
దేవనాగరి లిపిలో కళాత్మకంగా రాయిపై చెక్కబడిన శ్రీ విశిష్ఠ కంకణధారి పేరు
పురావస్తు శాఖ పరిశీలనలో వెలుగులోకి ఆశ్చర్యకరమైన విషయాలు
లంకమల అభయారణ్యంలో ఉత్తర భారత లిపిలో తొలి శాసన ఫలకాలు.. బండరాయిపై 4–16 శతాబ్దాల మధ్య సందర్శించిన యాత్రికుల పేర్లు
ఉత్తరాది సిద్ధమాతృక లిపిలో కళాత్మకంగా లిఖించిన వైనం.. లేఖనంలో కుషానుల కాలం నాటి కళాత్మకత
తొలి విడతలో 12 శాసనాల కాపీలు తీసిన పురావస్తు బృందం
బి.కొత్తకోట: వైఎస్సార్ జిల్లా సిద్ధవటం అటవీ రేంజిలోని లంకమల అభయారణ్యం ఒకప్పుడు దేశంలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలతో వర్ధిల్లిందని భారత పురావస్తు శాఖ గుర్తించింది. బెంగళూరు, చెన్నై పురావస్తు కేంద్రాల నుంచి వచ్చిన పురావస్తు శాఖ డైరెక్టర్ డాక్టర్ కె.మునిరత్నంరెడ్డి, వివిధ విభాగాల్లో నిష్ణాతులైన యేసుబాబు, మేకా వి.రాఘవేంద్రవర్మ, సిద్ధవటం అటవీ రేంజి ఆఫీసర్ బి.కళావతితో కూడిన బృందం లంకమల అభయారణ్యం పరిధిలోని శాసనాలను అధ్యయనం చేసేందుకు గురువారం పర్యటించింది.
బృందం ఇక్కడ పరిశీలన జరిపి లేబుల్ శాసనాల (బండరాయిపై చెక్కబడిన పేర్లు)ను సేకరించింది. అట్లూరు మండల పరిధిలోకి వచ్చే సుమారు 3,200 అడుగుల ఎత్తులోని లంక మలలోని గోపాలస్వామి కొండ, పరిసరాల్లో రెండు బండలపై సిద్ధమాతృక, శంఖులిపి, దేవనాగరి లిపిలలో ఉత్తర భారతీయ యాత్రికుల పేర్లు చెక్కబడ్డాయి. వీటిని ప్రత్యేక యాత్రికులకు చెందిన శాసనాలుగా నిర్ధారించారు. వీటిపై చెక్కబడిన 12 లేబుల్ శాసనాలను పరిశీలించిన బృందం వాటి కాపీలను తీసుకుంది.
కుషానుల కాలం నాటి కళాత్మకత
లేబుల్ శాసనాల్లో పేర్లు చెక్కిన తీరు పురావస్తు శాఖ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. అత్యంత కళాత్మకంగా చెక్కబడిన ఈ పేర్లను పరిశీలించాక 6వ శతాబ్దంలో అప్పటి కుషాను రాజుల కాలం నాటి కళాత్మకత కనిపిస్తోందని అధికారులు వెల్లడించారు. కుషానుల కాలం నాటి బొటనవేలి మొన శైలిలో తలకట్టును ఉపయోగించి పేర్లను చెక్కినట్టు గుర్తించారు. ఇది 5–6 శతాబ్దాల నాటి ఉత్తర భారత సిద్ధమాతృక లిపి అని నిర్ధారించారు.
క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 4–5 శతాబ్దాల వరకు బ్రాహ్మి లిపిని వాడినట్టు కూడా ఆధారాలు ఉన్నాయి. కశ్మీర్, పంజాబ్‌లో శారద లిపి, ఒడిశాలో గౌడ, బెంగాల్‌లో ప్రోటోబెంగాలి లిపిగా ఉండేవి. తర్వాత ఉత్తర భారతంలో 8–9 శతాబ్దాల్లో మనుగడలో ఉన్న సిద్ధ మాతృక లిపి దేవ నాగరిలిపిగా పరిణామం చెందినట్టు భావిస్తున్నారు. లంకమలలో వెలుగుచూసిన లేబుల్ శాసనాల్లో ఈ విషయాలు స్పష్టమయ్యాయి.
నేడు గుహలు, శాసనాల పరిశీలన
సిద్ధవటం అటవీ రేంజి పరిధిలోని లంకమల అభయారణ్యంలో వెలుగు చూసిన ప్రాచీన కాలపు శాసనాలపై భారతీయ పురావస్తు శాఖ పరిశోధన, అధ్యయన బృందం శుక్రవారం సిద్ధవటం మండలంలోని నిత్యపూజలకోన కొండపై శాసనాలు, గుహలు, రాతి విగ్రహాలను పరిశీలించనుంది. ఈ బృందం సిద్ధవటం నుంచి పంచలింగాలకోనకు చేరుకుని అక్కడి నుంచి సుమారు 4 కిలోమీటర్లు కాలినడకన నిత్యపూజల కోనకు చేరుకుంటుంది. అక్కడ ప్రాచీన మానవులు నడయాడిన జాడలు, వెలుగులోకి వచ్చిన ఆధారాలను పురావస్తుశాఖ అధికారులు కాపీ చేసుకోనున్నారు. అనంతరం చరిత్రను పరిశోధించి అధ్యయనం చేస్తారు.
వెలుగులోకి ఆశ్చర్యకర విషయాలు
పురావస్తు శాఖ బృందం పరిశీలనలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రాంతం ఒకప్పుడు పవిత్ర శైవక్షేత్రంగా, దేశవ్యాప్తంగా ఖ్యాతి గడించిన ప్రాంతంగా బృంద సభ్యులు గుర్తించారు. ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితమైన దేవనాగరి లిపిని బండరాయిపై కళాత్మకంగా చెక్కిన తీరును బట్టి ఇది దక్షిణ భారతదేశంలో వెలుగు చూసిన తొలి లేబుల్ శాసనంగా బృందం తేల్చింది. ఇక్కడి ఆధారాలు ఆశ్చర్యకరమైన, లంకమల ప్రాంత గొప్పతనాన్ని చెబుతున్నాయి.
లంకమలలోని గోపాలస్వామి కోన, నిత్యపూజల కోన ప్రాంతాలు ఇప్పటికీ ప్రసిద్ధి చెందినవే. గోపాలస్వామికొండపై ఆలయానికి పశ్చిమాన ఎత్తైన కొండపై రెండు బండరాళ్లు ఉన్నాయి. వాటిలో శ్రీ విశిష్ఠ కంకణధారి, యె ధర్మజ, చంద్రహాస తదితర పేర్లు కలిగిన లేబుల్ శాసనాలు ఉన్నాయి. ఇవి దేవనాగరి లిపికి చెందినవి కాగా.. క్రీ.శ. 4–16 శతాబ్దాల మధ్య ఇక్కడికి వచ్చిన యాత్రికుల పేర్లను బండపై చెక్కినట్టు లభ్యమైన లిపి ఆధారంగా నిర్ధారించారు. ఈ పేర్లు ఉత్తర భారతం నుంచి లంకమల ఆలయాల దర్శనం కోసం వచ్చిన యాత్రికులవై ఉంటాయని భావిస్తున్నారు. ఇందులో 4వ శతాబ్దానికి చెందిన బ్రాహ్మిలిపి పరిణామ క్రమాన్ని గుర్తించడం విశేషం.
తొలి శాసనం ఇదే
ఉత్తర భారతానికి చెందిన యాత్రికులు లంకమలకు వచ్చినట్టు వెల్లడిస్తున్న తొలి చారిత్రక ఆధారం ఈ శాసనాలే అని పురావస్తు బృందం నిర్ధారించింది. దక్షిణ భారతంలో ఏకైక ఉత్తర భారత యాత్రికుల పేర్లు సిద్ధమాతృకలో రాసి ఉన్న ఇవి ఏకైక శాసన ఆధారమని పేర్కొంటున్నారు. ఈ శాసన అధ్యయనం దక్షిణ భారత చరిత్రలో మొదటిసారి కాబోతోందని వెల్లడించారు. శాసనాల అధ్యయనం నిపుణుడు యేసుబాబు మాట్లాడుతూ వీటిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తే మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment