తప్ప నా మనసులో మరో ఆలోచన లేదు. అంతగా ఈ కళలో మమేకం అయిపోయాను. ఆన్‌లైన్‌లోనూ సాధన పదిహేనేళ్లుగా ప్రణవ్ నృత్య అకాడమీ ద్వారా దాదాపు 700 మంది శిష్యులు నృత్యంలో ప్రావీణ్యం సాధించారు. నా దగ్గరకు వచ్చే శిష్యుల్లో ఆరేళ్ల వయసు నుంచి పాతికేళ్ల వయసు వారి వరకు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం చేసిన కాకతీయం పార్ట్ 1 కి విశేష స్పందన వచ్చింది. ఆ తర్వాత రెండవభాగాన్ని తీసుకువద్దామని రెండేళ్ల క్రితమే సాధనకు శ్రీకారం చుట్టాను. అయితే, కరోనా కారణంగా నృత్యక్లాసులు ఆన్లైన్లో తీసుకోవాల్సి వచ్చింది. పిల్లలు కూడా చురుకుదనం, ఆసక్తితో నేర్చుకున్నారు కాబట్టి ఈ నృత్యరీతుల్లో నిష్ణాతులు అయ్యారు. ప్రస్తుతం కొన్ని రోజులుగా అకాడమీలోనే శిక్షణ జరుగుతోంది. సామాజిక సమస్యలపై అవగాహన శాస్త్రీయ నృత్యం అనగానే పురాణేతిహాస ఘట్టాలే ప్రదర్శిస్తారు అనుకుంటారు. కానీ, ఈ నృత్యం ద్వారా సమాజ సమస్యలను అద్దంలా చూపుతూ, వాటికి పరిష్కారం కూడా సూచించే కళారీతులను ప్రదర్శించాను. వాటిలో భ్రూణహత్యలు, ఎయిడ్స్ పై అవగాహన, నమస్తే ఇండియా, సీజన్ ఆఫ్ ఫ్లవర్స్‌తో పాటు పురాణేతిహాసాలను నృత్యరూపకాల్లో ప్రదర్శించాను. మనకు కూచిపూడి అనగానే సిద్ధేంద్రయోగి, భరతనాట్యం అనగానే భరతముని పేరు గుర్తుకు వస్తాయి. అలాగే, కాకతీయం అనగానే జాయప పేరు గుర్తు రావాలన్నదే నా తపన’’ అంటూ శిష్యులవైపు కదిలారు ఈ నృత్యకారిణి. వందమంది శిష్య బృందంతో నృత్యరత్నావళిలోని పిండి, గొండలి, రాసకం, పేరిణి, శివప్రియం, కందుక, లాస్యాంగం, చాలన.. నృత్యరీతులను కాయతీయంలో ప్రదర్శిస్తున్నారు పద్మజారెడ్డి. కాల ప్రవాహంలో కళలు కనుమరుగు కాకుండా కాపాడేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్క కళాహృదయానికి ఈ సందర్భంగా అభివాదం చెబుదాం. నృత్యరూపకంలో... – నిర్మలారెడ్డి -
Haut Monde Mrs India Worldwide: ప్రతిభా షా
ఉద్యోగం చేసి అలసిపోయి..అబ్బా చాలా కష్టపడ్డాం... అనుకునే వాళ్లు కొందరైతే...ఈ ఉద్యోగం ఇంకెన్నాళ్లు చేస్తాం? ఇక చాలు విసుగొస్తుంది. ఇంకేదైనా కొత్తగా నేర్చుకుందాం! అని సరికొత్త ఉత్సాహంతో విభిన్న రంగాల్లో దూసుకుపోతుంటారు మరికొందరు. ఈ కోవకు చెందిన వ్యక్తే అమిషా సేథీ. రచయితగా... వెల్నెస్ కోచ్‌గా... గ్లోబల్ మార్కెటింగ్ కన్సల్టెంట్‌గా విజయవంతంగా రాణిస్తూనే.. తాజాగా ప్రతిష్టాత్మక ‘హౌట్ మొండే మిసెస్ ఇండియా వరల్డ్‌వైడ్– 2021’ పదో సీజన్ విన్నర్‌గా నిలిచి, కిరీటాన్ని కైవసం చేసుకుంది. అమిషా రాజ్‌కోట్‌లో పుట్టినప్పటికీ పెరిగిందంతా ఢిల్లీలోనే. బాల్యంలో స్నేహితులతో కలిసి డ్యాన్స్‌షోలు చూడడం. థ్రిల్లర్, రొమాంటిక్ నవలలు చదువుతూ... సినిమాలు చూస్తూనే చదువులో మంచి గ్రేడ్లు తెచ్చుకునేది. తను చూసిన డ్యాన్స్షోల ప్రభావంతో చిన్ననాటి నుంచి కొరియోగ్రాఫర్ అవ్వాలని కలలను కనేది. కానీ వివిధ కారణాలతో కొరియోగ్రఫీ చేయలేకపోయింది. దీంతో ఇంటర్మీడియట్ అయ్యాక నోయిడాలోని బిజినెస్ స్కూల్లో ఎమ్బీఏ చదివింది. తరవాత చికాగోలోని‘ కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్’లో ఎగ్జిక్యూటివ్ స్కాలర్స్ ప్రోగ్రామ్ చేసింది. బడా కంపెనీలకు కన్సల్టెంట్‌గా.. అమిషా చదువు పూర్తయిన వెంటనే ఎయిర్‌టెల్‌లో ఉద్యోగిగా చేరింది. ఇక్కడ నాలుగేళ్లు పనిచేసాక, బ్లాక్‌బెర్రీ కంపెనీకి మారింది. ఈ రెండు కంపెనీలలో వివిధ హోదాల్లో పనిచేసింది. బ్లాక్‌బెర్రీలో బ్రాండ్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా, ఎయిర్ ఏసియాలో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా, జఫీన్లో గ్లోబల్ సీఎమ్వోగా అత్యుతమ సేవలందించింది. అనేక బడా కంపెనీలకు కన్సల్టెంట్‌గా అమిషా అందించిన సేవలకుగాను.. వరల్డ్ ఉమెన్ లీడర్షిప్ కాంగ్రెస్ ఇచ్చే ‘యంగ్ ఉమెన్ రైజింగ్ స్టార్’, ద ఏసియా పసిఫిక్ యంగ్ ఉమెన్ అచీవర్స్ అవార్డు, సీఎన్‌బీసీ యూత్ అచీవర్స్ అవార్డు, మార్కెటింగ్ ఎక్స్‌లెన్స్ లాంటి ఎన్నో అవార్డులు వరించాయి. రచయిత నుంచి మోటివేషనల్ స్పీకర్ వరకు... కన్సల్టెంట్‌గా విజయవంతంగా దూసుకుపోతూ, అనేక ఉన్నతస్థాయి పదవుల్లో తనని తాను నిరూపించుకున్న అమిషాకు గ్రంథాలు, శిల్పాల మీదకు ఆసక్తి మళ్లింది. దీంతో వివిధ గ్రంథాలను చదువుతూ అనేక విషయాలు తెలుసుకునేది. గ్రంథాలను చదివేటప్పుడు తనకు వచ్చిన ఆలోచనలను కాగితం మీద పెట్టేది. అలాగే వివిధ భాషల్లో తను చదివిన గ్రంథాలను అందరూ చదివేందుకు వీలుగా అనువాదాలు చేసింది. ఇలా అమిషా రాసి పుస్తకం ‘ఇట్ డజంట్ హర్ట్ టు బి నైస్’ బెస్ట్‌సెల్లర్ బుక్‌గా నిలిచింది. పుస్తకాల ప్రమోషన్లో భాగంగా అమిషా మాటతీరు ఆసక్తికరంగా ఉండడంతో, ‘‘అంతా ఇంకా మాట్లాడండి’’ అంటూ ప్రోత్సహించడంతో అమిషా మోటివేషనల్ స్పీకర్‌గా మారింది. ప్రతి సెషన్‌కు ఏం మాట్లాడాలి? ఆరోజు ఏం సందేశం ఇవ్వాలి... అని బాగా సన్నద్ధమయ్యేది. ఏన్షియంట్ టైమ్‌లెస్ టెక్నిక్స్, మెడిటేషన్, ఫన్ గేమ్స్, న్యూరోసైన్స్, సైకలాజికల్ టెస్టులను వివిధ వర్క్‌షాప్స్‌లో అందిస్తూ తన కంటెంట్‌ను మెరుగుపరుచుకుంది. ఇవేగాక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్, ఆసుపత్రులు, సపోర్ట్ సెంటర్లలో తరచూ హ్యాపీనెస్ సెషన్లను నిర్వహిస్తుండేది. వెల్నెస్కోచ్.. ఫిట్‌నెస్‌కు బాగా ప్రాముఖ్యతనిచ్చే అమిషా ‘ఏజ్ రివర్సల్ థెరపీస్’, యోగా, మెడిటేషన్, ఆధునిక వ్యాయామాలపై ఆసక్తితో వాటి గురించి లోతుగా తెలుసుకుని తను ఆచరించడంతోపాటు.. ఫిట్‌గా ఎలా ఉండాలో తోటి వాళ్లకు నేర్పించేంత ప్రావీణ్యాన్ని సంపాదించింది. తన ఫిటెనెస్, ఆకర్షించే రూపం, తెలివితేటలతో బెంగళూరు తరపున పాల్గొని ప్రతిష్టాత్మక హౌట్ మొండే మిసెస్ ఇండియా వరల్డ్‌వైడ్–2021 సీజన్–10 విజేతగా నిలిచింది. యూఏఈలో జరిగిన ఈ పోటీలో 21 దేశాల నుంచి అతివలు పాల్గొనగా, అందులో 96 మంది ఫైనలిస్టులలో గ్లామర్, గుడ్‌లుక్స్, తెలివితేటల ప్రతిభ ఆధారంగా అమిషా సేథీ టైటిల్ విన్నర్‌గా నిలిచింది. ‘‘జీవితంలో విజయం, ఓటమి రెండూ లేవు. జీవితమంటే ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయడమే. ఈ సూత్రం నమ్మే నేను ఈ స్థాయికి ఎదిగాను.’’ అంటూ అమిషా నేటి యువతరానికి ప్రేరణగా నిలుస్తోంది. -
అపర్ణ సినీ ప్రపూర్ణ
తండ్రి సినిమా క్రిటిక్, తల్లి కాస్ట్యూమ్ డిజైనర్. ఈ దంపతుల పదేళ్ల కూతురు..ఓ రోజూ ఉదయాన్నే బ్రష్ చేసుకుంటూ..‘‘అమ్మా నేను భవిష్యత్‌లో మంచి నటిని కాబోతున్నాను’ అని చెప్పింది. తల్లిదండ్రులు ఇద్దరూ సినీపరిశ్రమతో సంబంధాలు ఉన్నవారే అయినప్పటికీ తమ చిన్నారి చెప్పిన బుజ్జిబుజ్జి మాటలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ అ చిన్నారి పదహారేళ్లకే సత్యజీత్ రే సినిమాలో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అప్పుడు ఆరంభమైన అపర్ణాసేన్ ప్రయాణం నటిగా, దర్శకురాలిగా, స్క్రీన్ రైటర్‌గా... ఎడిటర్‌గా అంచలంచెలుగా ఎదుగుతూ దేశంలోనే పాపులర్ వ్యక్తుల జాబితాలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. ప్రస్తుతం 75 ఏళ్ల వయసులోనూ ‘ద రేపిస్ట్’ సినిమా తీసి ప్రతిష్టాత్మక ‘కిమ్ జిసెక్’ పురస్కారాన్ని అపర్ణ గెలుచుకున్నారు. అనేక అంతర్జాతీయ చిత్రాలతో పోటీ పడి ఆసియాలోనే అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును దక్కించుకోవడం విశేషం. కుమార్తె కొంకణసేన్ శర్మతో అపర్ణాసేన్ అప్పటి కలకత్తాలోని బెంగాలీ దంపతులు చిదానంద్ దాస్‌గుప్తా, సుప్రియ దాస్‌గుప్తాలకు 1945లో అక్టోబర్ 25న అపర్ణ జని్మంచింది. ఆమె బాల్యం అంతా కలకత్తాలోనే గడిచింది. బిఏ(ఇంగ్లిష్) డిగ్రీ పూర్తిచేసింది. 1961లో మ్యాగ్నమ్ ఫోటోగ్రాఫర్ బ్రేయిన్ బ్రాకేను కలిసిన అపర్ణ అతను తీస్తోన్న మాన్సూన్ సీరిస్‌లో నటించింది. పదహారేళ్లకే మోడల్‌గా మారిన అపర్ణ ..ఈ అనుభవంతో సత్యజీత్రే నిర్మించిన తీన్ కన్యలో మూడో భాగం ‘సమాప్తి’ లో నటించింది. ఈ సినిమాలో అపర్ణాకు మంచి గుర్తింపు లభించింది. మరోపక్క తన చదువును కొనసాగిస్తూనే కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ బిఏ(ఇంగ్లిష్) చదివింది. సమాప్తి తర్వాత ‘బక్సాబాదరల్’, ‘ఆకాశ్ కుసుమ్’లో నటించినప్పటికీ అవి అంతగా ఆకట్టుకోలేదు. తరువాత నటించిన ‘అపరాజితో’ మంచి కమర్షియల్ హిట్‌ను అందించింది. ఒక పక్క సినిమా, మరోపక్క థియేటర్లలో నటిస్తూ సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. తరువాత సత్యజీత్ రే నిర్మించిన అనేక సినిమాల్లో నటించింది. రేకు వారసురాలిగా.. అపర్ణ తండ్రి సత్యజిత్ రేలు మంచి స్నేహితులు కావడం, వల్ల రేకు సన్నిహితంగా పెరిగిన అపర్ణ ...తన మొదటి సినిమా కూడా రే దర్శకత్వం వహించడంతో..ఆయనను ఆదర్శంగా తీసుకుని ఆయనలా విభిన్న సినిమాలు తీయడం ప్రారంభించింది. రాజకీయాలు, వివిధ రకాల మానవ సంబంధాలపై అపర్ణా అనేక సినిమాలు నిర్మించారు. 1981లో విడుదలైన ‘36 చౌరంగీ లేన్’ అనే ఇంగ్లిష్ సినిమాతో అపర్ణాకు రచయితగా, డైరెక్టర్‌గా గుర్తింపు లభించింది. అపర్ణ సిని పరిశ్రమకు చేసిన కృషికి గాను 1986లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. బెస్ట్ డైరెక్టర్ నేషనల్ అవార్డులను అందుకుంది. జాతీయ, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో జ్యూరీగా వ్యవహరించడమేగాక అనేక లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డులను అందుకున్నారు. 2009లో ‘అంతహీన్’ లో నటించగా ..ఈ సినిమాకు నాలుగు జాతీయ అవార్డులు వచ్చాయి. బెస్ట్ లుకింగ్ ఉమెన్.. బెస్ట్ లుకింగ్ ఇండియన్ ఉమెన్ జాబితాలో నిలిచిన అపర్ణ..నటిగా, దర్శకురాలిగా ఎదిగినప్పటికీ, వ్యక్తిగత జీవితంలో కొంత ఒడిదుడుకులకు లోనయ్యారు. అయినప్పటికీ తన ఇద్దరు కూతుర్లు, మనవ సంతానంతో ఆమె ఆనందంగా గడుపుతున్నారు. ప్రస్తుతం బెంగాల్లో బాగా పాపులర్ అయిన మహిళా మ్యాగజీన్ ‘సనంద’కు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. మ్యాగజీన్ లో సామాజిక సమస్యలపై ఆమె ఎడిటోరియల్స్ రాస్తున్నారు. ద రేపిస్ట్.. ఈ సినిమాను పదిహేనేళ్ల క్రితమే తియ్యాలని అపర్ణాసేన్ అనుకుంది. ఆ తరువాత భారత్‌లో చోటుచేసుకున్న అత్యాచార ఘటనలను గమనిస్తూ ఉండేది. ఎవరూ కూడా పుట్టుకతో రేపిస్ట్ కారు. చిన్నప్పుడు అమాయకంగా ఉండే అబ్బాయిలు యవ్వనంలోకి వచ్చాక వారిలో ఎందుకు అత్యాచార మనస్తత్వం ఏర్పడుతుంది? రేపిస్ట్‌గా ఎలా మారుతున్నారు? ఇది కేవలం సమాజంలో ఉన్న అసమానతలు, లేదా జన్యువుల వల్ల జరుగుతోందా? ఇటువంటి ప్రశ్నలు అపర్ణ మనసులో మెదిలాయి. కానీ వేటికీ జవాబు దొరకలేదు. వీటన్నింటికి జవాబులు అన్వేషించే క్రమంలోనే ‘ద రేపిస్ట్’ సినిమా తీశారు. ఈ సినిమా కోసం ఆమె ఎన్నో పుస్తకాలు చదివారు, అనేక మంది లాయర్లు, ఫెమినిస్టులు, స్నేహితులతో కలిసి చర్చించి తన కూతురు, ప్రముఖ నటి కొంకణా సేన్ శర్మ ప్రధాన పాత్రధారిగా సినిమాను తీశారు. ఇప్పటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా సినిమా తీయడం, దానికి అంతర్జాతీయ అవార్డు వరించడంతో..75 ఏళ్ల వయసులోనూ తన ప్రతిభను నిరూపించుకుని ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ఫ్యాషన్ డిజైనర్ మనాలి జగ్తాప్ ఆఫ్ క్యాన్సర్ సర్వైవర్
ఫ్యాషన్ డిజైనర్ మనాలి జగ్తాప్ ఆఫ్ క్యాన్సర్ సర్వైవర్. ముంబైలో క్యాన్సర్‌కి చికిత్స తీసుకుంటూ కూడా డ్రెస్ డిజైనర్‌గా కొనసాగింది. ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తూ, అవార్డులూ పొందుతోంది. ‘సంతోషంగా ఉండటం వల్లే వ్యాధిని ఓడించగలుగుతున్నాను’ అంటోంది మనాలి. ముంబయికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ మనాలి కిందటి సంవత్సరం క్యాన్సర్ చికిత్సలో భాగంగా 12 కెమోథెరపీలు చేయించుకున్నది. ఇప్పుడు ఆమె మరోసారి తన డిజైనింగ్ నైపుణ్యంతో ప్రజలను ప్రభావితం చేస్తోంది. క్యాన్సర్ రోగులందరికీ జీవితాన్ని వదులుకోకుండా ముందుకు సాగాలని మనాలి తన జీవితం ద్వారా నిరూపిస్తోంది. 2018 ఏప్రిల్‌లో తన గర్భాశయంలో ఏదో తేడా ఉందని మనాలికి అర్ధమైంది. ఈ కారణంగానే ప్రతి నెలా భారీగా రక్తస్రావం జరిగేది. ఆపరేషన్ చేసి, తన గర్భాశయాన్ని తొలగించాలని ఆమె డాక్టర్ని కోరింది. దీంట్లో భాగంగా బయాప్సీ టెస్ట్ చేయడంతో ఆమెకు క్యాన్సర్ ఉందని తేలింది. క్లినికల్ భాషలో, దీనిని ఎండోమెట్రియల్ స్ట్రోమల్ సార్కోమా అంటారు. ప్రతిరోజూ సంతోషంగా.. మనాలికి క్యాన్సర్ ఉందని కుటుంబంలో అందరూ భయపడ్డారు. అదే సమయంలో, ఆమె ఫ్యాషన్ షో కోసం దుబాయ్ వెళ్లాల్సి ఉంది. ఆమె తల్లిదండ్రులు మనాలికి క్యాన్సర్ అనే విషయం ఆమెకు చెప్పకుండా దాచారు. కాని, వారి విచారకరమైన ముఖాలను చూడటంతో ఆమెకు తన స్థితిని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. గతంలో మనాలి కుటుంబంలో ఎవరికీ క్యాన్సర్ లేదు. అందుకే, అది క్యాన్సర్‌కు దారి తీస్తుందని వారూ గుర్తించలేదు. తన చావో బతుకో ఏదైనా జరగవచ్చని మనాలికి తెలుసు. దీంతో బతికి ఉన్నన్నాళ్లూ తన కుటుంబంతో సంతోషంగా ఉంటూ జీవితాన్ని ఆస్వాదించాలనుకుంది. భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా, ప్రతిరోజూ సంతోషంగా గడపాలని కోరుకుంది. ఈ అనారోగ్యం సమయంలో కూడా మనాలి తన ఆలోచనను సానుకూలంగా మార్చుకుంది. ముంబయ్‌లోని సహారా స్టార్ హోటల్లో ఇటీవల జరిగిన లోక్మత్ లైఫ్‌స్టైల్ ఐకాన్ 2020 అవార్డు వేడుకలో ఫ్యాషన్ డిజైనర్ ఐకాన్ 2020 అవార్డును అందుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన మనాలి..‘కుటుంబం, స్నేహితులే నా బలం. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా క్యాన్సర్ నెమ్మదిగా చంపేస్తుంది. జుట్టు పోతుంది, అందం తగ్గుతుంది. అన్నీ తెలుసు. కానీ, మన కల మనల్ని బతికించాలి. లక్ష్యం వైపుగా ప్రయత్నించాలి అనుకున్నాను. అప్పుడే నన్ను నేను మార్చుకోవాలనుకున్నాను. విగ్గు పెట్టుకుంటాను, డిజైనర్ డ్రెస్సులు ధరిస్తాను. అలాగే సంతోషంగా నా జీవితాన్ని తిరిగి మొదలుపెట్టాను. ఇప్పుడు సమస్య లేదని అనను. కానీ, డిజైనర్‌గా నా పనిని నేను కొనసాగిస్తూనే ఉంటాను. ఫ్యాషన్ షోలలో పాల్గొంటాను. కెరియర్లో ఎదుగుతాను. మూడేళ్లుగా నా పనుల్లో ఎక్కడా అంతరాయం రాకుండా చూసుకున్నాను. క్యాన్సర్ పేషంట్స్‌కు రోగం పట్ల అవగాహన కల్గిస్తూ మరింత సంతృప్తిగా జీవిస్తాను’ అని తెలిపారు మనాలి. క్యాన్సర్ అనగానే బతుకు భయంతో కుంగిపాటుకు లోనయ్యేవారికి మనాలి చెప్పే మాటలు ఉత్తేజాన్ని నింపుతాయి. ఆమె జీవితం ఒక ప్రేరణగా నిలుస్తుంది. క్యాన్సర్ చికిత్స సమయంలో..; ఫ్యాషన్ డిజైనర్‌గా అవార్డు అందుకుంటూ.. -
ఐరాస అవార్డుకు ఎంపికైన భారతీయుడు
ఐక్యరాజ్యసమితి: పర్యావరణ సమస్యలను ఎదుర్కోవడానికి సృజనాత్మక పరిష్కారాలను సూచించే వారికి ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రకటించే ‘యంగ్ చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్–2020’ విజేతల్లో భారత్‌కు చెందిన విద్యుత్ మోహన్ (29) కూడా నిలిచారు. ఈ అవార్డుకు మొత్తం ఏడు మంది ఎంపికయ్యారు. వృత్తిరీత్యా ఇంజినీర్ అయిన విద్యుత్.. మిగిలిపోయిన పంటను ప్రత్యేక పద్ధతిలో కాల్చడం ద్వారా రైతులకు ఆదాయం చేకూరే విధానాన్ని గురించి ప్రచారం చేసినందుకుగానూ ఆయనకు ఈ అవార్డును ప్రకటించారు. పంటను యాక్టివేటెడ్ కార్బన్‌లుగా మార్చి వాటిని అమ్మడం ద్వారా డబ్బు సంపాదించవచ్చని ప్రచారం చేశాడు. పేదలకు ఆదాయం వచ్చే మార్గాల గురించి చెప్పడం తనకు ఇష్టమని విద్యుత్ అన్నారు. కరోనాతో ప్రపంచం బాధపడుతున్న వేళ పర్యావరణహితం కోరి ఈ ఏడు మంది చేసిన ప్రయత్నాలకు ఈ అవార్డును ప్రకటించినట్లు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో అన్నారు. -
ప్రపంచ బాల మేధావి ఈశ్వర్ శర్మ
లండన్: ఆధ్యాత్మిక యోగాలో సాధించిన విజయాలకుగానూ పదేళ్ల స్కూల్ విద్యార్థి, బ్రిటిష్ ఇండియన్ ఈశ్వర్ శర్మను ప్రపంచ బాల మేధావి–2020 అవార్డుతో బ్రిటన్ సత్కరించింది. 30 విభిన్న (బైకింగ్, కొరియోగ్రఫీ, ఫిట్నెస్, మార్షల్ ఆర్ట్స్ తదితర) రంగాల్లో సత్తాచాటిన ప్రపంచంలోని 45 దేశాలకు చెందిన బాల మేధావులను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. అందులో ఇంగ్లండ్‌లోని కెంట్ కేంద్రంగా పనిచేస్తున్న ఈశ్వర్ శర్మ యోగాలో అసాధారణ ప్రతిభ కనబర్చినందుకు ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ‘45 దేశాల నుంచి 15 వేల మంది దరఖాస్తుదారుల్లో ప్రపంచ బాల మేధావి అవార్డుకు ఎంపికైనందుకు గర్వంగా ఉంది. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం. విద్యార్థులకు యోగా చాలా ముఖ్యం.’అని అవార్డు తీసుకుంటున్న సందర్భంగా శర్మ చెప్పాడు. -
నంజుండన్ అనుమానాస్పద మృతి
బెంగళూర్ : ప్రముఖ అనువాదకులు, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ జీ నంజుండన్ బెంగళూర్‌లోని తన నివాసంలో శనివారం విగతజీవిగా కనిపించారు. 58 ఏళ్ల నంజుండన్ నాలుగు రోజుల కిందట గుండెపోటుతో మరణించారని అనుమానిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. నాగదేవనహల్లిలోని నివాసంలో కుళ్లిన స్ధితిలో ఆయన మృతదేహాన్ని గుర్తించామని వెల్లడించారు. బెంగళూరు యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్ లెక్చరర్‌గా పనిచేసే నంజుండన్ కొద్దిరోజులుగా విధులకు గైర్హాజరయ్యారని, ఆయనను చూసేందుకు అసిస్టెంట్ వచ్చిన క్రమంలో ఈ ఘటన వెలుగుచూసిందని చెప్పారు. ఆ సమయంలో చెన్నైలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా భార్య, కుమారుడు హుటాహుటిన బెంగళూర్‌కు చేరుకున్నారని తెలిపారు. కాగా, ఆయన దాదాపు 12 పుస్తకాలను కన్నడ నుంచి తమిళంలోకి అనువదించి విశేష ప్రాచుర్యం పొందారు. పలు కన్నడ మహిళా రచయితల కథలను అకా పేరుతో ఆయన తమిళంలోకి అనువదించినందుకు నంజుండన్‌కు 2012లో సాహిత్య అకాడమి బహుమతి లభించింది. -
మా ఊరిని చూపించాలనుంది
‘‘కెమెరా, చక్కటి కథనం చాలు అద్భుతాలు సృష్టించడానికి’’ అంటారు సినిమాటోగ్రాఫర్ ఆచార్య వేణు. ఇంతకీ ఎవరీ వేణు అంటే షాంగై ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డ్ అందుకున్న తొలి భారతీయ కెమెరామేన్. అనుభవం ఒక్క సినిమానే. అదీ గారో భాషలో తీసిన మేఘాలయ సినిమా. రాజయ్యపల్లి, వరంగల్‌లో పుట్టిన వేణు ఆచార్యకి పదో తరగతి నుంచి కెమెరామేన్ అవాలనే కోరిక ఉండేది. ‘‘చిన్నప్పటి నుంచే నాకు డ్రాయింగ్ మీద ఆసక్తి ఉండేది. గొప్ప ఆర్టిస్ట్ అని చెప్పను కానీ నాకు ఆర్ట్స్ మీద ఆసక్తి ఉందని అర్థమైంది. ఓసారి హైదరాబాద్ జెయన్‌టీయూ నుంచి కొందరు స్టూడెంట్స్ మా ఊరు వచ్చారు. ఆసక్తి ఉంటే ఆర్ట్స్ కాలేజీలో చేరి సినిమాటోగ్రాఫర్ కావచ్చని సలహా ఇచ్చారు. అలాగే చేశాను’’ అని బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు. ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ షాంగై ఫిల్మ్‌ఫెస్టివల్. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 15 నామినేషన్లలో ‘మా.అమా’ అనే చిత్రానికి వేణు ఈ అవార్డు పొందారు. ‘‘మేఘాలయా చూడటానికి అద్భుతంగా ఉంటుంది. కానీ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఏం మా సినిమాలో లేవు. కేవలం 8 లక్షల్లో సినిమా తీశాం. డోమ్నిక్ సంగ్నా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అందరూ కెమెరాకు కొత్తవాళ్లే కావడం విశేషం. ఇంతకుముందు ‘జెర్సీ’ సినిమాకు సెకండ్ యూనిట్ కెమెరామేన్‌గా కూడా చేశాను. త్వరలోనే దర్శకత్వం కూడా చేయాలని, మా ఊరిని, అక్కడి ప్రజలను చూపించాలనుంది. అవార్డు తీసుకొని ఇంటికి వెళ్లగానే అమ్మ చిన్నగా నవ్వి ఇంతకీ తిన్నావా? అని అడిగింది. జీవితంలో కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు అనిపించింది నాకు’’ అన్నారు వేణు. -
దాతృత్వ మాస్టారుకు పట్టం
తనను వరించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ టీచర్స్ అవార్డు పట్టుకుని విద్యార్థులతో కలసి సంతోషం పంచుకుంటున్న కెన్యా ఉపాధ్యాయుడు పీటర్ మొకాయా తాబిచి. దాదాపు పదేళ్లుగా ఆయన ప్రతీ నెలా తన ఆదాయంలో 80 శాతం మొత్తాన్ని పేద విద్యార్థుల అవసరాలు తీర్చేందుకే వెచ్చిస్తున్నారు. దీంతో వార్కే ఫౌండేషన్.. అవార్డుతో పాటు రూ.7 కోట్ల నగదు బహుమతిని అందజేసింది. -
తెలంగాణకు మరో అరుదైన గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. టీఎస్ఐపాస్ ద్వారా సకాలంలో విద్యుత్ కనెక్షన్లను జారీ చేయడంలో దేశంలోనే ఇతరులకన్నా ముందున్న తెలంగాణ విద్యుత్ తనిఖీ శాఖకు ప్రతిష్టాత్మక బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ అవార్డు దక్కింది. ఈ మేరకు సోమవారం మింట్ కాంపౌండ్‌లో ఆ విభాగం ప్రధాన అధికారి ఏజీ రమణప్రసాద్ విలేకరులకు వెల్లడించారు. ‘నాణ్యత నిర్వహణ వ్యవస్థ ధృవీకరణ లైసెన్స్’ను పొంది న తొలి రాష్ట్రం మనదేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి చేతుల మీదుగా ఇటీవలే ఈ అవార్డును అందుకున్నట్లు తెలిపారు. ఈ తరహా లైసెన్స్ తెలంగాణలోని ఏ ప్రభుత్వ శాఖ కూడా ఇప్పటి వరకు పొందలేదన్నారు. కేవలం ప్రభుత్వ ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి కార్యాలయానికే కాకుండా నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌సిటీ, నిజామాబాద్ కార్యాలయాలకు కూడా ఈ గుర్తింపు దక్కిందని స్పష్టం చేశారు. తెలం గాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆన్లైన్ విధానం అమలు చేయడం, టీఎస్ఐపాస్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సకాలంలో అనుమతులు జారీ చేయడం, విద్యుత్ వినియోగం, ప్రమాదాల నివారణ, నిర్దేశిత సమయంలోనే పరిశ్రమలకు కనెక్షన్లు మంజూరు చేయడం, ధ్రువీకరణ పత్రాల జారీ వంటి విషయంలో దేశంలోనే తెలంగాణ విద్యుత్ తనిఖీశాఖ ముందుందని, సీఎం కేసీఆర్ చొరవ, ఉద్యోగుల సమష్టికృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు.టీఎస్ఐపాస్ ద్వారా వచ్చిన దరఖాస్తులను సమర్థంగా పరిశీలించినందుకు గుర్తింపుగా గతేడాది జనవరిలో అత్యుత్తమ ప్రదర్శన అవార్డు దక్కిందని, ఎత్తైన భవనాల్లో భద్రతను పెంచడంలో కృషిచేసినందుకు గుర్తింపుగా ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ ఇటీవలే బహుమతిని ఇచ్చి సత్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. -
పాక్ మహిళకు ఐరాస పురస్కారం
ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్ మానవహక్కుల ఉద్యమకారిణి అస్మా జహంగీర్(66)కు అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రతి ఐదేళ్లకు ఓసారి ప్రకటించే ప్రతిష్టాత్మక మానవహక్కుల పురస్కారం–2018 అస్మాను మరణానంతరం వరించింది. పాకిస్తాన్లో సైనిక జోక్యానికి, మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా పోరాడిన అస్మా ఈ ఏడాది ఫిబ్రవరిలో గుండెపోటుతో కన్నుమూశారు. న్యూయార్క్‌లో మంగళవారం సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఐరాస సాధారణ సభ అధ్యక్షురాలు మారా ఫెర్నాండా ఈ అవార్డును అస్మా కుమార్తె మునైజే జహంగీర్‌కు అందజేశారు. అస్మాతో పాటు టాంజానియాలో బాలికా విద్య కోసం ఉద్యమిస్తున్న రెబెకా గ్యుమీ, బ్రెజిల్లో తొలి ఆదివాసీ మహిళా న్యాయవాది జోనియా బటిస్టా, ప్రపంచవ్యాప్తంగా హక్కుల కార్యకర్తల కోసం పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ డిఫెండర్స్(ఐర్లాండ్)కు 2018కి గానూ ఈ మానవహక్కుల పురస్కారం లభించింది. -
జర్నలిస్టు స్వాతికి ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు
లండన్: ప్రతిష్టాత్మక లండన్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు ఫర్ కరేజ్–2018 భారత్‌కు చెందిన పరిశోధనాత్మక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ స్వాతి చతుర్వేదిని వరించింది. సామాజిక మాధ్యమాల్లో వేధింపుల్ని ధైర్యంగా ఎదుర్కొన్నందుకు ఆమెకు ఈ గుర్తింపు దక్కింది. ఆన్లైన్లో భారతీయ జనతా పార్టీ ఐటీ విభాగాల విద్వేషపూరిత వేధింపులను ఆమె వెలుగులోకి తెచ్చారు. ఇటలీ, టర్కీ, మొరాకోకు చెందిన జర్నలిస్టులను అధిగమించి ప్రియాంక ఈ అవార్డును గెలుచుకున్నారు. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగానే కాకుండా ఆమె ’ఐ యామ్ ఏ ట్రోల్: ఇన్సైడ్ ది సీక్రెట్ వరల్డ్ ఆఫ్ ది బీజేపీ డిజిటల్ ఆర్మీ’ అనే పుస్తకాన్ని రచించారు. గురువారం లండన్‌లో జరిగిన కార్యక్రమంలో రిపోర్టర్స్ విత్ అవుట్ బోర్డర్స్(ఆర్‌డబ్ల్యూబీ) అనే సంస్థ అవార్డును స్వాతికి ప్రదానం చేసింది. స్వాతి మాట్లాడుతూ ‘ సమర్థంగా చేసిన నా పనికి కాకుండా నా ధైర్యానికి ఈ అవార్డు పొందడం కొంత విచారకరం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియాను శత్రువుగా చిత్రీకరిస్తున్నారు. భారత్‌లో గతేడాది ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ తన ఇంటి బయటే హత్యకు గురవడం భయభ్రాంతులకు గురిచేసింది. ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది. విమర్శల పట్ల ప్రభుత్వాలు సహనం పాటించడంలేదు. ఆన్లైన్లో నాకు ఎన్నో వేధింపులు ఎదురయ్యాయి. అవి నాపై ప్రభావం చూపి ఉంటే విధుల్ని సరిగా నిర్వర్తించేదాన్నే కాదు. దాడులు, ప్రాణ హాని ఎదుర్కొంటున్న జర్నలిస్టుల కోసం ఆర్‌డబ్ల్యూబీ పాటుపడటం ధైర్యాన్నిస్తోంది’ అని అన్నారు. స్వాతి చతుర్వేది -
బల్దియాకు బహుమానం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల కోసం బాండ్ల జారీ ద్వారా రూ.200 కోట్లు సేకరించినందుకు ప్రోత్సాహకంగా రూ.26 కోట్ల చెక్కును ప్రధాని మోదీ.. మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డికి అందజేశారు. లక్నోలో శనివారం 2 రోజుల ‘ట్రాన్స్ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్ స్కేపింగ్’ సదస్సు ముగింపు సందర్భంగా అమృత్ పథకం కింద ఈ బహుమతిని, ప్రత్యేక ప్రశంసాపత్రాన్ని అందజేశారు. మేయర్, కమిషనర్.. ప్రధానికి స్వచ్ఛ నమ స్కారం అంటూ గౌరవిస్తూ ప్రత్యేకత చూపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మం త్రులు రాజ్‌నాథ్ సింగ్, హరిదీప్‌సింగ్, గవర్నర్ రాంలాల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ‘సింగం చెరువు’ లబ్ధిదారుతో ప్రధాని భేటీ హైదరాబాద్‌లోని సింగం చెరువు తండా డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీలో ఇల్లు పొందిన గిరిజన మహిళ జ్యోతితో ప్రధాని సమావేశమయ్యారు. కూలి చేసుకునే తమకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇంటిని నిర్మించి ఉచితంగా ఇచ్చిందని తెలిపింది. గుడిసెలో ఉన్నప్పుడు ఎండ, వానలకు ఇబ్బందులను ఎదుర్కొనేవారమని.. ఇప్పుడు తమ కుటుంబం సంతోషంగా ఉందని చెప్పింది. సూచన పాటించారు.. బహుమతి పొందారు స్థానిక సంస్థలు.. ముఖ్యంగా మునిసిపల్ కార్పొరేషన్లు స్వయం సమృద్ధికి బాండ్ల జారీ ద్వారా నిధు లు సమీకరించుకోవాలని, దీనికి తెలంగాణ ప్రభు త్వం చొరవ చూపాలని మెట్రోరైలు ప్రారంభోత్స వానికి నగరానికి వచ్చిన ప్రధాని.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు సూచించారు. దీంతో మంత్రి బాండ్ల ద్వారా నిధులు సేకరించాలని జీహెచ్ఎంసీ ని ఆదేశించారు. నగరంలో చేపట్టనున్న ఎస్సార్డీపీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం వెయ్యి కోట్లు సేకరించాలనే లక్ష్యంతో కృషి చేసి సఫలమయ్యారు. పుణే తర్వాత జీహెచ్ఎంసీ మాత్రమే బాండ్ల ద్వారా నిధులు సేకరించాయి. జీహెచ్ఎంసీలోని ఆర్థిక క్రమశిక్షణ, ఆస్తులు, వనరులు తదితరమైన వాటిని పరిగణనలోకి తీసుకున్న పలు సంస్థలు వెయ్యి కోట్లకు పైగా నిధులిచ్చేందుకు ముంబై స్టాక్ ఎక్సే్ఛంజ్‌లో పోటీలు పడ్డాయి. తొలిదశలో ఎస్సార్డీపీ పనులకు రూ.200 కోట్లు సేకరించారు. సొంతంగా నిధులు సేకరించే స్థానిక సంస్థలకు ప్రోత్సాహకంగా బాండ్ల ద్వారా తీసుకున్న మొత్తానికి వడ్డీని కేంద్రమే అందజేయాలని కేటీఆర్ కోరారు. ఈ మేరకు సీఎస్ ఎస్కే జోషి కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించారు. సుముఖత వ్యక్తం చేసిన కేంద్రం జీహెచ్ఎంసీని ఇందుకు ఎంపిక చేసింది. ప్రజోపయోగానికి రూ. 26 కోట్లు... జీహెచ్ఎంసీ బాండ్ల రూపంలో నిధులను సేకరించినందున కేంద్రం ప్రోత్సాహకంగా అందజేసిన రూ.26 కోట్లను వినూత్న కార్యక్రమాలకు ఉపయోగించాలని కేటీఆర్ సూచించారు. దీంతో ప్రత్యేక ప్రజోపయోగ కార్యక్రమానికి ఈ నిధులు వినియోగించాలని, దీనికి ప్రజాభిప్రాయాన్నీ సేకరించనున్నట్లు కమిషనర్ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. -
అవార్డు గ్రహీతల అభిశంసన
మతం పేరిట భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ, బెదిరిస్తూ రచయితల హత్యలకు పాల్పడుతున్న ఉన్మాదశక్తులను అదుపు చేయటంలో కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా ఉండటాన్ని మేము తీవ్రంగా అభిశంసిస్తున్నాం. నరేంద్ర దభోల్కర్, గోవింద పన్సారే, ఎం.ఎం.కల్బుర్గీల హంతకులను నిర్ధారించలేకపోవటాన్ని ప్రభుత్వాల ఉద్దేశ పూరిత నిర్లక్ష్యంగా భావిస్తూ ఖండిస్తున్నాం. తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్‌ను రచయితగా బతికించటానికి ప్రభుత్వాలు ఎలాంటి ప్రయత్నం చేయకపోవటాన్ని నిరసిస్తు న్నాం. బహుళ మతాల, సంస్కృతుల దేశంలో విభిన్న ఆహారపు అలవాట్లను గౌరవించటానికి భిన్నం గా, కొందరి ఆహారంపై నిషేధాలు ప్రకటించ టాన్ని ఖండిస్తున్నాం. ఉత్తరప్రదేశ్‌లో మహమ్మద్ అఖిలేఖ్ హత్య, పెచ్చరిల్లుతున్న మతోన్మాదానికి చిహ్నంగా భావిస్తూ, ప్రతి ఎన్నికల ముందు మత విద్వేషవ్యాప్తిని గావించే రాజకీయాలతో సాధా రణ ప్రజల జీవితాన్ని కల్లోల పరచటాన్ని మేము గర్హిస్తున్నాము. సంకీర్ణ మత విశ్వాసాలతో కూడిన ప్రజల నడుమ సామరస్యాన్నీ, వారిలో అన్యమత విశ్వాసాలపట్ల సహనాన్నీ, భిన్నాభిప్రాయాల పట్ల గౌరవాన్నీ పెంపొందించాల్సిన ప్రధాన బాధ్యత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలది. ప్రత్యక్షంగా గానీ, పరో క్షంగానైనా మత విద్వేషాలను రెచ్చగొట్టే శక్తు లను అదుపు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలదే. మతతత్త్వ శక్తులను రాజ్యా నికి (స్టేట్) దూరంగా ఉంచకుండా, రాజకీ యాల్లోకి మతాన్ని చొప్పించటం ప్రజాస్వా మ్య సంస్కృతికీ, నాగరిక ప్రవర్తనకూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనది, గొడ్డలి పెట్టులాంటిదేనని మేము భావిస్తున్నాం. ఈ అభిశంసనకు ఆమోదం తెలిపినవారు: అంపశయ్య నవీన్, ఎన్.గోపి, భూ పాల్, కేతు విశ్వనాథరెడ్డి, నలిమెల భాస్కర్, డి.సు జాతాదేవి, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ఆర్. శాం తసుందరి, కె.కాత్యాయని విద్మహే, కె.శివారెడ్డి. పెద్దిభొట్ల సుబ్బరామయ్య విజయవాడ, 91540 38840