శిష్యబృందంతో సాధన చేస్తున్న పద్మజారెడ్డి
ప్రజల్లో చైతన్యం నింపేలా కూచిపూడి నృత్యకళకు ఆధునికతను జోడించారామె. కాలం పరిచయం చేస్తున్న నృత్యరీతులను కళ్లకు అద్దుకున్నారు. మన సంస్కృతిని రాబోయే తరాలకు తెలియజేయాలనే తపనతో నృత్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. చారిత్రక అద్భుత కళా సౌందర్యాన్ని మన ముందుకు అంచెలంచెలుగా తీసుకువస్తున్నారు ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి, తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అవార్డు గ్రహీత డాక్టర్ జి.పద్మజారెడ్డి.
కాకతీయుల కాలంలో తెలుగు నేలను అసమాన ధైర్య సాహసాలతో, అత్యంత సమర్థ వంతంగా పరిపాలించిన రాణి రుద్రమదేవి మేనమామ జాయపసేనాని. ఆయన రచించిన ‘నృత్యరత్నావళి’ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ‘కాకతీయం’ అనే నృత్య దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించి, 2017లో ప్రదర్శించారు పద్మజారెడ్డి. ఆ తరువాయి భాగం నేటి సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో కాకతీయం–2 పేరుతో ప్రదర్శన ఇస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఆమె నృత్య అకాడమీకి వెళ్లినప్పుడు శిష్యబృందంతో సాధన చేస్తూ కనిపించారు. ‘సాక్షి’తో ముచ్చటించారు.
‘‘శాస్త్రీయ నృత్యరీతులు అనగానే మనకు కూచిపూడి, భరతనాట్యం వంటివి కళ్లముందు నిలుస్తాయి. కానీ, తెలంగాణ రాష్ట్రానికి ఓ ప్రత్యేకమైన నృత్యరీతి ఉంది. అదే కాకతీయం. కాకతీయుల నృత్యకళ అనగానే మనకు సాధారణంగా పేరిణి నృత్యం గుర్తుకు వస్తుంది. కానీ, జాయపసేనాని రచించిన ‘నృత్యరత్నావళి’లోని నృత్యరీతులను చూస్తే వాటిని పరిచయం చేయడానికి ఒక జీవితకాలం సరిపోదేమో అనిపిస్తుంది. సముద్రమంతటి ఆ కళను నేను ఏ కొద్దిగానైనా పరిచయం చేయగలిగితే అదే పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను.
ఏడేళ్ల కృషి
కూచిపూడి నృత్యకారిణిగా ఐదు దశాబ్దాలుగా ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ వచ్చాను. సత్కారాలు పొందాను. ఒకానొక సందర్భం లో రచయిత పప్పు వేణుగోపాలరావు ఆంగ్లంలోకి అనువదించిన ‘నృత్యరత్నావళి’ పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు ఇంత మంచి కళారీతిని పరిచయం చేయకుండా ఉండగలమా?! అంతటి సమర్థత నాలో ఉందా?! అనే ఎన్నో సందేహాలు తలెత్తాయి. విజయదుంధుభి వేళ ఆనందహేల, శృంగార, క్రోధ, కరుణ.. ఇలా నవరసాల కాకతీయ సౌరభాలు ఈ నృత్యరీతుల్లో కనిపిస్తాయి.
ఇదొక సవాల్. నేను గతంలో చేసిన నృత్యరీతులన్నీ సవాల్‌గా తీసుకుని చేసినవే. ఈ కళారూపాన్ని కూడా నేటి ప్రజలకు పరిచేయాల్సిందే అనుకున్నాను. దీంట్లో భాగంగా వరంగల్‌లోతో పాటు ఎన్నో గ్రంథాలయాలు, కాకతీయుల గుడులన్నీ సందర్శించాను. గైడ్స్‌తో మాట్లాడాను. పరిశోధకులను కలిశాను. ఏడేళ్లుగా ‘కాకతీయం’ తప్ప నా మనసులో మరో ఆలోచన లేదు. అంతగా ఈ కళలో మమేకం అయిపోయాను.
ఆన్‌లైన్‌లోనూ సాధన
పదిహేనేళ్లుగా ప్రణవ్ నృత్య అకాడమీ ద్వారా దాదాపు 700 మంది శిష్యులు నృత్యంలో ప్రావీణ్యం సాధించారు. నా దగ్గరకు వచ్చే శిష్యుల్లో ఆరేళ్ల వయసు నుంచి పాతికేళ్ల వయసు వారి వరకు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం చేసిన కాకతీయం పార్ట్ 1 కి విశేష స్పందన వచ్చింది. ఆ తర్వాత రెండవభాగాన్ని తీసుకువద్దామని రెండేళ్ల క్రితమే సాధనకు శ్రీకారం చుట్టాను. అయితే, కరోనా కారణంగా నృత్యక్లాసులు ఆన్‌లైన్‌లో తీసుకోవాల్సి వచ్చింది. పిల్లలు కూడా చురుకుదనం, ఆసక్తితో నేర్చుకున్నారు కాబట్టి ఈ నృత్యరీతుల్లో నిష్ణాతులు అయ్యారు. ప్రస్తుతం కొన్ని రోజులుగా అకాడమీలోనే శిక్షణ జరుగుతోంది.
సామాజిక సమస్యలపై అవగాహన
శాస్త్రీయ నృత్యం అనగానే పురాణేతిహాస ఘట్టాలే ప్రదర్శిస్తారు అనుకుంటారు. కానీ, ఈ నృత్యం ద్వారా సమాజ సమస్యలను అద్దంలా చూపుతూ, వాటికి పరిష్కారం కూడా సూచించే కళారీతులను ప్రదర్శించాను. వాటిలో భ్రూణహత్యలు, ఎయిడ్స్ పై అవగాహన, నమస్తే ఇండియా, సీజన్ ఆఫ్ ఫ్లవర్స్‌తో పాటు పురాణేతిహాసాలను నృత్యరూపకాల్లో ప్రదర్శించాను. మనకు కూచిపూడి అనగానే సిద్ధేంద్రయోగి, భరతనాట్యం అనగానే భరతముని పేరు గుర్తుకు వస్తాయి. అలాగే, కాకతీయం అనగానే జాయప పేరు గుర్తు రావాలన్నదే నా తపన’’ అంటూ శిష్యులవైపు కదిలారు ఈ నృత్యకారిణి.
వందమంది శిష్య బృందంతో నృత్యరత్నావళిలోని పిండి, గొండలి, రాసకం, పేరిణి, శివప్రియం, కందుక, లాస్యాంగం, చాలన.. నృత్యరీతులను కాయతీయంలో ప్రదర్శిస్తున్నారు పద్మజారెడ్డి. కాల ప్రవాహంలో కళలు కనుమరుగు కాకుండా కాపాడేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్క కళాహృదయానికి ఈ సందర్భంగా అభివాదం చెబుదాం.
నృత్యరూపకంలో...
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment