శారదా శ్రీనివాసన్; లాడ్లీ అవార్డు అందుకుంటున్న శారద
‘‘కలదు ఆ శారదకు వీణ కరములందు
కలదు ఈ శారదకు వీణ గళమునందు
కలదు ఆ శారద కవుల కవితలందు
కలవు కవితలే ఈమె గానామృతమందు
శారద కాని శారదకు శారదలోగల
సత్కళా సుధా సారదకున్... విశారదకు
సాదర పూర్వ నమస్సుమాంజలులు’’
రేడియో కళాకారిణి శారదా శ్రీనివాసన్‌కు ఆచార్య ఆత్రేయ కలం నుంచి జాలువారిన ప్రశంస ఇది. 19.6.1977వ తేదీన ఆత్రేయ స్వహస్తాలతో రాసిన ఈ లేఖ శారదా శ్రీనివాసన్ దగ్గర ఇంకా భద్రంగా ఉంది. ఈ నెల రెండవ తేదీన హైదరాబాద్‌లో ‘లాడ్లీ మీడియా అండ్ అడ్వర్‌టైజింగ్ అవార్డ్స్ ఫర్ జెండర్ సెన్సిటివిటీ’ ప్రాంతీయ పురస్కారం అందుకున్నారామె. 45 ఏళ్ల కిందటి ఆత్రేయ గారి ప్రశంస, ఇప్పుడు ఈ పురస్కారానికి మధ్య ఆమె అందుకున్న గౌరవాలను లెక్క పెట్టడం సాధ్యం కాని పని. అలాగే ఆమె గళమిచ్చిన పాత్రల సంఖ్య కూడా! వేలల్లో ఉంది. తనకు గుర్తింపు, గౌరవం అన్నీ రేడియోతోనే అన్నారామె. శారదా శ్రీనివాసన్ తన రేడియో ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు.
గళం దేవుడిచ్చాడు!
ఉచ్చారణ ఇల్లు నేర్పించింది!
‘‘నేను పుట్టింది కృష్ణాజిల్లా, అవనిగడ్డ. మా నాన్న ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగి. అప్పుడు అక్కడ ఉద్యోగం చేసేవారు. నాకు భగవంతుడు చక్కటి గొంతునిచ్చాడు. చక్కగా ఉచ్చరించడం మా ఇంట్లో అలవడింది. ఏ తొందరపాటులోనో ఒకపదంలో ఒక్క ఒత్తును సరిగ్గా పలకకపోయినా సరే ఉపేక్షించేవారు కాదు, ‘ఏం పలికావు? మళ్లీ పలుకు’ అని కోప్పడుతూ ఎప్పటికప్పుడు సరిదిద్దేవారు. మేము తణుకులో ఉన్నప్పుడు నన్నయ భట్టారకుని జయంతి సందర్భంగా పాఠశాల బాలికలకు పద్యపఠనం నిర్వహించారు. నేను కూడా ఓ నాలుగు పద్యాలు కంఠతా పట్టి ఆ పోటీల్లో వినిపించాను. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. బహుమతితో ఇంటికి వస్తే మా నాన్న ఏమన్నారో తెలుసా... ‘ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షం అన్నట్లు, నీకు ప్రథమ బహుమతి వచ్చిందా’ అని నవ్వారు.
యాదృచ్ఛికంగా మొదలైంది!
మేము విజయవాడ, మాచవరంలో ఉన్నప్పుడు హిందీకాలేజ్‌లో ప్రవీణ, ప్రచారక్ చేస్తున్న రోజుల్లో అనుకోకుండా వచ్చింది అవకాశం. రేడియో కాంటాక్ట్ కోసం వాయిస్ టెస్ట్ చేశారు. మా లెక్చరర్ చొరవతో వాయిస్ టెస్ట్‌లో పాల్గొనడం, సెలెక్ట్ కావడం జరిగిపోయింది. ఇది 1956–57ల నాటి మాట. అలా మొదలైన నా ఆకాశవాణి ప్రయాణంలో నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. 1995 ఆగస్టులో రిటైరయ్యే వరకు నేను గళమిచ్చిన ప్రతి కార్యక్రమం నాకు ఒక పాఠమే. నన్ను సమగ్రంగా తయారు చేసిన యూనివర్సిటీ రేడియో.
నవరసాలూ గొంతులోనే
పానుగంటి వారి రచనల్లోని పాతతరం తెలుగు భాషను ఒంటపట్టించుకోవడం కొంచెం శ్రమ అనిపించేది. అంతే తప్ప మరెక్కడా ఇబ్బంది పడలేదు. బాలగంగాధర తిలక్ ‘సుప్తశిల’ నేను చాలా బాగా చేశానని నాకనిపించిన నాటిక. రంగస్థలం మీద నటించేటప్పుడు హావభావాలు ప్రేక్షకులకు కనిపిస్తుంటాయి. రేడియోలో అలా కాదు. నవరసాలనూ గొంతులోనే పలికించాలి. అంతేకాదు, శ్రోతలకు మేము కనిపించడం లేదు కదా అని ఒకే చోట కూర్చుని మాట్లాడుతూ నాటికను రికార్డు చేస్తే జీవం రాదు. ఒక గదిలో నుంచి మరో గదిలోకి వెళ్తున్న సన్నివేశంలో కానీ, ఒక పాత్ర ఇంటి నుంచి బయటకు వెళ్తూ ‘వెళ్లొస్తాను’ అంటూ వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు మొదటి అక్షరం పలకడానికి చివరి అక్షరం పలకడానికి మధ్య మైక్‌కు దూరం వెళ్తేనే ఆ సన్నివేశం శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలను దర్శకులు చెప్పరు. ఎవరికి వారు సాధనలో తెలుసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం... ఉచ్చారణ ఉద్దేశం ఏమిటి? ఎదుటి వారికి తెలియాల్సిన ఒక విషయాన్ని మనం చెబుతున్నామనే కదా! పదాలను ఎక్కడ ఆపాలో, ఎక్కడ కలిపి పలకాలో స్పష్టత లేకపోతే వినేవాళ్లకు విషయం ఎలా తెలుస్తుంది? టీవీలో వార్తలు చదివే వాళ్లు ఈ ఒక్క నియమాన్ని పాటిస్తే బావుణ్ణనిపిస్తుంటుంది.
ఉత్సాహాన్నిచ్చింది
ఇక నా కుటుంబ విషయానికి వస్తే... చెన్నై నుంచి వచ్చిన ఫ్లూట్ ఆర్టిస్ట్ శ్రీనివాసన్‌తో రేడియోలోనే పరిచయమైంది. పెళ్లి చేసుకున్నాం. మాకు ఒకమ్మాయి నీరద. నాటికల ద్వారా ఎన్నో జీవితాలను ఆయా పాత్రల్లో ఇమిడిపోయినంతగా చదివాను. అందుకే ఎన్నో కోణాలను అర్థం చేసుకోగలిగాను. ముందే చెప్పాను కదా... ఆకాశవాణి అనే యూనివర్సిటీలో పట్టా పొందిన విద్యార్థిని నేను. ఈ రోజు లాడ్లీ్ల వంటి సంస్థ గుర్తించడానికి కారణమూ రేడియోనే. ఎనభై ఎనిమిదేళ్ల వయసులో ఈ అవార్డు నాకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఇప్పటికీ గళం సహకరిస్తూ ఉండడం నా అదృష్టమనే చెప్పాలి’’ అని సంతోషాన్ని వ్యక్తం చేశారు రేడియో ఆర్టిస్ట్, రచయిత శారదా శ్రీనివాసన్.
ఆకాశవాణి... నా బడి గుడి!
నాటికలు నా ప్రధాన విభాగం. అయినప్పటికీ స్పోకెన్ వర్డ్ ఆర్టిస్ట్‌గా రకరకాల స్క్రిప్టులు చదివాను. సాహిత్యం, చరిత్ర, నవలాపఠనం, వైద్య కథనాలు, మహిళలు – పిల్లల అంశాలు, కార్మికుల కార్యక్రమాలు, పిల్లల పాఠ్యాంశాలు... ఇలా అదీ ఇదీ అని పరిమితం కాకుండా అన్ని విభాగాల్లోనూ నా గొంతు వినిపించాను. యువవాణి మినహా రేడియోలో అన్ని విభాగాల్లోనూ నా గొంతు వినిపించాను.
Comments
Please login to add a commentAdd a comment