ఒక్క డైలాగుతో ఉద్యోగం వచ్చేసింది | All India Radio employee | Sakshi
Sakshi News home page

ఒక్క డైలాగుతో ఉద్యోగం వచ్చేసింది

Published Wed, Apr 29 2015 11:03 PM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM

ఒక్క డైలాగుతో ఉద్యోగం వచ్చేసింది

ఒక్క డైలాగుతో ఉద్యోగం వచ్చేసింది

పదేళ్ల క్రితం వరకు రేడియో నాటకాల్లో ఓ గంభీరమైన గాత్రం శ్రోతలందర్నీ ఎంతగానో అలరించింది. గుక్క తిప్పుకోకుండా ఎంత పెద్ద డైలాగునైనా అనర్గళంగా చెప్పగల సత్తా ఆ స్వరానికే సొంతం. రేడియోలోనే కాక రంగస్థల నాటకాల్లో, సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషించిన ఆ కళాకారుడే కోకా సంజీవరావు. నాటకాల్లో చెంఘిజ్‌ఖాన్, ఖడ్గ తిక్కన, రాముడు, భీష్ముడు, దుర్యోధనుడు అలా ఎన్నో పాత్రల్లో ఇమిడిపోయారాయన. నటనే కాకుండా నాటికలూ రచించారు. ఈ వారం ‘రేడియో  అంతరంగాలు’ కోసం సంజీవరావును ఇంటర్వ్యూ చేశారు ప్రముఖ రేడియో కళాకారిణి శారదా శ్రీనివాసన్. ఆయన ప్రస్థానంలోని విశేషాలు ఆయన మాటల్లోనే...
 
 జనం మెచ్చిన ‘జనరంజని’


విజయవాడలో పని చేస్తుండగా కోకా సంజీవరావు... శోభన్‌బాబు, సూపర్ స్టార్ కృష్ణ, బాలయ్య, కాంచన వంటి ఎంతో మంది నటీనటులతో ‘జనరంజని’ కార్యక్రమం నిర్వహించారు. తర్వాత 1994లో పదవీ విరమణ చేశారు. సర్వీసులో చివరి అయిదు ఏళ్లు ఎన్నో నాటకాలు ప్రొడ్యూస్ చేశారు. అలాగే ఆకాశవాణి తరఫున ఆయన ఢిల్లీలో చేసిన ‘మరో మొహెంజొదారో’, ‘సుడిగాలి’ నాటకాలకు అవార్డులు, అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా  ‘బళ్లారి రాఘవ’ పురస్కారం అందుకున్నారు.
 
 
నేను పుట్టి పెరిగిందంతా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో. 1949లో నేను మా స్కూల్‌లో ఓ నాటకం వేశాను. అదీ సంస్కృతంలో. భాష రాకపోయినా స్క్రిప్ట్‌ను బట్టీకొట్టి చేశాను. తర్వాత్తర్వాత రంగస్థల నాటకాలు వేయడం ప్రారంభించాను. అలా మొదలైంది నా నాటక జీవితం. నా సర్వీసులో ఓ రిక్షావాడి నుంచి జమీందారు వరకు అన్ని రకాల పాత్రలూ పోషించాను.
 
శోభన్‌బాబుతో సావాసం


గుంటూరులోని ఏసీ కాలేజీలో నేను బీఏలో చేరాను. ఓ ఏడాది కళాశాల యాజమాన్యం నాటకాలు నిర్వహించడానికి ఆసక్తిగల వారిని ఆహ్వానించింది. అప్పుడు నేను, సినీనటుడు ‘శోభన్‌బాబు’ ఆ సెలక్షన్స్‌కు వెళ్లాం. ‘పునర్జన్మ’ నాటకంలో శోభన్‌బాబు హీరోగా, నేను విలన్‌గా నటించాం. తర్వాత    స్నేహితులమయ్యాం.

రేడియోలోకి...

1957లో నేను ఏసీ కాలేజీలో ఉన్నప్పుడే విజయవాడ స్టేషన్‌లో ‘ఖైదీ’ అనే లైవ్ నాటకం వేశాను. ఆకాశవాణిలో అడుగుపెట్టక ముందే ఎన్నో రంగస్థల నాటకాల్లో అద్భుతమైన పాత్రలు పోషించాను. కానీ ఉద్యోగం లేకుండా ఇంకెన్నాళ్లు తిరగాలి అనుకొని అప్పుడే హైదరాబాద్ స్టేషన్‌లో ప్రకటన పడితే అనౌన్సర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాను. ఇంటర్వ్యూ ప్యానల్‌లో బాలగురుమూర్తి, స్థానం నరసింహారావు లాంటి దిగ్గజాలున్నారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలతో పాటు నేను ముందు వేసిన నాటకంలోంచి ఓ డైలాగును చెప్పేసరికి నాకు ఆ ఉద్యోగం వచ్చేసింది.

వివిధ స్టేషన్లలో..

ఓ నాలుగేళ్లు హైదరాబాద్‌లో పనిచేసి 1968లో వైజాగ్‌కు వచ్చేశా. అక్కడ చేస్తూనే ఎన్నో వీధి నాటకాలు వేశాను. అప్పట్లో మాకూ సినిమా తారలకున్నంత క్రేజ్ ఉండేది. 1971లో నేను విజయవాడ స్టేషన్‌కు బదిలీ అయ్యాక అక్కడ ఎన్నో రేడియో నాటకాలు చేశాను.
 
పాత్రాభినయం


విజయవాడలో ఎన్నో నాటకాల్లో వైవిధ్యభరిత పాత్రలు పోషిస్తూనే, చాలా వాటిని ప్రొడ్యూస్ చేశాను. రాముడు మొదలుకొని భీముడు, భీష్ముడు, అర్జునుడు, దుర్యోధనుడు లాంటి పౌరాణికాలతో పాటు అల్లావుద్దీన్, ఖడ్గతిక్కన, శ్రీ కృష్ణదేవరాయలు పాత్రలు చేశాను. ఎస్.బి.శ్రీరామమూర్తి స్వయంగా ప్రొడ్యూస్ చేసిన ‘చెంఘిజ్‌ఖాన్’ నాటకంలో ముఖ్యపాత్రను నన్ను పోషించమన్నారు. అది నేను రిటైర్ అయ్యాక చేశాను. అలా మరచిపోలేని ఎన్నో నాటకాలు చేశాను. దీనికంతటికీ కారణం తల్లిలాంటి ఆకాశవాణే.
 
ఆదరణ పొందిన సీరియళ్లు


రేడియోలో సీరియళ్లను అప్పట్లో శ్రోతలు ఎంతో అభిమానించేవారు. నేను చేసిన ‘మీర్జాన్ పుల్లయ్య’ సీరియల్ దాదాపు 28 ఎపిసోడ్లు నడిచింది. అలాగే ‘సమస్యల మజిలీలు’, ‘ఎవరు బాధ్యులు’ లాంటి సీరియళ్లను శ్రోతలు బాగా ఆదరించారు. నేను చేసిన నాటకాల్లో సన్నివేశాన్ని శ్రోతల కళ్లకు కట్టినట్టు ఉండాలనే జిజ్ఞాసతో విభిన్న ప్రయోగాలు చేశాను. ఉదాహరణకు నాటకంలో భీష్ముడిపాత్రను పోషించిన లింగరాజుశర్మగారిని అంపశయ్య మీద పడుకున్నట్టు తెలియజెప్పడానికి ఆయనను నేల మీద పడుకోబెట్టి డైలాగులు చెప్పించాను.

సినిమాల్లోనూ...

సినీ నిర్మాత డి.రామానాయుడు, నేనూ ఒకే స్కూల్లో చదువుకున్నాం. ఆయన చాలా సినిమాల్లో నాకు అవకాశం ఇచ్చారు. శోభన్‌బాబు నటించిన ‘సోగ్గాడు’తో మొదలు పెట్టి, ‘శుక్రవారం మహాలక్ష్మి’, ‘ఈ చదువులు మాకొద్దు’, ‘విప్లవ శంఖం’, ‘అంగడి బొమ్మ’, హిందీలో జితేందర్‌తో కలిసి ‘దిల్‌దార్’ సినిమాల్లో నటించాను.  ప్రస్తుతం నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ హాయిగా జీవనం సాగిస్తున్నాను.                                                
 - నిఖితా నెల్లుట్ల, ఫొటో: ఎస్.ఎస్.ఠాకూర్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement