నేడు (జనవరి 23) స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి. బోస్ పుట్టిన రోజును శౌర్య దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 2021లో బోస్ జయంతిని శౌర్య దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ విద్యార్హతలు ఏమిటి? ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినా, బోస్ ఎందుకు ఆ ఉద్యోగంలో చేరలేదో తెలుసుకుందాం.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897, జనవరి 23న ఒడిశాలోని బెంగాల్ డివిజన్‌లోని కటక్‌లో జన్మించారు. బోస్ తన తల్లిదండ్రులకు తొమ్మిదవ సంతానం. బోస్ నాటి కలకత్తాలో ఫిలాసఫీలో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత తదుపరి చదువుల కోసం ఇంగ్లండ్‌కు వెళ్లారు. బోస్ కేవలం తన 24 ఏళ్ల వయసులో ఐసీఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఉన్నత ఉద్యోగాల అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ, బ్రిటీష్ వారికి బానిసగా ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఈ ఉద్యోగంలో చేరలేదు.
బోస్ స్వాతంత్ర్య పోరాటంలో కాలుమోపేందుకు ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చి, నాటి ప్రముఖ నేత చిత్తరంజన్ దాస్‌తో జతకట్టారు. 1921లో చిత్తరంజన్ దాస్‌కు చెందిన స్వరాజ్ పార్టీ ప్రచురించే ‘ఫార్వర్డ్’ అనే వార్తాపత్రికకు సంపాదకత్వ బాధ్యతలను బోస్ స్వీకరించారు. 1920 నుంచి 1942 వరకు భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఆవిష్కరింపజేసే ‘ది ఇండియన్ స్ట్రగుల్’ అనే పుస్తకాన్ని బోస్ రచించారు. బోస్ 1939లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అయితే కొంతకాలానికే బోస్ ఆ పదవికి రాజీనామా చేశారు. నేతాజీ తన జీవితకాలంలో 11 సార్లు జైలు శిక్ష అనుభవించారు.
ఇది కూడా చదవండి: స్వాతంత్య్రాన్ని ఊహించిన ‘బోస్’ ఏం చేశారు?
Comments
Please login to add a commentAdd a comment