‘‘కెమెరా, చక్కటి కథనం చాలు అద్భుతాలు సృష్టించడానికి’’ అంటారు సినిమాటోగ్రాఫర్ ఆచార్య వేణు. ఇంతకీ ఎవరీ వేణు అంటే షాంగై ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డ్ అందుకున్న తొలి భారతీయ కెమెరామేన్. అనుభవం ఒక్క సినిమానే. అదీ గారో భాషలో తీసిన మేఘాలయ సినిమా. రాజయ్యపల్లి, వరంగల్‌లో పుట్టిన వేణు ఆచార్యకి పదో తరగతి నుంచి కెమెరామేన్ అవాలనే కోరిక ఉండేది. ‘‘చిన్నప్పటి నుంచే నాకు డ్రాయింగ్ మీద ఆసక్తి ఉండేది. గొప్ప ఆర్టిస్ట్ అని చెప్పను కానీ నాకు ఆర్ట్స్ మీద ఆసక్తి ఉందని అర్థమైంది.
ఓసారి హైదరాబాద్ జెయన్‌టీయూ నుంచి కొందరు స్టూడెంట్స్ మా ఊరు వచ్చారు. ఆసక్తి ఉంటే ఆర్ట్స్ కాలేజీలో చేరి సినిమాటోగ్రాఫర్ కావచ్చని సలహా ఇచ్చారు. అలాగే చేశాను’’ అని బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు. ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ షాంగై ఫిల్మ్‌ఫెస్టివల్. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 15 నామినేషన్లలో ‘మా.అమా’ అనే చిత్రానికి వేణు ఈ అవార్డు పొందారు. ‘‘మేఘాలయా చూడటానికి అద్భుతంగా ఉంటుంది. కానీ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఏం మా సినిమాలో లేవు. కేవలం 8 లక్షల్లో సినిమా తీశాం.
డోమ్నిక్ సంగ్నా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అందరూ కెమెరాకు కొత్తవాళ్లే కావడం విశేషం. ఇంతకుముందు ‘జెర్సీ’ సినిమాకు సెకండ్ యూనిట్ కెమెరామేన్‌గా కూడా చేశాను. త్వరలోనే దర్శకత్వం కూడా చేయాలని, మా ఊరిని, అక్కడి ప్రజలను చూపించాలనుంది. అవార్డు తీసుకొని ఇంటికి వెళ్లగానే అమ్మ చిన్నగా నవ్వి ఇంతకీ తిన్నావా? అని అడిగింది. జీవితంలో కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు అనిపించింది నాకు’’ అన్నారు వేణు.
Comments
Please login to add a commentAdd a comment