లలితరంజన్ | Radio inner | Sakshi
Sakshi News home page

లలితరంజన్

Published Thu, Apr 2 2015 10:56 PM | Last Updated on Sat, Sep 2 2017 11:45 PM

లలితరంజన్

లలితరంజన్

రేడియో అంతరంగాలు
 
రేడియో కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి సంగీతాన్ని నేర్పించిన ఘనత మహాభాష్యం చిత్తరంజన్‌కు మాత్రమే దక్కుతుంది. తల్లి నుంచి పుణికిపుచ్చుకున్న సంగీతమే తనను ఇంతటి వాణ్ణి చేసిందంటారాయన. లలిత సంగీతం నేర్చుకోవడం, పాడడం అందరికీ తెలుసు. కానీ దానిపై పరిశోధన చేయాలనే ఆలోచన ఎంతమందికి వస్తుంది? అలా పరిశోధన చేసి దేశంలోనే మొదటిసారిగా లలిత సంగీతాన్ని యూనివర్సిటీ కోర్సుల్లో చేర్చిన ప్రత్యేకత కూడా చిత్తరంజన్‌దే. ఆకాశవాణిలో ఎందరో సంగీత విద్వాంసులు తమ సేవలనందించారు. అలాంటి మహానుభావుల్లో ఆయనొకరు. తన జీవితంలో సంగీతం ఇచ్చిన మధురానుభూతులను ప్రముఖ రేడియో కళాకారిణి శారదాశ్రీనివాసన్ తో పంచుకున్నారు చిత్తరంజన్. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
 
అందరికీ తొలి పలుకులు అమ్మే నేర్పుతుందంటారు. అలాగే మా అమ్మ పేరిందేవి నాకు పలుకులతో పాటు స్వరాలూ నేర్పింది. ఆమె ఇంట్లోనే వయొలిన్ నేర్చుకునేది. అప్పుడు నేనూ వినేవాణ్ణి. అలా సంగీతంపై ఆసక్తి పెరిగింది. స్కూల్లోనూ పాటలు బాగా పాడేవాణ్ణి.
 
రేడియోలో సంగీతం


మా నాన్న మహాభాష్యం రంగాచార్యులుగారు దక్కన్ రేడియోలో ఇంజినీర్‌గా పని చేసేవారు. అలా చిన్నప్పటి నుంచే రేడియోలో ప్రసారమయ్యే పిల్లల కార్యక్రమాల్లో నేను పాల్గొనేవాణ్ణి. నాకు బాగా గుర్తు.. అక్కడ మొదట నేను ‘మా తెలుగు తల్లి’ పాటతో పాటు మరికొన్ని పాడాను. అంతా అయిపోయాక కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలందర్నీ పిలిచి డబ్బులిచ్చారు.  నా చేతిలో రూ.3 పెట్టారు మా నాన్నగారి ముందే. ‘‘నాన్నా! నాకు డబ్బులు ఇస్తున్నారు’’ అన్నాను. ఆయన ‘‘తీసుకో’’ అని నవ్వారు. అప్పుడు స్టేషన్లలో రికార్డింగులు లేవు కాబట్టి  ఎనిమిదేళ్ల వయసులోనే నేను లైవ్‌లో పాడాను.
 
నన్ను వద్దన్నారు


1954లో మొదటిసారి ఆడిషన్స్‌కు వెళ్లాను. క్యాజువల్ ఆర్టిస్ట్‌గా చేరుదామని. నేను రేడియో ఇంజినీర్ కొడుకునన్న కారణంగా నన్ను తీసుకునేది లేదన్నారు. కానీ అప్పటి ప్రోగ్రామ్ అసిస్టెంట్ వాక్నిస్‌గారు నాకు అవకాశం ఇవ్వాలంటూ సిఫారసు చేశారు. అప్పుడు ఆయన ‘‘ప్రతిభ ఉంటే ఎవరినైనా తప్పకుండా ప్రోత్సహించాలి’’ అన్న మాటలు నేను మర్చిపోలేను.
 
బాలమురళితోగారితో బాంధవ్యం


1955లో మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు హైదరాబాద్‌లో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. అప్పుడు  నాతో ఎన్నో పాటలు పాడించారు. తర్వాత 1958 నుంచి 1962 వరకు ఆయన దగ్గర శిష్యుడిగా ఎంతో నేర్చుకున్నాను. ఆయన వయొలిన్ అద్భుతంగా వాయించేవారు. బాలమురళి గారితో కలిసి వందల కచేరీల్లో పాల్గొన్నాను. తర్వాత రేడియో వల్లే నాకు సాహిత్య దిగ్గజం దేవులపల్లి కృష్ణశాస్త్రి, సినీ సంగీత దర్శకుడు ఘంటసాల గారితో  మంచి స్నేహం ఏర్పడింది. సంగీత కార్యక్రమాలు

1971లో నేను ఆకాశవాణిలో రెగ్యులర్ గాయకుడుగా, సంగీత దర్శకుడిగా చేరి 1997లో పదవీ విరమణ చేశాను. 1972లో నేను వారానికో రోజు ప్రసారమయ్యే ‘ఈ పాట నేర్చుకుందాం’ అనే కార్యక్రమం నిర్వహించాను. అలాగే 1983లో ‘కలిసి పాడుదాం’ అనే ప్రోగ్రామ్ మొదలుపెట్టాను. అలా దేశంలోని 16 భాషల్లో పాటలు నేర్పాను. ఇది ప్రతి ఆదివారం ప్రసారం అయ్యేది. చాలామంది రేడియో ద్వారా సంగీతం నేర్చుకొని మ్యూజిక్ టీచర్‌గా ఉద్యోగం సంపాదించామని చెప్పేవారు. కార్యక్రమం ఎంతో బాగుందని బరోడా, ఖరగ్‌పూర్ లాంటి ఎన్నో ప్రాంతాల నుంచి ఫోన్లు, గుట్టలుగా లెటర్లు వచ్చాయి. సంగీతం నేర్పించడమే ధ్యేయంగా పెట్టుకున్నవాడికి ఇంతకంటే ఏం కావాలి. రేడియోలోనే నాగార్జున సాగరం, రామప్ప, శర్మిష్ట, కొత్త కోవెల, మేఘసందేశం, శివక్షేత్రయాత్ర మొదలైన ఎన్నో సంగీత రూపకాలు చేశాను. మేఘసందేశంలో నేనూ, మీరు (శారదాశ్రీనివాసన్) చేశాం.

 ‘కోర్సు’ అలా మొదలైంది..

నాకు చిన్నప్పటి నుంచి పరిశోధనలు చేయడమంటే ఇష్టం. అలాగే లలిత సంగీతంపైనా చేశాను.  అలా ఎన్నో ఏళ్లు కృషి చేసి లలిత సంగీతానికి ప్రప్రథమంగా పాఠ్యప్రణాళికను రూపొందించాను. ఆ పుస్తకం పూర్తి కాగానే బాలమురళీ కృష్ణగారికి, మరో సంగీత విద్వాంసులు నూకల చినసత్యనారాయణగారికి చూపించాను.  చాలా బాగా వచ్చిందన్నారు. తర్వాత 1999లో డాక్టర్ సి. నారాయణరెడ్డిగారికి పంపాక నాకు ఫోన్ చేసి ఎక్స్‌లెంట్‌గా ఉందన్నారు. అలా నా పరిశోధనను తెలుగు విశ్వవిద్యాలయంలో లలిత సంగీతం కోర్సుగా పెట్టారు. పాలగుమ్మి విశ్వనాథం గారు మూడేళ్లు, దాదాపు నేనొక ఏడేళ్లు లలిత సంగీతానికి లెక్చరర్ గా చేశాం. ఆ పుస్తకానికే శ్రీలంకలోని ‘ఓపెన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫర్ కాంప్లిమెంటరీ మెడిసిన్స్’ వారు  2008లో నాకు డాక్టరేట్ ఇచ్చారు.
 ..:: నిఖితా నెల్లుట్ల
  ఫొటోలు: ఎస్.ఎస్ ఠాకూర్
 
చిత్తరంజనం

 రేడియోలో 2006 నుంచి ‘చిత్తరంజనం’ అనే ఓ వినూత్న కార్యక్రమం
 నిర్వహించారు. అందులో 1940 నుంచి సినీ  ప్రపంచంలో తమ స్వరాలనందించిన సంగీత దర్శకుల గురించి విశ్లేషణాత్మక కార్యక్రమం నిర్వహించారు. కేవీ మహదేవన్, పెండ్యాల, ఎంఎస్ విశ్వనాథం, ఘంటసాల, ఇళయరాజా, సీఆర్ సుబ్బరామన్ నుంచి నేటి తరం మ్యూజిక్ డెరైక్టర్ ఏఆర్ రెహమాన్‌తో పాటు దాదాపు 35మంది దక్షిణాది సినీరంగ సంగీత దర్శకులపై ప్రోగ్రాములు చేశారు.  
 
 
అందుకున్న  పురస్కారాలు

సుమారు 1500 పాటలకు సంగీతం అందించారు. అలాగే 8 వేల పాటలు పాడారు. వివిధ సంస్థల నుంచి ‘గాన రత్న’, ‘కళారత్న’, ‘లలిత గాంధర్వ కళానిధి’, ‘లలిత సంగీత చక్రవర్తి’, ‘మధుర స్వరనిధి’, ‘లలిత సంగీత సామ్రాట్’లాంటి బిరుదులు అందుకున్నారు.
 
 సినిమాల్లోనూ సంగీతం


 ‘కులదైవం’, ‘స్వర్ణగౌరి’, ‘విధివిలాసం’, ‘సూర్యచంద్రులు’ మొదలైన చిత్రాల్లో పాటలు పాడారు. అలాగే ‘మన మహాత్ముడు’, ‘శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మహత్త్యం’ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఎన్నో డాక్యుమెంటరీ చిత్రాలకు సంగీతమందించారు.
 
 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement