చలంగారి ప్రశంసతో చలించిపోయాను! | special chit chat with All India Radio Sharada Srinivasan | Sakshi
Sakshi News home page

చలంగారి ప్రశంసతో చలించిపోయాను!

Published Wed, Feb 4 2015 10:47 PM | Last Updated on Sat, Sep 2 2017 8:47 PM

చలంగారి  ప్రశంసతో చలించిపోయాను!

చలంగారి ప్రశంసతో చలించిపోయాను!

రేడియో అంతరంగాలు
 
తెలుగుకి సంబంధించి ఆల్ ఇండియా రేడియో అనగానే... ఠక్కున గుర్తొచ్చేది చలం ‘పురూరవ’ శ్రవణ నాటకం. అందులో ‘ఊర్వశి’ శారదా శ్రీనివాసన్! కావ్యాల్లోని ఊర్వశి సోయగాన్ని తన మధురస్వరంలో ఒలికించి శ్రోతల ఊర్వశిగా నిలిచారు. చలాన్ని సైతం మైమరిపించారు..! ఆ పురూరవ ఊర్వశి... ఆకాశవాణి మానసి... శారదా శ్రీనివాసన్ అంతరంగంలోని రేడియో తరంగం...
 
రేడియో... నా జీవితమే అది. నా అనుబంధమంతా దానితోనే. నాటకాలు వేసినా, పాటలు పాడినా, సీతక్కగా శ్రోతలు ఆదరించినా అంతా రేడియో వల్లే. ఒకరకంగా ఆకాశవాణి నాకు తల్లిలాంటిది. ఏఐఆర్ మాకు ఆఫీస్ కాదు. ఓ ఇల్లు.. ఓ ఫ్యామిలీ! అది తప్పితే మాకు ఇంకే వ్యాపకమూ ఉండేది కాదు.

ఏఐఆర్... ఓ యూనివర్సిటీ

హైదరాబాద్‌లో ఏఐఆర్ బిల్డింగ్ (ఇప్పుడున్నది కాదు పాతది) అసెంబ్లీ ఎదురుగుండా అంతే దర్జాగా ఇంకా చెప్పాలంటే దాని ఔన్నత్యాన్ని చాటుతున్నట్టుండేది. అసెంబ్లీలోని ప్రజాప్రతినిధుల వాయిస్‌కి ప్రతిధ్వని. అప్పుడు బిల్డింగ్ అంతా వెనక్కి ఉంటే లాన్స్ ముందు ఉండేవి. బిల్డింగ్‌కి లాన్స్‌కి మధ్యలో కార్ డ్రైవ్. సాయంకాలాలు... ఆ లాన్స్‌లో కూర్చోని రిహార్సల్స్ చేసుకునే వాళ్ళం. బేగం అఖ్తర్ భుజం మీద చేయి వేసి...‘బేటీ కేసీ హో...క్యాకర్తీ హో ఇదర్’ అని అడిగింది. మళ్ళీ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకొని మరీ పలకరించింది. బాలమురళీకృష్ణగారితో కలిసి పాడే అదృష్టాన్నిచ్చింది. ఇలా వీళ్లందరినీ వ్యక్తిగతంగా చూసి, మాట్లాడే అవకాశం ఆకాశవాణివల్లే కలిగింది. నేను గనుక అందులో ఉద్యోగం చేసుండకపోతే వాళ్లను కనీసం చూసే భాగ్యం కూడా దొరక్కపోవును.
 
సౌందర్యరాశి ఊర్వశి..

మన కావ్యాల్లో వర్ణించిన దాని ప్రకారం మహా సౌందర్యరాశి ఆవిడ. రేడియోలో ఆ సౌందర్యాన్ని గొంతులో పలికించాలి. ఊర్వశి పట్ల శ్రోతలకున్న ఊహకు రేడియో ఆర్టిస్ట్ తన కంఠంతో ఊపిరి పోయాలి. అలాంటి ఈ శ్రవణ పాత్ర నాకు తెచ్చిన పేరు అంతా ఇంతా కాదు. కృష్ణశాస్త్రిగారి ‘షర్మిష్ఠ’ నాటకంలోని దేవయానిగా పలికిన నా పాత్రకు రాజమన్నార్‌లాంటి వాళ్ళు మెచ్చుకుంటూ ఉత్తరం రాశారు. అయితే ఈ ప్రశంసలన్నిటికీ అప్పుడు కలిగిన సంతోషం వేరు...ఇన్నేళ్ళయినా వాటి ద్వారా ఇంకా నన్ను గుర్తుపెట్టుకున్నారని ఇప్పుడు కలుగుతున్న సంతోషం మాటల్లో చెప్పలేనిది. చలంగారు నా ఊర్వశి పాత్రను చాలా మెచ్చుకున్నారని అప్పట్లో ఎవరో చెప్పారు. నేను నమ్మలేదు. ఎందుకంటే చలంగారు ఈ రేడియో ప్రోగ్రామ్స్‌ని పెద్దగా ఇష్టపడరని వినున్నాను. అలాంటి ఆయన ఆ నాటకంలోని నా పాత్రను ఎందుకు మెచ్చుకుంటార్లే అనుకున్న. ఓరోజు... రమణయ్య రాజా అనే ఓ లెఫ్టినెంట్ కల్నల్ ఫోన్ చేసి ‘‘మేడం... చలంగారు ‘పురూరవ’ నాటకం విని అందులోని మీ ఊర్వశి పాత్రను చాలా మెచ్చుకున్నారండీ’’ అన్నారు. ఎదురుగా ఆ నాటకం ప్రొడ్యూసర్ గోపాల్‌గారూ ఉన్నారు. నేను రిటైరయ్యాక భార్గవిగారితో కలిసి ఊరికెనే అరకులోయ చూడాలని వెళ్ళాం. అన్నీ చూసుకొని ఆ రోజు సాయంకాలం తిరుగు ప్రయాణమవుతామనగా... ‘‘శారదా.. సరదాగా భీమ్లీ వెళ్ళి సౌరీస్ (చలంగారి అమ్మాయి)ని చూద్దాం’’ అంది భార్గవి. అప్పుడు మాతో కథారచయిత గొరుసు జగదీశ్వర్‌రెడ్డి ఉన్నాడు. భీమ్లీ కోసం అతనే కారు అదీ ఆరెంజ్ చేసి భీమ్లీకి తీసుకెళ్ళాడు. మేం వెళ్లే సరికి సౌరీస్ కళ్ళు మూసుకుని ధ్యానముద్రలో కూర్చొని ఉన్నారు. హిందుస్థానీ మ్యూజిక్ ఏదో ప్లే అవుతుంది.

తతిమావాళ్ళంతా ఆవిడకెదురుగా అలా కూర్చొని ఉన్నారు. మేమూ అరగంట అలాగే కూర్చున్నాం. అయినా ఆవిడ కళ్ళు తెరవరు. మధ్యాహ్నం ఎవరింట్లోనో భోజనం మాకు. వాళ్లింటికి వెళ్ళాలి. టైమ్ అవుతోంది. ఈలోపు భార్గవి ఇంకో వైపు ఉన్న ద్వారం నుంచి సౌరీస్ దగ్గరకు వెళ్ళింది. తను మిలేనియం ఇయర్‌లో కొన్ని కథల సంపుటి తీసుకొచ్చింది. అందులో సౌరీస్ కథ కూడా ఉంది. ఆ మాటే సౌరీస్ చెవిలో చెప్తూ ఆ భార్గవిని నేను అంది. ఆవిడ కళ్ళు తెరవకుండా అవునా అన్నట్టుగా తల ఊపారు.

 తర్వాత పక్కనే ఉన్న నన్ను ‘ఈవిడ శారదా శ్రీనివాసన్’ అంటూ పరిచయం చేసింది భార్గవి. ఆ మాట విన్న వెంటనే దిగ్గున కళ్ళు తెరిచి నా వైపు చూస్తూ ‘‘ఎవరూ ఊర్వశి?’’ అని అడిగారు. ఆశ్చర్యపోయాను. తేరుకొని ‘‘అవును మేడమ్...ఆ వేషం నేనే వేశాను’’ అన్నాను. ‘‘నాన్నగారికి చాలా ఇష్టం’’ అన్నారు. మరపురాని జ్ఞాపకం ఇది. చలంగారు మెచ్చుకున్నారన్న విషయాన్ని అప్పుడు నమ్మాను. అంతకు ముందు అభిమానుల నుంచి వచ్చిన వేల ఉత్తరాలు, ఫోన్లకు స్పందించని నా మనసు   చలంగారి ప్రశంసతో చలించిపోయింది. ఆయన రాసిన నాటకాన్ని నేను మెప్పించగలిగాను అన్న సంతృప్తి. అలాగే మనసుకవి ఆత్రేయగారు ‘పురూరవ’ నాటకాన్ని విని ఫోన్ చేశారు. ‘‘ఊర్వశిగా అద్భుతం మీరు. నాకు ఆ రికార్డింగ్ కావాలి. పంపగలరా ఎలాగైనా’’ అని పంపాను. తర్వాత ఒకసారి ‘‘మీకు సన్మానం చేస్తున్నాం, రాగలరా’’ అని అడిగారు. ‘‘సారీ అండీ... నాకు టైమ్ ఉండదు. అయినా మీలాంటి గొప్ప కవుల ప్రశంసే నాకు సన్మానం కన్నా ఎక్కువ’’ అన్నాను. ‘‘లేదు. నేనొచ్చి మిమ్మల్ని కలుస్తాను మీకేమైనా అభ్యంతరమా?’’ అన్నారు. ‘‘మీరు మా ఇంటికి రాగలిగితే చాలా సంతోషం’’ అన్నాను.

ఎవరినో వెంటతీసుకొని మా ఇంటికొచ్చారు. ‘పురూరవ’లో పురూరవగా వేసిన చిరంజీవిగారినీ రమ్మన్నాను. నేనూ, మావారూ ఉన్నాం. నేను వేసిన మిగిలిన నాటకాల గురించీ అడిగారు. సంభాషణ అంతా అయ్యాక చిన్న కాగితం ఉంటే ఇవ్వమ్మా అని అడిగారు. ఇచ్చాను. నన్ను, సరస్వతిదేవిని కంపేర్ చేస్తూ ‘ఆ శారదకు వీణ కరమునుందు ఈ శారదకు వీణ గళము నందు’ అంటూ ఓ కవిత రాసిచ్చారు. ఏ పద్మశ్రీలు వీటితో సమానం? అలాగే బాలమురళీకృష్ణగారు... నా జీవితంలో ఆయనది గురుస్థానం. ఆయన సంగీత సారథ్యం వహించిన ఓ సినిమాలో నేను డబ్బింగ్ చెప్పాను. ఎప్పుడు విన్నారో తెలియదు కానీ.. ఏదో ఫంక్షన్‌లో కలిసినప్పుడు ‘శారదా.. ఇలా రా...’ అని పిలిచి ‘‘నిన్ను చూసి నేను గర్వపడుతున్నానమ్మా’’ అన్నారు. నా కళ్లెంబట నీళ్లోచ్చేశాయ్. అలాంటివన్నీ తలచుకున్నప్పుడు నా జీవితాన్ని వృథా కానివ్వలేదు. తర్వాత తరం వాళ్ళు నేర్చుకోవడానికి ఎంతోకొంత స్ఫూర్తినిచ్చాననే తృపి.్త  

ఒక్కటి కూడా వినలేదు ...

ఇంతా చేసి నేను వేసిన నాటకం ఒక్కటి కూడా మా నాన్న గారు వినలేదు. అలాగని ఆయనకు నాటకాలంటే ఇష్టంలేక కాదు. బందాగారు, స్థానంవారు వేసిన నాటకాలను పక్క ఊరికి కూడా వెళ్ళి చూసొచ్చిన సందర్భాలున్నాయి. బహుశా...తన కూతురు అలా రేడియోలో నాటకం వేయడం ఇష్టం ఉండకపోవచ్చు. అంతదాకా ఎందుకు..మా ఆయనా పెళ్ళయ్యాక ‘‘రేడియోలో ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండగలవా?’’ అని అడిగారు. ఆయనదీ రేడియోలోనే ఉద్యోగం. ఫ్లూట్ వాయిద్యంలో పెద్ద విద్వాంసుడు.
 ‘‘మీరూ ఇదే ఉద్యోగంలో కంటిన్యూ అవుతూ నన్ను ఉద్యోగం మానేయమంటే ఇల్లు గడవడం కష్టమవుతుంది. కాబట్టి మీరు ఇంతకన్నా మంచి ఉద్యోగం చూసుకోండి అప్పుడు నేను ఈ ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటా’’ అని చెప్పాను. కానీ ఆయన వేరే జాబ్ చూసుకోవడం పడలేదు... నేను రేడియోలో ఉద్యోగం మానేసే అవసరం రాలేదు (నవ్వుతూ) తర్వాత మామధ్య ఇంకెప్పుడూ ఆ ప్రస్తావన కూడా రాలేదు.
      
విజయవాడలో నేను ప్రవీణ ప్రచారక్‌గా ఉన్నప్పుడు  మా హిందీ కాలేజ్‌కి ఓ కాంట్రాక్ట్ వచ్చింది.  హిందీలో ఓ శ్రవణ నాటకం వేయమని. మా మాస్టర్ వేమూరి రాధాకృష్ణగారితో ఆడిషన్ టెస్ట్‌కి వెళ్లాను. వాళ్లిచ్చిన విషయాన్ని మాడ్యులేషన్‌తో చదివాను. జనమంచి రామకృష్ణారావుగారు నన్ను సెలక్ట్ చేశారు. అయితే కాలేజ్ ప్లే ద్వారా కాకుండా వేరే ప్లే ద్వారా నా రేడియో ప్రవేశం జరిగింది. అదే నాంది అనుకోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement