Sharada Srinivasan
-
అలనాటి ఆకాశ వాణి
‘‘కలదు ఆ శారదకు వీణ కరములందు కలదు ఈ శారదకు వీణ గళమునందు కలదు ఆ శారద కవుల కవితలందు కలవు కవితలే ఈమె గానామృతమందు శారద కాని శారదకు శారదలోగల సత్కళా సుధా సారదకున్... విశారదకు సాదర పూర్వ నమస్సుమాంజలులు’’ రేడియో కళాకారిణి శారదా శ్రీనివాసన్‌కు ఆచార్య ఆత్రేయ కలం నుంచి జాలువారిన ప్రశంస ఇది. 19.6.1977వ తేదీన ఆత్రేయ స్వహస్తాలతో రాసిన ఈ లేఖ శారదా శ్రీనివాసన్ దగ్గర ఇంకా భద్రంగా ఉంది. ఈ నెల రెండవ తేదీన హైదరాబాద్‌లో ‘లాడ్లీ మీడియా అండ్ అడ్వర్టైజింగ్ అవార్డ్స్ ఫర్ జెండర్ సెన్సిటివిటీ’ ప్రాంతీయ పురస్కారం అందుకున్నారామె. 45 ఏళ్ల కిందటి ఆత్రేయ గారి ప్రశంస, ఇప్పుడు ఈ పురస్కారానికి మధ్య ఆమె అందుకున్న గౌరవాలను లెక్క పెట్టడం సాధ్యం కాని పని. అలాగే ఆమె గళమిచ్చిన పాత్రల సంఖ్య కూడా! వేలల్లో ఉంది. తనకు గుర్తింపు, గౌరవం అన్నీ రేడియోతోనే అన్నారామె. శారదా శ్రీనివాసన్ తన రేడియో ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు. గళం దేవుడిచ్చాడు! ఉచ్చారణ ఇల్లు నేర్పించింది! ‘‘నేను పుట్టింది కృష్ణాజిల్లా, అవనిగడ్డ. మా నాన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగి. అప్పుడు అక్కడ ఉద్యోగం చేసేవారు. నాకు భగవంతుడు చక్కటి గొంతునిచ్చాడు. చక్కగా ఉచ్చరించడం మా ఇంట్లో అలవడింది. ఏ తొందరపాటులోనో ఒకపదంలో ఒక్క ఒత్తును సరిగ్గా పలకకపోయినా సరే ఉపేక్షించేవారు కాదు, ‘ఏం పలికావు? మళ్లీ పలుకు’ అని కోప్పడుతూ ఎప్పటికప్పుడు సరిదిద్దేవారు. మేము తణుకులో ఉన్నప్పుడు నన్నయ భట్టారకుని జయంతి సందర్భంగా పాఠశాల బాలికలకు పద్యపఠనం నిర్వహించారు. నేను కూడా ఓ నాలుగు పద్యాలు కంఠతా పట్టి ఆ పోటీల్లో వినిపించాను. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. బహుమతితో ఇంటికి వస్తే మా నాన్న ఏమన్నారో తెలుసా... ‘ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షం అన్నట్లు, నీకు ప్రథమ బహుమతి వచ్చిందా’ అని నవ్వారు. యాదృచ్ఛికంగా మొదలైంది! మేము విజయవాడ, మాచవరంలో ఉన్నప్పుడు హిందీకాలేజ్లో ప్రవీణ, ప్రచారక్ చేస్తున్న రోజుల్లో అనుకోకుండా వచ్చింది అవకాశం. రేడియో కాంటాక్ట్ కోసం వాయిస్ టెస్ట్ చేశారు. మా లెక్చరర్ చొరవతో వాయిస్ టెస్ట్‌లో పాల్గొనడం, సెలెక్ట్ కావడం జరిగిపోయింది. ఇది 1956–57ల నాటి మాట. అలా మొదలైన నా ఆకాశవాణి ప్రయాణంలో నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. 1995 ఆగస్టులో రిటైరయ్యే వరకు నేను గళమిచ్చిన ప్రతి కార్యక్రమం నాకు ఒక పాఠమే. నన్ను సమగ్రంగా తయారు చేసిన యూనివర్సిటీ రేడియో. నవరసాలూ గొంతులోనే పానుగంటి వారి రచనల్లోని పాతతరం తెలుగు భాషను ఒంటపట్టించుకోవడం కొంచెం శ్రమ అనిపించేది. అంతే తప్ప మరెక్కడా ఇబ్బంది పడలేదు. బాలగంగాధర తిలక్ ‘సుప్తశిల’ నేను చాలా బాగా చేశానని నాకనిపించిన నాటిక. రంగస్థలం మీద నటించేటప్పుడు హావభావాలు ప్రేక్షకులకు కనిపిస్తుంటాయి. రేడియోలో అలా కాదు. నవరసాలనూ గొంతులోనే పలికించాలి. అంతేకాదు, శ్రోతలకు మేము కనిపించడం లేదు కదా అని ఒకే చోట కూర్చుని మాట్లాడుతూ నాటికను రికార్డు చేస్తే జీవం రాదు. ఒక గదిలో నుంచి మరో గదిలోకి వెళ్తున్న సన్నివేశంలో కానీ, ఒక పాత్ర ఇంటి నుంచి బయటకు వెళ్తూ ‘వెళ్లొస్తాను’ అంటూ వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు మొదటి అక్షరం పలకడానికి చివరి అక్షరం పలకడానికి మధ్య మైక్‌కు దూరం వెళ్తేనే ఆ సన్నివేశం శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలను దర్శకులు చెప్పరు. ఎవరికి వారు సాధనలో తెలుసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం... ఉచ్చారణ ఉద్దేశం ఏమిటి? ఎదుటి వారికి తెలియాల్సిన ఒక విషయాన్ని మనం చెబుతున్నామనే కదా! పదాలను ఎక్కడ ఆపాలో, ఎక్కడ కలిపి పలకాలో స్పష్టత లేకపోతే వినేవాళ్లకు విషయం ఎలా తెలుస్తుంది? టీవీలో వార్తలు చదివే వాళ్లు ఈ ఒక్క నియమాన్ని పాటిస్తే బావుణ్ణనిపిస్తుంటుంది. ఉత్సాహాన్నిచ్చింది ఇక నా కుటుంబ విషయానికి వస్తే... చెన్నై నుంచి వచ్చిన ఫ్లూట్ ఆర్టిస్ట్ శ్రీనివాసన్‌తో రేడియోలోనే పరిచయమైంది. పెళ్లి చేసుకున్నాం. మాకు ఒకమ్మాయి నీరద. నాటికల ద్వారా ఎన్నో జీవితాలను ఆయా పాత్రల్లో ఇమిడిపోయినంతగా చదివాను. అందుకే ఎన్నో కోణాలను అర్థం చేసుకోగలిగాను. ముందే చెప్పాను కదా... ఆకాశవాణి అనే యూనివర్సిటీలో పట్టా పొందిన విద్యార్థిని నేను. ఈ రోజు లాడ్లీ్ల వంటి సంస్థ గుర్తించడానికి కారణమూ రేడియోనే. ఎనభై ఎనిమిదేళ్ల వయసులో ఈ అవార్డు నాకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఇప్పటికీ గళం సహకరిస్తూ ఉండడం నా అదృష్టమనే చెప్పాలి’’ అని సంతోషాన్ని వ్యక్తం చేశారు రేడియో ఆర్టిస్ట్, రచయిత శారదా శ్రీనివాసన్. ఆకాశవాణి... నా బడి గుడి! నాటికలు నా ప్రధాన విభాగం. అయినప్పటికీ స్పోకెన్ వర్డ్ ఆర్టిస్ట్‌గా రకరకాల స్క్రిప్టులు చదివాను. సాహిత్యం, చరిత్ర, నవలాపఠనం, వైద్య కథనాలు, మహిళలు – పిల్లల అంశాలు, కార్మికుల కార్యక్రమాలు, పిల్లల పాఠ్యాంశాలు... ఇలా అదీ ఇదీ అని పరిమితం కాకుండా అన్ని విభాగాల్లోనూ నా గొంతు వినిపించాను. యువవాణి మినహా రేడియోలో అన్ని విభాగాల్లోనూ నా గొంతు వినిపించాను. -
ఒక్క డైలాగుతో ఉద్యోగం వచ్చేసింది
పదేళ్ల క్రితం వరకు రేడియో నాటకాల్లో ఓ గంభీరమైన గాత్రం శ్రోతలందర్నీ ఎంతగానో అలరించింది. గుక్క తిప్పుకోకుండా ఎంత పెద్ద డైలాగునైనా అనర్గళంగా చెప్పగల సత్తా ఆ స్వరానికే సొంతం. రేడియోలోనే కాక రంగస్థల నాటకాల్లో, సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషించిన ఆ కళాకారుడే కోకా సంజీవరావు. నాటకాల్లో చెంఘిజ్‌ఖాన్, ఖడ్గ తిక్కన, రాముడు, భీష్ముడు, దుర్యోధనుడు అలా ఎన్నో పాత్రల్లో ఇమిడిపోయారాయన. నటనే కాకుండా నాటికలూ రచించారు. ఈ వారం ‘రేడియో అంతరంగాలు’ కోసం సంజీవరావును ఇంటర్వ్యూ చేశారు ప్రముఖ రేడియో కళాకారిణి శారదా శ్రీనివాసన్. ఆయన ప్రస్థానంలోని విశేషాలు ఆయన మాటల్లోనే... జనం మెచ్చిన ‘జనరంజని’ విజయవాడలో పని చేస్తుండగా కోకా సంజీవరావు... శోభన్‌బాబు, సూపర్ స్టార్ కృష్ణ, బాలయ్య, కాంచన వంటి ఎంతో మంది నటీనటులతో ‘జనరంజని’ కార్యక్రమం నిర్వహించారు. తర్వాత 1994లో పదవీ విరమణ చేశారు. సర్వీసులో చివరి అయిదు ఏళ్లు ఎన్నో నాటకాలు ప్రొడ్యూస్ చేశారు. అలాగే ఆకాశవాణి తరఫున ఆయన ఢిల్లీలో చేసిన ‘మరో మొహెంజొదారో’, ‘సుడిగాలి’ నాటకాలకు అవార్డులు, అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా ‘బళ్లారి రాఘవ’ పురస్కారం అందుకున్నారు. నేను పుట్టి పెరిగిందంతా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో. 1949లో నేను మా స్కూల్లో ఓ నాటకం వేశాను. అదీ సంస్కృతంలో. భాష రాకపోయినా స్క్రిప్ట్‌ను బట్టీకొట్టి చేశాను. తర్వాత్తర్వాత రంగస్థల నాటకాలు వేయడం ప్రారంభించాను. అలా మొదలైంది నా నాటక జీవితం. నా సర్వీసులో ఓ రిక్షావాడి నుంచి జమీందారు వరకు అన్ని రకాల పాత్రలూ పోషించాను. శోభన్‌బాబుతో సావాసం గుంటూరులోని ఏసీ కాలేజీలో నేను బీఏలో చేరాను. ఓ ఏడాది కళాశాల యాజమాన్యం నాటకాలు నిర్వహించడానికి ఆసక్తిగల వారిని ఆహ్వానించింది. అప్పుడు నేను, సినీనటుడు ‘శోభన్‌బాబు’ ఆ సెలక్షన్స్‌కు వెళ్లాం. ‘పునర్జన్మ’ నాటకంలో శోభన్‌బాబు హీరోగా, నేను విలన్‌గా నటించాం. తర్వాత స్నేహితులమయ్యాం. రేడియోలోకి... 1957లో నేను ఏసీ కాలేజీలో ఉన్నప్పుడే విజయవాడ స్టేషన్లో ‘ఖైదీ’ అనే లైవ్ నాటకం వేశాను. ఆకాశవాణిలో అడుగుపెట్టక ముందే ఎన్నో రంగస్థల నాటకాల్లో అద్భుతమైన పాత్రలు పోషించాను. కానీ ఉద్యోగం లేకుండా ఇంకెన్నాళ్లు తిరగాలి అనుకొని అప్పుడే హైదరాబాద్ స్టేషన్లో ప్రకటన పడితే అనౌన్సర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాను. ఇంటర్వ్యూ ప్యానల్లో బాలగురుమూర్తి, స్థానం నరసింహారావు లాంటి దిగ్గజాలున్నారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలతో పాటు నేను ముందు వేసిన నాటకంలోంచి ఓ డైలాగును చెప్పేసరికి నాకు ఆ ఉద్యోగం వచ్చేసింది. వివిధ స్టేషన్లలో.. ఓ నాలుగేళ్లు హైదరాబాద్‌లో పనిచేసి 1968లో వైజాగ్‌కు వచ్చేశా. అక్కడ చేస్తూనే ఎన్నో వీధి నాటకాలు వేశాను. అప్పట్లో మాకూ సినిమా తారలకున్నంత క్రేజ్ ఉండేది. 1971లో నేను విజయవాడ స్టేషన్‌కు బదిలీ అయ్యాక అక్కడ ఎన్నో రేడియో నాటకాలు చేశాను. పాత్రాభినయం విజయవాడలో ఎన్నో నాటకాల్లో వైవిధ్యభరిత పాత్రలు పోషిస్తూనే, చాలా వాటిని ప్రొడ్యూస్ చేశాను. రాముడు మొదలుకొని భీముడు, భీష్ముడు, అర్జునుడు, దుర్యోధనుడు లాంటి పౌరాణికాలతో పాటు అల్లావుద్దీన్, ఖడ్గతిక్కన, శ్రీ కృష్ణదేవరాయలు పాత్రలు చేశాను. ఎస్.బి.శ్రీరామమూర్తి స్వయంగా ప్రొడ్యూస్ చేసిన ‘చెంఘిజ్‌ఖాన్’ నాటకంలో ముఖ్యపాత్రను నన్ను పోషించమన్నారు. అది నేను రిటైర్ అయ్యాక చేశాను. అలా మరచిపోలేని ఎన్నో నాటకాలు చేశాను. దీనికంతటికీ కారణం తల్లిలాంటి ఆకాశవాణే. ఆదరణ పొందిన సీరియళ్లు రేడియోలో సీరియళ్లను అప్పట్లో శ్రోతలు ఎంతో అభిమానించేవారు. నేను చేసిన ‘మీర్జాన్ పుల్లయ్య’ సీరియల్ దాదాపు 28 ఎపిసోడ్లు నడిచింది. అలాగే ‘సమస్యల మజిలీలు’, ‘ఎవరు బాధ్యులు’ లాంటి సీరియళ్లను శ్రోతలు బాగా ఆదరించారు. నేను చేసిన నాటకాల్లో సన్నివేశాన్ని శ్రోతల కళ్లకు కట్టినట్టు ఉండాలనే జిజ్ఞాసతో విభిన్న ప్రయోగాలు చేశాను. ఉదాహరణకు నాటకంలో భీష్ముడిపాత్రను పోషించిన లింగరాజుశర్మగారిని అంపశయ్య మీద పడుకున్నట్టు తెలియజెప్పడానికి ఆయనను నేల మీద పడుకోబెట్టి డైలాగులు చెప్పించాను. సినిమాల్లోనూ... సినీ నిర్మాత డి.రామానాయుడు, నేనూ ఒకే స్కూల్లో చదువుకున్నాం. ఆయన చాలా సినిమాల్లో నాకు అవకాశం ఇచ్చారు. శోభన్‌బాబు నటించిన ‘సోగ్గాడు’తో మొదలు పెట్టి, ‘శుక్రవారం మహాలక్ష్మి’, ‘ఈ చదువులు మాకొద్దు’, ‘విప్లవ శంఖం’, ‘అంగడి బొమ్మ’, హిందీలో జితేందర్‌తో కలిసి ‘దిల్దార్’ సినిమాల్లో నటించాను. ప్రస్తుతం నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ హాయిగా జీవనం సాగిస్తున్నాను. - నిఖితా నెల్లుట్ల, ఫొటో: ఎస్.ఎస్.ఠాకూర్ -
సుధామతో రేడియో అక్కయ్య ముచ్చట్లు
-
చిన్నక్క కబుర్లు
రేడియో అంతరంగాలు ఆలిండియా రేడియోలో ఓ నటిగా, రచయిత్రిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు రతన్‌ప్రసాద్. శ్రోతలందరికీ ఆమె ‘చిన్నక్క’గా సుపరిచితురాలు. అనౌన్సర్ అంటే ఇలా ఉండాలని చూపించదగ్గ గొప్పతనం ఆమెకుంది. ఏ కార్యక్రమానికి ఎలా మాట్లాడాలనే దానిపై ఆమెకున్న పట్టు సాటిలేనిది. సినీతారలకే కాదు రేడియో కళాకారులకు కూడా ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో ఆమె మాటలు వింటే తెలుస్తుంది. ‘‘తప్పు జరిగింది, క్షమించండి’’ అని చెప్పాల్సిన పరిస్థితిని ఆమె తన నలభై ఏళ్ల సర్వీసులో ఏనాడూ తెచ్చుకోలేదు. ప్రముఖ రేడియో కళాకారిణి శారదా శ్రీనివాసన్ ఈ వారం ప్రఖ్యాత రేడియో ఆర్టిస్ట్ అయిన 83 ఏళ్ల రతన్‌ప్రసాద్‌ను పలకరించారు. ఆత్మీయంగా పంచుకున్న ఆ విశేషాలు ఆమె మాటల్లోనే... దక్కన్ రేడియోలో క్యాజువల్ ఆర్టిస్ట్‌గా నా రేడియో జీవితాన్ని ప్రారంభించాను. అప్పుడు అక్కడ కేశవపంతుల నరసింహ శాస్త్రిగారు, కుప్పుస్వామిగారు ఉండేవారు. తర్వాత దక్కన్ రేడియో ‘ఆలిండియా రేడియో’గా రూపాంతరం చెందాక 1958లో నేను అనౌన్సర్‌గా ఉద్యోగంలో చేరాను. అది అనుకోకుండా జరిగి పోయింది. అసలు నేను వాద్యసంగీతం ఆడిషన్‌కు వెళ్లాను. ఆ ఆడిషన్లో వాద్యాల మధ్య నేను మాట్లాడిన మాటలను విని, నా కంఠ స్వరంలో ప్రత్యేకత ఉందని చెప్పి అక్కడి జడ్జీలు నన్ను అనౌన్సర్‌గా తీసుకున్నారు. కార్మికుల కార్యక్రమం ఈ కార్యక్రమం నా జీవితాన్నే మలుపు తిప్పిందని చెప్పాలి. ఇప్పటికీ ప్రజల్లో ‘చిన్నక్క’, ‘ఏకాంబరం’ పాత్రలు గుర్తున్నాయంటే అది మా అదృష్టం. ఈ కార్యక్రమంలో మొదట కొన్నేళ్లు నేను రమణక్కగా తెలంగాణ మాండలికంలో మాట్లాడేదాన్ని. తర్వాత నా పాత్ర పేరును రమణక్క నుంచి చిన్నక్కగా, సత్యనారాయణ పోషించే పాత్ర పేరును జగన్నాథం నుంచి ఏకాంబరంగా మార్చారు. అలా 10 ఏళ్లు రమణక్కగా, 30 ఏళ్లు చిన్నక్కగా రేడియోలో కార్యక్రమాలు చేశాను. అలాగే కుటుంబ నియంత్రణపై మేం చేసిన కార్యక్రమాలు మాకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఏనుగు అంబారీ దివిసీమ ఉప్పెన సమయంలో తుపాను బాధితుల సహాయార్థం విరాళాలు సేకరిద్దామని నేను, వి.సత్యనారాయణ (ఏకాంబరం పాత్రధారి), జీడిగుంట రామచంద్రమూర్తి (బాలయ్య పాత్రధారి)లతో మహబూబ్‌నగర్ జిల్లాల్లోని వనపర్తి, గద్వాల్, కొల్లాపూర్ ప్రాంతాల్లో పర్యటించాం. సినీ తారలకు నీరాజనం పట్టినట్టే మాకూ ఘనస్వాగతం పలికారు ప్రజలు. అలాగే జగిత్యాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు నన్ను ఏనుగుపై ఊరేగించి సన్మానం చేశారు. ఆ సన్మానం నాకు జరిగినట్టుగా నేనెప్పుడూ భావించలేదు. అది ఆకాశవాణికే జరిగిందని నమ్ముతాను. భాగ్యనగరంలో కలకలం 1970లో గండిపేట తెగిపోయి హైదరాబాద్ నగరం మునిగిపోతుందని వదంతులు చెలరేగాయి. అప్పుడు ప్రజల్లో భయాందోళనలు తొలిగించేందుకు కృషి చేయాల్సిందిగా పోలీసులు మమ్మల్ని కోరారు. దాంతో ప్రతి అయిదు నిమిషాలకోసారి ఈ అంశంపై వివిధ రకాలుగా అనౌన్స్ చేశాను. మరుసటి రోజు పోలీసు కమిషనర్ వచ్చి ‘‘మేం చేయలేకపోయిన పనిని మీరు విజయవంతంగా చేశార’’ని ప్రశంసించారు. ప్రజలు మెచ్చిన ప్రోగ్రామ్స్ స్త్రీల కార్యక్రమంలో ‘రంగవల్లి’లో ‘అమ్మ ఒడి’ అనే ధారావాహిక శీర్షిక నిర్వహించాను. ఈ కార్యక్రమంలో చిన్న పిల్లల భాషలోనే కథలు చెప్పేదాన్ని. ‘గ్రామసీమలు’ కార్యక్రమంలో రామాయణం చదివి వినిపించాను. మునిమాణిక్యం గారి ‘కాంతం కథలు’ చదివాను. 1962లో చైనా యుద్ధ సమయంలో సైనిక సోదరులు తమ భార్యలకు రాసినట్టుగా మేం ప్రసారం చేసిన ‘హంస సందేశం’ అనే దేశభక్తిపూరిత ధారావాహిక ఉత్తరాల కార్యక్రమం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ‘వన్నెల విసనకర్ర’ శీర్షికతో మహిళా వస్త్రధారణ, నగలకు సంబంధించిన కార్యక్రమం చేశాను. అలుపెరుగని కృషి.. నేను పత్రికలకు రాసిన ‘ఆవలి తీరానికి’, ‘ఎప్పటికీ ఏమీకాను’, ‘తెర తొలగింది’లాంటి నవలలకు బహుమతులు అందుకున్నాను. సెక్షన్ గ్రేడ్ అనౌన్సర్‌గా 1992లో రిటైర్ అయ్యాను. ఇప్పటికీ హైదరాబాద్ స్టేషన్ వారు మూడు, నాలుగేళ్లకోసారి నిర్వహించే జాతీయ నాటకానికి దర్శకత్వం వహించే బాధ్యతను నాకే అప్పగిస్తారు. ప్రస్తుతం ‘అమృతవాణి’లో చిన్నారులకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ..:: ప్రెజెంటేషన్: నిఖితా నెల్లుట్ల ఫొటోలు: ఎన్.రాజేశ్‌రెడ్డి కత్తిమీది సాము అనౌన్సర్ ఉద్యోగం కత్తి మీద సాము లాంటిది. అయితే వీరికి బాహ్య శత్రువులంటూ ఎవరూ ఉండరు. తమ కళ్లు, నాలుక, చేతులే విరోధులు. అవెలాగంటారా... స్క్రిప్టులోని అక్షరాలు అప్పుడప్పుడు కంటిని తప్పు దారి పట్టిస్తాయి. దాంతో నాలుక తప్పు చదువుతుంది. ఇక చేయి విషయానికొస్తే అనౌన్సర్లు మిషన్లతో వేగంగా పని చేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం పొరపాటు జరిగినా అంతే ఇంక. -
రేడియో అక్కయ్య ముచ్చట్లు!
-
మంగళహారతి సావిత్రి
రేడియో అంతరంగాలు అద్భుత స్వరం... ఆమెకు దేవుడిచ్చిన వరం. ఆ స్వరంతో దాదాపు నలభై ఏళ్ల పాటు ఆకాశవాణి శ్రోతలను అలరించారు ప్రముఖ రేడియో కళాకారిణి పాకాల సావిత్రీ దేవి. రేడియోలో పని చేసినంత కాలం ఎందరో మహానుభావుల స్వరాలకు శ్రుతి కలిపారామె. కర్ణాటక సంగీత విద్వాంసురాలైన సావిత్రీ దేవి ఆకాశవాణిలో సాంప్రదాయిక పాటలతో పాటు ఎన్నో జానపదాలూ పాడారు. అలా దాదాపు 4 వేల పాటలు పాడారు. అలాగే న్యాయపతి కామేశ్వరి (రేడియో అక్కయ్య) నిర్వహించిన కార్యక్రమంలో కూడా నటించారు. ఈ వారం ‘రేడియో అంతరంగాలు’ ఆమెను ఆత్మీయంగా పలకరించారు ప్రముఖ రేడియో కళాకారిణి శారదా శ్రీనివాసన్. ఆ విశేషాలు సావిత్రీ దేవి మాటల్లోనే... ఏడేళ్ల వయసులోనే సంగీత సాధన ప్రారంభించాను. మా అమ్మనాన్నలు ఇద్దరూ పాడేవారు. అలా సంగీతం నాకు వారసత్వంగా వచ్చిందేమో. నేను చిలకలపూడి వెంకటేశ్వరశర్మ, చావలి కృష్ణమూర్తి, గద్వాల్ ఆస్థాన విద్వాంసులు పురాణం కనకయ్యగారి లాంటి ఎంతోమంది గొప్ప విద్వాంసుల దగ్గర సంగీతం నేర్చుకున్నాను. అలా నా జీవితమే సంగీతంతో ముడిపడి పోయింది. రెగ్యులర్ ఆర్టిస్ట్‌గా... మొదట నేను విజయవాడ స్టేషన్లో క్యాజువల్ ఆర్టిస్ట్‌గా పాటలు పాడేదాన్ని. ఓ సారి హైదరాబాద్‌లో ‘గీత గోవిందం’, ‘గీతా శంకరం’ అనే సంగీత రూపకాలు చేయడానికి నన్ను పిలిచారు. అవి చేసి నేను తిరిగి వెళ్తుండగా అప్పటి స్టేషన్ డెరైక్టర్ నాయర్‌గారు నన్ను ఇక్కడే స్టాఫ్ ఆర్టిస్ట్‌గా ఉండి పొమ్మన్నారు. అప్పుడు నేను నా తల్లిదండ్రులను అడిగి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాను. అలా 1958లో హైదరాబాద్ స్టేషన్లో రెగ్యులర్ స్టాఫ్ ఆర్టిస్ట్‌గా అడుగుపెట్టాను. నా కోసం మా కుటుంబమంతా ఇక్కడకు వచ్చేసింది. సాహిత్య దిగ్గజాల పాటలు నా నలభై ఏళ్ల సర్వీసులో దేవులపల్లి కృష్ణశాస్త్రి, బాలాంత్రపు రజనీకాంతరావు, స్థానం నరసింహారావుగారు లాంటి ఎంతోమంది గొప్ప రచయితలు రాసిన పాటలు ఎన్నో పాడాను. ఆకాశవాణి వల్లే నాకు ఆ అదృష్టం దక్కింది. వారు నా కోసం ప్రత్యేకంగా పాటలు రాసేవారు. మా రెండో అమ్మాయి పుట్టినప్పుడు నెలరోజులకే నేను డ్యూటీలో చేరాను. అప్పుడు నేను చంటిపిల్ల తల్లినని కృష్ణశాస్త్రి గారు నా కోసం ‘మూసే నీ కనుల, ఎవరు పూసేరో నిదుర’ అనే జోల పాటను ప్రత్యేకంగా రాసి పాడించారు.. నా సర్వీసును విజయవంతంగా పూర్తి చేసి స్టాఫ్ ఆర్టిస్ట్‌గానే 1999లో పదవీ విరమణ పొందాను. భక్తి పాటలు అనేకం నేను కర్ణాటక సంగీతంతో పాటు లలిత సంగీతమూ పాడేదాన్ని. ‘భక్తి రంజని’ కార్యక్రమంలో సంప్రదాయ కీర్తనలు ఎన్నో పాడాను. చిత్తరంజన్గారితో కలిసి పాడటం గొప్ప అనుభవం. ఆయన ఎంతో ఓర్పుతో నేర్పించేవారు. రేడియోలోనే కాకుండా బయట కూడా ఎన్నో కచ్చేరీలు చేశాను. అందులో సోలో కచ్చేరీలూ చాలా ఉన్నాయి. ఇప్పటికీ పాడుతూనే ఉంటాను. పాటలు మననం చేసుకోవడమే నాకు బలం. రేడియో సంగీతం కృష్ణశాస్త్రిగారు రాసిన ‘శర్మిష్ఠ’ లాంటి ఎన్నో రూపకాల్లో పాడాను. నా పాటలను ప్రశంసిస్తూ స్టేషన్‌కు ఎన్నో ఉత్తరాలు వచ్చేవి. కేవలం శాస్త్రీయ సంగీతమే కాకుండా వింజమూరి సీతాదేవిగారి సారథ్యంలో జానపద గీతాలూ పాడాను. ఎన్నో దేశభక్తి గీతాలూ ఆలపించాను. ఇక స్త్రీల కార్యక్రమంలో నేను, మీరు (శారదా శ్రీనివాసన్) కలిసి ఎన్నో పాటలు పాడాం. కృష్ణశాస్త్రి, రజనీకాంతరావుగారు కలిసి రాసిన ‘నీ ఇంటికీ పిలువకూ, నన్ను లోనికి రమ్మనకూ..’ అనే పాట నాకెంతో పేరు సంపాదించి పెట్టింది. అలాగే వారానికో కొత్త మంగళహారతి పాటను శ్రోతలకు పరిచయం చేసేదాన్ని. దాంతో నన్ను చాలామంది ‘మంగళహారతి సావిత్రి’ అనే పిలిచేవాళ్లు. నాటకాల్లోనూ ప్రవేశం.. పాటలు మాత్రమే కాకుండా అడపా దడపా రేడియో నాటకాల్లోనూ చేశాను. రేడియో అక్కయ్యగారు, తురగా జానకీరాణిగారు నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. మహిళా సమాజం, రంగవల్లిలో చేశాను. మహిళా సమాజంలో ప్రతి బుధవారం ‘పెద్దక్క పెత్తనాలు’లో నేను, శ్యామలాదేవిగారు చేసేవాళ్లం. అందులో నేను వారమంతా అన్ని ఊళ్లూ తిరిగినట్టు ఆ వారం రాష్ట్రంలో జరిగిన ఉత్సవాలు, ఉరుసులు, వార్తలు, ముఖ్యమైన సంఘటనల గురించి చెప్పేదాన్ని. అలా పెద్దక్కగా నన్ను శ్రోతలు గుర్తుపెట్టుకున్నారు. ప్రస్తుతం గుళ్లలో కచ్చేరీలూ ఇస్తూ హాయిగా జీవితాన్ని గడుపుతున్నాను. ప్రెజెంటేషన్: నిఖితా నెల్లుట్ల ఫొటోలు: ఠాకూర్ రవీంద్రభారతి శంకుస్థాపన రోజు... హైదరాబాద్‌లో ఇప్పుడున్న కట్టడాల్లో చాలా వరకు మా పాటలతోనే ప్రారంభమయ్యాయి. రవీంద్రభారతి శంకుస్థాపన రోజు మేం పాటలు పాడాం. అలా ఎన్నో ప్రభుత్వ భవనాలు, పరిశ్రమలు ప్రారంభించే ముందు మా సంగీతం తప్పనిసరిగా ఉండేది. భారత తొలి రాష్ట్రపతి బాబూరాజేంద్రప్రసాద్ మొదలుకొని జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ లాంటి రాజకీయ నాయకులు నగరానికి వచ్చిన ప్రతిసారీ వారి ఎదుట మేము పాటలు పాడేవాళ్లం. -
లలితరంజన్
రేడియో అంతరంగాలు రేడియో కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి సంగీతాన్ని నేర్పించిన ఘనత మహాభాష్యం చిత్తరంజన్‌కు మాత్రమే దక్కుతుంది. తల్లి నుంచి పుణికిపుచ్చుకున్న సంగీతమే తనను ఇంతటి వాణ్ణి చేసిందంటారాయన. లలిత సంగీతం నేర్చుకోవడం, పాడడం అందరికీ తెలుసు. కానీ దానిపై పరిశోధన చేయాలనే ఆలోచన ఎంతమందికి వస్తుంది? అలా పరిశోధన చేసి దేశంలోనే మొదటిసారిగా లలిత సంగీతాన్ని యూనివర్సిటీ కోర్సుల్లో చేర్చిన ప్రత్యేకత కూడా చిత్తరంజన్దే. ఆకాశవాణిలో ఎందరో సంగీత విద్వాంసులు తమ సేవలనందించారు. అలాంటి మహానుభావుల్లో ఆయనొకరు. తన జీవితంలో సంగీతం ఇచ్చిన మధురానుభూతులను ప్రముఖ రేడియో కళాకారిణి శారదాశ్రీనివాసన్ తో పంచుకున్నారు చిత్తరంజన్. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... అందరికీ తొలి పలుకులు అమ్మే నేర్పుతుందంటారు. అలాగే మా అమ్మ పేరిందేవి నాకు పలుకులతో పాటు స్వరాలూ నేర్పింది. ఆమె ఇంట్లోనే వయొలిన్ నేర్చుకునేది. అప్పుడు నేనూ వినేవాణ్ణి. అలా సంగీతంపై ఆసక్తి పెరిగింది. స్కూల్లోనూ పాటలు బాగా పాడేవాణ్ణి. రేడియోలో సంగీతం మా నాన్న మహాభాష్యం రంగాచార్యులుగారు దక్కన్ రేడియోలో ఇంజినీర్‌గా పని చేసేవారు. అలా చిన్నప్పటి నుంచే రేడియోలో ప్రసారమయ్యే పిల్లల కార్యక్రమాల్లో నేను పాల్గొనేవాణ్ణి. నాకు బాగా గుర్తు.. అక్కడ మొదట నేను ‘మా తెలుగు తల్లి’ పాటతో పాటు మరికొన్ని పాడాను. అంతా అయిపోయాక కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలందర్నీ పిలిచి డబ్బులిచ్చారు. నా చేతిలో రూ.3 పెట్టారు మా నాన్నగారి ముందే. ‘‘నాన్నా! నాకు డబ్బులు ఇస్తున్నారు’’ అన్నాను. ఆయన ‘‘తీసుకో’’ అని నవ్వారు. అప్పుడు స్టేషన్లలో రికార్డింగులు లేవు కాబట్టి ఎనిమిదేళ్ల వయసులోనే నేను లైవ్‌లో పాడాను. నన్ను వద్దన్నారు 1954లో మొదటిసారి ఆడిషన్స్‌కు వెళ్లాను. క్యాజువల్ ఆర్టిస్ట్‌గా చేరుదామని. నేను రేడియో ఇంజినీర్ కొడుకునన్న కారణంగా నన్ను తీసుకునేది లేదన్నారు. కానీ అప్పటి ప్రోగ్రామ్ అసిస్టెంట్ వాక్నిస్గారు నాకు అవకాశం ఇవ్వాలంటూ సిఫారసు చేశారు. అప్పుడు ఆయన ‘‘ప్రతిభ ఉంటే ఎవరినైనా తప్పకుండా ప్రోత్సహించాలి’’ అన్న మాటలు నేను మర్చిపోలేను. బాలమురళితోగారితో బాంధవ్యం 1955లో మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు హైదరాబాద్‌లో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. అప్పుడు నాతో ఎన్నో పాటలు పాడించారు. తర్వాత 1958 నుంచి 1962 వరకు ఆయన దగ్గర శిష్యుడిగా ఎంతో నేర్చుకున్నాను. ఆయన వయొలిన్ అద్భుతంగా వాయించేవారు. బాలమురళి గారితో కలిసి వందల కచేరీల్లో పాల్గొన్నాను. తర్వాత రేడియో వల్లే నాకు సాహిత్య దిగ్గజం దేవులపల్లి కృష్ణశాస్త్రి, సినీ సంగీత దర్శకుడు ఘంటసాల గారితో మంచి స్నేహం ఏర్పడింది. సంగీత కార్యక్రమాలు 1971లో నేను ఆకాశవాణిలో రెగ్యులర్ గాయకుడుగా, సంగీత దర్శకుడిగా చేరి 1997లో పదవీ విరమణ చేశాను. 1972లో నేను వారానికో రోజు ప్రసారమయ్యే ‘ఈ పాట నేర్చుకుందాం’ అనే కార్యక్రమం నిర్వహించాను. అలాగే 1983లో ‘కలిసి పాడుదాం’ అనే ప్రోగ్రామ్ మొదలుపెట్టాను. అలా దేశంలోని 16 భాషల్లో పాటలు నేర్పాను. ఇది ప్రతి ఆదివారం ప్రసారం అయ్యేది. చాలామంది రేడియో ద్వారా సంగీతం నేర్చుకొని మ్యూజిక్ టీచర్‌గా ఉద్యోగం సంపాదించామని చెప్పేవారు. కార్యక్రమం ఎంతో బాగుందని బరోడా, ఖరగ్‌పూర్ లాంటి ఎన్నో ప్రాంతాల నుంచి ఫోన్లు, గుట్టలుగా లెటర్లు వచ్చాయి. సంగీతం నేర్పించడమే ధ్యేయంగా పెట్టుకున్నవాడికి ఇంతకంటే ఏం కావాలి. రేడియోలోనే నాగార్జున సాగరం, రామప్ప, శర్మిష్ట, కొత్త కోవెల, మేఘసందేశం, శివక్షేత్రయాత్ర మొదలైన ఎన్నో సంగీత రూపకాలు చేశాను. మేఘసందేశంలో నేనూ, మీరు (శారదాశ్రీనివాసన్) చేశాం. ‘కోర్సు’ అలా మొదలైంది.. నాకు చిన్నప్పటి నుంచి పరిశోధనలు చేయడమంటే ఇష్టం. అలాగే లలిత సంగీతంపైనా చేశాను. అలా ఎన్నో ఏళ్లు కృషి చేసి లలిత సంగీతానికి ప్రప్రథమంగా పాఠ్యప్రణాళికను రూపొందించాను. ఆ పుస్తకం పూర్తి కాగానే బాలమురళీ కృష్ణగారికి, మరో సంగీత విద్వాంసులు నూకల చినసత్యనారాయణగారికి చూపించాను. చాలా బాగా వచ్చిందన్నారు. తర్వాత 1999లో డాక్టర్ సి. నారాయణరెడ్డిగారికి పంపాక నాకు ఫోన్ చేసి ఎక్స్‌లెంట్‌గా ఉందన్నారు. అలా నా పరిశోధనను తెలుగు విశ్వవిద్యాలయంలో లలిత సంగీతం కోర్సుగా పెట్టారు. పాలగుమ్మి విశ్వనాథం గారు మూడేళ్లు, దాదాపు నేనొక ఏడేళ్లు లలిత సంగీతానికి లెక్చరర్ గా చేశాం. ఆ పుస్తకానికే శ్రీలంకలోని ‘ఓపెన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫర్ కాంప్లిమెంటరీ మెడిసిన్స్’ వారు 2008లో నాకు డాక్టరేట్ ఇచ్చారు. ..:: నిఖితా నెల్లుట్ల ఫొటోలు: ఎస్.ఎస్ ఠాకూర్ చిత్తరంజనం రేడియోలో 2006 నుంచి ‘చిత్తరంజనం’ అనే ఓ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. అందులో 1940 నుంచి సినీ ప్రపంచంలో తమ స్వరాలనందించిన సంగీత దర్శకుల గురించి విశ్లేషణాత్మక కార్యక్రమం నిర్వహించారు. కేవీ మహదేవన్, పెండ్యాల, ఎంఎస్ విశ్వనాథం, ఘంటసాల, ఇళయరాజా, సీఆర్ సుబ్బరామన్ నుంచి నేటి తరం మ్యూజిక్ డెరైక్టర్ ఏఆర్ రెహమాన్‌తో పాటు దాదాపు 35మంది దక్షిణాది సినీరంగ సంగీత దర్శకులపై ప్రోగ్రాములు చేశారు. అందుకున్న పురస్కారాలు సుమారు 1500 పాటలకు సంగీతం అందించారు. అలాగే 8 వేల పాటలు పాడారు. వివిధ సంస్థల నుంచి ‘గాన రత్న’, ‘కళారత్న’, ‘లలిత గాంధర్వ కళానిధి’, ‘లలిత సంగీత చక్రవర్తి’, ‘మధుర స్వరనిధి’, ‘లలిత సంగీత సామ్రాట్’లాంటి బిరుదులు అందుకున్నారు. సినిమాల్లోనూ సంగీతం ‘కులదైవం’, ‘స్వర్ణగౌరి’, ‘విధివిలాసం’, ‘సూర్యచంద్రులు’ మొదలైన చిత్రాల్లో పాటలు పాడారు. అలాగే ‘మన మహాత్ముడు’, ‘శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మహత్త్యం’ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఎన్నో డాక్యుమెంటరీ చిత్రాలకు సంగీతమందించారు. -
సుధా పూర్ణోదయం
రేడియో అంతరంగాలు ఆకాశవాణిలోకి అడుగుపెట్టక ముందే రేడియోతో అనుబంధం పెంచుకున్న వ్యక్తి ‘సుధామ’. ఆయన అసలు పేరు అల్లంరాజు వెంకట్రావు. గుక్క తీసుకోకుండా అనర్గళంగా, తెలుగులో తియ్యగా మాట్లాడే స్వభావం సుధామది. 30 ఏళ్లు రేడియోలో పని చేసినప్పుడు నిర్వహించిన కార్యక్రమాలు, బాధ్యతలు, అనుభవాలను తనను ఇంటర్వ్యూ చేసిన ప్రముఖ రేడియో కళాకారిణి శారదా శ్రీనివాసన్‌తో పంచుకున్నారు 63 ఏళ్ల సుధామ. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... నా విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే జరిగింది. ఆరో తరగతి చదువుతున్నప్పటి నుంచే సాహిత్యంలోకి అడుగుపెట్టాను. స్కూల్లో ఉన్నప్పుడే రేడియోలో ప్రసారమయ్యే ‘బాలానందం’లో బాలనటుడిగా నాటకాలు వేసేవాణ్ణి. రేడియో రంగప్రవేశం... ఆకాశవాణిలో రెగ్యులర్ ఉద్యోగిగా చేరకముందే ‘మాటా మంతీ’కార్యక్రమానికి స్క్రిప్ట్‌లు రాసేవాణ్ణి. అలా అప్పుడప్పుడు రేడియోలో చేస్తూనే కరీంనగర్‌లోని ఓ జూనియర్ కాలేజీలో రెండేళ్లపాటు లెక్చరర్‌గా పని చేశాను. తర్వాత 1978లో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ (డ్యూటీ ఆఫీసర్)గా ఆకాశవాణిలో శాశ్వత ఉద్యోగంలో చేరాను. నేను చేరింది పేరుకు డ్యూటీ ఆఫీసర్‌గా అయినా అన్ని విభాగాల్లోనూ నా ఆసక్తి మేరకు కార్యక్రమాలు చేశాను. తర్వాత 1995లో నాకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌గా విజయవాడకు బదిలీ, పదోన్నతి ఒకేసారి వచ్చాయి. అలా అక్కడ ఓ అయిదేళ్లు పని చేసి, తిరిగి హైదరాబాద్ స్టేషన్‌కు వచ్చేశాను. అలా 30 ఏళ్లు రేడియోలో పని చేసి 2008లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నాను. నెరవేరిన కళ... చిన్నప్పుడు ఇంట్లో కూర్చొని రేడియో వింటుంటే నేనెప్పుడైనా అక్కడ రచనలు చేయగలనా అనుకునేవాణ్ణి. కానీ స్వయంగా చేరాక నన్ను, నా రచనలను అందరూ అభినందిస్తూ ప్రోత్సహించేవారు. కార్యక్రమాల్లో నా గళాన్ని విని ప్రొడ్యూసర్ వేలూరి సహజానందగారు అభినందించి ‘కవితా ్రసవంతి’లో అవకాశం ఇచ్చారు. అలా నేను రూపకాలు, నాటకాలు, సంభాషణలు రాశానంటే అది రేడియో వల్ల దొరికిన అదృష్టమే. ఢిల్లీలో తెలుగు కవిగా ... 1983లో రేడియోలో పని చేస్తూ జాతీయ కవిసమ్మేళనంలో జాతీయ కవిగా ఎన్నికవడం అప్పట్లో గొప్ప విషయంగా మారింది. ఎన్నికల సమయంలో రాసిన ‘’ఎండలో సామాన్యుడు’ అనే నా కవితకు నాకు ఆ అవార్డు లభించింది. అంతకు ముందు తెలుగు రాష్ట్రం నుంచి ఎంతోమంది కవులు వెళ్లారు కానీ రేడియోలో ఉద్యోగం చేస్తున్న నేను వెళ్లడం ప్రత్యేకత సంతరించుకుంది. నా కవిత దేశంలోని అన్ని భాషల్లోకి అనువాదమైందంటే ఎంతో ఆనందంగా, గర్వంగానూ అనిపించింది. తర్వాత ఆ అనువాదాలు చేయించే బాధ్యతలను నేను తీసుకున్నాను. రాయడమే లోకం... ఉద్యోగం డ్యూటీ ఆఫీసర్‌గా అయినా రచనపై ఉన్న ఆసక్తితో ఎన్నో కార్యక్రమాలు చేశాను. ‘ఉదయ తరంగిణి’కి స్క్రిప్ట్ రాశాను. మీరు (శారదా శ్రీనివాసన్) నటించే నాటకాలకు స్క్రిప్ట్ రాయాలంటే చాలా జాగ్రత్త పడేవాణ్ణి. సినిమాపై పిచ్చితో ఎన్నో చిత్రాల సమీక్షా కార్యక్రమాలు నడిపాను. ప్రతి శుక్రవారం రాత్రి సినిమా చూడడం, శనివారం నాడు దానిపై రేడియోలో సమీక్ష నిర్వహించాను. విజయవాడలో అయిదేళ్లు.... నాకు పదోన్నతి వచ్చి విజయవాడకు వెళ్లినప్పుడు అక్కడ కూడా విభిన్న కార్యక్రమాలు నిర్వహించాను. అక్కడ 1990 నుంచి 1995వరకు పని చేశాను. నేను రేడియోలోకి రాకముందు ‘యువమిత్ర’ అనే లిఖిత పత్రికను ఓ ఎనిమిదేళ్లు నడిపాను. అప్పుడు అందులో ‘రేడియో ఏమంటోంది’ అనే కాలమ్ నిర్వహించాను. తర్వాత ఆకాశవాణిలో చేరాక విజయవాడలో ‘పత్రికలో ఈ నెల’ అనే కార్యక్రమం చేశాను. అలాగే విశ్వనాధ సత్యనారాయణగారి శతజయంతి సందర్భంగా వారం రోజులపాటు ‘విశ్వనాధ వైభవం’ అనే కార్యక్రమం నిర్వహించాను. ఇలా విభిన్న కార్యక్రమాలు చేసే అవకాశం కేవలం రేడియోలోనే ఉంటుందేమోనని నా అభిప్రాయం. ప్రెజెంటేషన్: నిఖితా నెల్లుట్ల ఫొటోలు: ఠాకూర్ మరువలేని అనుభవాలు... 1982లో నేను నిర్వహించిన ‘నూరేళ్ల తెలుగు వెలుగు’ కార్యక్రమంలో శ్రీశ్రీ గారిని గంటన్నరపాటు ఇంటర్వ్యూ చేశాను. అది మరచిపోలేని అనుభవం. నాకెంతో ఇష్టమైన ప్రముఖ రచయిత రావూరి భరద్వాజ గారి దగ్గర రెండేళ్లు తెలుగు ‘ప్రసంగాల’ విభాగంలో సహాయకుడిగా పని చేయడం కూడా నా అదృష్టంగా భావిస్తాను. అలాగే ‘కుటుంబ సంక్షేమం’ విభాగంలో నేను, ఉమాపతి వర్మ, గోపల్లె శివరాం పని చేసేవాళ్లం. ఈ రేడియో వల్లే మేం ముగ్గురం మంచి స్నేహితులమయ్యాం. -
రామం... నా సంతోషం
రేడియో అంతరంగాలు విజయవాడలో జర్నలిస్టుగా ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టి ఆకాశవాణిలో రచయితగా, కళాకారుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్న ఇంద్రగంటి శ్రీకాంతశర్మ... తన సుదీర్ఘ రేడియో ప్రస్థానం గురించి ప్రముఖ రేడియో కళాకారిణి శారదాశ్రీనివాసన్ అడిగిన అనేక ప్రశ్నలకు ఎంతో ఉత్సాహంగా సమాధానమిచ్చారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... రేడియోతో అనుబంధం ఆకాశవాణిలో ఉద్యోగం రాకముందు నుంచే నేను రేడియోలో ఔట్‌సైడ్ ఆర్టిస్ట్‌గా కార్యక్రమాలు చేసేవాణ్ణి. 1976లో విజయవాడ కేంద్రంలో రెగ్యులర్ స్టాఫర్‌గా నేను నా శాశ్వత రేడియో జీవితాన్ని ప్రారంభించాను. తీసుకోవడానికి నన్ను రచయితగా తీసుకున్నా ఓ వైపు స్క్రిప్ట్, పాటలు రాస్తూ మరో వైపు నాటకాల్లోనూ నటించేవాణ్ని. ఏనాడూ ఓ ఉద్యోగంలో కష్టపడుతున్నాననే భావన నాకు కలగలేదు. ఇరవై ఏళ్లు ఆకాశవాణిలో పని చేసి నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రంలో కార్యక్రమ నిర్వహణాధికారిగా ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నాను. రేడియో నాటకాలు 1970లో ప్రసారమైన ‘వాయులీనం’ నా తొలి రేడియో నాటకం.. అదే ఏడాదిలో నా తొలి గేయకథాకావ్యం ‘శిలామురళి’ ప్రచురితమయింది. తర్వాత దాన్ని రేడియోలో మీరు (శారదాశ్రీనివాసన్), సుత్తివేలు గారు కలిసి నాటకం వేశారు. నేను, శ్రీరామమూర్తి కలిసి సుమారు యాభై కార్యక్రమాలు చేశాం. ఎప్పుడూ ఇద్దరం ఇంకెలాంటి సృజనాత్మక కార్యక్రమాలు చేద్దామా అని చర్చించుకునే వాళ్లం. నా ఇరవై ఏళ్ల రేడియో జీవితంలో రామంతో కలిసి పని చేయడం ఎంతో సంతోషాన్ని ఇవ్వడంతో పాటు ఎన్నో విజయాలను తెచ్చి పెట్టింది. మొత్తం నేను పాలుపంచుకున్న రేడియో కార్యక్రమాల్లో పదిహేను ప్రోగ్రామ్స్‌కు ఆకాశవాణి వార్షిక జాతీయ పురస్కారాలు వచ్చాయి. అందులో ఏడు ప్రథమ బహుమతులు, మూడు ద్వితీయ బహుమతులు మరికొన్నింటికి యోగ్యతా పత్రాలు అందుకున్నాం. ప్రథమ బహుమతి అందుకున్న వాటిలో వర్షానందిని (సంగీతరూపకం), మెట్లు (సృజనాత్మకం), అమరారామం (డాక్యుమెంటరీ)లాంటి విభిన్న కార్యక్రమాలున్నాయి. అమరారామం ఈ డాక్యుమెంటరీ కోసం అమరావతి వెళ్లాను. దళితుడి దానం, కలశం వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాను. అక్కడి దేవుడు అమరేశ్వరుడి పైనా చేశాను. నా డాక్యుమెంటరీ కోసం ఓవైపు పరిశోధన, రచన చేస్తూ సత్యంగారి ‘అమరావతి కథలు’లో నుంచి కొన్ని కథా భాగాలను నాటకీకరించి ఈ ‘అమరారామం’ పూర్తి చేశాను. 1982లో జాతీయస్థాయిలో ఇచ్చే ఆకాశవాణి పురస్కారాలలో దీనికి ప్రథమ బహుమతి వచ్చింది. ‘తిలక్’పై లైవ్ డాక్యుమెంటరీ తణుకులో నేనూ ప్రముఖ కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ తరచూ కలిసే వాళ్లం. అలా ఆయనపై ఉన్న అభిమానమే నన్నీ డాక్యుమెంటరీ చేసేలా చేసింది. ఆయన రాసిన పద్యాలు, నాటకాలు, పాటలు సేకరించి వాటితో దీన్ని తయారు చేశాను. తణుకులోని ఆయన ఇంట్లోనే ఓ గదిలో తిలక్ పాటలు పాడుకుంటూ, ఆయన గురించి మాట్లాడుకుంటూ ‘శిఖరావరోహణ’ పేరుతో చేశా. ఓ వ్యక్తిపై నేను చేసిన మొదటి డాక్యుమెంటరీ అది. తిలక్ నా మనసుకు అర్థమైన మనిషి, ఆత్మీయుడు. ‘కబుర్లు’ పెట్టుకున్నాం నేను, రామ్మోహనరావు, నండూరి సుబ్బారావు కలసి రేడియోలో ఓ పదిహేనేళ్లు ‘కబుర్లు’ అనే కార్యక్రమం చేశాం. ఇందులో ఇద్దరిద్దరం వర్తమాన అంశాల్లోంచి ఏదో ఒక దానిపై ముచ్చటించే వాళ్లం. దానికి నేను స్క్రిప్ట్ రాస్తూ, నటించే వాణ్ణి. ఈ కార్యక్రమానికి శ్రోతల ఆదరణ బాగా లభించింది. అలాగే ‘కిటికీ’ అనే పదిహేను నిమిషాల కార్యక్రమం నిర్వహించాం. ఇందులో మూడు పాత్రలుండేవి. ఇది నలభై వారాల పాటు విజయవంతంగా నడిచింది. నాలుగు పాత్రలుండే ‘ఇరుగుపొరుగు’ అనే కార్యక్రమం నలభై ఏడు వారాలు నిర్వహించాం. ప్రెజెంటేషన్: నిఖితా నెల్లుట్ల ఫోటోలు: నోముల రాజేశ్‌రెడ్డి దేశభక్తిగీతాలు రాయనన్నా నాకు విజయవాడ స్టేషన్ డెరైక్టర్ శ్రీనివాసన్‌గారితో ఉన్న చనువుతో ‘‘దేశభక్తి గీతాలు, ప్రచార కార్యక్రమాలకు పాటలు మాత్రం రాయమనకండి’’ అన్నాను. ఆయన నా అభ్యర్థనను సానుకూలంగా స్వీకరించారు. కానీ కొన్ని సందర్భాల్లో దేశభక్తి గీతాలు రాయక తప్పలేదు. నేను రాసిన ‘‘తేనెల తేటల మాటలతో... మన దేశమాతనే కొలిచెదమా...’’ పాట నాకు పేరుతో పాటు ఆత్మసంతృప్తినీ ఇచ్చింది. మ్యూజిక్ కంపోజర్ ఎమ్మెస్ శ్రీరాంగారు అందించిన సంగీతం కూడా అద్భుతంగా ఉండేది. ఆయన నన్ను అడగ్గానే రాత్రికి రాత్రి రెండు పాటలు రాసిచ్చాను. -
హిందీ రాబట్టి తెలుగు తేలికైంది
రేడియో అంతరంగాలు ఆకాశవాణిలో అనౌన్సర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి... అనువాదకునిగా, న్యూస్‌రీడర్‌గా, రేడియో జర్నలిస్టుగా ప్రఖ్యాతులైన దివి వెంకట్రామయ్య... టీవీ చానళ్లు లేని కాలంలో రేడియో జర్నలిజాన్ని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లారు. కృషా ్ణజిల్లా గుడివాడలో జన్మించి, ఏఎన్నార్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసిన వెంకట్రామయ్యకు బాల్యం నుంచి సాహిత్యం, నాటకాలు అంటే ఆసక్తి. రేడియో కార్యక్రమాలు, నాటికలు చేయాలనే ఆశతోనే అసలీ రంగంలోకి ఆయన అడుగు పెట్టారు. ‘‘జర్నలిజం నా వృత్తి, సాహిత్యం నా ప్రవృత్తి, సినిమా నా ప్రేయసి’’ అని అంటుండే వెంకట్రామయ్యను ‘రేడియో అంతరంగాలు’ శీర్షిక కోసం శారదా శ్రీనివాసన్ చేసిన ఇంటర్వ్యూలోని విశేషాంశాలివి. డి ఫర్ దేవులపల్లి? నా సర్వీసంతా హైదరాబాద్‌లోనే సాగింది. 1963లో అనౌన్సర్‌గా చేరాను. నన్ను ఇంటర్వ్యూ చేసిన కమిటీలో దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు ఉన్నారు. నా పేరు డి. వెంకట్రామయ్య అనగానే... ‘డి’ అంటే దేవులపల్లా అని చమత్కరించారు. ఓ నాలుగేళ్లు అనౌన్సర్‌గా పని చేశాక జర్నలిజంపై ఉన్న ఇష్టంతో హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ రీడర్‌గా చేరి, ఇరవై ఏడేళ్లు పని చేశాను. కేవలం వార్తలు చదవడమే కాకుండా రిపోర్టింగ్ చేస్తూ నా శక్తి, అవగాహన మేరకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాను. రాంబాబు... ఏకాంబరం నేను, ఉషశ్రీ, రతన్‌ప్రసాద్, సత్యనారాయణ అలా కొందరం కలసి కార్మికుల కార్యక్రమాన్ని ప్రారంభించాం. దానికి పూర్తిగా రచన, కార్యక్రమం రూపకల్పన నేనే. దాదాపు పదేళ్ల పాటు ఆ కార్యక్రమాన్ని నిర్వహించాను. ఆ కార్యక్రమంలోని మా పాత్రలను శ్రోతలు ఎంతగానో ఆదరించారు. నన్ను రాంబాబుగా, సత్యనారాయణను ఏకాంబరంగా బాగా గుర్తు పెట్టుకునేవారు. దిగ్గజాల మధ్య... రేడియో పుణ్యమా అని స్థానం నరసింహారావు, నాయని సుబ్బారావు, బుచ్చిబాబు, బాలాంత్రపు రజనీకాంతరావు, భాస్కరభట్ల కృష్ణారావు వంటి మహానుభావులతో కలసి పని చేసే అదృష్టం దక్కింది. వారిని అడిగి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. వారి తర్వాతి తరంలో గొల్లపూడి మారుతీరావు, శ్రీగోపాల్, శంకరమంచి సత్యం నేను కలసి పని చేశాం. మాడపాటి సత్యవతి, నేను కలసి వార్తావాహిని కార్యక్రమం నిర్వహించాం. శ్రోతలు దానిని ఎంతగానో ఆదరించారు. అప్పుడు టీవీలు లేవు. బయట ఏవైనా కార్యక్రమాలు, సభలు, సమావేశాలు జరిగితే మేమే వెళ్లి రికార్డు చేసుకొచ్చి ఎడిట్ చేసి వాటికి వ్యాఖ్యానాలు రాసి ప్రసారం చేసేవాళ్లం. రేడియోలో ప్రముఖుల వాయిస్ వినిపించే వాళ్లం. అలా నేను పీవీ నరసింహారావు, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి లాంటి ఎంతోమంది రాజకీయ నాయకులు, ప్రముఖ సినీ నటులను ఇంటర్వ్యూ చేశాను. అనువాదంలో వాడుక భాష ఏ వార్త అయినా శ్రోతలందరికీ సులువుగా, సరళంగా అర్థమయ్యేలా ఉండాలనుకుంటాను. మామూలుగా ఇతర భాషల్లోంచి తెలుగులోకి వార్తలు, కథలు అనువాదం చేసినప్పుడు చదవడానికి ఇబ్బందిగా ఉంటాయి. అలా కాకుండా ఆ రచనకు మూలం తెలుగే అన్నట్టు ఉండాలనుకునేవాణ్ని. అందుకే అనువాదాన్ని వాడుక భాషలోకి తెచ్చేందుకు నా వంతు కృషి చేశా. నేను విడిగా హిందీ నేర్చుకున్నా. డిగ్రీలో నా రెండో భాష హిందీనే. అది నాకు ఎంతోగానో ఉపయోగపడింది. సినిమాతో అనుబంధం మొదటి నుంచీ నాకు సినిమాలంటే బాగా ఇష్టం. అప్పట్లో సినిమా పరిశ్రమ మొత్తం మద్రాసులోనే ఉన్నా చాలామంది ఆర్టిస్టులు నాకు పరిచయం ఉండేవాళ్లు. ‘విజయా’ చక్రపాణిగారు నా కార్యక్రమాలు విని హైదరాబాద్‌కు వచ్చినప్పుడు నన్ను పిలిపించి అభినందించేవారు. ఆయన నడిపిస్తున్న పత్రికకు నన్ను కథలు, వ్యాసాలు కూడా రాయమన్నారు. ఇదంతా రేడియో గొప్పతనమే. అలాగే సింగీతం శ్రీనివాసరావుగారి ‘పంతులమ్మ’ చిత్రానికి స్క్రిప్ట్ నేనే రాశాను. అక్కినేని నాగేశ్వరరావు, వహీదా రెహ్మాన్‌లు నటించిన ‘బంగారు కలలు’ సినిమాలో హీరోయిన్‌కు మీరు (శారదా శ్రీనివాసన్) డబ్బింగ్ చెప్పారు కదా. ఆ సంభాషణలు రాసింది నేనే. అప్పట్లో తెలుగు, హిందీ సినిమాలపై వివిధ పత్రికల్లో రివ్యూలూ రాశాను. ఇప్పటికీ సినిమాలు బాగానే చూస్తాను. రచయితగా... రేడియోలో ఉద్యోగం చేస్తూనే కథలు రాసేవాణ్ణి. ఉదయరాగం, పువ్వులమేడ వంటి నవలలూ రాశా. అందరూ నవల ఆధారంగా నాటకాలు చేస్తే నేను అందుకు భిన్నంగా రేడియో నాటకాన్నే పుస్తకంగా మార్చాను. న్యూస్రీడర్లకు శిక్షణ పదవీ విరమణ చేసినప్పటి నుంచి గత పదేళ్లుగా ఎంతోమందికి వార్తల అనువాదం, చదివే పద్ధతి, ఎడిటింగ్ వంటి అంశాలపై ట్రైనింగ్ ఇస్తున్నాను. మనకున్న విద్యను పదిమందికి నేర్పితే వచ్చే సంతృప్తి, ఆనందమే వేరు. అవార్డులు డీవీ కథలకు బుచ్చిబాబు స్మారక అవార్డు వచ్చింది. ‘‘బుచ్చిబాబుగారు నాకు ఇష్టమైన రచయిత. ఆయన పేరు మీద పురస్కారం అందుకోవడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది’’ అంటారు డీవీ. అలాగే తన కథలకు తెలుగు యూనివర్సిటీ అవార్డు అందుకున్నారు. రావిశాస్త్రి గారి పేరుపై తీసుకున్న ఆ పురస్కారం కూడా తనకు ఎంతో ముఖ్యమైందని అంటారు డీవీ. తెలుగులో వార్తలు ప్రారంభమై 75 ఏళ్లు నిండిన సందర్భంలో ఆలిండియా రేడియో వాళ్లు కూడా వెంకట్రామయ్యను ఢిల్లీలో సన్మానించారు. -
చలంగారి ప్రశంసతో చలించిపోయాను!
రేడియో అంతరంగాలు తెలుగుకి సంబంధించి ఆల్ ఇండియా రేడియో అనగానే... ఠక్కున గుర్తొచ్చేది చలం ‘పురూరవ’ శ్రవణ నాటకం. అందులో ‘ఊర్వశి’ శారదా శ్రీనివాసన్! కావ్యాల్లోని ఊర్వశి సోయగాన్ని తన మధురస్వరంలో ఒలికించి శ్రోతల ఊర్వశిగా నిలిచారు. చలాన్ని సైతం మైమరిపించారు..! ఆ పురూరవ ఊర్వశి... ఆకాశవాణి మానసి... శారదా శ్రీనివాసన్ అంతరంగంలోని రేడియో తరంగం... రేడియో... నా జీవితమే అది. నా అనుబంధమంతా దానితోనే. నాటకాలు వేసినా, పాటలు పాడినా, సీతక్కగా శ్రోతలు ఆదరించినా అంతా రేడియో వల్లే. ఒకరకంగా ఆకాశవాణి నాకు తల్లిలాంటిది. ఏఐఆర్ మాకు ఆఫీస్ కాదు. ఓ ఇల్లు.. ఓ ఫ్యామిలీ! అది తప్పితే మాకు ఇంకే వ్యాపకమూ ఉండేది కాదు. ఏఐఆర్... ఓ యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఏఐఆర్ బిల్డింగ్ (ఇప్పుడున్నది కాదు పాతది) అసెంబ్లీ ఎదురుగుండా అంతే దర్జాగా ఇంకా చెప్పాలంటే దాని ఔన్నత్యాన్ని చాటుతున్నట్టుండేది. అసెంబ్లీలోని ప్రజాప్రతినిధుల వాయిస్‌కి ప్రతిధ్వని. అప్పుడు బిల్డింగ్ అంతా వెనక్కి ఉంటే లాన్స్ ముందు ఉండేవి. బిల్డింగ్‌కి లాన్స్కి మధ్యలో కార్ డ్రైవ్. సాయంకాలాలు... ఆ లాన్స్‌లో కూర్చోని రిహార్సల్స్ చేసుకునే వాళ్ళం. బేగం అఖ్తర్ భుజం మీద చేయి వేసి...‘బేటీ కేసీ హో...క్యాకర్తీ హో ఇదర్’ అని అడిగింది. మళ్ళీ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకొని మరీ పలకరించింది. బాలమురళీకృష్ణగారితో కలిసి పాడే అదృష్టాన్నిచ్చింది. ఇలా వీళ్లందరినీ వ్యక్తిగతంగా చూసి, మాట్లాడే అవకాశం ఆకాశవాణివల్లే కలిగింది. నేను గనుక అందులో ఉద్యోగం చేసుండకపోతే వాళ్లను కనీసం చూసే భాగ్యం కూడా దొరక్కపోవును. సౌందర్యరాశి ఊర్వశి.. మన కావ్యాల్లో వర్ణించిన దాని ప్రకారం మహా సౌందర్యరాశి ఆవిడ. రేడియోలో ఆ సౌందర్యాన్ని గొంతులో పలికించాలి. ఊర్వశి పట్ల శ్రోతలకున్న ఊహకు రేడియో ఆర్టిస్ట్ తన కంఠంతో ఊపిరి పోయాలి. అలాంటి ఈ శ్రవణ పాత్ర నాకు తెచ్చిన పేరు అంతా ఇంతా కాదు. కృష్ణశాస్త్రిగారి ‘షర్మిష్ఠ’ నాటకంలోని దేవయానిగా పలికిన నా పాత్రకు రాజమన్నార్లాంటి వాళ్ళు మెచ్చుకుంటూ ఉత్తరం రాశారు. అయితే ఈ ప్రశంసలన్నిటికీ అప్పుడు కలిగిన సంతోషం వేరు...ఇన్నేళ్ళయినా వాటి ద్వారా ఇంకా నన్ను గుర్తుపెట్టుకున్నారని ఇప్పుడు కలుగుతున్న సంతోషం మాటల్లో చెప్పలేనిది. చలంగారు నా ఊర్వశి పాత్రను చాలా మెచ్చుకున్నారని అప్పట్లో ఎవరో చెప్పారు. నేను నమ్మలేదు. ఎందుకంటే చలంగారు ఈ రేడియో ప్రోగ్రామ్స్‌ని పెద్దగా ఇష్టపడరని వినున్నాను. అలాంటి ఆయన ఆ నాటకంలోని నా పాత్రను ఎందుకు మెచ్చుకుంటార్లే అనుకున్న. ఓరోజు... రమణయ్య రాజా అనే ఓ లెఫ్టినెంట్ కల్నల్ ఫోన్ చేసి ‘‘మేడం... చలంగారు ‘పురూరవ’ నాటకం విని అందులోని మీ ఊర్వశి పాత్రను చాలా మెచ్చుకున్నారండీ’’ అన్నారు. ఎదురుగా ఆ నాటకం ప్రొడ్యూసర్ గోపాల్గారూ ఉన్నారు. నేను రిటైరయ్యాక భార్గవిగారితో కలిసి ఊరికెనే అరకులోయ చూడాలని వెళ్ళాం. అన్నీ చూసుకొని ఆ రోజు సాయంకాలం తిరుగు ప్రయాణమవుతామనగా... ‘‘శారదా.. సరదాగా భీమ్లీ వెళ్ళి సౌరీస్ (చలంగారి అమ్మాయి)ని చూద్దాం’’ అంది భార్గవి. అప్పుడు మాతో కథారచయిత గొరుసు జగదీశ్వర్‌రెడ్డి ఉన్నాడు. భీమ్లీ కోసం అతనే కారు అదీ ఆరెంజ్ చేసి భీమ్లీకి తీసుకెళ్ళాడు. మేం వెళ్లే సరికి సౌరీస్ కళ్ళు మూసుకుని ధ్యానముద్రలో కూర్చొని ఉన్నారు. హిందుస్థానీ మ్యూజిక్ ఏదో ప్లే అవుతుంది. తతిమావాళ్ళంతా ఆవిడకెదురుగా అలా కూర్చొని ఉన్నారు. మేమూ అరగంట అలాగే కూర్చున్నాం. అయినా ఆవిడ కళ్ళు తెరవరు. మధ్యాహ్నం ఎవరింట్లోనో భోజనం మాకు. వాళ్లింటికి వెళ్ళాలి. టైమ్ అవుతోంది. ఈలోపు భార్గవి ఇంకో వైపు ఉన్న ద్వారం నుంచి సౌరీస్ దగ్గరకు వెళ్ళింది. తను మిలేనియం ఇయర్లో కొన్ని కథల సంపుటి తీసుకొచ్చింది. అందులో సౌరీస్ కథ కూడా ఉంది. ఆ మాటే సౌరీస్ చెవిలో చెప్తూ ఆ భార్గవిని నేను అంది. ఆవిడ కళ్ళు తెరవకుండా అవునా అన్నట్టుగా తల ఊపారు. తర్వాత పక్కనే ఉన్న నన్ను ‘ఈవిడ శారదా శ్రీనివాసన్’ అంటూ పరిచయం చేసింది భార్గవి. ఆ మాట విన్న వెంటనే దిగ్గున కళ్ళు తెరిచి నా వైపు చూస్తూ ‘‘ఎవరూ ఊర్వశి?’’ అని అడిగారు. ఆశ్చర్యపోయాను. తేరుకొని ‘‘అవును మేడమ్...ఆ వేషం నేనే వేశాను’’ అన్నాను. ‘‘నాన్నగారికి చాలా ఇష్టం’’ అన్నారు. మరపురాని జ్ఞాపకం ఇది. చలంగారు మెచ్చుకున్నారన్న విషయాన్ని అప్పుడు నమ్మాను. అంతకు ముందు అభిమానుల నుంచి వచ్చిన వేల ఉత్తరాలు, ఫోన్లకు స్పందించని నా మనసు చలంగారి ప్రశంసతో చలించిపోయింది. ఆయన రాసిన నాటకాన్ని నేను మెప్పించగలిగాను అన్న సంతృప్తి. అలాగే మనసుకవి ఆత్రేయగారు ‘పురూరవ’ నాటకాన్ని విని ఫోన్ చేశారు. ‘‘ఊర్వశిగా అద్భుతం మీరు. నాకు ఆ రికార్డింగ్ కావాలి. పంపగలరా ఎలాగైనా’’ అని పంపాను. తర్వాత ఒకసారి ‘‘మీకు సన్మానం చేస్తున్నాం, రాగలరా’’ అని అడిగారు. ‘‘సారీ అండీ... నాకు టైమ్ ఉండదు. అయినా మీలాంటి గొప్ప కవుల ప్రశంసే నాకు సన్మానం కన్నా ఎక్కువ’’ అన్నాను. ‘‘లేదు. నేనొచ్చి మిమ్మల్ని కలుస్తాను మీకేమైనా అభ్యంతరమా?’’ అన్నారు. ‘‘మీరు మా ఇంటికి రాగలిగితే చాలా సంతోషం’’ అన్నాను. ఎవరినో వెంటతీసుకొని మా ఇంటికొచ్చారు. ‘పురూరవ’లో పురూరవగా వేసిన చిరంజీవిగారినీ రమ్మన్నాను. నేనూ, మావారూ ఉన్నాం. నేను వేసిన మిగిలిన నాటకాల గురించీ అడిగారు. సంభాషణ అంతా అయ్యాక చిన్న కాగితం ఉంటే ఇవ్వమ్మా అని అడిగారు. ఇచ్చాను. నన్ను, సరస్వతిదేవిని కంపేర్ చేస్తూ ‘ఆ శారదకు వీణ కరమునుందు ఈ శారదకు వీణ గళము నందు’ అంటూ ఓ కవిత రాసిచ్చారు. ఏ పద్మశ్రీలు వీటితో సమానం? అలాగే బాలమురళీకృష్ణగారు... నా జీవితంలో ఆయనది గురుస్థానం. ఆయన సంగీత సారథ్యం వహించిన ఓ సినిమాలో నేను డబ్బింగ్ చెప్పాను. ఎప్పుడు విన్నారో తెలియదు కానీ.. ఏదో ఫంక్షన్లో కలిసినప్పుడు ‘శారదా.. ఇలా రా...’ అని పిలిచి ‘‘నిన్ను చూసి నేను గర్వపడుతున్నానమ్మా’’ అన్నారు. నా కళ్లెంబట నీళ్లోచ్చేశాయ్. అలాంటివన్నీ తలచుకున్నప్పుడు నా జీవితాన్ని వృథా కానివ్వలేదు. తర్వాత తరం వాళ్ళు నేర్చుకోవడానికి ఎంతోకొంత స్ఫూర్తినిచ్చాననే తృపి.్త ఒక్కటి కూడా వినలేదు ... ఇంతా చేసి నేను వేసిన నాటకం ఒక్కటి కూడా మా నాన్న గారు వినలేదు. అలాగని ఆయనకు నాటకాలంటే ఇష్టంలేక కాదు. బందాగారు, స్థానంవారు వేసిన నాటకాలను పక్క ఊరికి కూడా వెళ్ళి చూసొచ్చిన సందర్భాలున్నాయి. బహుశా...తన కూతురు అలా రేడియోలో నాటకం వేయడం ఇష్టం ఉండకపోవచ్చు. అంతదాకా ఎందుకు..మా ఆయనా పెళ్ళయ్యాక ‘‘రేడియోలో ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండగలవా?’’ అని అడిగారు. ఆయనదీ రేడియోలోనే ఉద్యోగం. ఫ్లూట్ వాయిద్యంలో పెద్ద విద్వాంసుడు. ‘‘మీరూ ఇదే ఉద్యోగంలో కంటిన్యూ అవుతూ నన్ను ఉద్యోగం మానేయమంటే ఇల్లు గడవడం కష్టమవుతుంది. కాబట్టి మీరు ఇంతకన్నా మంచి ఉద్యోగం చూసుకోండి అప్పుడు నేను ఈ ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటా’’ అని చెప్పాను. కానీ ఆయన వేరే జాబ్ చూసుకోవడం పడలేదు... నేను రేడియోలో ఉద్యోగం మానేసే అవసరం రాలేదు (నవ్వుతూ) తర్వాత మామధ్య ఇంకెప్పుడూ ఆ ప్రస్తావన కూడా రాలేదు. విజయవాడలో నేను ప్రవీణ ప్రచారక్‌గా ఉన్నప్పుడు మా హిందీ కాలేజ్‌కి ఓ కాంట్రాక్ట్ వచ్చింది. హిందీలో ఓ శ్రవణ నాటకం వేయమని. మా మాస్టర్ వేమూరి రాధాకృష్ణగారితో ఆడిషన్ టెస్ట్‌కి వెళ్లాను. వాళ్లిచ్చిన విషయాన్ని మాడ్యులేషన్‌తో చదివాను. జనమంచి రామకృష్ణారావుగారు నన్ను సెలక్ట్ చేశారు. అయితే కాలేజ్ ప్లే ద్వారా కాకుండా వేరే ప్లే ద్వారా నా రేడియో ప్రవేశం జరిగింది. అదే నాంది అనుకోవచ్చు.