Radio programs
-
ఫిమేల్ ఆర్జే: అహో... అంబాలా జైలు రేడియో!
అక్కడ ఒక ట్రైనింగ్ సెషన్ జరుగుతోంది. ‘మీ ముందు మైక్ ఉన్నట్లు పొరపొటున కూడా అనుకోకూడదు. మీ స్నేహితులతో సహజంగా ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడాలి! భవ్యా... ఇప్పుడు నువ్వు ఆర్జేవి. నీకు ఇష్టమైన టాపిక్‌పై మాట్లాడు...’ భవ్య మైక్ ముందుకు వచ్చింది. ‘హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భవ్యను. ప్రతి ఒక్కరికీ జ్ఞాపకాలు ఉంటాయి. నాకు ఎప్పుడూ నవ్వు తెచ్చే జ్ఞాపకం ఒకటి ఉంది. మా గ్రామంలో సంగ్రామ్ అనే ఒకాయన ఉండేవాడు. ఆయన ఎప్పుడూ ఎవరికో ఒకరికి జాగ్రత్తలు చెబుతూనే ఉండేవాడు. అయితే అందరికీ జాగ్రత్తలు చెబుతూనే తాను పొరపాట్లు చేసేవాడు. ఒకరోజు వర్షం పడి వెలిసింది. ఎటు చూసినా తడి తడిగా ఉంది..కాస్త జాగ్రత్త సుమా! అని ఎవరికో చెబుతూ ఈ సంగ్రామ్ సర్రుమని జారి పడ్డాడు. అందరం ఒకటే నవ్వడం! ఒకరోజు సంగ్రామ్ ఏదో ఫంక్షన్‌కు వచ్చాడు. ఎవరికో చెబుతున్నాడు... వెనకా ముందు చూసుకొని జాగ్రత్తగా ఉండాలయ్యా. ఇది అసలే కలికాలం...అని చెబుతూ, తన వెనక కుర్చీ ఉందన్న భ్రమలో కూర్చోబోయి ధబాలున కిందపడ్డాడు!’ ....ఆ ఆరుగురు మహిళా ఆర్జేలు, హాస్యసంఘటనలను ఆకట్టుకునేలా ఎలా చెప్పాలనే విషయంలో కాదు, శ్రోతలు కోరుకున్న పాట ప్లే చేసేముందు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? ‘సత్యమైన జ్ఞానమే ఆత్మజ్ఞానం’లాంటి ఆధ్యాత్మిక విషయాలను అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు ఎలా సులభంగా చెప్పాలి... ఇలా ఎన్నో విషయాలలో ఒక రేడియోకోసం ఆ ఆరుగురు మహిళలు శిక్షణ తీసుకున్నారు. అయితే ఆ రేడియో మెట్రో సిటీలలో కొత్తగా వచ్చిన రేడియో కాదు, ఆ మహిళలు జర్నలిజం నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లు అంతకంటే కాదు. అది అంబాల జైలు రేడియో. ఆ ఆరుగురు మహిళలు... ఆ జైలులోని మహిళా ఖైదీలు. హరియాణాలోని అంబాల సెంట్రల్ జైలులో ఖైదీల మానసిక వికాసం, సంతోషం కోసం ప్రత్యేకమైన రేడియో ఏర్పాటు చేశారు. ఆరుగురు మగ ఆరేజే (ఖైదీలు)లు ఈ రేడియో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడిక మహిళల వంతు వచ్చింది. రేడియో కార్యక్రమాల నిర్వహణ కోసం ఆరుగురు మహిళా ఖైదీలు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇంకొన్ని రోజుల్లో ‘ఆర్జే’గా విధులు నిర్వహించనున్నారు. దిల్లీ యూనివర్శిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్ వర్తిక నందా ఈ ఆరుగురికి శిక్షణ ఇచ్చారు. ‘ఒత్తిడి, ఒంటరితనం పోగొట్టడానికి, మనం ఒక కుటుంబం అనే భావన కలిగించడానికి ఈ రేడియో ఎంతో ఉపయోగపడుతుంది’ అంటుంది నందా. ఈ మాట ఎలా ఉన్నా మహిళా ఆర్జేల రాకతో ‘అంబాల జైలు రేడియో’కు మరింత శక్తి, కొత్త కళ రానుంది! -
గిరిజన మాండలికాల్లో ప్రసారాలు
న్యూఢిల్లీ: గిరిజన సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించడానికి రేడియో కార్యక్రమాల్లో మరిన్ని గిరిజన మాండలికాలను చేర్చాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీని కోసం ఆలిండియా రేడియో, గిరిజన సంక్షేమ శాఖలను సంప్రదించి, ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించారు. గిరిజనులు తమ భాషకాని భాషకు అర్థం చేసుకోలేరని, అందుకే షార్ట్వేవ్ కార్యక్రమాల ద్వారా కొండ, అటవీ ప్రాంతాల్లోని గిరిజనులను వారి మాండలికాల ప్రసారాల ద్వారా చేరుకోవాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రిత్వ శాఖ తెలిపింది. -
లలితరంజన్
రేడియో అంతరంగాలు రేడియో కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి సంగీతాన్ని నేర్పించిన ఘనత మహాభాష్యం చిత్తరంజన్‌కు మాత్రమే దక్కుతుంది. తల్లి నుంచి పుణికిపుచ్చుకున్న సంగీతమే తనను ఇంతటి వాణ్ణి చేసిందంటారాయన. లలిత సంగీతం నేర్చుకోవడం, పాడడం అందరికీ తెలుసు. కానీ దానిపై పరిశోధన చేయాలనే ఆలోచన ఎంతమందికి వస్తుంది? అలా పరిశోధన చేసి దేశంలోనే మొదటిసారిగా లలిత సంగీతాన్ని యూనివర్సిటీ కోర్సుల్లో చేర్చిన ప్రత్యేకత కూడా చిత్తరంజన్దే. ఆకాశవాణిలో ఎందరో సంగీత విద్వాంసులు తమ సేవలనందించారు. అలాంటి మహానుభావుల్లో ఆయనొకరు. తన జీవితంలో సంగీతం ఇచ్చిన మధురానుభూతులను ప్రముఖ రేడియో కళాకారిణి శారదాశ్రీనివాసన్ తో పంచుకున్నారు చిత్తరంజన్. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... అందరికీ తొలి పలుకులు అమ్మే నేర్పుతుందంటారు. అలాగే మా అమ్మ పేరిందేవి నాకు పలుకులతో పాటు స్వరాలూ నేర్పింది. ఆమె ఇంట్లోనే వయొలిన్ నేర్చుకునేది. అప్పుడు నేనూ వినేవాణ్ణి. అలా సంగీతంపై ఆసక్తి పెరిగింది. స్కూల్లోనూ పాటలు బాగా పాడేవాణ్ణి. రేడియోలో సంగీతం మా నాన్న మహాభాష్యం రంగాచార్యులుగారు దక్కన్ రేడియోలో ఇంజినీర్‌గా పని చేసేవారు. అలా చిన్నప్పటి నుంచే రేడియోలో ప్రసారమయ్యే పిల్లల కార్యక్రమాల్లో నేను పాల్గొనేవాణ్ణి. నాకు బాగా గుర్తు.. అక్కడ మొదట నేను ‘మా తెలుగు తల్లి’ పాటతో పాటు మరికొన్ని పాడాను. అంతా అయిపోయాక కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలందర్నీ పిలిచి డబ్బులిచ్చారు. నా చేతిలో రూ.3 పెట్టారు మా నాన్నగారి ముందే. ‘‘నాన్నా! నాకు డబ్బులు ఇస్తున్నారు’’ అన్నాను. ఆయన ‘‘తీసుకో’’ అని నవ్వారు. అప్పుడు స్టేషన్లలో రికార్డింగులు లేవు కాబట్టి ఎనిమిదేళ్ల వయసులోనే నేను లైవ్‌లో పాడాను. నన్ను వద్దన్నారు 1954లో మొదటిసారి ఆడిషన్స్‌కు వెళ్లాను. క్యాజువల్ ఆర్టిస్ట్‌గా చేరుదామని. నేను రేడియో ఇంజినీర్ కొడుకునన్న కారణంగా నన్ను తీసుకునేది లేదన్నారు. కానీ అప్పటి ప్రోగ్రామ్ అసిస్టెంట్ వాక్నిస్గారు నాకు అవకాశం ఇవ్వాలంటూ సిఫారసు చేశారు. అప్పుడు ఆయన ‘‘ప్రతిభ ఉంటే ఎవరినైనా తప్పకుండా ప్రోత్సహించాలి’’ అన్న మాటలు నేను మర్చిపోలేను. బాలమురళితోగారితో బాంధవ్యం 1955లో మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు హైదరాబాద్‌లో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. అప్పుడు నాతో ఎన్నో పాటలు పాడించారు. తర్వాత 1958 నుంచి 1962 వరకు ఆయన దగ్గర శిష్యుడిగా ఎంతో నేర్చుకున్నాను. ఆయన వయొలిన్ అద్భుతంగా వాయించేవారు. బాలమురళి గారితో కలిసి వందల కచేరీల్లో పాల్గొన్నాను. తర్వాత రేడియో వల్లే నాకు సాహిత్య దిగ్గజం దేవులపల్లి కృష్ణశాస్త్రి, సినీ సంగీత దర్శకుడు ఘంటసాల గారితో మంచి స్నేహం ఏర్పడింది. సంగీత కార్యక్రమాలు 1971లో నేను ఆకాశవాణిలో రెగ్యులర్ గాయకుడుగా, సంగీత దర్శకుడిగా చేరి 1997లో పదవీ విరమణ చేశాను. 1972లో నేను వారానికో రోజు ప్రసారమయ్యే ‘ఈ పాట నేర్చుకుందాం’ అనే కార్యక్రమం నిర్వహించాను. అలాగే 1983లో ‘కలిసి పాడుదాం’ అనే ప్రోగ్రామ్ మొదలుపెట్టాను. అలా దేశంలోని 16 భాషల్లో పాటలు నేర్పాను. ఇది ప్రతి ఆదివారం ప్రసారం అయ్యేది. చాలామంది రేడియో ద్వారా సంగీతం నేర్చుకొని మ్యూజిక్ టీచర్‌గా ఉద్యోగం సంపాదించామని చెప్పేవారు. కార్యక్రమం ఎంతో బాగుందని బరోడా, ఖరగ్‌పూర్ లాంటి ఎన్నో ప్రాంతాల నుంచి ఫోన్లు, గుట్టలుగా లెటర్లు వచ్చాయి. సంగీతం నేర్పించడమే ధ్యేయంగా పెట్టుకున్నవాడికి ఇంతకంటే ఏం కావాలి. రేడియోలోనే నాగార్జున సాగరం, రామప్ప, శర్మిష్ట, కొత్త కోవెల, మేఘసందేశం, శివక్షేత్రయాత్ర మొదలైన ఎన్నో సంగీత రూపకాలు చేశాను. మేఘసందేశంలో నేనూ, మీరు (శారదాశ్రీనివాసన్) చేశాం. ‘కోర్సు’ అలా మొదలైంది.. నాకు చిన్నప్పటి నుంచి పరిశోధనలు చేయడమంటే ఇష్టం. అలాగే లలిత సంగీతంపైనా చేశాను. అలా ఎన్నో ఏళ్లు కృషి చేసి లలిత సంగీతానికి ప్రప్రథమంగా పాఠ్యప్రణాళికను రూపొందించాను. ఆ పుస్తకం పూర్తి కాగానే బాలమురళీ కృష్ణగారికి, మరో సంగీత విద్వాంసులు నూకల చినసత్యనారాయణగారికి చూపించాను. చాలా బాగా వచ్చిందన్నారు. తర్వాత 1999లో డాక్టర్ సి. నారాయణరెడ్డిగారికి పంపాక నాకు ఫోన్ చేసి ఎక్స్‌లెంట్‌గా ఉందన్నారు. అలా నా పరిశోధనను తెలుగు విశ్వవిద్యాలయంలో లలిత సంగీతం కోర్సుగా పెట్టారు. పాలగుమ్మి విశ్వనాథం గారు మూడేళ్లు, దాదాపు నేనొక ఏడేళ్లు లలిత సంగీతానికి లెక్చరర్ గా చేశాం. ఆ పుస్తకానికే శ్రీలంకలోని ‘ఓపెన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫర్ కాంప్లిమెంటరీ మెడిసిన్స్’ వారు 2008లో నాకు డాక్టరేట్ ఇచ్చారు. ..:: నిఖితా నెల్లుట్ల ఫొటోలు: ఎస్.ఎస్ ఠాకూర్ చిత్తరంజనం రేడియోలో 2006 నుంచి ‘చిత్తరంజనం’ అనే ఓ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. అందులో 1940 నుంచి సినీ ప్రపంచంలో తమ స్వరాలనందించిన సంగీత దర్శకుల గురించి విశ్లేషణాత్మక కార్యక్రమం నిర్వహించారు. కేవీ మహదేవన్, పెండ్యాల, ఎంఎస్ విశ్వనాథం, ఘంటసాల, ఇళయరాజా, సీఆర్ సుబ్బరామన్ నుంచి నేటి తరం మ్యూజిక్ డెరైక్టర్ ఏఆర్ రెహమాన్‌తో పాటు దాదాపు 35మంది దక్షిణాది సినీరంగ సంగీత దర్శకులపై ప్రోగ్రాములు చేశారు. అందుకున్న పురస్కారాలు సుమారు 1500 పాటలకు సంగీతం అందించారు. అలాగే 8 వేల పాటలు పాడారు. వివిధ సంస్థల నుంచి ‘గాన రత్న’, ‘కళారత్న’, ‘లలిత గాంధర్వ కళానిధి’, ‘లలిత సంగీత చక్రవర్తి’, ‘మధుర స్వరనిధి’, ‘లలిత సంగీత సామ్రాట్’లాంటి బిరుదులు అందుకున్నారు. సినిమాల్లోనూ సంగీతం ‘కులదైవం’, ‘స్వర్ణగౌరి’, ‘విధివిలాసం’, ‘సూర్యచంద్రులు’ మొదలైన చిత్రాల్లో పాటలు పాడారు. అలాగే ‘మన మహాత్ముడు’, ‘శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మహత్త్యం’ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఎన్నో డాక్యుమెంటరీ చిత్రాలకు సంగీతమందించారు. -
అమావాస్యలో పండు వెన్నెల!
గొంతులోని అమృతాన్ని కళ్లల్లోని చీకటి ఏం చేయగలదు? పాట పున్నమిలా ప్రకాశిస్తుంటే ఏ అమావాస్య మాత్రం దరి చేరగలదు? వి.జె.వర్మ పదిరోజుల పసిగుడ్డుగా ఉన్నప్పుడే కాలం కర్కశంగా కాటేసింది. చీకటి అంటేనే తెలీని వయసులోనే అతని రెండు కళ్లనీ మశూచి వ్యాధి కబళించేసింది. అలాంటి పరిస్థితుల్లో వి.జె.వర్మకి సంగీతమే మనోనేత్రమయ్యింది. కళ్లులేకపోతేనేం... స్వరాల్నే నయనాలుగా మలుచుకున్నాడు. మదనపల్లిలో పుట్టిన వర్మకు మద్రాసు మహానగరం కొత్త జీవితాన్ని ప్రసాదించింది. చిన్నతనం నుంచి నేర్చుకున్న వేణుగానం వర్మకు కీర్తి సాక్షాత్కారం కావించింది. ఎన్నో కచ్చేరీలు... రేడియో ప్రోగ్రామ్స్... క్షణం తీరిక లేదు. అలాంటి సమయంలో విజయా సంస్థ నుంచి పిలుపు. ఘంటసాల సంగీత దర్శకత్వంలో పాట పాడే ఛాన్సు. పాట అదిరింది. విన్నవాళ్లంతా ఆహా ఓహో అన్నారు. ఆంధ్రదేశమంతా మార్మోగిపోయిన ఆ పాట ఏంటో తెలుసా? ‘ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు...’. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చిరంజీవి ఈ పాట. వి.జె.వర్మ జన్మ ధన్యం. ఈ ఒక్క పాటతోనే ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. నిజానికి వర్మ ఎవరో ఆ తరంలో చాలామందికి తెలీదు. ఈ తరానికి అంతకన్నా తెలీదు. టోటల్‌గా సినిమా పరిశ్రమే మరిచిపోయింది పాపం. ఎంత అన్యాయం! వర్మది ఎంత చక్కని గొంతు. నాగయ్య లాంటివాడే మెచ్చుకున్న గొంతు. ‘అచ్చం నాలాగే పాడతావు నాయనా’ అంటూ నాగయ్య ఓసారి మెచ్చేసుకున్నారు కూడా. ఇంత చేస్తే... వర్మ పాడిన పాటలు పదికి మించి ఉండవు. అక్కడో పాట.. ఇక్కడో పాట... అంతే. ‘పాతాళ భైరవి’లోనే ‘కనుగొనగలనో లేనో’ అంటూ ఘంటసాలతో కలిసి ఓ పాట. ‘పెళ్లి చేసి చూడు’ (1952)లో ‘పోవమ్మా! బలి కావమ్మా’ అంటూ ఇంకో పాట. ‘నా యిల్లు’ (1953)లో ‘ఔరా కాలమహిమ’ అటూ మరో పాట. ‘పెద్ద మనుషులు’ (1954)లో ఓ పాట. ‘ఓరి ఇరక’ అనే తమిళ సినిమాలో పాట. ‘జగన్నాటక సూత్రధారి’లో ఇంకో పాట. తక్కువ పాడినా... తియ్యగా పాడాడు.విధియే కాదు, సంగీత దర్శకులు కూడా వర్మను చిన్న చూపు చూసినట్టున్నారు. కారణాలేంటో తెలీదు కానీ, వర్మకు ప్రోత్సాహమే కరవు. ఒక్క అద్దేపల్లి రామారావు మాత్రం వర్మ ప్రతిభను గుర్తించాడు. ఆయన ఏ సినిమా చేసినా వర్మతో పాట పాడించాల్సిందే. అద్దేపల్లి ఆర్కెస్ట్రాలో వర్మ ఫ్లూట్ వాయించాల్సిందే. అశ్వత్థామ కూడా కొన్నాళ్లు ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత వర్మ ఒంటరి అయిపోయారు. అవకాశాలిచ్చేవారు లేరు. పట్టించుకున్నవారు లేరు. అప్పటివరకూ కళ్లు లేకపోయినా చీకటి అనిపించలేదు. ఫస్ట్ టైమ్ చీకటి అంటే ఏంటో తెలిసొచ్చింది. నాలుగ్గోడల మధ్యనే జీవితం. అయినా పాటను మరవలేదు. స్వరం చేయి విడువలేదు. కాసేపు త్యాగరాజ కీర్తన ఆలపించడం...ఇంకాసేపు ఫ్లూట్ వాయించడం...ఇవే కాలక్షేపాలు ఆయనకు. అప్పట్లో మద్రాసులో వేడి జ్వరాలు వెల్లువెత్తాయి. వర్మకు తగులుకుందీ పాడు రోగం. అప్పుడు కూడా సంగీతమే రిలీఫ్ ఆయనకు. అర్ధరాత్రి రెండు గంటలకు లేచి గ్లాసుడు మంచినీళ్లు తాగి ఓ త్యాగరాజ కీర్తన పాడారు. అలాగే నిద్రలోకి జారుకున్నారు. తెల్లారింది. కానీ ఆయన నిద్ర లేవలేదు. గూట్లోని వేణువు కన్నీరు పెట్టుకుంది. చీకటి నుంచి చీకటికి వర్మ స్వర ప్రయాణం ముగిసింది. కానీ, పాట ఉన్నంతకాలం వర్మ పండు వెన్నెలే! ఉన్నంతలోనే సాయపడాలనేవారు నాన్న! ‘‘నాన్న అసలు పేరు విజయ వర్మ. ఇంటి పేరు పీవీ. అంటే పండ్రూత్తి వల్లం. అదో ఊరి పేరట. మరి వీజే వర్మగా ఎలా పాపులర్ అయ్యారో నాకైతే తెలీదు. నాన్నకు అమ్మ నాగరత్నమ్మతో 1945లో పెళ్లయ్యింది. అప్పటికే నాన్న ఫ్లూట్ కచ్చేరీలతో బాగా పాపులర్. ట్రంక్ పెట్టె నిండా బోల్డన్ని గోల్డ్, సిల్వర్ మెడల్స్. నాన్నకు నేను, చెల్లి సంతానం. ఆలిండియా రేడియోలో రెండు నెలలకోసారి ప్రోగ్రామ్స్ చేసేవారు. ఏ జన్మలోనో ఏదో పాపం చేయడం వల్లనే ఇలా అంధుణ్ణయ్యానని బాధపడుతుండేవారు. అందుకే ఈ జన్మలోనైనా ఉన్నంతలో అందరికీ సాయపడాలని తపించేవారు. - విద్యుల్లత