సుధా పూర్ణోదయం
రేడియో అంతరంగాలు
ఆకాశవాణిలోకి అడుగుపెట్టక ముందే రేడియోతో అనుబంధం పెంచుకున్న వ్యక్తి ‘సుధామ’. ఆయన అసలు పేరు అల్లంరాజు వెంకట్రావు. గుక్క తీసుకోకుండా అనర్గళంగా, తెలుగులో తియ్యగా మాట్లాడే స్వభావం సుధామది. 30 ఏళ్లు రేడియోలో పని చేసినప్పుడు నిర్వహించిన కార్యక్రమాలు, బాధ్యతలు, అనుభవాలను తనను ఇంటర్వ్యూ చేసిన ప్రముఖ రేడియో కళాకారిణి శారదా శ్రీనివాసన్‌తో పంచుకున్నారు 63 ఏళ్ల సుధామ. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
నా విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే జరిగింది. ఆరో తరగతి చదువుతున్నప్పటి నుంచే సాహిత్యంలోకి అడుగుపెట్టాను. స్కూల్లో ఉన్నప్పుడే రేడియోలో ప్రసారమయ్యే ‘బాలానందం’లో బాలనటుడిగా నాటకాలు వేసేవాణ్ణి.
రేడియో రంగప్రవేశం...
ఆకాశవాణిలో రెగ్యులర్ ఉద్యోగిగా చేరకముందే ‘మాటా మంతీ’కార్యక్రమానికి స్క్రిప్ట్‌లు రాసేవాణ్ణి. అలా అప్పుడప్పుడు రేడియోలో చేస్తూనే కరీంనగర్‌లోని ఓ జూనియర్ కాలేజీలో రెండేళ్లపాటు లెక్చరర్‌గా పని చేశాను. తర్వాత 1978లో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్ (డ్యూటీ ఆఫీసర్)గా ఆకాశవాణిలో శాశ్వత ఉద్యోగంలో చేరాను. నేను చేరింది పేరుకు డ్యూటీ ఆఫీసర్‌గా అయినా అన్ని విభాగాల్లోనూ నా ఆసక్తి మేరకు కార్యక్రమాలు చేశాను. తర్వాత 1995లో నాకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌గా విజయవాడకు బదిలీ, పదోన్నతి ఒకేసారి వచ్చాయి. అలా అక్కడ ఓ అయిదేళ్లు పని చేసి, తిరిగి హైదరాబాద్ స్టేషన్‌కు వచ్చేశాను. అలా 30 ఏళ్లు రేడియోలో పని చేసి 2008లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నాను.
నెరవేరిన కళ...
చిన్నప్పుడు ఇంట్లో కూర్చొని రేడియో వింటుంటే నేనెప్పుడైనా అక్కడ రచనలు చేయగలనా అనుకునేవాణ్ణి. కానీ స్వయంగా చేరాక నన్ను, నా రచనలను అందరూ అభినందిస్తూ ప్రోత్సహించేవారు. కార్యక్రమాల్లో నా గళాన్ని విని ప్రొడ్యూసర్ వేలూరి సహజానందగారు అభినందించి ‘కవితా ్రసవంతి’లో అవకాశం ఇచ్చారు. అలా నేను రూపకాలు, నాటకాలు, సంభాషణలు రాశానంటే అది రేడియో వల్ల దొరికిన అదృష్టమే.
ఢిల్లీలో తెలుగు కవిగా ...
1983లో రేడియోలో పని చేస్తూ జాతీయ కవిసమ్మేళనంలో జాతీయ కవిగా ఎన్నికవడం అప్పట్లో గొప్ప విషయంగా మారింది. ఎన్నికల సమయంలో రాసిన ‘’ఎండలో సామాన్యుడు’ అనే నా కవితకు నాకు ఆ అవార్డు లభించింది. అంతకు ముందు తెలుగు రాష్ట్రం నుంచి ఎంతోమంది కవులు వెళ్లారు కానీ రేడియోలో ఉద్యోగం చేస్తున్న నేను వెళ్లడం ప్రత్యేకత సంతరించుకుంది. నా కవిత దేశంలోని అన్ని భాషల్లోకి అనువాదమైందంటే ఎంతో ఆనందంగా, గర్వంగానూ అనిపించింది. తర్వాత ఆ అనువాదాలు చేయించే బాధ్యతలను నేను తీసుకున్నాను.
రాయడమే లోకం...
ఉద్యోగం డ్యూటీ ఆఫీసర్‌గా అయినా రచనపై ఉన్న ఆసక్తితో ఎన్నో కార్యక్రమాలు చేశాను. ‘ఉదయ తరంగిణి’కి స్క్రిప్ట్ రాశాను. మీరు (శారదా శ్రీనివాసన్) నటించే నాటకాలకు స్క్రిప్ట్ రాయాలంటే చాలా జాగ్రత్త పడేవాణ్ణి. సినిమాపై పిచ్చితో ఎన్నో చిత్రాల సమీక్షా కార్యక్రమాలు నడిపాను. ప్రతి శుక్రవారం రాత్రి సినిమా చూడడం, శనివారం నాడు దానిపై రేడియోలో సమీక్ష నిర్వహించాను.
విజయవాడలో అయిదేళ్లు....
నాకు పదోన్నతి వచ్చి విజయవాడకు వెళ్లినప్పుడు అక్కడ కూడా విభిన్న కార్యక్రమాలు నిర్వహించాను. అక్కడ 1990 నుంచి 1995వరకు పని చేశాను. నేను రేడియోలోకి రాకముందు ‘యువమిత్ర’ అనే లిఖిత పత్రికను ఓ ఎనిమిదేళ్లు నడిపాను. అప్పుడు అందులో ‘రేడియో ఏమంటోంది’ అనే కాలమ్ నిర్వహించాను. తర్వాత ఆకాశవాణిలో చేరాక విజయవాడలో ‘పత్రికలో ఈ నెల’ అనే కార్యక్రమం చేశాను. అలాగే విశ్వనాధ సత్యనారాయణగారి శతజయంతి సందర్భంగా వారం రోజులపాటు ‘విశ్వనాధ వైభవం’ అనే కార్యక్రమం నిర్వహించాను. ఇలా విభిన్న కార్యక్రమాలు చేసే అవకాశం కేవలం రేడియోలోనే ఉంటుందేమోనని నా అభిప్రాయం.
ప్రెజెంటేషన్: నిఖితా నెల్లుట్ల
ఫొటోలు: ఠాకూర్
మరువలేని అనుభవాలు...
1982లో నేను నిర్వహించిన ‘నూరేళ్ల తెలుగు వెలుగు’ కార్యక్రమంలో శ్రీశ్రీ గారిని గంటన్నరపాటు ఇంటర్వ్యూ చేశాను. అది మరచిపోలేని అనుభవం. నాకెంతో ఇష్టమైన ప్రముఖ రచయిత రావూరి భరద్వాజ గారి దగ్గర రెండేళ్లు తెలుగు ‘ప్రసంగాల’ విభాగంలో సహాయకుడిగా పని చేయడం కూడా నా అదృష్టంగా భావిస్తాను. అలాగే ‘కుటుంబ సంక్షేమం’ విభాగంలో నేను, ఉమాపతి వర్మ, గోపల్లె శివరాం పని చేసేవాళ్లం. ఈ రేడియో వల్లే మేం ముగ్గురం మంచి స్నేహితులమయ్యాం.