అమావాస్యలో పండు వెన్నెల!
అమావాస్యలో పండు వెన్నెల!
Published Tue, Dec 3 2013 2:17 AM | Last Updated on Sat, Aug 11 2018 8:27 PM
గొంతులోని అమృతాన్ని కళ్లల్లోని చీకటి ఏం చేయగలదు?
పాట పున్నమిలా ప్రకాశిస్తుంటే ఏ అమావాస్య మాత్రం దరి చేరగలదు?
వి.జె.వర్మ పదిరోజుల పసిగుడ్డుగా ఉన్నప్పుడే కాలం కర్కశంగా కాటేసింది. చీకటి అంటేనే తెలీని వయసులోనే అతని రెండు కళ్లనీ మశూచి వ్యాధి కబళించేసింది. అలాంటి పరిస్థితుల్లో వి.జె.వర్మకి సంగీతమే మనోనేత్రమయ్యింది. కళ్లులేకపోతేనేం... స్వరాల్నే నయనాలుగా మలుచుకున్నాడు. మదనపల్లిలో పుట్టిన వర్మకు మద్రాసు మహానగరం కొత్త జీవితాన్ని ప్రసాదించింది.
చిన్నతనం నుంచి నేర్చుకున్న వేణుగానం వర్మకు కీర్తి సాక్షాత్కారం కావించింది. ఎన్నో కచ్చేరీలు... రేడియో ప్రోగ్రామ్స్... క్షణం తీరిక లేదు. అలాంటి సమయంలో విజయా సంస్థ నుంచి పిలుపు. ఘంటసాల సంగీత దర్శకత్వంలో పాట పాడే ఛాన్సు. పాట అదిరింది. విన్నవాళ్లంతా ఆహా ఓహో అన్నారు. ఆంధ్రదేశమంతా మార్మోగిపోయిన ఆ పాట ఏంటో తెలుసా? ‘ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు...’. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చిరంజీవి ఈ పాట. వి.జె.వర్మ జన్మ ధన్యం. ఈ ఒక్క పాటతోనే ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. నిజానికి వర్మ ఎవరో ఆ తరంలో చాలామందికి తెలీదు. ఈ తరానికి అంతకన్నా తెలీదు.
టోటల్‌గా సినిమా పరిశ్రమే మరిచిపోయింది పాపం. ఎంత అన్యాయం!
వర్మది ఎంత చక్కని గొంతు. నాగయ్య లాంటివాడే మెచ్చుకున్న గొంతు. ‘అచ్చం నాలాగే పాడతావు నాయనా’ అంటూ నాగయ్య ఓసారి మెచ్చేసుకున్నారు కూడా. ఇంత చేస్తే... వర్మ పాడిన పాటలు పదికి మించి ఉండవు. అక్కడో పాట.. ఇక్కడో పాట... అంతే. ‘పాతాళ భైరవి’లోనే ‘కనుగొనగలనో లేనో’ అంటూ ఘంటసాలతో కలిసి ఓ పాట. ‘పెళ్లి చేసి చూడు’ (1952)లో ‘పోవమ్మా! బలి కావమ్మా’ అంటూ ఇంకో పాట. ‘నా యిల్లు’ (1953)లో ‘ఔరా కాలమహిమ’ అటూ మరో పాట. ‘పెద్ద మనుషులు’ (1954)లో ఓ పాట. ‘ఓరి ఇరక’ అనే తమిళ సినిమాలో పాట. ‘జగన్నాటక సూత్రధారి’లో ఇంకో పాట. తక్కువ పాడినా... తియ్యగా పాడాడు.విధియే కాదు, సంగీత దర్శకులు కూడా వర్మను చిన్న చూపు చూసినట్టున్నారు. కారణాలేంటో తెలీదు కానీ, వర్మకు ప్రోత్సాహమే కరవు. ఒక్క అద్దేపల్లి రామారావు మాత్రం వర్మ ప్రతిభను గుర్తించాడు. ఆయన ఏ సినిమా చేసినా వర్మతో పాట పాడించాల్సిందే. అద్దేపల్లి ఆర్కెస్ట్రాలో వర్మ ఫ్లూట్ వాయించాల్సిందే. అశ్వత్థామ కూడా కొన్నాళ్లు ఎంకరేజ్ చేశారు.
ఆ తర్వాత వర్మ ఒంటరి అయిపోయారు. అవకాశాలిచ్చేవారు లేరు. పట్టించుకున్నవారు లేరు. అప్పటివరకూ కళ్లు లేకపోయినా చీకటి అనిపించలేదు. ఫస్ట్ టైమ్ చీకటి అంటే ఏంటో తెలిసొచ్చింది. నాలుగ్గోడల మధ్యనే జీవితం. అయినా పాటను మరవలేదు. స్వరం చేయి విడువలేదు. కాసేపు త్యాగరాజ కీర్తన ఆలపించడం...ఇంకాసేపు ఫ్లూట్ వాయించడం...ఇవే కాలక్షేపాలు ఆయనకు. అప్పట్లో మద్రాసులో వేడి జ్వరాలు వెల్లువెత్తాయి. వర్మకు తగులుకుందీ పాడు రోగం. అప్పుడు కూడా సంగీతమే రిలీఫ్ ఆయనకు. అర్ధరాత్రి రెండు గంటలకు లేచి గ్లాసుడు మంచినీళ్లు తాగి ఓ త్యాగరాజ కీర్తన పాడారు. అలాగే నిద్రలోకి జారుకున్నారు. తెల్లారింది. కానీ ఆయన నిద్ర లేవలేదు. గూట్లోని వేణువు కన్నీరు పెట్టుకుంది. చీకటి నుంచి చీకటికి వర్మ స్వర ప్రయాణం ముగిసింది. కానీ, పాట ఉన్నంతకాలం వర్మ పండు వెన్నెలే!
ఉన్నంతలోనే సాయపడాలనేవారు నాన్న!
‘‘నాన్న అసలు పేరు విజయ వర్మ. ఇంటి పేరు పీవీ. అంటే పండ్రూత్తి వల్లం. అదో ఊరి పేరట. మరి వీజే వర్మగా ఎలా పాపులర్ అయ్యారో నాకైతే తెలీదు. నాన్నకు అమ్మ నాగరత్నమ్మతో 1945లో పెళ్లయ్యింది. అప్పటికే నాన్న ఫ్లూట్ కచ్చేరీలతో బాగా పాపులర్. ట్రంక్ పెట్టె నిండా బోల్డన్ని గోల్డ్, సిల్వర్ మెడల్స్. నాన్నకు నేను, చెల్లి సంతానం. ఆలిండియా రేడియోలో రెండు నెలలకోసారి ప్రోగ్రామ్స్ చేసేవారు. ఏ జన్మలోనో ఏదో పాపం చేయడం వల్లనే ఇలా అంధుణ్ణయ్యానని బాధపడుతుండేవారు. అందుకే ఈ జన్మలోనైనా ఉన్నంతలో అందరికీ సాయపడాలని తపించేవారు.
- విద్యుల్లత
Advertisement
Advertisement